ప్రతి 10 మందిలో ఒకరికి 80 ఏళ్లు పైనే.. జపాన్ చరిత్రలో తొలిసారి

వ్యాయామం చేస్తున్న వృద్ధ మహిళ

ఫొటో సోర్స్, Getty Images

జపాన్ చరిత్రలో తొలిసారి, ప్రతీ పది మందిలో ఒకరు 80 ఏళ్లు లేదా అంత కంటే ఎక్కువ వయసున్న వారని తేలింది.

12.5 కోట్ల మంది జనాభాలో 29.1 శాతం మంది 65 ఏళ్లు అంత కంటే ఎక్కువ వయసున్న వారేనని జాతీయ గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది కూడా ఒక రికార్డు.

ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు అతితక్కువ ఉన్న దేశాల్లో జపాన్ ఒకటి. దేశంలో వృద్ధుల సంఖ్య అధికం కావడంపై చాలా కాలంగా ఆందోళన పెరుగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే జపాన్‌లోనే వృద్ధుల జనాభా ఎక్కువగా ఉందని, జనాభాలో 65 ఏళ్లు అంతకంటే పెద్దవాళ్లు ఎక్కువ మంది ఉన్నారని ఐక్యరాజ్య సమితి చెప్పింది.

దేశ ప్రజల్లో వృద్ధ జనాభా విషయంలో జపాన్ తర్వాతి స్థానంలో 24.5 శాతంతో ఇటలీ, 23.6 శాతంతో ఫిన్‌లాండ్ ఉన్నాయి.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ రీసర్చ్ అంచనా ప్రకారం 2040 నాటికి జపాన్‌లో65 ఏళ్లు దాటిన వారి సంఖ్య 34.8 శాతానికి చేరవచ్చు.

జపాన్ చిన్నారి

ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, జపాన్‌లో నిరుడు 8 లక్షల మంది కంటే తక్కువ పిల్లలు పుట్టారని అంచనా.

శ్రామిక శక్తిలో 13 శాతం మంది 65 ఏళ్లు పైబడినవారే

ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అధిక వయసున్న ఉద్యోగుల సంఖ్య కూడా జపాన్‌లోనే ఎక్కువ. జాతీయ శ్రామిక శక్తిలో 13 శాతం మంది 65 అంత కంటే ఎక్కువ వయసున్నవారే. వాళ్లు సొంతంగా సంపాదిస్తుండటంతో ప్రభుత్వం సామాజిక భద్రత కోసం చేయాల్సిన ఖర్చు భారం తగ్గుతోంది.

పెరుగుతున్న ఖర్చులు, అధిక పని గంటల మధ్య జననాల రేటు పెంచేందుకు చేపట్టిన చర్యలు కొంత వరకూ సత్ఫలితాలను ఇస్తున్నాయి.

జపాన్‌తోపాటు చుట్టు పక్కల దేశాల్లోనూ జననాల రేటు నెమ్మదిస్తున్నా, ఈ సమస్య జపాన్‌ను బాగా ఇబ్బంది పెడుతోంది.

జపాన్‌లో నిరుడు 8 లక్షల మంది కంటే తక్కువ పిల్లలు పుట్టారని అంచనా. 19వ శతాబ్దం తర్వాత ఆ దేశంలో ఇంత తక్కువ మంది పిల్లలు పుట్టడం ఇదే తొలిసారి.

1970లో ఈ సంఖ్య 20 లక్షలుగా ఉంది.

జననాల రేటు తగ్గడంపై జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా ఈ ఏడాది జనవరిలో తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సమస్య వల్ల మనమొక సమాజంగా కొనసాగగలమా, లేదా అనే పరిస్థితి తలెత్తుతోందని ఆయన చెప్పారు.

జననాల రేటు తగ్గడమనే సమస్యకు వలస కార్మికుల రూపంలో పరిష్కారం దొరుకుతుందని అంగీకరించేందుకు జపాన్ అధికార యంత్రాంగం సిద్ధంగా లేదు.

చైనా, దక్షిణ కొరియాల్లోనూ ఇదే సమస్య

ఆసియాలోని ఇతర దేశాలు కూడా జనాభాకు సంబంధించి ఇలాంటి సవాళ్లనే ఎదుర్కొంటున్నాయి.

1961 తర్వాత నిరుడు చైనాలోనూ జనాభా వృద్ధి రేటు తొలిసారి పడిపోయింది.

దక్షిణ కొరియాలో ప్రపంచంలోనే అతి తక్కువ జననాల రేటు నమోదవుతున్నట్లు తేలింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)