స్పెర్మ్ చలికాలంలో కంటే వేసవిలో చురుగ్గా కదులుతుందా?

శుక్ర కణాలు, వేసవి, సంతానోత్పత్తి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జో మెక్‌ఫాడెన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 3 నిమిషాలు

వేసవిలో శుక్రకణాల నాణ్యత అధికంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవల వెల్లడైన కొత్త అధ్యయనం ప్రకారం.. శుక్రకణాల కదిలిక వేసవిలో ఎక్కువగా, శీతాకాలంలో తక్కువగా ఉంటుంది.

18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల 15,581 మంది పురుషుల వీర్య నమూనాలను యూకే, కెనడా, డెన్మార్క్ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ పురుషులు డెన్మార్క్, ఫ్లోరిడా (అమెరికా)లకు చెందినవారు.

ఈ రెండు ప్రాంతాల (వారి)లో జూన్, జులై నెలల్లో శుక్రకణాల కదలిక (అంటే స్పెర్మ్ ఎంత బాగా ఈదగలదు) అధికంగానే ఉందని పరిశోధకులు కనుగొన్నారు.

సంతానోత్పత్తి పరీక్షలు, చికిత్సల కోసం వైద్యులు తగిన సమయాన్ని ఎంచుకోవడంలో ఈ సమాచారం సహాయపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది బిడ్డను కనడానికి ప్రయత్నిస్తున్న జంటలకు ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ అధ్యయనం రీప్రొడక్టివ్ బయాలజీ అండ్ ఎండోక్రినాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది. వివిధ వాతావరణాలలో శుక్రకణాల కదలిక ఒకేలా ఉంటుందని, అయితే సీజన్‌ను బట్టి మారుతుందని ఈ పరిశోధన సూచిస్తోంది.

ఫ్లోరిడాలో సంవత్సరం పొడవునా వాతావరణం వెచ్చగా ఉన్నప్పటికీ, డిసెంబర్, జనవరిలో కణాల కదలిక అత్యల్పంగా ఉందని తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కణాల సంఖ్యలో మార్పు ఉందా?

మరోవైపు, రుతువులను బట్టి వీర్యంలోని శుక్రకణాల సంఖ్య మారలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఏడాది కాలంలో స్ఖలనం సమయంలో విడుదలయ్యే వీర్యం పరిమాణంలో కూడా ఎలాంటి మార్పు లేదని తెలిపారు.

ఏడాదిలో సీజన్ వాతావరణాన్ని మాత్రమే కాకుండా, పురుషుల్లో సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుందని పరిశోధన సూచించింది.

సగటున, సాధారణ శరీర ఉష్ణోగ్రత(37 డిగ్రీల సెల్సియస్) కంటే వృషణాల ఉష్ణోగ్రత 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉండాలని ఇది సూచిస్తోంది.

ఈ పరిధి కంటే ఉష్ణోగ్రత ఎక్కువైనా తక్కువైనా, అది శుక్రకణాల కదలికను తగ్గిస్తుంది, సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది.

'ఉష్ణోగ్రతలు కాదు సీజన్ కీలకం'

వాతావరణం వేరైనా రెండు చోట్లా(డెన్మార్క్, ఫ్లోరిడా) ఒకేలాంటి మార్పులు రావడం ఆశ్చర్యపరిచిందని అధ్యయనంలో పాల్గొన్న మాంచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ అలన్ పేసీ అన్నారు.

"ఫ్లోరిడాలో వాతావరణం ఏడాది పొడవునా వెచ్చగా ఉంటుంది. అయితే, అక్కడ శుక్రకణాల కదలిక వేసవిలో అత్యధికంగా, శీతాకాలంలో అత్యల్పంగా ఉంది. అంటే, ఈ మార్పులకు బయటి ఉష్ణోగ్రత మాత్రమే కారణం కాకపోవచ్చు" అన్నారు.

వీర్యం నాణ్యతను తనిఖీ చేసేటప్పుడు సీజన్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యమని ఈ అధ్యయనం సూచిస్తోందని ప్రొఫెసర్ అలన్ పేసీ అన్నారు.

అంటే వెచ్చగా ఉండే ప్రదేశాలలో కూడా రుతువులను బట్టి శుక్రకణాల కదలిక మారుతుందని ఆయన తెలిపారు.

పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, సంతానోత్పత్తి చికిత్సలను మెరుగుపరచడంలో ఈ ఫలితాలు సహాయపడతాయని ప్రొఫెసర్ అల్లన్ పేసీ అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)