దేశంలో ‘మైనారిటీ’ అంటే ఎవరు? ఈ పదానికి రాజ్యాంగ నిర్వచనం చెప్పాలని కొందరు ఎంపీలు ఎందుకు కోరుతున్నారు?

భారతదేశం, మైనార్టీలు, జనాభా, భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్

ఫొటో సోర్స్, AFP

    • రచయిత, దిగవల్లి పవన్‌కాంత్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 10 నిమిషాలు

దేశంలో ఏదైనా ప్రజా సమూహాన్ని మైనారిటీ కేటగిరీలో చేర్చాలంటే దానికి ఉండాల్సిన అర్హతలేంటి?

ఇప్పటివరకూ మైనారిటీలుగా పరిగణిస్తున్న వారిని ఏ ప్రాతిపదికన నిర్ణయించారు? రాజ్యాంగంలో మైనారిటీ అనే పదానికి నిర్వచనం ఉందా లేదా? కేంద్ర ప్రభుత్వం ఎవరిని మైనారిటీలుగా గుర్తిస్తుంది?

ఈ ప్రశ్నలను పార్లమెంటులో 2006 నుంచి అనేక సందర్భాల్లో వేర్వేరు పార్టీలకు చెందిన ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు.

మైనారిటీ అనే పదానికి రాజ్యాంగ నిర్వచనమేంటో ప్రభుత్వం వివరించాలనేది వీళ్ల ప్రశ్నల్లో ప్రధాన ఉద్దేశం.

అల్ప సంఖ్యాకులైన సంచార, అర్ధ సంచార, డీనోటిఫైడ్ తెగలకూ మైనారిటీ హోదా ఇవ్వాలనే డిమాండ్ కూడా ప్రస్తుతం వినిపిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Paka Venkata Satyanarayana

ఫొటో సోర్స్, Paka Venkata Satyanarayana/facebook

ఫొటో క్యాప్షన్, పాకా సత్యనారాయణ

‘మైనారిటీల జనాభా పెరిగింది’

"ఒక ముఖ్యమైన రాజ్యాంగ విధానం (కాన్‌స్టిట్యూషనల్ పాలసీ)పై సభ దృష్టి సారించాలని అనుకుంటున్నా. అదే మైనారిటీలను గుర్తించే అంశం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొన్ని కమ్యూనిటీలను మైనారిటీ కేటగిరీ కింద గుర్తించారు. అయితే, గడిచిన ఏడు దశాబ్దాలుగా ఇలా గుర్తించిన మైనారిటీల జనాభా రెట్టింపు అయింది, లేదా అంతకన్నా ఎక్కువైంది'' అని రాజ్యసభలో ఫిబ్రవరి 10న బీజేపీకి చెందిన తెలుగు ఎంపీ పాకా సత్యనారాయణ తన ప్రసంగంలో అన్నారు.

''ఇది రాజ్యాంగ సంస్థలపైన, ఎన్నికల సంస్కరణలు చేసే వ్యవస్థపైన ప్రభావం చూపుతుంది. దీనివలన నిజమైన మైనారిటీలకు నష్టం జరుగుతోంది కాబట్టి మైనారిటీ స్టేటస్ ఇచ్చేందుకు అనుసరించిన విధివిధానాలను ప్రభుత్వం పునఃపరిశీలించాలి" అని ఆయన కోరారు.

"భాషాప్రయుక్త, అల్పసంఖ్యాక హిందూ ఉప తెగలైన, సంచార, అర్ధ సంచార, డీనోటిఫైడ్ తెగలే అసలైన మైనారిటీలు అవుతారు. వీరిలో అనేక తెగలకు చెందిన ప్రజల సంఖ్య తగ్గిపోతోంది. కొన్ని తెగలు మాట్లాడే భాష, లిపి క్రమంగా అంతరించిపోతున్నాయి. కాబట్టి వీరికి మైనారిటీ స్టేటస్ కల్పించాలి" అని పాకా సత్యనారాయణ కోరుతున్నారు.

'మైనారిటీ' అనే పదానికి రాజ్యాంగ నిర్వచనం చెప్పాలని పాకా సత్యనారాయణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

సంచార, అర్ధ సంచార, డీనోటిఫైడ్ తెగలను అసలు హిందూ ఉప తెగలుగానే చూడాలా? వీళ్లు ఏ మతానికి చెందుతారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంటుంది.

వీరిలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల కింద హక్కుల రక్షణకు, రాజ్యాంగ ప్రయోజనాలకు నోచుకోని తెగలున్నాయా?

సంచార, అర్ధ సంచార, డీనోటిఫైడ్ తెగలు ఎన్ని ఉన్నాయి?

డీనోటిపైడ్, సంచార, అర్ధ సంచార తెగలపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 2014లో 'భికు రాంజీ ఐడేట్ కమిషన్‌'ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 2017లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

దేశంలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల్లో అన్నీకలిపి 1,257 తెగలు ఉన్నాయని కమిషన్ గుర్తించింది. మరో 269 తెగలు అసలు ఏ కేటగిరీ కిందా లేకుండా, ఎలాంటి గుర్తింపూ లేకుండా, ఏవిధమైన హక్కుల రక్షణకు, రాజ్యాంగ ప్రయోజనాలకూ నోచుకోకుండా ఉన్నాయని 'భికు రాంజీ ఐడేట్ కమిషన్' నివేదికలో పేర్కొన్నారు.

ఈ 269 తెగలను కూడా 2026-27లో నిర్వహించబోయే జనగణన ప్రక్రియలో భాగం చేయాలని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయితే ఈ 1,257 తెగల వారందరికీ రాజ్యాంగ ప్రయోజనాలు సమానంగా అందడం లేదని, కొన్నింటికి ఉపాధి అవకాశాల్లో కనీస ప్రాతినిధ్యం కూడా దక్కడం లేదని కమిషన్ ప్రస్తావించింది.

2006‌ నుంచీ మైనారిటీ వ్యవహారాల శాఖ

పూర్తి స్థాయి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను మొదటిసారిగా 2006లో ప్రవేశపెట్టారు. నాటి నుంచి లోక్‌సభ, రాజ్యసభలో కొందరు ఎంపీలు వేర్వేరు సందర్భాల్లో మైనారిటీ నిర్వచనం, ప్రాతిపదికకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు.

పంజాబ్‌లో అకాలీదళ్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ వరీందర్ సింగ్ బజ్వా 2006లో, గోవాలో కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ శాంతారామ్ నాయక్ 2007లో, మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ ప్యారేలాల్ ఖండేల్వాల్ 2008లో, వైఎస్సార్‌సీపీ రాజ్యసభకు నామినేట్ చేసిన ఎంపీ పరిమల్ నత్వానీ 2015లో, బీజేపీకి చెందిన రాజ్యసభ ఎంపీ రాకేశ్ సిన్హా 2021లో, మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే)కు చెందిన లోక్‌సభ ఎంపీ అనిల్ దేశాయ్ 2023లో, ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి చెందిన పాకా సత్యనారాయణ 2026లో ఈ అంశంపై ప్రశ్నలు అడిగారు.

భారతదేశం, మైనార్టీలు, జనాభా, భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్

‘మైనారిటీ’ నిర్వచనమివ్వడానికి ప్రయత్నం...

బీజేపీ ఎంపీ రాకేశ్ సిన్హా ప్రశ్నకు సమాధానంగా మైనారిటీకి నిర్వచనం చెప్పే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది.

నాటి మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. జాతీయ మైనారిటీ కమిషన్ 1992 చట్టంలోని 2(సి) సెక్షన్ కింద క్రైస్తవులు, సిక్కులు, ముస్లింలు, బౌద్ధులు, పార్సీలు (జొరాస్ట్రియన్లు), జైనులను మైనారిటీలుగా నోటిఫై చేశారని ఆయన తెలిపారు.

రాజ్యాంగంలోని 29వ అధికరణం, 30వ అధికరణం మైనారిటీల ప్రయోజనాలకు రక్షణ కల్పిస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. భాషాప్రయుక్త మైనారిటీలు కూడా ఇందులో భాగమని తెలిపింది.

అయితే 'కమిషనర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్' వ్యవహారిక నిర్వచనం ప్రకారం భాషాప్రయుక్త మైనారిటీలంటే – దేశ భూభాగంలో నివసిస్తూ, తమకంటూ సొంత భాష, లిపి కలిగి ఉండే ఏదైనా ప్రజల సముదాయం. వీళ్లు మాట్లాడే భాష రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం గుర్తించిన 22 భాషల్లో ఒకటిగా ఉండాల్సిన అవసరం లేదు.

ఎంపీల ప్రశ్నలకు గత యూపీఏ, ప్రస్తుత ఎన్‌డీయే ప్రభుత్వాలిచ్చిన సమాధానాల్లో, మైనారిటీ కమిషన్ చట్ట ప్రకారం కొన్ని కమ్యూనిటీలను మైనారిటీలుగా నోటిఫై చేశామనే తెలిపాయి తప్ప మైనారిటీ ఎంపికకు మతమే ప్రాతిపదిక అని చెప్పే పదాలను ఎక్కడా వాడలేదు.

అలాగే జనాభా ఆధారంగా అల్ప సంఖ్యాకులకు మైనారిటీ స్టేటస్ కల్పించాలంటే అవసరమైన కనీస జనాభా నిష్పత్తిపైనా జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం-1992లో స్పష్టమైన నిర్వచనం లేదని కూడా కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

భారతదేశం, మైనార్టీలు, జనాభా, భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్

జాతీయ మైనారిటీ కమిషన్-1992 చట్టం ప్రకారం...

'మైనారిటీ' అనే పదానికి జాతీయ మైనారిటీ కమిషన్-1992 చట్టం నిర్వచనం ఏంటి?

ఈ చట్టంలోని చాప్టర్ 1లో 2(సి) అమలు కోసం కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన కమ్యూనిటీలనే మైనారిటీలుగా పరిగణనలోకి తీసుకుంటుంది. కానీ మైనారిటీ పదానికి ప్రత్యేకమైన నిర్వచనమేదీ ఈ చట్టంలో లేదు.

జాతీయ మైనారిటీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది?

1992కి ముందు మైనారిటీలంటే ఎవరనే స్పష్టమైన నిర్వచనం ఎక్కడా లేదు.

స్వాతంత్ర్యం తరువాత జరిగిన జనగణనల ఆధారంగా హిందూయేతర ప్రజలను మైనారిటీలుగా పరిగణించే సాధారణ అవగాహన కొనసాగింది.

ఇలా పరిగణనలోకి తీసుకున్న మైనారిటీల హక్కుల పరిరక్షణ స్థితి ఏవిధంగా ఉందో అంచనా వేసేందుకు 1978 జనవరిలో కేంద్ర ప్రభుత్వం మైనారిటీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

కానీ, ఈ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించలేదు. తర్వాత జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం 1992ను రూపొందించి కమిషన్‌కు చట్టబద్ధత కల్పించారు.

క్రైస్తవులు, ముస్లింలు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు (జొరాస్ట్రియన్స్)... ఈ ఐదు కమ్యూనిటీలను ఈ చట్టం కింద 1993లో మొదటిసారి అధికారికంగా మైనారిటీలుగా నోటిఫై చేశారు. తర్వాత 2014లో ఇదే చట్టంలోని సెక్షన్ 2(సి) కింద జైనులను మైనారిటీ కేటగిరీలో చేర్చారు.

భారతదేశం, మైనార్టీలు, జనాభా, భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్

రాజ్యాంగంలో 'మైనారిటీ'కి నిర్వచనం లేదా?

రాజ్యాంగంలో 'మైనారిటీ'కి నిర్వచనం లేదా? ఆర్టికల్ 29 & 30 ఏం చెబుతున్నాయి?

ఆర్టికల్ 29 :

సెక్షన్ (1) - మైనారిటీల ప్రయోజనాలకు రక్షణ కల్పిస్తోంది. భారత భూభాగంలో నివసించే పౌరులు ఏ వర్గానికి చెందినవారైనా సరే – తమకంటూ విభిన్న భాష, లిపి, సంస్కృతి కలిగి ఉంటే, వీటిని పరిరక్షించుకునే హక్కు వారికి ఉంటుంది.

సెక్షన్ (2) - ప్రభుత్వాల నిర్వహణలో ఉన్న విద్యాసంస్థల్లో లేదా మతం, కులం, జాతి, భాష ఆధారంగా ప్రభుత్వ నిధులు అందుకునే విద్యాసంస్థలేవైనా సరే, పౌరులెవరికీ అడ్మిషన్ నిరాకరించడానికి వీల్లేదు.

ఆర్టికల్ 30 : మైనారిటీలు విద్యాసంస్థల అభివృద్ధి, నిర్వహణ హక్కులు కలిగి ఉంటారు.

సెక్షన్ (1) - మైనారిటీలందరూ అంటే, మతపరమైన మైనారిటీలైనా, భాషాప్రయుక్త మైనారిటీలైనా తమకు నచ్చిన విధంగా విద్యాసంస్థలను అభివృద్ధి చేసుకునే హక్కులు, నిర్వహణ హక్కులు కలిగి ఉంటారు.

సెక్షన్ (2) – మతం, భాష ఆధారంగా మైనారిటీలుగా పరిగణించే వారి మేనేజ్‌మెంట్‌లో ఏదైనా విద్యా సంస్థ ఉన్నపుడు, ప్రభుత్వ నిధుల కేటాయింపుల్లో ఆయా సంస్థలపై ఎలాంటి వివక్ష చూపడానికి లేదు.

భారతదేశం, మైనార్టీలు, జనాభా, భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్
ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్

నిపుణులేమంటున్నారు?

మైనారిటీ అనే పదానికి నిర్వచనం రాజ్యాంగంలోని 14, 15, 16 అధికరణల్లో భాగంగా ఉందని, ఈ అధికరణలను విస్తృతంగా చూడాల్సిన అవసరం ఉంటుందని కేంద్ర మాజీ సమాచార కమిషనర్, రాజ్యాంగ నిపుణుడు, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ అన్నారు.

"రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16లలో సవివర నిర్వచనాలు ఉన్నాయి. ప్రాథమిక హక్కుల్లోని (భాగం III) ఆర్టికల్ 14 నుంచి 16 వరకు.. చట్టం ముందు సమానత్వాన్ని వివరిస్తున్నాయి.

ఆర్టికల్ 15 వివక్షను నిషేధిస్తుంది. మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా పౌరుల మధ్య వివక్ష చూపడాన్ని నిషేధిస్తుంది. ఇక ఆర్టికల్ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు, పదవులకు సంబంధించి సమాన అవకాశాలు కల్పించాలి. మతం, కులం, జెండర్ కారణాలతో వివక్ష చూపడానికి లేదు" అని మాడభూషి శ్రీధర్ వివరించారు.

భారతదేశం, మైనార్టీలు, జనాభా, భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్
ఫొటో క్యాప్షన్, మాజీ ఐఏఎస్ అధికారి, లోక్‌సత్తా అధినేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్

‘అది తేనెతుట్టను కదిపినట్టే.. ’

మైనారిటీల వ్యవహారం చుట్టూ చాలా చర్చ జరిగిందని, ఇప్పుడు దీనంతటినీ పునఃపరిశీలించాలని, కొత్తగా నిర్వచనం చెప్పాలని కోరడం తేనెతుట్టను కదిపినట్టేనని మాజీ ఐఏఎస్ అధికారి, లోక్‌సత్తా అధినేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అభిప్రాయపడ్డారు.

"అనేక మతాలు, జాతులు, కులాలు, తెగలు ఉన్న అత్యంత సంక్లిష్టమైన సమాజం మనది. ఇంతటి సమాజాన్ని సజావుగా నడిపిస్తున్నది మన రాజ్యాంగం. ఇప్పుడు మైనారిటీ వ్యవహారం చుట్టూ తేనెతుట్టను కదిపితే, సమాజంలో ఏకాభిప్రాయం కుదరడం అసాధ్యం" అని డాక్టర్ జయప్రకాశ్ నారాయణ అన్నారు.

అయితే, మతం ప్రాతిపదికనే మైనారిటీ స్టేటస్ ఇవ్వాలని ఎక్కడా లేనపుడు, అల్పసంఖ్యాక హిందూ ఉపతెగలను, క్రైస్తవ మెజారిటీ రాష్ట్రాల్లో మైనారిటీగా ఉన్న హిందువులను జాతీయ స్థాయిలో ఎందుకు మైనారిటీలుగా పరిగణించట్లేదో వివరించాలనే ప్రశ్నలు కూడా కొందరు ఎంపీలు పార్లమెంటులో అడిగారు.

"మైనారిటీలుగా పరిగణిస్తున్న వారి సంఖ్య గడిచిన కొన్ని దశాబ్దాలుగా రెట్టింపు కావడమో, అంతకన్నా ఎక్కువగా పెరగడమో జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. ముఖ్యంగా లిపి, భాష అంతరించిపోతున్న తెగలు దాదాపు 28 ఉన్నాయి. వీటిలో బుడబుక్కల, పూసల, దొమ్మర, గంగిరెద్దుల, పాముల, వీరముష్టి, కంజర బట్ట, యాత, వడ్డెర, పార్థి, బోయ లాంటి తెగలున్నాయి. వీరిని మైనారిటీలుగా గుర్తించాల్సిన అవసరముంది" అని పాకా సత్యనారాయణ 'బీబీసీ'తో అన్నారు.

"వెనుకబడిన, అణగారిన ప్రజలను గుర్తించి వారికి రాజ్యాంగ ప్రయోజనాలు అందేలా ప్రత్యేక చట్టాలు చేయొచ్చు. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం హేతుబద్ధం కాని డిమాండ్లు చేయడం సమాజానికి మంచి చేయదు" అని డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అభిప్రాయపడ్డారు.

అలానే 'మైనారిటీ' అనే పదాన్ని మతం కోణంలోనే కాకుండా మొత్తంగా వెనుకబడిన, అణగారిన వర్గాల ప్రజలకు వర్తించేదిగా విస్తృతమైన ఉద్దేశంతో చూడాలని ఆయన సూచించగా, వెనుకబడిన వర్గాల ప్రయోజనాల కోసం తీసుకొచ్చే చట్టాల్లో నిబద్ధత లోపిస్తోందని మాడభూషి శ్రీధర్ అన్నారు.

"ఒకవేళ ప్రత్యేక చట్టాలు చేసినా, అవి లోపభూయిష్టంగా ఉంటున్నాయి కాబట్టి కోర్టుల్లో వాటిని కొట్టివేసే పరిస్థితులు ఎదురవుతున్నాయి. రాజకీయ స్వలాభాల కోసం ఓడిపోయే చట్టాలను తెచ్చుకుంటే అది అన్యాయం అవుతుంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

భారతదేశం, మైనార్టీలు, జనాభా, భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్

ఫొటో సోర్స్, GovtofIndia

ఫొటో క్యాప్షన్, 2011 జనగణన డేటా

ఇక్కడ మైనార్టీలే అక్కడ మెజారిటీ...

2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో నాటి జమ్మూ కశ్మీర్‌, కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లు ముస్లిం మెజారిటీ ప్రాంతాలుగా ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో స్వల్పంగా, నాగాలాండ్, మిజోరం, మేఘాలయలు గణనీయంగా క్రైస్తవ మెజారిటీ రాష్ట్రాలుగా ఉన్నాయి.

భారత్‌లో స్వాతంత్రానికి ముందు ఎనిమిదిసార్లు, తర్వాత ఏడుసార్లు.. మొత్తం 15సార్లు జనగణన జరిగింది.

2011 సెన్సస్ డేటా తప్ప గడిచిన దశాబ్దాల్లో మైనారిటీల జనాభా సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పే నిర్దిష్టమైన డేటా కానీ, ఆధారం కానీ ఎక్కడా అందుబాటులో లేదు.

అలానే హిందువులు మైనారిటీలుగా ఉన్న రాష్ట్రాల్లో క్రైస్తవ మెజారిటీని జాతీయస్థాయిలో మైనారిటీగా ఎలా గుర్తిస్తారని కూడా పాకా సత్యనారాయణ ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రాల స్థాయిలో మైనారిటీలుగా ఉన్న ప్రజలకు జాతీయ స్థాయిలో మైనారిటీ స్టేటస్ ఇవ్వాలనే విజ్ఞప్తులు కూడా వేర్వేరు పార్టీలకు చెందిన కొందరు ఎంపీలు వేర్వేరు సందర్భార్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమో, కోరడమో జరిగింది.

భారతదేశం, మైనార్టీలు, జనాభా, భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్
ఫొటో క్యాప్షన్, స్మృతీ ఇరానీ

బాధ్యత ఎవరిది? కేంద్రానిదా, రాష్ట్రాలదా?

రాష్ట్రాల స్థాయిలో మతపర, భాషాప్రయుక్త మైనారిటీలను గుర్తించి నోటిఫై చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలేనని 2021లో బీజేపీ ఎంపీ రాకేశ్ సిన్హా అడిగిన ప్రశ్నకు సమాధానంగా నాటి కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో మైనారిటీలను గుర్తించి నోటిఫై చేస్తుందని 2023లో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే)కు చెందిన ఎంపీ అనిల్ దేశాయ్ అడిగిన ప్రశ్నకు నాటి కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతీ ఇరానీ సమాధానమిచ్చారు.

భారతదేశం, మైనార్టీలు, జనాభా, భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్

ఫొటో సోర్స్, Getty Images

‘మైనారిటీ’ హోదాతో లభించే ప్రయోజనాలేంటి?

ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 కింద మైనారిటీల హక్కులకు రక్షణ దొరుకుతుంది.

మతపర మైనారిటీలు అభివృద్ధి చేసుకునే విద్యాసంస్థల్లో ఆయా కమ్యూనిటీలకు చెందిన విద్యార్థులకు గరిష్టంగా 50 శాతం రిజర్వేషన్లు ఉంటాయి. మిగిలిన సీట్లను ఇతరులకు ఇవ్వాల్సి ఉంటుంది.

తమ లిపి, భాష, సంస్కృతిని పరిరక్షించుకునే రాజ్యాంగ హక్కులు సంక్రమిస్తాయి.

ప్రభుత్వం ప్రవేశపెట్టే సాంఘిక సంక్షేమ పథకాలు వెనుకబడిన వర్గాలుగా గుర్తించిన మైనారిటీలకు మాత్రమే వర్తిస్తాయి.

అలానే వెనుకబడిన వర్గాలు (ఓబీసీ)గా గుర్తించిన మైనారీటీలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం జాతీయ స్థాయిలో అమలవుతున్న 27 శాతం ఓబీసీ రిజర్వేషన్‌లలోనే పోటీ పడాల్సి ఉంటుంది. కానీ 'మైనారిటీ స్టేటస్' అంటూ జాతీయ స్థాయిలో ప్రత్యేక రిజర్వేషన్లను అమలు చేసిన చరిత్ర ఇప్పటి వరకూ దేశంలో లేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)