యుక్రెయిన్: ఈ యుద్ధంలో రష్యా యుద్ధ ట్యాంకులను భారీగా ఎందుకు కోల్పోతోంది?

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్‌పై దండెత్తిన తర్వాత రెండు నెలల్లోనే రష్యా భారీగా యుద్ధ ట్యాంకులను కోల్పోయిందని భావిస్తున్నారు.
పశ్చిమ దేశాలు యుక్రెయిన్‌కు ఇచ్చిన అత్యాధునిక యాంటీ ట్యాంక్ ఆయుధాల వల్ల, రష్యా తన ట్యాంకులను సమర్థవంతంగా ఉపయోగించకపోవడం వల్ల ఎక్కువగా నష్టం జరిగిందని సైనిక నిపుణులు చెబుతున్నారు.
ఇంతకీ రష్యా ఎన్ని ట్యాంకులు కోల్పోయింది?
రష్యా 680 యుద్ధ ట్యాంకులను కోల్పోయిందని యుక్రెయిన్ సైన్యం చెబుతోంది.
మరోవైపు, రష్యాకు చెందిన 460కి పైగా ట్యాంకులు, 2,000 ఇతర సాయుధ వాహనాలు ధ్వంసమయ్యాయని సైనిక, నిఘా బ్లాగ్ Oryx పేర్కొంది. వార్ జోన్ నుంచి అందిన ఫొటోల ఆధారంగా Oryx ఈ అంచనాకు వచ్చింది.
యుద్ధం ప్రారంభానికి ముందు రష్యా దగ్గర సుమారు 2,700 ప్రధాన యుద్ధ ట్యాంకులు ఉన్నాయని రాండ్ కార్పొరేషన్, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్ (ఐఐఎస్ఎస్) చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
యాంటీ-ట్యాంక్ ఆయుధాలు ఎంత శక్తివంతమైనవి?
యుద్ధం ప్రారంభమైనప్పుడు అమెరికా.. 2,000 జావెలిన్ యాంటీ-ట్యాంక్ మిసైళ్లను యుక్రెయిన్‌కు ఇచ్చింది. ఆ తర్వాత మరో 2,000 క్షిపణులను కూడా పంపించింది.
జావెలిన్‌లతో క్షిపణులను ప్రయోగించొచ్చు. అవి యుద్ధ ట్యాంకు పైభాగంలో పేలుతాయి. యుద్ధ ట్యాంకులో ఆ భాగం బలహీనంగా ఉంటుందని లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ పేర్కొంది.
క్షిపణులు ప్రయోగించినా ఆ ప్రభావాన్ని తట్టుకునే రియాక్టివ్ ఆర్మర్ రష్యాకు చెందిన చాలా ట్యాంకుల్లో ఉంటుంది.
అయితే, జావెలిన్‌లో రెండు వార్‌హెడ్స్ ఉంటాయి. ఒకటి రియాక్టివ్ ఆర్మర్‌ను ధ్వంసం చేస్తుంది. ఇక రెండో వార్‌హెడ్ యుద్ధ ట్యాంకు కింద ఉన్న చాసిస్‌లోకి దూసుకెళ్తుంది.
బ్రిటన్ కూడా 3,600 నెక్ట్స్ జనరేషన్ లైట్ యాంటీ-ట్యాంక్ వెపన్ మిసైల్స్ - ఎన్ఎల్ఏడబ్ల్యూలను పంపించింది.
ట్యాంకుల పైభాగం నుంచి వెళ్తున్నప్పుడు పేలేలా వీటిని డిజైన్ చేశారు.
జావెలిన్, ఎన్ఎల్ఏడబ్ల్యూలు చాలా శక్తివంతమైనవని రాయల్ యూనైటైడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్ (RUSI) రీసెర్చ్ అనలిస్ట్ నిక్ రేనాల్డ్స్ చెప్పారు.
ఈ ఆయుధాలు లేకుంటే యుక్రెయిన్‌లో పరిస్థితి మరోలా ఉండేదని ఆయన అన్నారు.
100 స్విచబుల్ యాంటీ-ట్యాంక్ డ్రోన్లను కూడా అమెరికా యుక్రెయిన్‌కు పంపిస్తోంది.
వీటిని కమికజీ డ్రోన్లు అని పిలుస్తుంటారు. ఈ డ్రోన్లకు వార్‌హెడ్ అమర్చి ఉంటుంది. కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి ఆపరేటర్ వీటిని కంట్రోల్ చేయవచ్చు. యుద్ధ ట్యాంకులను గుర్తించి, దాని పైభాగంలో బాంబు వేయడం ద్వారా వాటిని ధ్వంసం చేస్తుంది.

రష్యా వ్యూహాల్లో లోపాలున్నాయా?
ఈరోజుల్లో రష్యా ఆర్మీ బెటాలియన్ టాక్టికల్ గ్రూప్స్ (బీటీజీ)ల ద్వారా పని చేస్తోంది. వీటిలో ట్యాంకులు, పదాతిదళాలు, ఫిరంగిదళాలు కూడా ఉంటాయి.
అయితే, బీటీజీల కచ్చితమైన కూర్పులో మార్పులు ఉంటాయి. సాధారణంగా సాయుధ వాహనాలు ఎక్కువగా ఉంటాయి. పదాతిదళాలు తక్కువగా ఉంటాయి.
రష్యాకు సైనిక బలగాలు తక్కువగా ఉన్నాయని, కాబట్టి బలంగా యుద్ధం చేయటానికి బీటీజీలను ఏర్పాటు చేసుకున్నారని సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీలో స్ట్రాటజిక్ స్టడీస్ ప్రొఫెసర్ ఫిలిప్స్ ఓబ్రియన్ చెప్పారు.
''ఎక్కువ కాల్పుల బలంతో వేగంగా దాడి చేయటానికి వీటిని డిజైన్ చేశారు. కానీ వీటికి రక్షణ చాలా తక్కువగా ఉంది. భద్రత కల్పించే సైనిక సిబ్బంది, దాడికి లోనవుతున్నపుడు దానిని తిప్పికొట్టే వ్యవస్థ లోపభూయిష్టంగా ఉంది'' అన్నారాయన.
''ఫలితంగా కుడి చేత్తో గొప్ప పంచ్ ఇవ్వగల బలమైన బాక్సర్‌కు దవడ చాలా బలహీనంగా ఉన్న చందంగా రష్యా సైన్యం పరిస్థితి మారింది'' అని అభివర్ణించారు.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా వైమానిక గస్తీ లోపించటం కూడా.. రష్యా యుద్ధ ట్యాంకుల శ్రేణి మీద ఉచ్చుపన్ని దాడి చేయటం యుక్రెయిన్ బలగాలకు సులువుగా మారిందని ప్రొఫెసర్ ఓబ్రియాన్ పేర్కొన్నారు.
''ఘర్షణ ఆరంభంలో గగనతలంలో రష్యా ఆధిపత్యం సంపాదించలేదు. కాబట్టి, యుక్రెయిన్ సైనిక బలగాల కదలికలను పసిగట్టేలా గగనతలంలో గస్తీ నిర్వహించలేకపోతోంది'' అని వివరించారు.
''దాని అర్థం.. యుక్రెయిన్ సైనికులు మంచి స్థానాల్లోకి చేరి ఆకస్మిక దాడులు చేయగలుగుతున్నారు. ఈ విధంగా రష్యా సైన్యానికి చాలా నష్టం చేయగలుగుతున్నారు'' అని చెప్పారు.
రష్యా అసమర్థత ఎంత వరకూ కారణం?
ఓరిక్స్ గణాంకాల ప్రకారం.. రష్యా నష్టపోయిన యుద్ధ ట్యాంకుల్లో సగం ట్యాంకులను శత్రువు ధ్వంసం చేయలేదు. వాటిని శత్రువు స్వాధీనం చేసుకున్నవి కొన్నైతే, రష్యా సైనికులు వదిలేసి వెళ్లిపోయినవి కొన్ని ఉన్నాయి.
మౌలిక సదుపాయాల విషయంలో వైఫ్యలం, రష్యా బలగాల అసమర్థత దీనికి కారణమని నిపుణులు అంటున్నారు.
''రష్యా యుద్ధ ట్యాంకులను యుక్రెయిన్ రైతుల ట్రాక్టర్లతో లాక్కెళుతున్న దృశ్యాలను మనం చూశాం'' అని ప్రొఫెసర్ ఓబ్రియాన్ ఉటంకించారు.
''వాటిలో కొన్ని ట్యాంకుల్లో చమురు అయిపోవటం వల్ల వదిలేసి వెళ్లారు. అది సదుపాయాల కల్పనలో వైఫల్యం. కొన్ని ట్యాంకులు వర్షకాలపు చిత్తడి నేలల్లో చిక్కుకుపోయాయి. దీనికి కారణం.. ఏడాదిలో తప్పుడు సమయంలో ఈ సైనిక దండయాత్ర ప్రారంభించారు'' అని ఆయన విశ్లేషించారు.

''రష్యా పదాతి దళాల్లో ఎక్కువ మంది తక్కువ అనుభవం గల కిరాయి సైనికులు, కొత్తగా చేర్చుకున్న సైనికులు ఉన్నారు. అంటే వారు దిగువ నుంచి మధ్య శ్రేణి నాణ్యమైన యుద్ధ బలగం అవుతారు'' అని రూసీ ఎనలిస్ట్ నిక్ రేనాల్డ్స్ పేర్కొన్నారు.
''డ్రైవింగ్ సరిగా చేయకపోవటం వల్ల చాలా ట్యాంకులను వదిలేశారు. కొన్ని ట్యాంకులను బ్రిడ్జీల కిందకు నడిపారు. కొన్ని ట్యాంకులను గుంతల్లోకి నడిపారు. దానివల్ల ట్రాక్స్ ఊడిపోయాయి. సైనికులకు తమ యుద్ధ సామగ్రిని ఉపయోగించే సామర్థ్యం లేకపోయింది'' అని వివరించారు.
''కానీ సైనికులు తమ వాహనాలను వదిలేసి పారిపోవటం ఎక్కువగా జరిగింది. అంటే పోరాడాలనే పట్టుదల కూడా కొరవడింది'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
రష్యా సైన్యం వదిలేసి వెళ్లిన సైనిక వాహనాలను ఎలా తమకు అప్పగించాలనే అంశంపై యుక్రెయిన్ ప్రభుత్వం పౌరులకు సూచనలు కూడా జారీ చేసింది.
ఇలాంటి ''యుద్ధ బహుమతులు'' గెలుచుకున్న పౌరులెవరూ వాటి వివరాలను పన్ను అవసరాల కోసం వెల్లడించాల్సిన అవసరం లేదని అధికారులు ధృవీకరించారు.
ఇవి కూడా చదవండి:
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 103 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది
- భారతదేశంలో బ్రాహ్మణులు మాంసం తినడం ఎప్పటి నుంచి, ఎందుకు మానేశారు?
- 1500 అడుగుల ఎత్తున రెండు రోజుల పాటు కేబుల్ కార్లలో చిక్కుకుపోయిన పర్యటకులను ఎలా కాపాడారు
- వయాగ్రా ప్రభావం ఎక్కువగా ఉంటే ఏం చేయాలి... సైడ్ ఎఫెక్టులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- బాయిల్డ్, రా రైస్ మధ్య తేడా ఏమిటి? తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై వివాదం ఎందుకు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









