ప్రపంచం మొత్తానికి భారత్ తిండి పెట్టగలదా, బైడెన్‌తో మోదీ ఎందుకలా చెప్పారు

గోధుమ పంట

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, గోధుమ పంట
    • రచయిత, సౌతిక్ బిస్వాస్
    • హోదా, బీబీసీ న్యూస్

యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ధరలు, సరఫరా సమస్యలతో ఆహార కొరత ఎదుర్కొంటున్న దేశాలకు ఆహారం పంపించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో గత వారం అన్నారు.

"మా దేశంలో ఉన్న 140 కోట్ల జనాభాకు సరిపడేంత ఆహార నిల్వలు ఉన్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతిస్తే రేపటి నుంచే ప్రపంచానికి ఆహార సరఫరా చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది" అని మోదీ చెప్పారు.

యుక్రెయిన్‌లో యుద్ధం మొదలుకాక ముందు నుంచే గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వస్తువుల ధరలు పెరిగిపోయాయి. యుద్ధం తర్వాత వాటి ధరలు మరింత పెరిగాయి. 1990 నుంచి పరిశీలిస్తే ఆహార సరకుల ధరలు ప్రస్తుతం అత్యధిక స్థాయికి చేరాయని ‘ఐక్యరాజ్య సమితి ఆహారం, వ్యవసాయ సంస్థ’ (యూఎన్‌ఎఫ్‌ఏఓ) ఆహార ధరల పట్టిక సూచిస్తోంది.

ప్రపంచంలో గోధుమలను అత్యధికంగా ఎగుమతి చేసే దేశాల్లో రష్యా, యుక్రెయిన్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే గోధుమ విక్రయాలలో ఏటా మూడొంతుల గోధుమ అమ్మకాలు ఈ రెండు దేశాల నుంచే జరుగుతాయి. ఈ రెండు దేశాలు కలిపి ఏటా అంతర్జాతీయంగా చేసే ఎగుమతుల్లో సన్ ఫ్లవర్ నూనె 55 శాతం.. జొన్న, బార్లీ 17 శాతం ఉంటాయి.

ఈ ఏడాదిలో రెండు దేశాలు కలిపి సుమారు 14 మిలియన్ (1.4 కోట్ల) టన్నుల గోధుమలు, 16 మిలియన్ (1.6 టన్నుల) జొన్నలు ఎగుమతి చేయాల్సి ఉందని ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ తెలిపింది.

"సరఫరా వ్యవస్థలో ఏర్పడిన ఆటంకాలు, రష్యా పై విధించిన ఆంక్షలను బట్టి ఈ ఎగుమతులను లెక్కలోంచి తీసేయాల్సి వస్తోంది.

భారతదేశంలో తగినంత గోధుమల నిల్వలు ఉన్నట్లయితే ఎగుమతులు చేసేందుకు ముందుకు రావచ్చు" అని రోమ్‌కు చెందిన యూఎన్‌ఎఫ్‌ఏఓ ఆర్థికవేత్త ఉపాలి గల్‌కేటి అరాచిలేజ్ చెప్పారు.

భారతదేశం వరి, గోధుమల ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఈ రెండు ఉత్పత్తుల నిల్వలు 74 మిలియన్ (7.4 కోట్ల) టన్నులు ఉన్నాయి. ఇందులో 21 మిలియన్ (2.1కోట్ల) టన్నులను వ్యూహాత్మక నిల్వలను ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం కేటాయించారు. దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 70 కోట్ల మంది పేదలకు ఆహార ధాన్యాలను చౌక ధరలకు పంపిణీ చేస్తారు.

వరి పంట

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, వరి పంట

అంతర్జాతీయంగా ధరల పెరుగుదల, దిగుమతుల్లో ఏర్పడిన తగ్గుదల వల్ల భారతదేశం ఎరువుల కొరత ఎదుర్కొంటోంది.

ప్రపంచంలో గోధుమలు, బియ్యాన్ని అత్యంత చౌకగా సరఫరా చేసే దేశాల్లో భారత్ ఒకటి. భారత్ 150 దేశాలకు బియ్యాన్ని, 68 దేశాలకు గోధుమలను ఎగుమతి చేస్తోంది. 2020-21లో సుమారు 70 లక్షల టన్నుల గోధుమలను ఎగుమతి చేసింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న డిమాండ్‌కు స్పందించి ఏప్రిల్ నుంచి జులై మధ్యలో 30 లక్షల టన్నుల గోధుమల ఎగుమతి కోసం ఇప్పటికే చాలా మంది వర్తకులు వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2021-22లో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 50 బిలియన్ డాలర్లకు చేరి రికార్డు స్థాయిని దాటాయి.

వీడియో క్యాప్షన్, ఆంధ్ర అరటికి విదేశాల్లో అంత డిమాండ్ ఎందుకు?

"ఈ ఆర్ధిక సంవత్సరంలో భారత్‌కు 2.2 కోట్ల టన్నుల బియ్యం, 1.6 కోట్ల టన్నుల గోధుమలను ఎగుమతి చేసే సామర్ధ్యం ఉంది" అని ‘ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్‌’లో అగ్రికల్చర్ ప్రొఫెసర్ అశోక్ గులాటీ చెప్పారు.

"ప్రభుత్వం దగ్గరున్న నిల్వలను ఎగుమతి చేసేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతిస్తే అంచనాల కంటే ఎక్కువగానే ఎగుమతి చేయవచ్చు. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన ధరలు తగ్గి ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దేశాలపై ఇప్పటివరకు పడుతున్న భారం తగ్గుతుంది" అని అన్నారు.

అయితే, వీటికి కొన్ని అభ్యంతరాలున్నాయి. "ప్రస్తుతానికి మన దగ్గర తగినన్ని నిల్వలు ఉన్నాయి. కానీ, ప్రపంచానికి ఆహారధాన్యాలు సరఫరా చేసేందుకు అత్యుత్సాహం పడేందుకు లేదు. దీని వల్ల కొన్ని సమస్యలున్నాయి" అని దిల్లీకి చెందిన సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ సీనియర్ ఫెలో హరీష్ దామోదరన్ అన్నారు.

ఇంకా చేతికందాల్సిన పంటలు అంచనాల కంటే తక్కువగా రావొచ్చనే భయాలున్నాయి. భారతదేశంలో గోధుమ సీజన్ మొదలవుతోంది. 11.1 కోట్ల టన్నుల పంట చేతికొస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అనుకున్నట్లుగానే ఇంత మొత్తంలో పంట చేతికొస్తే వరుసగా ఆరో సంవత్సరం అత్యధికంగా గోధుమ దిగుబడులు సాధించినట్లవుతుంది.

అయితే, దామోదరన్ లాంటి నిపుణులు ఈ వాదనను అంగీకరించడం లేదు. ఎరువుల కొరత, అధిక వర్షపాతం, ఉష్ణోగ్రతల లాంటి వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది దిగుబడి తక్కువగా ఉంటుందని ఆయన భావిస్తున్నారు. "దిగుబడిని చాలా ఎక్కువగా వస్తుందని అంచనా వేస్తున్నారు కానీ మరో 10 రోజుల్లో పూర్తి విషయం తెలుస్తుంది" అని ఆయన అన్నారు.

మరోవైపు యుక్రెయిన్‌లో యుద్ధం మొదలైన తర్వాత భారతదేశంలో ఎరువుల నిల్వలు తగ్గిపోయాయి. భారతదేశం నైట్రోజన్, ఫాస్ఫేట్ , సల్ఫర్, పొటాష్ ఉన్న ఎరువులను, డై అమ్మోనియం ఫాస్ఫేట్‌ను దిగుమతి చేసుకుంటుంది.

ఎరువుల నిల్వలు కూడా యుద్ధం మొదలైన తర్వాత తగ్గాయి. ప్రపంచ పొటాష్ ఎగుమతుల్లో 40 శాతం రష్యా, బెలారస్ నుంచే జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న గ్యాస్ ధరలతో ఎరువుల ధరలు కూడా ఇప్పటికే పెరిగాయి.

భారతదేశం సుమారు 150 దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, భారతదేశం సుమారు 150 దేశాలకు బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది.

"రానున్న సీజన్‌లో పంటల దిగుబడిపై ఈ ఎరువుల కొరత ప్రభావం చూపించొచ్చు. అయితే, భారత్ ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఈజిప్ట్, ఇతర కొన్ని ఆఫ్రికా దేశాలకు గోధుమలు పంపించి అందుకు బదులు ఎరువులు దిగుమతి చేసుకునేలా ఒప్పందాలు చేసుకోవచ్చు" అని దామోదరన్ సూచించారు.

యుక్రెయిన్ యుద్ధం కొనసాగితే ఎగుమతులను పెంచే విషయంలో భారత్ కొన్ని రవాణా సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. "అధిక మొత్తంలో తృణధాన్యాలను ఎగుమతి చేయాలంటే రవాణాకు, నిల్వ చేసేందుకు, సరఫరాకు భారీగా మౌలిక సదుపాయాల అవసరం కూడా ఉంటుంది. అధిక మొత్తంలో రవాణా చేయగలిగే సామర్ధ్యం కూడా అవసరం" అని అరాచిలేజ్ అన్నారు. రవాణాకయ్యే ఖర్చులనూ పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.

మరో వైపు, దేశంలో ఆహారపదార్థాల ధరలు పెరుగుతున్నాయనే ఆందోళన కూడా ఉంది.

గోధుమల బస్తాలు

ఫొటో సోర్స్, Getty Images

మార్చిలో గత 16 నెలల్లో ఎన్నడూ లేనంతగా 7.68 శాతం ఆహార ద్రవ్యోల్బణం ఏర్పడింది. వంట నూనెలు, కూరగాయలు, తృణధాన్యాలు, పాలు, మాంసం, చేపల ధరల్లో పెరుగుదలతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రధాన ఆహార పదార్ధాల ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణంలో అనిశ్చితికి దారి తీయొచ్చని రిజర్వ్ బ్యాంక్ కూడా హెచ్చరించింది.

"రష్యా దాడుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు ముప్పు ఏర్పడింది" అని ఐఎఫ్‌పీఆర్‌ఐ అంది.

రష్యా, యుక్రెయిన్ దేశాల నుంచి జరిగే గోధుమ, ఎరువులు, ఇతర ఉత్పత్తుల ఎగుమతులకు ఆటంకం దీర్ఘకాలం కొనసాగితే ప్రపంచంలో పోషకాహార లోపంతో బాధడేవారి సంఖ్య 80 లక్షల నుంచి 1.3 కోట్లకు పెరుగుతుందని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ అంచనా వేసింది.

పంటలు విరివిగా చేతికొచ్చి, తగినన్ని ఆహార నిల్వలు ఉన్నప్పటికీ, భారత్ లో 30 లక్షల మందికి పైగా చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు ప్రభుత్వమే చెప్పింది. పోషకాహార లోపంతో బాధపడుతున్న రాష్ట్రాల్లో మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ మూడో స్థానంలో ఉంది.

"ఆహార భద్రత విషయంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించేందుకు లేదు. సబ్సిడీ ద్వారా సరఫరా చేసేందుకు కేటాయించిన ఆహార వ్యవస్థ చుట్టూ ఆటలు ఆడుకోలేం" అని దామోదరన్ అన్నారు.

ఆహారం ఉండటం, లేకపోవడమే భారత్‌లో రాజకీయ నాయకుల భవిష్యత్ నిర్ణయిస్తుందని వారికి బాగా తెలుసు. గతంలో అమాంతం పెరిగిన ఉల్లిపాయల ధరల వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇబ్బంది పడ్డాయి.

వీడియో క్యాప్షన్, కోటిన్నర ఖర్చుతో ఎకరా స్థలంలో బావి తవ్వించాడు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)