‘‘ఇద్దరిని కాదు, ఒకరిని కనీపెంచడమే కష్టంగా మారుతోంది’’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పద్మ మీనాక్షి
- హోదా, బీబీసీ కోసం
ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల పిలుపునిచ్చారు. పిల్లల్ని కని, వారిని పెంచే విషయంలో మహిళల పై, కుటుంబం పై పడే శారీరక, మానసిక, ఆర్ధిక భారం గురించి బీబీసీ కొంత మంది మహిళలు, వైద్య, సామాజిక నిపుణులతో మాట్లాడింది.


ఫొటో సోర్స్, Getty Images
‘పాప కోసం ఉద్యోగానికి రాజీనామా చేశా’
"నేను మా నాలుగు నెలల కూతురిని చూసుకోవడానికి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులో ఉద్యోగానికి రిజైన్ చేశాను. ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉండటం బాగానే ఉంటుంది, కానీ, తరాలు మారాయి, సామాజిక, ఆర్ధిక పరిస్థితులు మారాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు కాదు కదా, ఒక బిడ్డను చూసుకోవడం కూడా కష్టమే, ఉద్యోగాల కోసం నగరాలకు వలస వెళుతూ కుటుంబ సభ్యుల మద్దతు లేకుండా పిల్లల్ని పెంచడం చాలా కష్టం" అన్నారు, బెంగళూరుకు చెందిన అనూహ్య.
"ఇద్దరు పిల్లలు ఉండటం కుటుంబాన్ని సంపూర్ణం చేస్తుంది" అంటారు విశాఖపట్నానికి చెందిన గృహిణి శైలజ మహాదాస్యం.
"తోబుట్టువులు జీవితాంతం మనతో పాటు ఉండిపోయే స్నేహితులు, ఒకరికొకరు భరోసాగా ఉంటారు. బాధ్యతలు పంచుకుంటారు. షేరింగ్ అలవాటవుతుంది. ఈ రోజుల్లో పిల్లల పెంపకం, కనడం, తిండి పెట్టడం మాత్రమే కాదు. బాధ్యతాయుతమైన పౌరునిగా తయారు చేసే బాధ్యత కూడా తల్లిదే. ఎంత మంది పిల్లలు ఉండాలనేది కుటుంబ, ఆర్ధిక, మానసిక, శారీరక స్థితి పై ఆధారపడి ఉంటుంది. ఇది ఎవరికి వారు తీసుకునే నిర్ణయం" అని శైలజ అన్నారు.
"ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉండటం బాగుంటుంది, మేం కూడా మా అమ్మా నాన్నలకు ముగ్గురు పిల్లలమే. కానీ, తరాలు మారాయి. వీటితో పాటు పరిస్థితులు, కుటుంబ వ్యవస్థ కూడా మారిపోయింది. ప్రస్తుత కాలంలో చాలా వరకు నగరాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు 25 ఏళ్ల తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. పూర్వం 18 ఏళ్ల లోపు పెళ్లిళ్లు అయిపోతూ ఉండేవి. 20 ఏళ్లకే పిల్లల్ని కనేవారు. చాలా వరకు ఇంటికే పరిమితమై ఉండేవారు. గృహిణిగా వాళ్ళ బాధ్యత పిల్లల పెంపకం, ఇల్లు చూసుకోవడం వరకే ఉండేది" అని అనూహ్య అన్నారు.
"ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, కెరీర్ కోసం నగరాలకు, విదేశాలకు వలస వెళ్లడం, చిన్నవైపోతున్న కుటుంబాలు, ఉద్యోగ ఒత్తిడి, పెరిగిన కాస్ట్ ఆఫ్ లివింగ్ వీటన్నింటి మధ్య ఇద్దరు కాదు కదా ఒకరిని కని పెంచడమే కష్టంగా మారుతోంది. ఇద్దరు పిల్లల్ని కనేవాళ్ళు చాలా మంది కుటుంబ ఒత్తిడి కారణంగా కంటున్నవారే" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ప్రోత్సాహకాలు ఇస్తారా?’
"మరో 25 ఏళ్లలో అంటే 2049 నాటికి ఆంధ్రప్రదేశ్ లో వృద్ధులు పెరిగిపోతారని, ఈ పరిస్థితిని నియంత్రించాలంటే, ఇద్దరు లేదా అంత కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ పరిస్థితి ఇప్పటికే జపాన్, చైనా, యూరోప్ లో కనిపిస్తోంది" అని ఆయన అన్నారు.
"భారతదేశంలో జనాభా ఇప్పటికే చైనాను మించిపోయింది. విదేశాల్లో జనాభా తక్కువ. అక్కడి విధానాన్ని ఇక్కడెలా అమలు చేస్తాం. ఆ దేశాల్లో ఉండే సాంఘిక సంక్షేమ పథకాలు ఇక్కడ అమలులో ఉన్నాయా? ఫిన్ ల్యాండ్, జపాన్ లాంటి దేశాల్లో ఒకరి కంటే ఎక్కువ పిల్లలున్నవారికి ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహకాలు ఇస్తోంది. చాలా దేశాల్లో విద్య, వైద్యం ఉచితంగా ఉంటాయి. నిరుద్యోగ పథకాలు ఉంటాయి. అవన్నీ మన దేశంలో అమలు చేసే పరిస్థితిలో ఉన్నామా?" అని ప్రశ్నించారు అనూహ్య.
"పిల్లల్ని కనడం, పెంచడం ఒక రోజులోనో, తొమ్మిది నెలల్లోనో అయిపోయే పని కాదు. అది 20 ఏళ్ల మిషన్. టైర్ 2 నగరాల్లో కూడా ఊహించలేనంత కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది".
"మా అమ్మాయి ఇప్పుడు గ్రేడ్ 1 లో ఉంది. తనకు ఏడాదికి చదువు కోసం 3 లక్షల రూపాయిల ఖర్చు అవుతోంది. ఇదేమీ హై క్లాస్ స్కూల్ కాదు. బెంగళూరులో మధ్యతరగతి వాళ్ళు వెళ్లే స్కూలు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొకరిని కనాలంటే వాళ్ళని చూసుకోవడం కోసం సరిపడే ఆదాయం లేదా ఆస్తులు ఉండాలి" అన్నారు అనూహ్య.
పిల్లల్ని కనడం, వాళ్ళను పెంచడం కోసం తిరిగి భార్యా భర్తలు ఉద్యోగాలకు వెళ్లడం, పిల్లల్ని డే కేర్ లో వదిలిపెట్టి రావడం, ఇంట్లో ఎవరూ లేక పిల్లలు మానసికంగా ఒత్తిడికి గురవ్వడం ఇదంతా ఒక విష వలయంలా అనిపిస్తోంది" అంటారామె.

ఫొటో సోర్స్, Getty Images
‘ఈఎంఐ వలయంలో చిక్కుకున్నారు’
విశాఖపట్నానికి చెందిన ఐవిఎఫ్ నిపుణులు, డాక్టర్ జి ఏ రామరాజు మాట్లాడుతూ "ప్రస్తుత తరం "ఈఎంఐ అనే విష వలయంలో చిక్కుకున్నారు" అంటూ, జీవితంలో ఎదురయ్యే డిమాండ్లు, వాళ్ళ ఆశలు, వాస్తవ పరిస్థితులు ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఉన్నాయి" అన్నారు.
"పిల్లల చదువు, వైద్య ఖర్చులు మధ్యతరగతి పై చాలా భారం పెంచుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కెరీర్ పట్ల దృష్టి పెట్టే మహిళలకు ఒక వైపు ఇల్లు, మరో వైపు ఉద్యోగం, పిల్లల బాధ్యత చూసుకోవడం తలకు మించిన భారంగా మారుతోంది. ఉద్యోగులు, మధ్య తరగతి వారు టీడీఎస్ , జిఎస్‌టీ లాంటి పన్నులు కడుతూ ,ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని కనాలంటే, శారీరకంగా, ఆర్ధికంగా, మానసికంగా కూడా భారమే," అని అన్నారు.
"ప్రస్తుత పరిస్థితుల్లో భార్యా భర్తలు కట్టాల్సిన లోన్ ఈఎంఐల గురించి ఆలోచించిన తర్వాత పిల్లల్ని కనాలో వద్దో నిర్ణయించుకుంటున్నారు" అని అన్నారు.
అనూహ్య కూడా ఈ అభిప్రాయాన్ని సమర్ధించారు.
"నేను మరో బిడ్డను కనాలంటే ఉద్యోగం చేస్తేనే, ఆ బిడ్డకు నాణ్యమైన జీవితం, చదువు ఇవ్వగలం. ఉద్యోగానికి వెళితే, నా బిడ్డలకు సమయం ఇవ్వలేను. అలాంటప్పుడు ఒక కొత్త జీవిని భూమి పైకి తేవడం ఎందుకు?" అని ఆమె ప్రశ్నించారు.
"ఉద్యోగానికి వెళితే, తల్లికి ఇంట్లో వండేందుకు టైం ఉండటం లేదు. దీంతో, రెడీ టూ ఈట్, జంక్ ఫుడ్ పై ఆధారపడుతున్నారు. దీనివల్ల పిల్లలు, తల్లుల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది’’ అన్నారు.
"ఈ ఒత్తిడి తట్టుకోలేకే మనం, మన పిల్లలు కూడా సైకియాట్రీ క్లినిక్స్ ముందు క్యూలు కడుతున్నాం. చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ లతో మరణిస్తున్న వారి కేసులు చూస్తున్నాం" అని అన్నారు.
"కోస్తా జిల్లాల్లో మధ్యతరగతి ప్రజల ఆర్థిక పరిస్థితులు అంత బాగా లేవు. సామాజిక భద్రతా ప్రయోజనాలు లేవు. అభద్రతా భావం బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ మరింత పటిష్టం కావాలి" అంటారు డాక్టర్ రామరాజు.
"ప్రస్తుత సామాజిక, ఆర్ధిక పరిస్థితుల్లో 20 ఏళ్లకే పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని , ఉద్యోగం ఒత్తిడి లేకుండా, పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా తగినంత డబ్బు, వారసత్వపు ఆస్తులు ఉంటే ఇద్దరు లేదా అంత కంటే ఎక్కువ మంది పిల్లల్నే కనొచ్చు" అన్నారు అనూహ్య.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














