గ్రౌండ్ రిపోర్ట్: ‘నన్ను చంపేయమని ఆశారాం సైగలు చేశారు’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రియాంక దూబే
- హోదా, బీబీసీ ప్రతినిధి, షాజహాన్‌పూర్ నుండి
చక్కెర మిల్లుల వాసన నేను దిల్లీకి 360 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాజహాన్‌పూర్ చేరుకున్నట్లు తెలియజేసింది. కకోరి కంద్ రామ్‌ప్రసాద్ బిస్మిల్, అష్ఫఖుల్లా ఖాన్‌లాంటి విప్లవ వీరుల నగరం షాజహాన్‌పూర్ నిర్భయానికి, ధైర్యానికి మారుపేరు.
ఇక్కడే ఆశారాంకు వ్యతిరేకంగా బాధితురాలు, ఆమె కుటుంబం ఐదేళ్లపాటు అసమాన ధైర్యసాహసాలతో న్యాయపోరాటం చేశారు.
రవాణా రంగంలో ఉన్న ఆ కుటుంబంతో ఇది నా మూడో సమావేశం. విచారణ ప్రారంభమైన నాటి నుంచి వాళ్ల ఇంటి బయట పోలీస్ పోస్టును ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన రిజిస్టర్‌లో నా పేరు, అడ్రస్ రాశాక నేను ఆ ఇంట్లోకి వెళ్లాను.
ఇంట్లోకి ప్రవేశించగానే, కుర్తా పైజామా వేసుకున్న బాధితురాలి తండ్రి, కొందరు మీడియా సిబ్బంది తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
''జోధ్‌పూర్‌లో ఏ మీడియా కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. చాలా పత్రికలు ఆశారాం మద్దతుదారుల ప్రకటనలను ప్రచురించాయి. మా వాదన కూడా వినిపించమని కోరినపుడు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు తీర్పు తర్వాత అంతా మా వద్దకు వస్తున్నారు'' అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
ప్రవాహంలా వస్తున్న జర్నలిస్టులను తప్పించుకునేందుకు, ఆయన తన కుమారుణ్ని తోడుగా ఇచ్చి నన్ను మొదటి అంతస్తులో వేచి ఉండమని కోరారు.
పైకి వెళుతుంటే - కఠినమైన చట్టాలున్నా, పలు మీడియా సంస్థలు తమ ఇంటి ఫొటోలను టీవీల్లో చూపించాయని బాధితురాలి సోదరుడు నాతో చెప్పాడు.
''దీని వల్ల మాకు ప్రమాదం పెరుగుతుంది. ఇవాళ ఆశారాంకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన కుటుంబం ఏదంటే నగరం మొత్తానికి తెలుసు. మేం సాధారణ జీవితం గడపలేకపోతున్నాం'' అని అతను వాపోయాడు.
కొద్దిసేపటికి బాధితురాలి తండ్రి నేనున్న గదికి వచ్చారు. ఆయన ఐదేళ్ల క్రితం నాటి కన్నా సన్నగా అయిపోయారు. ఆయన తలవెంట్రుకలు రాలిపోయి బట్టతల కనిపిస్తోంది. ఈ పోరాటంలో ఆయన సగం బరువు కోల్పోయినట్లు కనిపిస్తున్నారు.
విచారణ కాలాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన, ''గత ఐదేళ్లలో మేం ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నామో, ఎంత మానసిక వ్యథను అనుభవించామో మాటల్లో చెప్పలేం. ఈ పరిస్థితి వల్ల మా మొత్తం వ్యాపారం కోల్పోయాం. ఈ ఐదేళ్లలో ఒక్క రోజు కూడా కడుపునిండా భోంచేయలేదు. బయటికి వెళ్లి తిరగడం మాట అటుంచి, జబ్బు పడినప్పుడు కూడా బయటకు వెళ్లలేదు. మా ఇంట్లోనే మేం బందీలుగా మారాం'' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
''ఆశారాంపై కేసు పెట్టినపుడు, ఆందోళనతో మా ఇంట్లో ఎవరూ భోజనం చేయలేదు. ఏప్రిల్ 25న కేసు గెలిచినపుడూ తినలేకపోయాం. ఆనందంతోనే మా కడుపు నిండిపోయింది. తీర్పు వచ్చాకే మేం కంటినిండా నిద్ర పోతున్నాం'' అని తెలిపారు.

2013 ఆగస్టులో ఆశారాంపై కేసు దాఖలు చేసినపుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు. అది తన కూతురిపై ఎలాంటి ప్రభావం చూపిందో చెబుతున్నపుడు ఆ తండ్రి కంట్లో నీళ్లు తిరిగాయి.
''నా కూతురి కలలన్నీ నాశనమయ్యాయి. తను ఐఏఎస్ కావాలనుకుంది కానీ దీని వల్ల ఆమె చదువు మధ్యలో నిలిచిపోయింది. రెండేళ్లపాటు ఆమె కోర్టులో సాక్ష్యాలు ఇస్తూ గడపాల్సి వచ్చింది'' అన్నారాయన.
అయితే ఇప్పుడిప్పుడే ఆమె క్రమంగా మామూలు మనిషిగా మారుతోంది.
''తను బీఏలో అడ్మిషన్ తీసుకుని, సెకెండియర్ పరీక్షలు రాసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా పిల్లలు చదువుకోగలరా? అయినా కూడా నా కూతురు పరీక్షల్లో 85 శాతం మార్కులు సంపాదించింది'' అని గర్వంగా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఆశారాం ముఖంలో నెత్తురు చుక్క లేదు..’
కేసు విరమించుకోకుంటే చంపేస్తానని ఆశారాం తనను బెదిరించారని, డబ్బు ఇస్తామని ప్రలోభ పెట్టారని ఆయన వివరించారు.
''కేసు విచారణ జరుగుతున్నపుడు చికారా అనే ఆశారాం గూండా మా కార్యాలయానికి వచ్చాడు. అతనితో పాటు వచ్చిన మరో వ్యక్తి వద్ద ఆయుధం కూడా ఉంది. అప్పటికే సాక్షులను హత్య చేయడం ప్రారంభమైంది. అందువల్ల నేను జాగ్రత్తగా ఉన్నా. కేసు విరమించుకుంటే కావాల్సినంత డబ్బు ఇస్తామని, లేకపోతే చంపేస్తామని వాళ్లు నన్ను బెదిరించారు'' అని ఆయన వెల్లడించారు.
వాళ్ల బెదిరింపుతో అప్పటికి తనను తాను రక్షించుకోవడానికి కేసు విరమించుకుంటానని ఆయన వాళ్లతో చెప్పారు. బహుశా ఈ విషయం ఆశారాంకు తెలిసి ఉండాలి.
''అయితే కోర్టులో నేను సాక్ష్యం ఇవ్వగానే ఆశారాం ముఖంలో నెత్తురు చుక్క లేదు. కోర్టులోంచి బైటికి వెళుతున్నపుడు ఆయన నన్ను చూస్తూ తన రెండు చేతులతో ఏవో సైగలు చేశారు. దాని అర్థం 'ఈ మనిషిని చంపెయ్యండి' అని నా పక్కనున్న వారు వివరించారు. ఇలా అతను బహిరంగంగా సాక్షులను బెదిరించేవారు'' అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, SAM PANTHAKY/AFP/Getty Images
ముగ్గురు సాక్షులు మృతి.. ఆచూకీ లేని మరో సాక్షి
ఈ కేసులో ఇప్పటివరకు 9 మంది సాక్షులపై దాడి జరిగింది. వారిలో ముగ్గురు మరణించారు. ఇప్పటివరకు ఒక సాక్షి ఆచూకీ లేదు.
కోర్టులో తండ్రితోపాటు బాధితురాలినీ బెదిరించారు.
''నా కూతురు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వచ్చినపుడు, ఎదురుగా కూర్చున్న ఆశారాం వింత వింత శబ్దాలతో ఆమెను బెదిరించడానికి ప్రయత్నించేవారు. మా లాయర్లు జడ్జీకి ఫిర్యాదు చేస్తే.. ఆయన ఆశారాంను నిశబ్దంగా ఉంచాలని పోలీసులను ఆదేశించేవారు.''
విచారణలో పాల్గొనేందుకు బాధితురాలి కుటుంబం షాజహాన్‌పూర్ నుంచి సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న జోధ్‌పూర్‌కు వెళ్లడం కూడా సవాలుగా మారింది.
''ఆ సమయంలో ఏది దొరికితే అది పట్టుకుని జోధ్‌పూర్‌కు వెళ్లేవాళ్లం. కొన్నిసార్లు బస్సు, కొన్నిసార్లు రైలు, కొన్నిసార్లు రైళ్లలో సాధారణ కోచ్‌లో కూర్చుని వెళ్లేవాళ్లం.'' అని ఆయన వివరించారు.
బాధితురాలు తన తల్లిదండ్రులతో కలిసి విచారణ నిమిత్తం జోధ్‌పూర్‌కు వెళితే, ఆమె సోదరులిద్దరూ షాజహాన్‌పూర్‌లోనే ఉండిపోయేవాళ్లు.
అయితే బాధితురాలి తండ్రి ఎక్కువ సమయం ఇంటి వద్ద లేకపోవడం వల్ల వ్యాపారం కుంటుపడింది. కొన్నిసార్లు పూర్తిగా వ్యాపారం ఉండేది కాదు. ఖర్చుల కోసం ఆయన తన ట్రక్కులు అమ్మేసుకోవాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, ఆశారాం
సమాజంతో పోరాటంలో ఓడిపోయారు..
ఇలాంటి సందర్భాలలో కూడా బాధితురాలి కుటుంబం గట్టిగా నిలబడింది. తప్పు చేసిన ఆశారాంకు శిక్ష పడాలని కుటుంబమంతా భావించారు.
ఈ కేసు కారణంగా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. తమ కుమారులపై ఎవరైనా దాడి చేస్తారేమో అని బాధితురాలి తండ్రి నిరంతరం ఆందోళన చెందేవారు.
ఒక సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం, ఆ కుటుంబం ఆశారాంపై అయితే విజయం సాధించింది కానీ, సమాజం మాత్రం వాళ్లను ఓడించింది. తన పిల్లలను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
''నా పెద్ద కుమారుడికి 25 ఏళ్లు. నా కూతురికి 21 ఏళ్లు. వాళ్లిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నా, కానీ ఎవరూ ముందుకు రావడం లేదు. నీ కుమారుడిపై దాడి జరిగితే మా అమ్మాయి జీవితం ఏం కావాలని కొందరు అడిగారు. నీ కూతురి జీవితంపై మచ్చ పడిందని మరి కొంతమంది నా ముఖం మీదే చెప్పేశారు. ఇప్పుడు నా కూతురిని పెళ్లి చేసుకోవడానికి వయసు మళ్లినవాళ్లో, రెండో పెళ్లి వాళ్లో వస్తున్నారు. అలాంటి వాళ్లకు నా కూతుర్ని ఎలా ఇవ్వడం?''.. కళ్లలో నీళ్లతో చెప్పారాయన.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








