ద్రవ్యోల్బణం దెబ్బకు చిత్తు అవుతున్న వీరిని ఆదుకునేదెవరు?

ఫొటో సోర్స్, Beka Atoma/BBC
- రచయిత, రికార్డో నెన్రా
- హోదా, గ్లోబల్ పాపులేషన్ కరెస్పాండెంట్
మెసెరెట్ ఏడిస్ గొంతు వణుకుతోంది. మాట చిన్నగా వినిపిస్తోంది. 83 ఏళ్ల ఈ మహిళ ఎక్కువగా మంచంపైనే జీవితాన్ని గడుపుతున్నారు.
ఆక్సీజన్ కోసం ముక్కుకు అమర్చిన కాన్యులా ద్వారా ఆమె దీర్ఘ శ్వాస తీసుకుంటారు.
‘‘నాకు ఈ బాధ వద్దు. నేను ఆకలితో ఉండాలని అనుకోవట్లేదు. చలి బారిన పడాలనుకోవట్లేదు’’ అని ఆమె చెప్పారు.
ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాలోని ముగ్గురు మనుమలతో కలిసి ఆమె ఒక చిన్న గదిలో ఉంటారు. డయాబెటిస్‌తో ఆమె కూతురు చనిపోయారు. ఆమె ఒక వితంతువు.
పిల్లలంతా బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనాన్ని పాఠశాలలోనే ముగిస్తారు. కాబట్టి రాత్రి భోజనం కోసం ఏడిస్ కొంత ఆహారాన్ని ఆదా చేస్తారు. ఆమె రోజూ ఒకపూట మాత్రమే తింటారు.
‘‘మేం కోలో మాత్రమే తింటాం. నీరు తాగి నిద్రపోతాం. కోలో కూడా దొరక్కపోతే మేం ఏం చేయలేం’’ అని ఆమె చెప్పారు. కోలో అనేది వేయించిన పప్పులతో చేసే సంప్రదాయక ఆహారం.
కేవలం ఆమె కథ మాత్రమే ఇలా లేదు.

ఫొటో సోర్స్, Beka Atoma/BBC
‘‘వృద్ధుల్ని పట్టించుకోరు’’
ప్రపంచ ద్రవ్యోల్బణ సంక్షోభం ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా వయస్సు పైబడిన పురుషులు, మహిళలతో బీబీసీ మాట్లాడింది.
కనీస అవసరాలు తీర్చుకోవడంలో ఎదురయ్యే సవాళ్లు, చారిటీలపై ఆధారపడటం, తీవ్ర దుర్భలంగా మారిన ఇతర అంశాల గురించి వారి మాటల్లో తెలిసింది.
‘‘వృద్ధులకు సంబంధించిన పూర్తి డేటా లేదు’’ అని బీబీసీతో వృద్దుల హక్కులపై పనిచేసే ఐక్యరాజ్య సమితి స్వతంత్ర నిపుణురాలు క్లాడియా మహ్లర్ చెప్పారు.
‘‘వారి స్వరం ఎక్కువగా వినిపించనందున వారిని అందరూ వదిలేస్తారు. వృద్ధులకు మద్దతు కూడా పెద్దగా అందదు’’ అని ఆమె అన్నారు.
బతకడం కోసం వృద్ధులు బిక్షమెత్తుకోవడం దగ్గర్నుంచి వైద్యం ఖర్చులను తగ్గించుకోవడం వంటి కఠినమైన చర్యలను తీసుకుంటున్నారని ‘హెల్ప్‌ఏజ్’ అనే చారిటీ సంస్థ చేసిన సర్వేలో తేలింది.
అంతర్జాతీయ ఏజెన్సీల సహాయంతో నడిచే ఈ సంస్థ 10 దేశాల్లోని వృద్ధులపై సర్వే చేసి ఈ విషయాన్ని వెల్లడించింది.
‘‘నేను అనారోగ్యంతో ఉన్నా. మంచం పట్టాను. నాకు సహాయం అందకపోతే చావడం తప్ప ఇంకో మార్గం లేదు’’ అని మెసెరెట్ ఏడిస్ అన్నారు.
లెబనాన్ రాజధాని బీరూట్‌లో నివసించే 67 ఏళ్ల అలైస్ చోబనియాన్‌ది కూడా ఇలాంటి వ్యథే.
‘‘ఎన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించానో అనే విషయం గురించి ఇప్పుడు నేను మాట్లాడాలని అనుకోవట్లేదు’’ అని అలైస్ అన్నారు.
ఈ ద్రవ్యోల్బణ సంక్షోభం, వృద్ధులపై మానసికంగా చాలా తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.
‘‘వృద్ధుల్లో డిప్రెషన్‌ను ఏదో వయస్సు సంబంధిత సమస్యగా చూస్తారు. దాన్ని అంత తీవ్రంగా పరిగణించరు. కానీ, ఇది తీవ్రమైన సమస్య. దీన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు’’ అని క్లాడియా అన్నారు.
అలైస్ తన ఇద్దరు కూతుర్లు, ఎనిమిది మంది మనుమళ్లతో కలిసి ఒక చిన్న గదిలో నివసిస్తున్నారు.
2020 నుంచి తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారిందని అలైస్ చెప్పారు. ఇప్పుడున్నంత కష్టంగా గతంలో ఎప్పుడూ తమ జీవితం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Zakaria Jaber/BBC
సంక్షోభాల వరుస
తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్న వారి సంఖ్య 2019లో 13.5 కోట్ల నుంచి 2022 నాటికి 34.5 కోట్లకు పెరిగిందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం తెలిపింది.
కోవిడ్ మహమ్మారి, వాతావరణ మార్పులతో పాటు 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా దాడి వల్ల ప్రపంచంలో ఆహార కొరత మరింత తీవ్రమైంది. ఆహారం, శక్తి, ఔషధాల సరఫరా గొలుసుకు అంతరాయం ఏర్పడింది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటింది.
రష్యా-యుక్రెయిన్ యుద్ధాని కంటే ముందే లెబనాన్‌లో సంక్షోభ పరిస్థితులు ఉన్నాయి. నిరుడు అక్కడ ఆహార ద్రవ్యోల్బణం 372.8 శాతాన్ని తాకింది.
‘‘నా మనుమరాళ్లు చికెన్ దుకాణం ముందు నుంచి నడవటాన్ని ఇష్టపడతారు. ఎందుకంటే అలాగైనా చికెన్ వాసన చూడొచ్చని వారు అనుకుంటారు.
నిన్న వాళ్లు నాతో ఆకలేస్తుందని అన్నారు. కానీ, వారికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు. దీంతో వారు ‘సరే పడుకుందాం. కలలో చికెన్ తిన్నట్లు ఊహించుకుందాం’ అన్నారు’’ అని అలైస్ బాధగా చెప్పారు.
అలైస్ కూతురు ఒక ఇంట్లో పనిచేస్తున్నారు. ఆమెకు నెలకు వేతనంగా 20 డాలర్లు (రూ. 1,636) అందుతాయి.
‘‘ఈ సంక్షోభం రాక ముందు నేను దుస్తులు అమ్మేదాన్ని. ఆర్థిక సంక్షోభం కారణంగా ఇప్పుడు ఎవరూ ఏమీ కొనట్లేదు. నేను అమ్మే దుస్తులను విలాస వస్తువులుగా ప్రజలు భావిస్తున్నారు. అందుకే వారు కొనట్లేదు’’ అని అలైస్ చెప్పారు.

ఫొటో సోర్స్, Beka Atoma/BBC
వృద్ధ మహిళలకు తీవ్ర కష్టాలు
ఏడిస్, అలైస్ వంటి వృద్ధ మహిళలు ఈ సంక్షోభం వల్ల ఏర్పడిన గడ్డు పరిస్థితులను అనుభవించారని నిపుణులు చెబుతున్నారు.
‘‘ఆహారం కొద్దిగా ఉన్నప్పుడు మొదట మహిళలే భోజనానికి దూరంగా ఉంటారు. సామాజిక సాంస్కృతిక నిబంధనలు కూడా మహిళలు ఇలా చేసేందుకు కారణం అవుతాయి. అలాగే ప్రస్తుతం ఉన్న సామాజిక అసమానతల కారణంగా మహిళలకు డబ్బులు సంపాదించే సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది’’ అని ‘హెల్ప్‌ఏజ్’ చారిటీ ఇన్‌కమ్ సెక్యూరిటీ హెడ్ బాబ్ బాబాజనియాన్ అన్నారు.
ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, బంధువులకు మర్యాదలు చేయడం వంటి పనులను సాధారణంగా మహిళల పనులుగా పరిగణిస్తారు.
బయట పనులకు వెళ్లినప్పుడు సాధారణంగా పురుషుల కంటే మహిళలకు తక్కువగా వేతనం అందుతుంది.
‘‘పురుషులకు, మహిళలకు మధ్య వేతన అంతరాల గురించి మేం తరచుగా మాట్లాడతాం. వేతన అంతరమే కాకుండా పెన్షన్ విషయంలో కూడా ఈ తేడాలు ఉన్నాయి’’ అని క్లాడియా అన్నారు.

ఫొటో సోర్స్, Kiran Fatima/BBC
వృద్ధ పురుషులు కూడా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటారు.
అది మధ్నాహ్నసమయం. పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఉన్న తన కార్ వర్క్‌షాప్ ముందు జియావుద్దీన్ ఖిల్జీ కూర్చున్నారు. గత నెలలో ఆయన భార్య చనిపోయారు. ఆమెకు ఏడేళ్ల పాటు డయాలిసిస్ జరిగింది.
68 ఏళ్ల వయస్సులో కూడా ఆయన పనిచేయాల్సి వస్తోంది. ఆయనకు ఎలాంటి పెన్షన్ రాదు. తరచుగా ఆయన వద్దకు వచ్చే కస్టమర్లలో చాలామంది గత ఏడాది కాలంగా ఆయనకు కనిపించట్లేదు.
‘‘అప్పట్లో రోజంతా తీరిక దొరక్కపోయేది. చాలా పని ఉండేది. ఇప్పుడేమో అంతా ఖాళీ. పొద్దున్నుంచి చూస్తే ఇప్పుడే చేయడానికి ఒక పని వచ్చింది’’ అని దుమ్ముతో కూడిన ఒక మెషీన్‌ను చూపిస్తూ ఖిల్జీ చెప్పారు.
2023 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌లో వినియోగదారుల ధరలు, గత 50 ఏళ్ల గరిష్టానికి పెరిగాయి.
వర్క్‌షాప్‌లోనే వెనుకవైపు ఒక మడత మంచంపై ఆయన రోజూ పడుకుంటున్నారు. గత నెలలోనే ఆయన నిర్వహించే వర్క్‌షాప్ కిరాయిని రెండింతలకు పైగా పెంచారు.
వడ్డీ రేట్లు పెరగడంతో భార్య వైద్య ఖర్చుల కోసం తీసుకున్న అప్పులు కూడా ఆయనకు మరింత భారంగా మారాయి.
‘‘నాకు డయాబెటిస్ ఉంది. గుండెకు స్టంట్ కూడా పడింది. కిడ్నీలు బాగా దెబ్బతిన్నాయి. కానీ, నేను వాడే టాబ్లెట్లు ధరలు ఇప్పుడు బాగా పెరిగాయి. ఒక్కోసారి నేను మందులు వేసుకోవడం లేదు. డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే వాటిని కొని వేసుకుంటున్నా. డబ్బులు లేకపోతే నేను మాత్రం ఏం చేయగలను?’’ అని ఖిల్జీ అన్నారు.
మరోవైపు ఇథియోపియాలోని ఏడిస్ కూడా ఊపిరితిత్తులు సరిగా పనిచేయడం కోసం తీసుకోవాల్సిన మందులు కొనడాన్ని ఆపేశారు.
ధరల పెరుగుదల వల్ల వైద్యానికి, మందులకు వృద్ధులు దూరమవుతున్నారనే హెల్ప్ ఏజ్ పరిశోధనకు ఈ రెండు కేసులు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

ఫుడ్ బ్యాంక్‌ల వైపు మొగ్గు
అభివృద్ధి చెందుతున్న దేశాలైన ఇథియోపియా, లెబనాన్, పాకిస్తాన్‌లతో పాటు ధనిక దేశమైన యూకేలో కూడా వృద్ధులపై ఆర్థిక సంక్షోభ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
74 ఏళ్ల థబాని సిథోల్ ఒక రిటైర్డ్ నర్స్. ఆమె లండన్‌లో ఉంటారు. తనకు కావాల్సిన ఆహారం కోసం ఆమె ‘‘ఫుడ్ బ్యాంక్’’ అనే సంస్థపై ఆధారపడాల్సి వస్తోంది. అక్కడి కమ్యూనిటీ వారు ఈ సంస్థను నడుపుతున్నారు.
‘‘నేను ఆహారం కోసం ఇలా ఫుడ్ బ్యాంక్‌పై ఆధారపడతానని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే అంతా బాగానే ఉన్నట్లు అనిపించింది. నా దగ్గర కొంత పొదుపు డబ్బు ఉండేది. అప్పుడు ఇతరులను చూసి వీరంతా ఫుడ్ బ్యాంక్‌ను ఎందుకు ఉపయోగిస్తున్నారు? అనుకునేదాన్ని.
కానీ, ఇప్పుడు నాకు అదే పరిస్థితి వచ్చింది. వెళ్లి నేను కూడా ఆ క్యూలలో నిల్చుంటున్నా’’ అంటూ తన వంటగదిలోని టేబుల్‌పై టిన్నులను చూపిస్తూ చెప్పారు.

‘‘ఎన్‌హెచ్‌ఎస్ నుంచి 2019లో రిటైర్ అయినప్పుడు, నా జీవితం ఇప్పుడే మొదలవుతుందని అనుకున్నా. కానీ, రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు అంతా మార్చేశాయి.
ఒక్కోసారి ఏదైనా తినాలని అనిపిస్తుంది. కానీ, నచ్చింది తినే పరిస్థితి లేదు. కడుపు నింపుకోవడం కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది’’ అని ఆమె అన్నారు.
తన కూతురికి 2 నెలల వయస్సున్నప్పుడు సిథోల్ భర్త చనిపోయారు. కూతురితో కలిసి ఆమె జీవిస్తున్నారు.
వచ్చే 20 ఏళ్లలో యూకేలో 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వారి సంఖ్య రెండింతలు లేదా మూడింతలు కావొచ్చని కింగ్స్ కాలేజీ లండన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెరెంటోలజీ డైరెక్టర్ వీయ్ యాంగ్ అన్నారు.
‘‘ప్రజలకు ఎప్పుడూ తమ పిల్లల నుంచి మద్దతు లభించడం అసాధ్యం. వృద్ధులకు దీర్ఘకాలిక రక్షణకోసం ఆర్థిక సహాయం చేసే మార్గాలను ప్రభుత్వాలు అన్వేషించాల్సిన అవసరం ఉంది’’ అని యాంగ్ అభిప్రాయపడ్డారు.
‘‘ఇండిపెండెంట్ ఏజ్’’ వంటి చారిటీలు అందించే సహాయంపై తాను ఆధారపడుతున్నానని సిథోల్ చెప్పారు.
‘‘రెండు నెలలకు ఒకసారి కిరాయి పెరుగుతోంది. మేం ఈ ఇంటిని విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే దీని కిరాయిని భరించే స్థోమత మాకు ఇప్పుడు లేదు’’ అని అన్నారు.
ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధులంతా తమ కష్టాల గురించి మాట్లాడాలని ఆమె పిలుపునిచ్చారు.
‘‘సిగ్గుపడకండి, భయపడకండి. అవమానంగా భావించకండి. అయ్యో నువ్వు నర్సుగా పనిచేసేదానివి కదా. ఆహారం కోసం ఇక్కడికి వస్తున్నావా అనే మాటలకు నేను అలవాటు పడ్డాను.
కానీ, ఇప్పుడు ఎవరూ నా పేదరికం గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే ఇప్పుడు నర్సులే కాదు టీచర్లు, డాక్టర్లు కూడా ఫుడ్ బ్యాంక్ వద్దకు వస్తున్నారు’’ అని ఆమె చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అరికొంబన్: ఈ కిల్లర్ ఎలిఫెంట్ చేసిన పనికి తీసుకెళ్లి టైగర్ రిజర్వ్‌లో వదిలేశారు
- ఒసామా బిన్ లాడెన్‌ను చంపడానికి బరాక్ ఒబామా బృందం ఎలా వ్యూహం పన్నింది? 'ఎ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకంలో వివరించిన అమెరికా మాజీ అధ్యక్షుడు
- ఆంధ్రప్రదేశ్: అమరావతి ప్రాంతంలో ఆర్-5 జోన్ వివాదం ఏంటి, పేదలకు ఇళ్ల స్థలాలపై అభ్యంతరాలు ఎందుకు?
- జైశంకర్: భారత్ తరఫున బలమైన గొంతుకా, లేక దూకుడుతో వచ్చిన పాపులారిటీనా?
- దేవుని దగ్గరకు తీసుకెళ్తామంటూ వందల మంది ప్రాణాలు తీసిన ముగ్గురి కథ
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














