'రేప్ పోర్న్': ఆ అమ్మాయి బట్టలు చింపుతున్న వీడియోను మీరెందుకు చూశారు?

ఫొటో సోర్స్, iStock
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఏడుగురు కుర్రాళ్లు కలిసి బలవంతంగా ఓ అమ్మాయి బట్టల్ని చింపడానికి ప్రయత్నించారు. బిహార్‌లోని జహానాబాద్ అనే చిన్న పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో మీ దాకా వచ్చే ఉంటుంది!
ఓ అమ్మాయి తనను వదిలిపెట్టమని ఏడుస్తూ ప్రాధేయపడటం, కానీ ఆ ఏడుపును పట్టించుకోకుండా యువకులు నవ్వుతూ ఆమె బట్టల్ని చింపుతుండటం ఆ వీడియోలో కనిపిస్తుంది.
కొందరు ఆ వీడియోని షేర్ చేస్తూ.... 'ఇది సిగ్గుపడాల్సిన విషయం' అని తమ కోపాన్ని, బాధనూ ప్రదర్శించి ఉండొచ్చు. కానీ కొందరు మాత్రం ఎలాంటి వివరణలూ లేకుండా ఆ వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో, ముఖ్యంగా 'మెన్ ఓన్లీ' గ్రూపుల్లో విపరీతంగా షేర్ చేశారు.
అచ్చంగా నిమిషం, రెండు నిమిషాల నిడివుండే పోర్న్ క్లిప్‌లను షేర్ చేసినట్లే బిహార్ వీడియోను కూడా వాట్సాప్‌లో పంపించారు.

ఫొటో సోర్స్, Getty Images
అందులో వినోదం ఏముంది?
మనం ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా సరే, చడీచప్పుడూ లేకుండా, చాలా గోప్యంగా అలాంటి వీడియోలను పంచుకునే వెసులుబాటును 'మొబైల్' ప్రపంచం కల్పిస్తోంది.
ఆన్‌లైన్‌లో పంచుకునే సమాచారానికి సంబంధించిన గణాంకాలను విశ్లేషించే 'వీడూలీ' సంస్థ లెక్కల ప్రకారం, అసభ్యకర వీడియోలను చూసేవారితో పాటు పంచుకునే వారి సంఖ్య 2016లో 75శాతం మేర పెరిగింది.
అలా పంచుకునే వాటిలో 80శాతం వీడియోల నిడివి చాలా తక్కువగా ఉంటుందనీ, వాటిని చూసేవాళ్లలో 60శాతం మంది చిన్న నగరాల్లోనే ఉంటున్నారనీ 'విడూలీ' చెబుతోంది.
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల ఖరీదు బాగా తగ్గిపోయింది. ఇంటర్నెట్ ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి.
బిహార్‌లో ఆ అమ్మాయిని వేధించిన కుర్రాళ్లు కూడా స్మార్ట్‌ఫోన్‌తో ఆ వీడియో తీసి, దాన్ని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసేశారు.
కానీ దాన్ని చూడకుండా, ఇతరులతో పంచుకోకుండా ఉండే శక్తి మన దగ్గరే ఉంది కదా.
మరెందుకు దాన్ని చూశాం? పంచుకున్నాం? అందులో వినోదం ఏముంది?
సాయం కోసం ఓ అమ్మాయి పెట్టిన గావుకేకలు, వాటిని లెక్క చేయకుండా నవ్వుతూ, ఆమె దుస్తుల్ని చింపేస్తున్న కుర్రాళ్ల వీడియో ఎలాంటి థ్రిల్‌ను అందిస్తుంది?
మసకగా ఉన్న ఆ వీడియోలో మన కళ్లు దేన్ని చూడటానికి అంతలా ఆరాటపడుతున్నాయి? కాస్త ఒళ్లు కనిపిస్తే చూద్దామనా? లేక ఆ కుర్రాళ్లు ఎంతదాకా వెళ్తారో తెలుసుకోవాలన్న ఆసక్తితోనా?

ఫొటో సోర్స్, iStock
డెస్క్‌టాప్ కంటే మొబైల్ ఫోన్లలోనే ఎక్కువ..
ఓ రకంగా ఆ వీడియోని 'వైలెంట్ పోర్న్' అని పిలవొచ్చు.
కొన్ని పోర్న్ వీడియోల్లో హింసతో కూడిన లైంగిక చర్యలను మహిళలు కూడా ఆస్వాదిస్తున్నట్లు చూపిస్తారు.
మహిళను కొట్టడం, బలవంతంగా ముద్దుపెట్టుకోవడం, జుట్టు లాగడం లాంటి చర్యలు వాటిలో కనిపిస్తాయి. మహిళలు కూడా వాటిని ఆస్వాదిస్తున్నట్లే కనిపిస్తారు.
చాలామందికి అందులో ఎలాంటి తప్పూ కనిపించదు. కొందరు మహిళలు కూడా వాటిని ఇష్టపడతారనే భావన నెలకొంది.
కానీ వైలెంట్ పోర్న్ అలాంటిది కాదు. ఓ వీడియోలో బలవంతంగా ఓ వ్యక్తి మహిళను రేప్ చేస్తే అది 'వైలెంట్ పోర్న్' లేదా 'రేప్ పోర్న్' కిందకే వస్తుంది.
అలాంటి రేప్ వీడియోలను, పోర్న్ పేరుతో విరివిగా పంచుకుంటూ చాలామంది చూస్తున్నారు.
అన్ని పోర్న్ వీడియోల్లానే ఆ వీడియోలని కూడా నటులని పెట్టి హైక్వాలిటీతో తీస్తారు.
కానీ బయట కూడా అత్యాచారాలు, లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలను తీసి ఇంటర్నెట్‌లో పెట్టేస్తున్నారు. బిహార్ వీడియో కూడా అలాంటిదే.
ఆ వీడియో వైరల్ అయి, పోలీసులు దాన్ని కంట్రోల్ చేసేలోపే అలాంటి అనేక వీడియోలను ఆసక్తికొద్దీ చాలామంది ఒకరికొకరు పంచుకుంటున్నారు.
స్మార్ట్ ఫోన్ల వల్ల ఆ పని మరింత సులువైంది. చాలా సులభంగా అవి ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి మరో గ్రూప్‌కి చేరిపోతున్నాయి.
డెస్క్‌టాప్ కంటే మొబైల్ ఫోన్లలోనే ఎక్కువమంది పోర్న్‌ను చూడటానికి ప్రాధాన్యమిస్తున్నారని పోర్నోగ్రఫీ వెబ్‌సైట్ 'పోర్న్ హబ్' పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
ఆ తరహా వీడియోల్ని పంచుకోవడం వల్ల సాధించేదేంటి?
2013లో తమ యూజర్లలో 45శాతం మంది మొబైల్ ద్వారా తమ సైట్‌ని వినియోగిస్తే, 2017లో ఆ సంఖ్య 67శాతానికి చేరిందని పోర్న్ హబ్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. భారత్‌లో అయితే 87శాతం మంది మొబైల్ ద్వారానే ఆ సైట్‌ను చూస్తున్నారు.
భారత్‌లో తమ వెబ్‌సైట్‌ను చూసేవారి సంఖ్య ఇటీవలి కాలంలో అత్యధికంగా 121శాతం మేర పెరిగిందని పోర్న్ హబ్ తెలిపింది.
కొందరికి పోర్న్ చూడటం బావుండొచ్చు. లైంగిక చర్యల గురించి తెలుసుకోవడానికి అదొక మార్గం కూడా కావొచ్చు. కానీ 'రేప్ పోర్న్' లాంటి హింసాత్మక వీడియోలను చూడటం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది?
రేప్ పోర్న్‌ను పదే పదే చూడటం ద్వారా మనిషిలో హింసాత్మక ప్రవృతితో పాటు అత్యాచారాలకు పాల్పడాలనే కోరికలు కూడా పెరిగే అవకాశం ఉందని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనాలు చెబుతున్నాయి.
బిహార్‌లో ఆ అమ్మాయిని వేధించిన వీడియో రెండు వేర్వేరు వాట్సాప్ గ్రూపుల ద్వారా నాక్కూడా చేరింది.
అది పంపించిన వారిపై నాక్కూడా కోపం వచ్చింది.
అసలా వీడియోల్ని పంచుకోవడం వల్ల ఏం సాధించాం?
దానికి జవాబు ఆ వీడియోని పంపినవాళ్లూ, చూసిన వాళ్లే చెప్పాలి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









