అగాథం నుంచి ‘అగ్రస్థానానికి’: జింబాబ్వే క్రికెట్ పునరాగమనం ఎలా సాగిందంటే..

ఫొటో సోర్స్, Robert Cianflone/Getty Images
- రచయిత, హెన్రీ మోరన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 5 నిమిషాలు
ప్రపంచ వేదికపై జింబాబ్వే జట్టు విజయాలు కొంచెం ముందుతరానికి చెందిన క్రికెట్ అభిమానులకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించవు.
ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 8 రౌండ్‌కు చేరుకున్నట్లే, ఒకప్పుడు అలా విజయాలు సాధించడం వారికి అలవాటుగా ఉండేది. ముఖ్యంగా 1990ల చివరలో భారత్, పాకిస్తాన్ వంటి జట్లపై టెస్ట్ సిరీస్‌లు గెలిచింది జింబాబ్వే.
1999 వరల్డ్ కప్‌లో ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిన ఆ జట్టు, సూపర్ సిక్స్ దశలో ఐదో స్థానంలో నిలిచి త్రుటిలో సెమీఫైనల్ అవకాశాన్ని చేజార్చుకుంది.
ఆ సమయంలో ఆండీ ఫ్లవర్.. బౌలర్లు హీత్ స్ట్రీక్, హెన్రీ ఒలాంగా వంటి ఆటగాళ్లతో ఆ జట్టు బలంగా ఉండేది.
జింబాబ్వే క్రికెట్ భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా కనిపిస్తున్న తరుణంలో అకస్మాత్తుగా ఆ జట్టు అగాథంలోకి వెళ్ళిపోయింది.
అయితే, ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని, పోరాడి, మళ్లీ ఇప్పుడు ప్రపంచ వేదికపై జింబాబ్వే తనదైన ముద్రను వేస్తోంది.


ఫొటో సోర్స్, Getty Images
చీకటి రోజులు
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 2003 వరల్డ్ కప్‌లో.. అప్పటి జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే పాలనను నిరసిస్తూ ఆండీ ఫ్లవర్, హెన్రీ ఒలాంగా నల్లటి చేతి పట్టీలు ధరించి ఆడారు.
ఆ తర్వాత ఆ ఇద్దరూ దేశం విడిచి వెళ్లాల్సివచ్చింది.
ఆ మరుసటి ఏడాది, ఆటలో రాజకీయ జోక్యం, సెలక్షన్ కోటాలకు నిరసనగా 14 మంది సీనియర్ ప్లేయర్లు రాజీనామా చేశారు. 2006 నాటికి, మైదానంలో ఎదురైన భారీ ఓటములు, మైదానం వెలుపల ఉన్న సమస్యల కారణంగా జింబాబ్వే స్వచ్ఛందంగా తన టెస్ట్ హోదాను వదులుకుంది.
సుమారు 15 ఏళ్ల పాటు ఆ జట్టు ఎటువంటి పురోగతి లేక ఇబ్బందులు పడింది. నిరాశలో ఉన్న అభిమానులకు గత విజయాలను గుర్తు చేసే అరుదైన సందర్భాలు తప్ప చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ లేవు. 2011లో తిరిగి టెస్ట్ క్రికెట్‌లోకి అడుగుపెట్టి బంగ్లాదేశ్‌పై విజయం సాధించినప్పటికీ, జింబాబ్వే క్రికెట్ బోర్డు అప్పులు అప్పటికే సుమారు 27 మిలియన్ డాలర్ల (రూ. 225 కోట్లు)కు చేరుకున్నట్లు కథనాలు వచ్చాయి.
మాజీ ఆల్ రౌండర్ సీన్ విలియమ్స్ 2023లో బీబీసీతో మాట్లాడుతూ ఆ చీకటి రోజులను గుర్తు చేసుకున్నారు.
"ఆ సమయంలో ఆటగాళ్ల కంటే ఆఫీసు సిబ్బందే ఎక్కువగా ఉండేవారు. అది ఒక పీడకల లాంటిది" అని అన్నారు.
"జింబాబ్వే క్రికెట్‌కు ఎంత డబ్బు వస్తుందో అందరికీ తెలుసు, కానీ ఏమీ జరిగేది కాదు. ఆ సమయంలో జింబాబ్వే క్రికెట్ నాశనమవుతున్నట్లుగా అనిపించేది" అని సీన్ విలియమ్స్ అన్నారు.
2019లో జింబాబ్వే క్రికెట్ బోర్డుపై ఐసీసీ నిషేధం విధించి, 2021 టీ20 వరల్డ్ కప్‌కు క్వాలిఫై కాకుండా చేయడంతో ఆ జట్టు పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది.

ఫొటో సోర్స్, Ishara S. KODIKARA/AFP via Getty Images
యువ ప్రతిభ, కొత్త ఆశలు
అయితే, ఛైర్మన్ తవెంగ్వా ముకుహ్లానీ సారథ్యంలో ఆర్థిక ఇబ్బందులను అధిగమించి, బోర్డు దాదాపు అప్పులు లేని స్థితికి చేరుకుంది. కరీబా సరస్సు అడుగున మునిగిపోయిన ఓడలా తయారైన బోర్డును తిరిగి దారిలోకి తెచ్చేందుకు, తక్కువ బడ్జెట్‌తో వారు పనిచేశారు.
ఒకప్పుడు గర్వకారణంగా నిలిచిన జట్టు మళ్లీ కోలుకునే అవకాశం కల్పించేందుకు సిబ్బంది ఎన్నో త్యాగాలు చేశారు, ఎంతో జాగ్రత్తగా ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో ఆశలు ఎప్పుడూ చావలేదని మాజీ కెప్టెన్ తతేంద తైబు బీబీసీ స్పోర్ట్స్‌తో చెప్పారు.
"పరిస్థితులు దిగజారుతున్నప్పుడు కూడా జింబాబ్వేలో తరచుగా ఒక మాట వినిపిస్తూ ఉంటుంది: 'నేను ఒక ప్లాన్ చేస్తాను'. 2000వ సంవత్సరం నుంచి ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి. కానీ జింబాబ్వే వాసుల గురించి తెలిసిన ఎవరికైనా తెలుసు. జింబాబ్వే ఖచ్చితంగా పుంజుకుంటుందని నమ్ముతారు" అన్నారు.
ఈ నేపథ్యంలో జరిగిన కసరత్తుతో పాటు, క్రికెట్ ఆడే విధానంలో కూడా పాత పద్ధతిని అనుసరిస్తూ.. రెడ్-బాల్ (టెస్ట్) క్రికెట్‌లో ఆటగాళ్లను తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టారు.
"కొత్త బోర్డు బాధ్యతలు చేపట్టినప్పుడు, 'మనం మళ్ళీ టెస్టులు ఆడదాం - మన జట్టు మెరుగుపడటానికి ఇదే ఏకైక మార్గం' అని ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నాం" అని జింబాబ్వే క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ గివ్మోర్ మాకోని గత ఏడాది బీబీసీతో అన్నారు.
"మేం అది ప్రారంభించినప్పటి నుంచి, జట్టు ప్రదర్శనలో గొప్ప పురోగతిని చూస్తున్నాం" అన్నారు.
మైదానంలో నిలకడగా విజయాలు సాధించే దిశగా సాగిన ఈ ప్రయాణంలో, 2024లో జస్టిన్ సమ్మన్స్‌ను ప్రధాన కోచ్‌గా నియమించడం అత్యంత కీలక మలుపుగా నిలిచింది.
సమ్మన్స్ ప్రధానంగా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించడంతో పాటు, ఓపెనర్ బ్రియన్ బెన్నెట్, ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజారబానీ వంటి యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పించే సంస్కృతిని ప్రోత్సహించారు.
ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో వీరిద్దరూ బాగా రాణిస్తున్నారు. ఫలితంగా, మాజీ ఛాంపియన్లయిన ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లపై సంచలన విజయాలు సాధించిన జింబాబ్వే జట్టు గ్రూప్-బిలో అగ్రస్థానంలో నిలిచింది.
"మైదానంలోకి దిగి, రూపొందించిన రకరకాల ప్రణాళికలను అమలు చేస్తున్నందుకు క్రెడిట్ అంతా ఆటగాళ్లకే దక్కాలి" అని మాజీ ఫాస్ట్ బౌలర్, వ్యాఖ్యాత ముబాంగ్వా అన్నారు.
"యాజమాన్యం, కోచింగ్ బృందం కూడా వారి కృషికి గుర్తింపు పొందాలి" అన్నారాయన.

ఫొటో సోర్స్, Getty Images
సికిందర్ రజా నాయకత్వం
జింబాబ్వే క్రికెట్ పునరుజ్జీవంలో ఆల్‌రౌండర్ సికందర్ రజా పాత్ర కీలకం. 2002లో పాకిస్తాన్ నుంచి జింబాబ్వేకు తరలివెళ్లిన రజా, కంటి సమస్య కారణంగా ఫైటర్ పైలట్ కావాలనే తన కల చెదిరిపోయినప్పటికీ, ఆ నిరాశను పక్కన పెట్టి క్రికెటర్‌గా మారాడు. రికార్డు సెంచరీలతో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు
2022 టీ20 వరల్డ్ కప్‌లో మూడుసార్లు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు గెలవడం, 2024లో గాంబియాపై కేవలం 43 బంతుల్లో 133 పరుగులు చేసి తన జట్టు టీ20 అంతర్జాతీయ ప్రపంచ రికార్డు (344-4) సాధించడంలో తోడ్పడటం, 2023లో నెదర్లాండ్స్‌పై 54 బంతుల్లోనే సెంచరీ (జింబాబ్వే తరపున వేగవంతమైన వన్డే సెంచరీ) చేయడం రజా అద్భుత ప్రదర్శనలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.
"చాలా కాలం తర్వాత అభిమానులు ప్రయాణాలు చేసి మరీ మాకు మద్దతు తెలపడం బహుశా ఇదే మొదటిసారి" అని రజా అంటున్నారు.
"గత ఏడాది కాలంగా మేం ఆడిన విధానమే అందుకు కారణం. మేమంతా కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించగలమనే నమ్మకాన్ని అభిమానుల్లో కలిగించాం. ఇది కేవలం క్రికెటర్లు లేదా సాంకేతిక సిబ్బంది విజయం మాత్రమే కాదు, ఇది మా అభిమానులు, మా మీడియా, మా దేశ పౌరులందరి విజయం" అన్నారు రజా.
ఈ టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి జట్లను ఓడించి లీగ్ పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది జింబాబ్వే. సూపర్ 8 దశకు చేరుకుంది.
మాజీ కెప్టెన్ తైబు, వ్యాఖ్యాత ముబాంగ్వా ఈ విజయాన్ని దేశానికి దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నారు. ప్రస్తుతం వెస్టిండీస్ చేతిలో ఓడినా, నేడు జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌ను చెన్నైలో ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు.
2027 వన్డే వరల్డ్ కప్‌కు జింబాబ్వే సహ ఆతిథ్యం ఇవ్వబోతుండటం ఆ జట్టు భవిష్యత్తుకు శుభసూచకం.
"వరల్డ్ కప్‌లలో జింబాబ్వే ఎప్పుడూ ఒక అండర్ డాగ్‌గానే ఉంటుంది" అని తైబు అన్నారు.
జింబాబ్వే సెమీఫైనల్‌కు చేరుకోవడం కష్టమని కొందరు భావించినప్పటికీ, దేన్నీ కొట్టిపారేయలేం. తైబు అన్నట్లు, "జింబాబ్వే విషయంలో అసాధ్యమనేది ఏదీ లేదు".
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










