ఆశారాం బాపు మద్దతుదారులు పదేళ్ల కిందట అహ్మదాబాద్‌లో విధ్వంసం ఎలా సృష్టించారంటే..

ఫొటో సోర్స్, MONEY SHARMA/AFP/Getty Images
- రచయిత, అంకుర్ జైన్
- హోదా, బీబీసీ గుజరాతీ ఎడిటర్
అది 2008వ సంవత్సరం. అహ్మదాబాద్‌లోని మోతెరా క్రికెట్ స్టేడియం సమీపంలో, ఆశారాం బాపు ఆశ్రమానికి మూడు కిలోమీటర్ల దూరంలో మేం ఉన్నాం.
ప్రభుత్వం వినేందుకు ఇష్టపడని విషయాలను లేవనెత్తుతూ పలువురు ప్రతిపక్ష నాయకులు అహ్మదాబాద్‌లో చేస్తున్న ఆందోళనల్ని ఒక యువ విలేకరిగా నేను కవర్ చేశాను. అప్పుడే తొలిసారిగా పోలీసులు నన్ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంఘటనకు కొద్ది రోజుల ముందు.. ఆశ్రమంలో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. తర్వాత వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆశ్రమానికి సమీపంలోనే ఈ మృతదేహాలను గుర్తించారు. ఆశ్రమంలో తాంత్రిక పూజల కారణంగానే వారు మరణించారని బాధిత కుటుంబాలు ఆరోపించాయి.
ఈ ఆరోపణల నేపథ్యంలో ఆశారాం అనుయాయులు విధ్వంసం సృష్టించారు. పలువురు మీడియా ప్రతినిధులపై దాడులకు దిగారు. ఒక మహిళా విలేకరి సహా పది మంది జర్నలిస్టులు గాయపడ్డారు. ఆశ్రమంలో కూడా జర్నలిస్టులపై దాడులు జరిగాయి. దీంతో వారంతా ఆశ్రమానికి సమీపంలోని కాలనీల వద్ద నుంచి ప్రత్యక్ష ప్రసారాలు ఇవ్వాల్సి వచ్చింది.
జర్నలిస్టులపై దాడుల్ని నిరసిస్తూ.. సబర్మతి నది కరకట్టలపై ఉన్న ఆశారాం ఆశ్రమం వైపు నిరసన ర్యాలీ జరిపిన విలేకరుల్లో నేను కూడా ఉన్నాను.

ఫొటో సోర్స్, MONEY SHARMA/AFP/Getty Images
దాడుల్ని ఖండిస్తూ.. సహచర జర్నలిస్టులకు సానుభూతి ప్రకటిస్తూ.. మీడియాను అణగదొక్కలేరని ఆశారాంకు, ఆయన అనుచరులకు ఎలుగెత్తి చాటటమే ఈ నిరసన ఉద్దేశం. అయితే, మేం ఆశ్రమం వద్దకు వెళ్లేలోపే మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు.
ఆశ్రమానికి దారితీసే అన్ని మార్గాల్లోనూ పోలీసులు బ్యారికేడ్లు పెట్టారు. 2002 గుజరాత్ అల్లర్ల తర్వాత నేను అంత పెద్ద ఎత్తున సాయుధ పోలీసుల్ని వీధుల్లో చూడటం అదే తొలిసారి.
అయితే, ఆశ్రమం సమీపంలోకి వెళితే జర్నలిస్టులకు ఏమవుతుందోనన్నది పోలీసుల ఆందోళన.
ర్యాలీకి రక్షణ కల్పించాలని జర్నలిస్టులు పోలీసుల్ని కోరారు. కానీ, ఆశారాం మద్దతుదారులు చాలా ఆగ్రహంతో ఉన్నారని పోలీసులు మాకు చెప్పారు.

ఫొటో సోర్స్, SAM PANTHAKY/AFP/Getty Images
ఆశారాం బాపు అలియాస్ అసుమల్ తౌమల్ హర్పలానీ పేదరికం నుంచి కోట్లు గడించిన సంగతిని మా నగరంలో కథలు కథలుగా చెప్పేవారు. అలాంటి ఆశారాం మద్దతుదారులను చూసి పోలీసులు అశక్తులవటం నాకు ఆశ్చర్యం కలిగించింది.
మేం జర్నలిస్టులన్న సంగతి పోలీసులకు తెలుసు. అందుకే వారు మమ్మల్ని ఆశ్రమం వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. జర్నలిస్టులు కూడా పోలీసుల మాట వినకుండా ఆశ్రమం వైపు ర్యాలీ కొనసాగించారు.
బ్యారికేడ్లను దాటి వెళితే ఆ దారిలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఎప్పుడూ ప్రజలతో రద్దీగా ఉండే ఆ ప్రాంతం ఇప్పుడు నిర్మానుష్యంగా, తలుపులు మూసిన ఇళ్లతో దర్శనమిస్తోంది. ఈ ప్రాంతాన్నే పోలీసులు ‘ప్రమాదకరమైన’ ప్రాంతం అని మాకు చెప్పారు.
అప్పటికే ఎన్నో ఎన్‌కౌంటర్లు చేసి చెడ్డపేరు తెచ్చుకున్న అహ్మదాబాద్ పోలీసులు ఈ ప్రాంతానికి కాపలాగా ఉన్నంతసేపు మాకు ఎలాంటి ఇబ్బందీ లేదని మేం ధీమాగా ఉన్నాం. పైపెచ్చు.. ఈ ప్రాంతంలో డ్యూటీ ఆఫీసర్‌గా ఉన్నది బీఆర్ బ్రహ్మభట్. 2001 అక్షరధామ్ దాడి సమయంలో ఆయుధాలతో విరుచుకుపడుతున్న ఉగ్రవాదులతో పోరాడిన పోలీసు అధికారి ఆయనే.

ఫొటో సోర్స్, SAM PANTHAKY/AFP/Getty Images

ఫొటో సోర్స్, SAM PANTHAKY/AFP/Getty Images
అయితే, జర్నలిస్టుల అంచనాలు తప్పని రుజువైంది. ఉన్నట్టుండి చేతిలో కర్రలు పట్టుకుని, తెల్లటి వస్త్రాలు ధరించిన వ్యక్తులతో నిండిపోయిన వాహనాలు మాకు కనిపించాయి. వాళ్లు ఆశారాం మద్దతుదారులని ఆశ్రమంలో కార్యక్రమాలను కవర్ చేసే జర్నలిస్టులంతా గుర్తుపట్టారు.
గన్ పేలిన శబ్ధం వినిపించటంతో ఒక్కసారిగా అందరూ భయాందోళనలకు లోనయ్యారు. కార్లు మా దగ్గరకు వచ్చేంత వరకూ మేం మా ర్యాలీని కొనసాగించాం. ఏ క్షణంలోనైనా మాపై రాళ్లదాడి ప్రారంభం కావొచ్చని మేం అనుకున్నాం. కానీ, దాని బారి నుంచి కాపాడుకునేందుకు మేం సన్నద్ధం కాలేదు.
అయితే, పోలీసులు అడ్డుపడ్డారు. ఆశారాం మద్దతుదారుల్ని తరిమి కొడతారని మేం భావించాం.

ఫొటో సోర్స్, SAM PANTHAKY/AFP/Getty Images
కానీ, పోలీసులు మాత్రం.. శాంతిభద్రతలను కాపాడేందుకు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకోవటమే ‘సరైన’ మార్గమని మమ్మల్ని సముదాయించారు.
పోలీసుల నిస్సహాయత్వం.. చేతుల్లో కర్రలు, రాళ్లు పట్టుకున్న వారిని స్వేచ్ఛగా వీధుల్లో వదిలేసి, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నిరాయుధులైన 100 మంది జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకోవటం మాకు ఆగ్రహం కలిగించింది.
ఆ సంఘటన జరిగిన పదేళ్ల తర్వాత.. ఈ రోజు, 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినందుకు ఆశారాం దోషి అని తీర్పు వెలువడింది. మరి ఒకప్పుడు జర్నలిస్టులపై దాడి చేసేందుకు కర్రలు, రాళ్లు చేతబట్టి ఊరేగింపుగా వచ్చిన ఆయన మద్దతు దారులు ఇప్పుడు ఏం చేస్తున్నారో!!
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








