జైశంకర్: భారత్‌ తరఫున బలమైన గొంతుకా, లేక దూకుడుతో వచ్చిన పాపులారిటీనా?

జైశంకర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జుబేర్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రష్యా-యుక్రెయిన్ యుద్ధం ప్రపంచ దేశాలను రెండుగా విభజించిందని భారత్ నమ్ముతోంది. పాశ్చాత్య దేశాలు రుద్దుతున్న ప్రపంచ వ్యవస్థలో భారీ మార్పులు అవసరమని విశ్వసిస్తోంది.

కానీ ఈ నిజాన్ని శక్తివంతమైన అమెరికా లాంటి దేశానికి ఎవరు చెప్తారు?

ఈ విషయాన్ని చైనా బహిరంగంగానే చెబుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా చెబుతున్న ఇండియా కూడా ఆ బాధ్యతను తీసుకుంది.

ఇప్పుడు, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆలోచనలను ఎలాంటి సంకోచం లేకుండా, నిర్మొహమాటంగా చెప్పగలిగిన వ్యక్తిగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రమణియమ్ జైశంకర్ ఎదిగారు.

ఆ బాధ్యతలను జైశంకర్ అత్యుత్తమంగా నిర్వర్తిస్తున్నారని భారత్ చెబుతోంది. రష్యా - యుక్రెయిన్ యుద్ధం లాంటి విపత్కర సమయంలో రష్యాతో సంబంధాలను తెంచుకోవాలని, తమ క్యాంప్‌లో చేరాలని శక్తివంతమైన పాశ్చాత్య దేశాలు భారత్‌పై ఒత్తిడి తెచ్చినప్పటికీ ఇండియా అలా చేయలేదు.

ఈ యుద్ధంలో ఎవరికీ మద్దతుగా నిలిచేది లేదని భారత్ స్పష్టంగా చెప్పింది. పాశ్చాత్య దేశాల ఒత్తిడిని ఎదుర్కోవడంలో భారత్ చూపిన ధైర్యానికి ప్రధాన కారణం జైశంకర్.

అమెరికా, యూరోపియన్ యూనియన్ వంటి ప్రపంచంలోని అగ్రరాజ్యాలను జైశంకర్ ఎదుర్కోవడాన్ని భారత ప్రజలు గమనిస్తున్నారు. అదే ఆయనకు దేశంలో పాపులారిటీ పెరగడానికి పెద్ద కారణం.

జైశంకర్ వ్యాఖ్యలు సూటిగా, ఎలాంటి భయాలు లేకుండా ఉంటాయి. అయితే, ఆ దూకుడు కొందరికి చికాకు కూడా తెప్పిస్తుంది.

జైశంకర్

ఫొటో సోర్స్, Getty Images

‘విదేశీ పత్రికలు ఆ పదాలు రాయవు’

ఇటీవల పాశ్చాత్య దేశాలకు చెందిన కొన్ని సంస్థలు ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యంపై కొన్ని రేటింగ్స్ ఇచ్చాయి. మైనారిటీల పట్ల భారత్ వ్యవహరిస్తున్న తీరుతో ఇండియాలో ప్రజాస్వామ్యం క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ వాదనలపై జైశంకర్ దూకుడుగా వ్యవహరించారు.

''అవి కపటంతో చేసిన వాదనలు. ప్రపంచంలో కొందరు వ్యక్తులు తమకు తాము ఇతరులకు సర్టిఫికెట్ ఇచ్చేవారిగా భావిస్తుంటారు. భారత్ తమ అంగీకారాన్ని కోరడం లేదని జీర్ణించుకోలేకపోతున్నారు.'' అని జైశంకర్ వ్యాఖ్యానించారు.

అయితే, జైశంకర్ వ్యాఖ్యల్లో ప్రధానమైన విషయం ఏంటంటే, దౌత్యపరమైన పద్ధతుల్లో సున్నితంగా చెప్పకుండా, సూటిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తమ దేశంపై చేసే విమర్శలకు భారతీయులు కూడా అలాగే ప్రతిస్పందిస్తారని జైశంకర్‌కు తెలుసు. అలాంటి వ్యాఖ్యలే దేశ ప్రజల దృష్టిలో ఆయన్ను హీరోగా మార్చేశాయి. దేశప్రయోజనాలే ప్రధానంగా భావించే వ్యక్తిగా పేరుతెచ్చిపెట్టాయి.

ఈ సంవత్సరం జనవరిలో, బీజేపీ ప్రభుత్వాన్ని 'హిందూ జాతీయవాద ప్రభుత్వం' అని చెప్పిన పాశ్చాత్య మీడియాకి జైశంకర్ చాలా కటువైన సమాధానమిచ్చారు.

''మీరు విదేశీ వార్తాపత్రికలు చదివితే, హిందూ జాతీయవాద ప్రభుత్వం అనే పదాలు రాయడం కనిపిస్తుంది. అమెరికా, యూరప్‌లో క్రైస్తవ జాతీయవాదం అని వారు రాయరు. అలాంటి కొన్ని పదాలను ప్రత్యేకంగా మన కోసమే వాడతారు'' అని జైశంకర్ చెప్పారు.

పాశ్చాత్య దేశాల పట్ల జైశంకర్ దూకుడు వైఖరిని తాను సమర్థిస్తానని రాజకీయ, విదేశీ వ్యవహారాల నిపుణుడు డాక్టర్ సువ్రోక్మల్ దత్తా చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ప్రపంచ దేశాలు, ముఖ్యంగా పాశ్యాత్య దేశాల విషయానికి వస్తే, భారత్ ఏం కోరుకుంటుందో అది జైశంకర్ రూపంలో కనిపిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో పాశ్యాత్య దేశాలను ఆయన ఎదుర్కొన్న విధానం, ఆ దేశాలకు జవాబు ఇచ్చిన తీరు జైశంకర్‌ను భారత్‌లో పాపులర్ చేశాయి.

అయితే, ''మోడీస్ ఇండియా: హిందూ నేషనలిజం అండ్ ది రైజ్ ఆఫ్ ఎథ్నిక్ డెమొక్రసీ'' రచయిత, లండన్‌లో కింగ్స్ కాలేజీ ప్రొఫెసర్ క్రిస్టోఫీ జఫర్‌లో మాత్రం జైశంకర్‌ విధానం జాతీయవాది తరహాలో ఉందని అభిప్రాయపడ్డారు. అలాంటి వాళ్లు దేశ ప్రజల మన్ననలు పొందేందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తుంటారని అన్నారు.

'' పాశ్యాత్య దేశాల పట్ల జైశంకర్ వ్యాఖ్యలు, భారత ప్రజలపై బలమైన ముద్ర వేయడమే లక్ష్యంగా చేస్తున్నట్లు కనిపిస్తోంది. అదే ఆయన దూకుడు వైఖరికి ప్రధాన కారణం. కానీ, అది కొత్తేమీ కాదు.'' అని క్రిస్టోఫీ అన్నారు.

''ఈరోజుల్లో ప్రపంచంలోని చాలామంది జాతీయవాద నేతలు అలాగే మాట్లాడుతున్నారు. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోవాన్ కూడా అలాగే మాట్లాడతారు. హంగేరీ ప్రధాన మంత్రి విక్టర్ ఆర్బన్ అలాంటి పద్ధతినే వాడుతున్నారు. తమ దేశ ప్రజలను ప్రలోభపెట్టేందుకే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకు ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారు. వ్యంగ్యంగా, అనాలోచితంగా చేసే వ్యాఖ్యలను సామాన్య జనం ఇష్టపడతారు'' అని క్రిస్టోఫీ చెప్పారు.

పాశ్చాత్య దేశాలతో దౌత్య సంబంధాలు నెరపడంలో జైశంకర్, రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతిలో వెళ్తున్నారని లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ యూనివర్సిటీలో సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెమొక్రసీ విభాగం డైరెక్టర్ డాక్టర్ నిటాషా కౌల్ చెప్పారు. చాలా తెలివిగా, అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు.

''అవి మొదట ప్రగతిశీలమైనవిగానే అనిపిస్తాయి. కానీ, పాత పద్ధతులు, స్వదేశీ వైఖరిని సమర్థించుకోవడానికి కూడా వారు అలాంటి వాదనలే ఉపయోగిస్తారు.'' అని ఆమె చెప్పారు.

వలస పాలనపై జైశంకర్ చేసే విమర్శలను సమర్థించేవారు పశ్చిమ దేశాల్లోనూ చాలా మంది ఉన్నారని నిటాషా కౌల్ చెప్పారు. కానీ, పాశ్యాత్య దేశాల దుశ్చర్యలను విమర్శించే స్వదేశీ ప్రజలను ప్రలోభపెట్టేందుకు కూడా వారు అలాంటి వాదనలనే ఉపయోగిస్తారని ఆమె అన్నారు.

జైశంకర్

ఫొటో సోర్స్, Getty Images

స్నేహితులు, శత్రువులు దేశాన్ని ఎలా చూస్తారు?

జైశంకర్ భారత్ తరఫున చైనా రాయబారిగా సుదీర్ఘకాలం పనిచేశారని చైనాలోని సిచువాన్ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అసోసియేట్ డీన్, ప్రొఫెసర్ హువాంగ్ యన్‌సొంగ్ చెప్పారు.

చైనాకు చెందిన మేధావులు, వ్యూహకర్తల్లో కొంతమందికి జైశంకర్ బాగా తెలుసు. చాలా కచ్చితంగా, ముక్కుసూటిగా ఉండే జైశంకర్‌ను వాస్తవాలపై అవగాహన ఉన్న రాజకీయ నాయకుడిగా గౌరవిస్తారు.

''ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ఆయన దౌత్యపరమైన విషయాల్లో అత్యంత తెలివైన వ్యక్తి. భారత సార్వభౌమత్వాన్నికాపాడే విషయంలో ఆయన ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు.'' అని హువాంగ్ చెప్పారు.

''ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే పేరుతో కపట వైఖరి అవలంబించడం, మానవ హక్కుల పేరుతో ఇతర దేశాల వ్యవహారాల్లో పాశ్చాత్య దేశాలు జోక్యం చేసుకుటున్నాయన్న వాదనలను తీసేయలేం'' అని ప్రొఫెసర్ నిటాషా కౌల్ అభిప్రాయపడ్డారు.

కానీ, పాశ్చాత్య దేశాల పట్ల జైశంకర్ వ్యాఖ్యలు నైతికత ముసుగులో తెలివైన విధానమని ఆమె చెప్పారు.

''వలస పాలనలో జరిగిన దుశ్చర్యలను పశ్చిమ దేశాల నైతికతను ప్రశ్నించేందుకు ఆయుధంగా వాడుకుంటున్నట్లు నా పరిశోధనలో నేను గమనించాను. స్వదేశీవాదంతో కూడిన దూకుడు, అహంకారం రూపంలో అవి కనిపిస్తాయి.'' అని కౌల్ అన్నారు.

''మానవీయ కోణంలో పశ్చిమ దేశాల పాత చరిత్రను ఎత్తిచూపడం ద్వారా పాశ్యాత్య దేశాల ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నం. ఇది జైశంకర్ వంటి వారి రూపంలో అమలవుతున్న భారత విదేశాంగ విధానం ప్రస్తుత సిద్ధాంతం. ఈరోజు జైశంకర్ చేస్తున్నది అదేనని నేను అనుకుంటున్నా'' అని ఆమె చెప్పారు. రష్యా, యుక్రెయిన్ యుద్ధం అందుకు ఉదాహరణ అన్నారు.

జైశంకర్ చేస్తున్న ఇలాంటి వ్యాఖ్యలను పశ్చిమ దేశాలు గమనిస్తున్నాయి. కానీ, తమ ప్రధాన ప్రత్యర్థి చైనాపై చేసిన వ్యాఖ్యలతో పోల్చినప్పుడు కాస్త ఫర్వాలేదని ఆమె అన్నారు.

''సూటిగా చెప్పాలంటే జైశంకర్ వ్యాఖ్యల ప్రభావం ఎక్కువే. ఈ విషయంలో భారత్‌తో పాటు చైనా కూడా ప్రధానం. జైశంకర్ వ్యాఖ్యల వెనక నిజం తెలిసిన పశ్చిమ దేశాలకు, చైనా కంటే ఇండియా అంత ప్రమాదకరం కాదని తెలుసు'' అని కౌల్ చెప్పారు.

అయితే, ప్రపంచ వ్యవస్థలో పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేరని జైశంకర్ వ్యాఖ్యల్లో స్పష్టంగా తెలుస్తోందని ప్రొఫెసర్ క్రిస్టోఫీ తెలిపారు.

'ఈ రోజు మన ముందుకు ఒక మార్పు వచ్చింది. అది గతంలో మనమెప్పుడూ చూడనిది' అని జైశంకర్ 2020లో రాసిన 'ది ఇండియా వే: స్ట్రాటజీస్ ఫర్ యాన్ అన్‌సర్టెన్ వరల్డ్' అనే పుస్తకంలో పదే పదే చెప్పారు.

''ఇవి ప్రపంచ దేశాలపై ఆధిపత్య ధోరణిలో మార్పును సూచిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈరోజు వాస్తవాలను చెప్పేందుకు ధైర్యం చేస్తున్నాయి. పశ్చిమ దేశాలు కపట బుద్ధితో వ్యవహరిస్తున్నాయి. మీరు నైతికతతో వ్యవహరించనప్పుడు, ఇతరులకు నైతికత గురించి పాఠాలు చెప్పలేరు'' అని ప్రొఫెసర్ జఫర్‌లో వివరించారు.

జైశంకర్

ఫొటో సోర్స్, Getty Images

జైశంకర్ ఎదుగుదల

మోదీ క్యాబినెట్‌లో జైశంకర్‌ ప్రాధాన్యం పెరిగిందన్న వాదనలున్నాయి. మరీముఖ్యంగా యుక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలులో జైశంకర్ వైఖరితో ఆయన ప్రతిష్ట పెరిగింది.

మోదీ క్యాబినెట్‌లో అత్యంత ఆదరణ పొందిన వ్యక్తుల్లో జైశంకర్ ఒకరని ఆయన మద్దతుదారులు నమ్ముతున్నారు.

''విదేశాంగ శాఖ మంత్రిగా జైశంకర్‌ను దివంగత సుష్మా స్వరాజ్‌తో సమానంగా చూస్తాను. నా వరకు, విదేశాంగ మంత్రిగా డాక్టర్ జైశంకర్ సాధించిన విజయాలు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ కంటే కూడా గొప్పవి'' అని డాక్టర్ సువ్రోక్మల్ దత్తా చెప్పారు.

అది చాలా పెద్ద మాటే. విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు వరకూ, జైశంకర్ ప్రయాణం దౌత్యవేత్తగా విజయానికి గొప్ప ఉదాహరణ.

జైశంకర్

ఫొటో సోర్స్, Getty Images

ఎవరీ జయశంకర్?

జైశంకర్ 1955లో దిల్లీలో జన్మించారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల కుటుంబంలో ఆయన పుట్టారు. జైశంకర్ తండ్రి కె.సుబ్రమణియమ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారి. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ సంబంధాలపై జైశంకర్ డాక్టరేట్ పట్టా పొందారు.

జైశంకర్‌ను ఉదారవాదిగా, పశ్చిమ దేశాల ప్రజాస్వామ్య విధానాలను నమ్మే వ్యక్తిగా ఆయన సన్నిహుతులు భావించేవారు.

1977లో దౌత్యవేత్తగా జైశంకర్ తన ఉద్యోగ జీవితం మొదలుపెట్టారు. చాలా దేశాల్లో ఆయన భారత దౌత్యవేత్తగా పనిచేశారు.

2013 నుంచి 15 ఏళ్ల మధ్య అమెరికాలో భారత రాయబారిగా పనిచేశారు. ఇరుదేశాల ఆర్థిక సంబంధాలు విస్తృతం చేసేందుకు కృషి చేశారు. అమెరికా విధానాల రూపకల్పనలో కీలక వ్యక్తులతో కలిసి పనిచేశారు.

ఇండియా - యూఎస్ మధ్య బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపొందడంలో కీలక పాత్ర పోషించారు.

అయితే, 2009 నుంచి 2013 మధ్య చైనాలో భారత రాయబారిగా పనిచేయడం జైశంకర్ జీవితాన్ని మలుపు తిప్పిందని విదేశీ వ్యవహారాల నిపుణులు చెబుతుంటారు.

అదే సమయంలో, 2011లో గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో నరేంద్ర మోదీ చైనాలో పర్యటించారు. అప్పుడే తొలిసారి నరేంద్ర మోదీని జైశంకర్ కలిశారు.

ఇటీవల ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ రోజులను జైశంకర్ గుర్తు చేసుకున్నారు. '' నేను 2011లో చైనాలో నరేంద్ర మోదీని కలిశాను. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన చైనాలో పర్యటించారు. ఆ పర్యటనలో ఆయన నాపై బలమైన ముద్ర వేశారు.''

''2011 వరకు, అలా పర్యటనలకు వచ్చిన చాలామంది ముఖ్యమంత్రులను చూశాను. కానీ అంతగా ప్రిపేరై పర్యటనకు వచ్చిన వారిని నేనెప్పుడూ చూడలేదు.'' అని జైశంకర్ చెప్పారు.

జైశంకర్

ఫొటో సోర్స్, Getty Images

జైశంకర్ సైద్ధాంతిక ప్రయాణం

2014లో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జైశంకర్‌ను అమెరికాలో భారత రాయబారిగా నియమించారు.

జైశంకర్ ఆలోచనల్లో మార్పు వల్ల ఇది జరిగిందా? లేదా మరేదైనా జరిగిందా? అనేది చెప్పడం కష్టమని విమర్శకులు చెబుతుంటారు. అయితే, తొలిసారి 2014 సెప్టెంబర్‌లో అమెరికా పర్యటకు వెళ్లినప్పుడు ప్రధాని మోదీతో జైశంకర్ సన్నిహితంగా మెలిగారు.

నరేంద్ర మోదీ తొలి అమెరికా పర్యటనలో జైశంకర్ ప్రధాన పాత్ర పోషించారు. న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో నిర్వహించిన 'హౌడీ మోడీ' కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. దానిపై విస్తృతమైన చర్చ కూడా జరిగింది.

''నేను అమెరికా రాయబారిగా ఉన్న సమయంలో మాడిసన్ స్క్వేర్ ప్రోగ్రాం జరిగింది. చాలా మంది ఇప్పటికీ అదో చరిత్రాత్మక కార్యక్రమంగా చెబుతుంటారు'' అని గతేడాది జరిగిన ఒక కార్యక్రమంలో జైశంకర్ స్వయంగావ్యాఖ్యానించారు.

2015 - 18 మధ్య కాలంలో విదేశాంగ కార్యదర్శిగా నియమించిన తర్వాత భారత విదేశాంగ విధానాన్ని రూపొందించడంలో జైశంకర్ కీలకంగా వ్యవహరించారు. నిబంధనలతో కూడిన ప్రపంచ దేశాల వ్యవస్థపై భారత్ దృక్పథాన్ని స్పష్టంగా తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర పోషించారు.

విదేశాంగ కార్యదర్శిగా ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి చాలా పర్యటనలకు వెళ్లినట్లు జైశంకర్ చెప్పారు.

దౌత్యవేత్తగా తన అధికార పరిధిని దాటి తన రాజకీయ గురువుకు ఎక్కువగా సేవలందించారన్న విమర్శలు కూడా జైశంకర్‌పై వచ్చాయి.

జైశంకర్

ఫొటో సోర్స్, Getty Images

విదేశాంగ మంత్రిగా అనూహ్య నియామకం

2019 లోక్‌సభ ఎన్నికల అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత విదేశాంగ శాఖ మంత్రిగా జైశంకర్‌ను నియమించారు. విదేశాంగ కార్యదర్శిగా పదవీ విరమణ పొందిన జైశంకర్ తన జీవితంలో కొత్త బాధ్యతలకు సన్నద్ధమయ్యారు.

ఒక మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శిని అదే శాఖ మంత్రిగా నియమించడం ఎవరూ ఊహించని నిర్ణయమని విదేశీ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. తాను కూడా ఎప్పుడూ అనుకోలేదని జైశంకర్ కూడా ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

''ఆ ప్రతిపాదనను ఒప్పుకునే ముందు సుమారు నెల రోజులు ఆలోచించా. చివరికి, విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు బీజేపీలో సభ్యత్వం తీసుకున్నాను.'' అని జైశంకర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

మోదీకి విధేయుడిగా ఉండడం వల్లే పదవి వరించిందని, అందువల్ల పెద్దగా ఉపయోగం లేదన్న విమర్శలొచ్చాయి. నాలుగేళ్ల తర్వాత, మోదీ క్యాబినెట్‌లో అత్యుత్తమ మంత్రుల్లో ఒకరిగా ఆయన ఎదిగారు.

జైశంకర్‌ను ఉదార భావాలున్న వ్యక్తిగా భావించిన ఆయన ప్రత్యర్థులు, వారి ఆలోచనను మార్చుకున్నారు.

జైశంకర్

ఫొటో సోర్స్, Getty Images

జైశంకర్ సిద్ధాంతం సరైనదేనా?

జైశంకర్ రాసిన పుస్తకం ప్రకారం విదేశాంగ విధానంలో ఆయన మూడు మూల సూత్రాలను ప్రస్తావించారు.

ఇతర దేశాలతో స్నేహ సంబంధాల కంటే భాగస్వామ్యాలనే జైశంకర్ ఎక్కువగా నమ్ముతారు.

1.ఒకరితోనే స్నేహ సంబంధాలు కాకుండా ఎక్కువ మందితో రాజకీయ సంబంధాలు కలిగి ఉండడం

2.ప్రపంచ వ్యవస్థలో అంతర్లీనంగా ఉన్న సంఘర్షణల నుంచి ప్రయోజనాలను పొందడం.

3. ఈ రెండు విషయాల వల్ల ఎదురయ్యే వైరుధ్యాలను అంగీకరించేందుకు సిద్ధంగా ఉండడం.

జైశంకర్

ఫొటో సోర్స్, Getty Images

జైశంకర్ ఇప్పటికీ తన సిద్ధాంతాలను పాటిస్తున్నారా?

వైరుధ్యాలను సద్వినియోగం చేసుకోవడం అన్నివేళలా సాధ్యం కాదని ప్రొఫెసర్ జఫర్‌లో అన్నారు. "హిమాలయ శిఖరాల మీదికి చైనా చొచ్చుకు వస్తూనే ఉంటుంది. అయినా, బ్రిక్స్ వంటి వేదికలపై చైనా పట్ల భారతదేశం మర్యాదగానే ప్రవర్తిస్తుంది. ఇలా ఎన్నాళ్లు కొనసాగించగలదు" అని ఆయన ప్రశ్నించారు.

"చైనా దూకుడు ఇలాగే కొనసాగితే, భారతదేశం పశ్చిమ దేశాల అండను సంపాదించాలి. వేరే మార్గం లేదు. ఇప్పుడు రష్యా కూడా మంచి ఆప్షన్ కాదు. ఎందుకంటే చైనా, రష్యాలు ఇప్పుడు మంచి మిత్రులు’’ అన్నారు జఫర్‌లో

ద్వి ధ్రువ ప్రపంచంలో ఒక ధృవంగా చైనా ఆవిర్భవించడం భారతదేశానికి ఆందోళన కలిగించే అంశం. అయితే దీనిపై అమెరికాకు కూడా ఆందోళన ఉంది. భారతదేశం, జైశంకర్‌ దూకుడుగా ఉండటానికి, నిర్మొహమాటంగా ప్రకటనలు చేయడానికి కారణం ఇదే.

అయితే ఈరోజు భారతదేశం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితి ఎంతోకాలం ఉండబోదని ప్రొఫెసర్ జఫర్‌లో అంటున్నారు.

"ఈరోజు అందరూ భారత్‌ను తమతో కలుపుకోవాలని చూస్తున్నారు. అమెరికా వైఖరి అదే. రష్యా కూడా దాదాపు ఇదే ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రపంచం మరింత ద్విధ్రువంగా మారుతోంది. తటస్థంగా ఉండటం ఎక్కువ కాలం సాధ్యం కాకపోవచ్చు’’ అన్నారు ప్రొఫెసర్‌ జఫర్‌లో.

భారత్, చైనాలు కలిసి 21వ శతాబ్దాన్ని ఆసియా శతాబ్దంగా మార్చగలవని గతంలో జైశంకర్ అభిప్రాయపడ్డారు. ఆయన తన పుస్తకంలో కూడా ఇదే మాటను చెప్పారు.

‘‘జైశంకర్‌ పుస్తకాన్ని చదివిన వారెవరికైనా ఆయన వేగంగా అభివృద్ధి చెందుతున్న చైనా వైఖరికి అభిమాని అని చెప్పగలరు. చైనా నుంచి భారత్ చాలా నేర్చుకోవాలని ఆయన కోరుకుంటున్నారు’’ అని జఫర్‌లో అన్నారు.

జైశంకర్

ఫొటో సోర్స్, Getty Images

వైరుధ్యం ఉందా?

కానీ ఆయన వైఖరిలో వైరుధ్యం ఉందని కొందరు వాదిస్తున్నారు.

‘‘చైనా, భారత్‌లు కలిసి 21వ శతాబ్ధాన్ని ఆసియా శతాబ్ధంగా మార్చాలన్న ఆయన ఆలోచనలకు, చైనా పట్ల దూకుడుగా ఉండే అతని వైఖరికీ ఏమాత్రం పొత్తు కుదరడం లేదు’’ అని చైనాకు చెందిన స్కాలర్, ప్రొఫెసర్ హువాంగ్ యన్‌సొంగ్ వ్యాఖ్యానించారు.

"ఈ రోజు రెండు దేశాల మధ్య సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం నుంచి ఇరుగు పొరుగు శత్రుదేశాల స్థాయికి దిగజారింది. స్నేహ సంబంధాల స్థానంలో శత్రుత్వం, ఉదాసీనతలు నిండిపోయాయి’’ అన్నారాయన.

భారత, చైనాలు పరస్పర సహకారంతో ఆసియా శతాబ్ధంగా మార్చాలన్న జైశంకర్ ఆలోచన నిజమవుతుందన్న ఆశ ప్రొఫెసర్ జఫర్‌లో కి కూడా లేదు. ఈ వాదనను ఆయన చాలా వింత వాదనగా భావిస్తారు.

‘‘అసలు భారతదేశం చైనాకు ఎలా సహకరిస్తుంది, పశ్చిమ దేశాలను అగ్రస్థానం నుంచి గద్దె దింపాలన్న చైనా ప్రయత్నాలకు భారత్ సహకరించగలదా’’ అని ఆయన ప్రశ్నించారు.

"రాబోయే కాలంలో భారతదేశం ముందు రెండు రకాల సవాళ్లు ఉండవచ్చు. ప్రపంచం మళ్లీ రెండు శిబిరాలుగా విడిపోవడమే కాదు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా భారతదేశం చైనా కంటే వెనుకబడి ఉంటుంది. ఎందుకంటే గొప్ప దేశంగా మారడానికి చాలా శక్తి వనరులు కావాలి’’ అని జాఫర్లో అభిప్రాయపడ్డారు.

అయితే, భారత్ చైనాలు పరస్పర సహకారంతో ఆసియా శతాబ్ధి అనే కలను సాకారం చేయగలవన్న జైశంకర్ సిద్ధాంతాన్ని డాక్టర్ సువ్రోక్మల్ దత్తా సమర్ధించారు. అయితే, చైనా తన వైఖరిని మార్చుకోవాలని ఆయన సూచించారు.

"రెండు దేశాలు ఆసియా శతాబ్ధి కలను నిజం చేయగలవు. కానీ, కండీషన్ ఏంటంటే, చైనా తన భారత వ్యతిరేక వైఖరిని విడనాడాలి’’ అని ఆయన అన్నారు.

జైశంకర్

ఫొటో సోర్స్, Getty Images

జైశంకర్ ఎంతవరకు సక్సెస్ అయ్యారు?

ప్రపంచ రాజకీయాలపై భారతదేశ ప్రభావం పరిమితంగానే ఉందని ఒక రాజనీతివేత్త అభిప్రాయపడ్డారు. భారతదేశపు శత్రువులతో, స్నేహితులతో దశాబ్ధాలపాటు వ్యవహరించిన అనుభవం ఆయనకు ఉంది.

‘‘ సౌదీ అరేబియా నుంచి చైనా వరకు ఒక గీత గీస్తే, దానికి పశ్చిమాన ఉన్న దేశాలన్నీ చైనా, రష్యా, సౌదీ అరేబియా, ఇరాన్ ల పక్షాన ఉన్నాయి. మనం ఇక్కడ రెండో తరగతి ప్లేయర్లం’’ అని ఆయన అన్నారు.

ఈ విషయంలో చైనాతో పోలిస్తే భారత్ చాలా వెనకబడి ఉంది.

ఇటీవల, సౌదీ అరేబియా, ఇరాన్‌లు తమ మధ్య శత్రుత్వాన్ని ముగించి, సంబంధాలు పెంచుకోవడంలో చైనా మధ్యవర్తి పాత్ర పోషించింది. కానీ వాస్తవానికి ఇరాన్, సౌదీలు భారత్‌కు దగ్గరి దేశాలు.

జైశంకర్‌కన్నా చైనా గురించి తెలిసిన ప్రొఫెషనల్ దౌత్యవేత్త మరొకరు లేరనడంలో సందేహం లేదు.

అదే విధంగా మోదీలాగా చైనాలో తొమ్మిది సార్లు పర్యటించిన నాయకుడు కూడా మరొకరు లేరు. నాలుగుసార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఐదుసార్లు భారత ప్రధానిగా ఆయన ఈ పర్యటనలు చేశారు.

మోదీ, జైశంకర్ నేతృత్వం కారణంగా చైనా-భారత్ మధ్య సంబంధాలలో టెన్షన్లు తగ్గుతాయని అంతా భావించారు.

కానీ, ఈ బంధంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయని, శాంతి ఒప్పందంపై ఆశలు కూడా కనిపించడం లేదని అంటున్నారు.

వీడియో క్యాప్షన్, మునుపెన్నడూ చూడనంత భారీ స్థాయిలో విన్యాసాలు

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)