యుక్రెయిన్ యుద్ధం: రష్యా యుద్ధ ఖైదీని యుక్రెయిన్ సైనికులు చంపేశారా... వైరల్ వీడియోలో నిజమెంత? -BBC Reality Check

- రచయిత, బీబీసీ రియాలిటీ చెక్
- హోదా, బీబీసీ మానిటరింగ్
రష్యాకు చెందిన యుద్ధ ఖైదీని యుక్రెయిన్ సైనికులు కాల్చి చంపినట్టు చూపిస్తున్న ఒక వీడియో వైరల్ అయింది. యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌కు పశ్చిమాన ఒక రహదారిపై ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ ప్రాంతం నుంచి రష్యా దళాలు వెనక్కు మరలుతున్నాయి.
హెచ్చరిక: ఈ కథనంలో కనిపించే ఫొటోలు, వివరాలు మిమ్మల్ని కలచివేయవచ్చు.
ఈ వీడియో తన దృష్టికి వచ్చిందని, దీనిపై "కచ్చితంగా దర్యాప్తు చేస్తామని" యుక్రెయిన్ విదేశాంగ శాఖ మంత్రి డిమిత్రో కులేబా చెప్పారు.
బీబీసీ ఈ వీడియోను విశ్లేషించేందుకు ప్రయత్నిస్తోంది. ఆ దిశలో ఇంతవరకు మాకు లభించిన సమాచారాన్ని మీ ముందు ఉంచుతున్నాం.

వీడియోలో ఏముంది?
వీడియోలో మిలటరీ దుస్తుల్లో ఉన్న నలుగు వ్యక్తులు నేల మీద పడి ఉన్నారు. వారిలో ఒకరి చేతులు వెనక్కి విరిచి కట్టి ఉన్నాయి.
ముగ్గురు కదలట్లేదు. ఒకరు మాత్రం ఒంటి నిండా గాయలతో భారంగా ఊపిరి తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది.
దూరం నుంచి ఓ వ్యక్తి "ఆయన్ను వదిలేయ్" అంటున్నారు. మరొకరు "ఆయన్ను వదిలేయడం నాకిష్టం లేదు" అని జవాబిచ్చారు.
అప్పుడు ఒక సైనికుడు (వీడియోలో ఆయన ముఖం కనిపించట్లేదు) తుపాకీతో కాల్చడం మొదలుపెట్టారు. ఆ వ్యక్తిలో కదలికలు ఆగిపోయేంతవరకు కాలుస్తూనే ఉన్నారు.
తరువాత కెమెరా అక్కడున్న మిగతా సైనికులను చూపించింది. వారి స్పందనలు వీడియోలో కనిపిస్తున్నాయి.
నేలపై పడి ఉన్నవారంతా మిలటరీ దుస్తుల్లోనే ఉన్నారు. రక్తపు మడుగులు పేరుకుపోయాయి.
నలుగురిలో ఒకరి ముఖం వీడియోలో కనిపిస్తోంది. మిగితా ముగ్గురి ముఖాలు నేలవైపు ఉన్నాయి.


ఈ వీడియోను ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారు?
కీయెవ్‌కు పశ్చిమాన ఉన్న డిమిత్రివ్కా పట్టణం వెలుపల ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ రోడ్డు డిమిత్రివ్కా నుంచి ఇర్పిన్, బుచా పట్టణాలకు కలుస్తుంది.
వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలకు, గూగుల్ స్ట్రీట్ వ్యూలో చూపిస్తున్న దృశ్యాలకు పోలికలు కనిపిస్తున్నాయి.
మార్చి 31న ఆ రోడ్డుకు తీసిన ఉపగ్రహ చిత్రం పరిశీలిస్తే, వీడియోలో కనిపిస్తున్న సాయుధ వాహనాలు, రక్తపు మరకల్లాంటివి కనిపిస్తున్నాయి.
ఈ వీడియోను ఎప్పుడు షూట్ చేశారన్నది స్పష్టంగా తెలియడం లేదు కానీ, మధ్యహ్నం తీశారని చెప్పవచ్చు. రోడ్డుపై పడుతున్న నీడల ఆధారంగా సూర్యుడి స్థితిని అంచనా వేస్తే మధ్యాహ్నం అని తెలుస్తోంది.
మార్చి 30 ఉదయం ఈ వీడియో మొదటి వెర్షన్ ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. అంటే దీన్ని మార్చి 29 మధ్యాహ్నం తీసి ఉంటారు.
చనిపోయిన సైనికులు రష్యన్లని మనకు ఎలా తెలుస్తుంది?
ముఖ్యమైన క్లూ వీడియోలో వినిపిస్తున్న మాటలే. నేలపై పడి ఉన్నవారి పక్కనే నిల్చున్న సైనికుడు, "రష్యన్ ఆర్మీ రక్షకులు ఇక్కడ పడి ఉన్నారు" అని అంటున్నారు.
ఇదే కాకుండా, ఈ ఫుటేజీలో కొన్ని సాయుధ వాహనాలు కనిపిస్తున్నాయి. వాటిల్లో మనుషులు లేరు కానీ, ఓ పక్క V అని రాసి ఉంది. రష్యా సైనికులు తమ ఆర్మీ వాహనాలపై V అని రాసుకుంటారు.
నేలపై ఉన్న వారిలో ఇద్దరి భుజాలకు తెల్లటి పట్టీలు (ఆర్మ్ బ్యాండ్స్) ఉన్నాయి. యుక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాల్లో గుర్తింపు కోసం రష్యా సైనికులు వీటిని ధరిస్తున్నారు.
ఎరుపు, ఆరంజ్ పట్టీలు కూడా కట్టుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో పౌరులను తెల్లటి పట్టీలు కట్టుకోమని ప్రోత్సహిస్తున్నట్టు రిపోర్టులు వచ్చాయి.

ఈ ఘటనలో యుక్రెయిన్ సైనికుల ప్రమేయం ఉందని కచ్చితంగా చెప్పగలమా?
వీడియోలో కనిపిస్తున్న సైనికుల్లో కొందరు చేతికి నీలం రంగు పట్టీలు కట్టుకున్నారు. దుస్తులపై యుక్రెయిన్ జెండా గుర్తులున్నాయి.
సాధారణంగా వీటిని యుక్రెయిన్ సైన్యం ధరిస్తుంది. అయితే, కేవలం వాటిబట్టి వాళ్లు యుక్రెయిన్ సైనికులని నిర్థరించలేం.
వీడియోలో సైనికులంతా రష్యన్ మాట్లాడుతున్నారు. యుక్రెయిన్‌లో చాలామంది రష్యన్ మాట్లాడతారు.
వీడియో సగంలో పెద్ద గడ్డం పెట్టుకున్న ఒక సైనికుడి ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. మరి కొన్నిచోట్ల మరి కొంతమంది సైనికుల ముఖాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గడ్దం ఉన్న వ్యక్తి ముఖాన్ని కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ద్వారా మ్యాచ్ చేసేందుకు ప్రయత్నించాం.
యుక్రెయిన్‌తో దగ్గర సంబంధాలున్న జార్జియన్ వ్యక్తితో పోలికలు కుదిరాయి. ఆయన గుర్తింపును ఇంకా ధ్రువీకరించలేదు కాబట్టి ప్రస్తుతానికి ఆయన పేరు బయటపెట్టలేకపోతున్నాం.
గడ్డం ఉన్న వ్యక్తి వైపుకు కెమెరా తిరిగినప్పుడు మరొక వ్యక్తి "గ్లోరీ టు యుక్రెయిన్" (యుక్రెయిన్‌కు విజయం) అని అరిచారు. దానికి జవాబుగా గడ్డం వ్యక్తి "గ్లోరీ టు హీరోస్" (హీరోలకు విజయం) అని అరిచారు.
మళ్లీ మొదటి వ్యక్తి ఉత్సాహంగా "గ్రుజినీ" అని అరిచినట్టు వినిపిస్తోంది. ఆడియో మరీ అంత స్పష్టంగా లేదుగానీ మాటలు వినిపిస్తున్నాయి. గ్రుజినీ అంటే రష్యన్‌లో జార్జియన్లు అని అర్థం.
"మా భూభాగంలోకి రావద్దు" అని మరొక వ్యక్తి చెప్పడంతో ఆడియో ముగుస్తోంది.
ఈ వీడియోపై వ్యాఖ్య కోసం బీబీసీ, యుక్రెయిన్ రక్షణ శాఖను సంప్రదించింది.
బీబీసీ ఈ వీడియోపై పరిశోధన కొనసాగిస్తోంది. కొత్త సమాచారం లభించిన వెంటనే ఈ కథనాన్ని అప్‌డేట్ చేస్తాం.
రిపోర్టింగ్: పాల్ మైయర్స్, డేనియేలే పలుంబో, ఓల్గా రాబిన్సన్, జాక్ హార్టన్, అలెక్స్ ముర్రే, షాయన్ సర్దారిజాదే, అలిస్టెయిర్ కోల్‌మన్, రిచర్డ్ ఇర్విన్-బ్రౌన్.

ఇవి కూడా చదవండి:
- అల్లు అర్జున్: గంగోత్రి నుంచి పుష్ప వరకు - తగ్గేదేల్యా
- మత రాజకీయాలు బెంగళూరు ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయా
- ఏపీ మంత్రుల రాజీనామా, జగన్ కొత్త కేబినెట్లో కుల సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి?
- నవరాత్రి వేడుకల సమయంలో మాంసం షాపులను ఎందుకు మూయించేస్తున్నారు? అసలు మాంసం తినని వారు ఎంత మంది?
- షాంఘై లాక్డౌన్: ఆహారం దొరకడం లేదంటున్న కొందరు స్థానికులు
- కర్ణాటక: హిజాబ్, హలాల్, ఆజాన్ తర్వాత ముస్లిం పండ్ల వ్యాపారులను టార్గెట్ చేసిన హిందూ మత సంస్థ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











