కరోనావైరస్-ఒమిక్రాన్: చైనాలోని షాంఘైలో నిరవధిక లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న ప్రజలు

చైనా, కరోనావైరస్

ఫొటో సోర్స్, CHINA DAILY/REUTERS

కోవిడ్-19 వ్యాప్తిని కట్టడి చేయడానికి షాంఘై నగరంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు చైనా మార్చి చివరి వారంలో ప్రకటించింది. రెండేళ్ల క్రితం కరోనావైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచీ ఈ స్థాయిలో ఇక్కడ లాక్‌డౌన్ విధించలేదు.

రెండు దశల్లో తొమ్మిది రోజులపాటు ఈ లాక్‌డౌన్ ఉంటుందని, ఆ సమయంలో అధికారులు భారీగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తారని చైనా తెలిపింది.

అయితే, లాక్‌డౌన్‌ కారణంగా షాంఘై నగరంలో ఆహార నిల్వలు తరిగిపోతున్నాయని కొందరు స్థానికులు వాపోతున్నారు.

ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. కిరాణా షాపింగ్ కోసం కూడా బయటకు వెళ్లడానికి వీల్లేదు.

చైనాలోని అతిపెద్ద నగరమైన షాంఘైలో బుధవారం సుమారు 20,000 కేసులు నమోదయ్యాయి. జాతీయ స్థాయిలో ఇది కొత్త రికార్డు.

నగరవాసులు "ఇబ్బందులు పడుతున్నారని" అధికారులు అంగీకరించారు. కానీ, పరిస్థితులు మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

నిరవధిక లాక్‌డౌన్‌

షాంఘై నగరంలో లాక్‌డౌన్‌ను వివిధ పద్ధతుల్లో అమలు చేస్తున్నారు. గతవారం నగరాన్ని రెండుగా విభజించి ఒక్కో భాగంలో ఒక్కో రకమైన నిబంధనలు అమలు చేశారు.

అయితే, సోమవారం లాక్‌డౌన్‌ను నిరవధికంగా పొడిగించారు. ప్రస్తుతం నగరం మొత్తానికి లాక్‌డౌన్ విధించారు.

షాంఘై నగరంలో 2.5 కోట్ల మంది ప్రజలు నివాసముంటున్నారు.

నిబంధనల ప్రకారం, ఆహారం, నీళ్లు ఇంటికి ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ, కేసులు పెరుగుతుండడం, లాక్‌డౌన్‌ పొడిగించడంతో కిరాణా దుకాణాల్లో రద్దీ పెరిగిపోతోంది. డెలివరీ సర్వీసులకు ఎడతెరిపి లేకుండా ఆర్డర్లు వస్తున్నాయి.

స్థానికులు సోషల్ మీడియాలో తమ బాధలను పంచుకుంటున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఆహారం, మంచి నీరు ఏదీ ఆర్డర్ చేయలేకపోతున్నామని వాపోయారు.

ప్రభుత్వం కూడా సరుకులు అందిస్తోందిగానీ, ఆలస్యం అవుతోందని మరికొందరు చెప్పారు.

డెలివరీ చేసేవాళ్లు లాక్‌డౌన్‌లో చిక్కుకుపోవడంతో సప్లయి తగ్గిపోతోందని అంటున్నారు.

"వీలైనంత త్వరగా డెలివరీ సామర్థ్యాన్ని మెరుగుపరచమని" ఒక యూజర్ రాశారు.

"జీవితంలో మొదటిసారి నేను ఆకలితో అలమటిస్తున్నా" అని మరొక వ్యక్తి రాశారు.

ధరలు పెరిగిపోతున్నాయని, వృద్ధులు, టెక్నాలజీ అంతగా తెలియనివాళ్లు సరుకులు ఎలా ఆర్డర్ చేసుకుంటారని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు.

చైనా, షాంఘై

ఫొటో సోర్స్, Getty Images

'సరుకులు ఉన్నాయి'

షాంఘైలో బియ్యం, నూడుల్స్, ధాన్యం, నూనె, మీట్ తగినంత ఉన్నాయని, వాటిని పంపిణీ చేయడంలో జాప్యం జరుగుతోందని బుధవారం అధికారులు వెల్లడించారు.

కేసులు పెరుగుతుండడంతో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సరుకులు సప్లయి చేయడం కష్టమవుతోందని చెప్పారు.

నగరంలో కొన్ని హోల్‌సేల్ దుకాణాలు తెరిచే ఏర్పాట్లు చేస్తామని, లాక్‌డౌన్ ప్రాంతాల్లో డెలివరీని పెంచేందుకు ప్రయత్నిస్తామని గురువారం నగరం ఉప మేయర్ చెన్ టాంగ్ చెప్పారు.

"ప్రజల సమస్యలను పరిష్కరించడానికి మేం రాత్రికి రాత్రే సమావేశమయ్యాం" అని చెన్ టాంగ్ తెలిపారు.

ప్రపంచంలో చాలా దేశాలు కరోనావైరస్ (ఒమిక్రాన్ వేరియంట్)తో కలిసి జీవించేందుకు సిద్ధపడుతుండగా, చైనా మాత్రం ఈ వైరస్‌ను పూర్తిగా మట్టుపెట్టాలని శపథం చేసింది.

గతంలో కూడా అనేకసార్లు వివిధ నగరాల్లో లాక్‌డౌన్ విధించింది. కానీ, షాంఘై అన్నిటికన్నా పెద్ద నగరం. అంతేకాకుండా, ఇంతకు ముందు కన్నా వేగంగా వైరస్ వ్యాప్తిస్తోంది.

షాంఘై నగరం చైనా ఆర్థిక కేంద్రం కూడా. ప్రస్తుత లాక్‌డౌన్ చైనాపై, ప్రపంచ ఆర్థికవ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.

వీడియో క్యాప్షన్, ‘నాకు కరోనా వచ్చింది.. నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)