చైనా - షాంఘై లాక్‌డౌన్: ‘ఫుడ్ ఆర్డర్ చేసేందుకు అలారం పెట్టుకుని ఆరు గంటలకే లేస్తున్నా.. లేదంటే స్టాక్ అయిపోవచ్చు’

నిత్యావసరాల కోసం ప్రజలు సూపర్ మార్కెట్లలో క్యూలు కడుతున్నారు.

ఫొటో సోర్స్, Edward Lawrence

ఫొటో క్యాప్షన్, నిత్యావసరాల కోసం ప్రజలు సూపర్ మార్కెట్లలో క్యూలు కడుతున్నారు.

చైనాలోని షాంఘైలో విధించిన లాక్‌డౌన్‌తో వేల మంది ఆఫీసులకే పరిమితమైపోతున్నారు. చాలా మంది భయంతో సరుకులను ఎక్కువగా కొని నిల్వ చేసుకుంటున్నారు.

2.5 కోట్ల జనాభాతో కూడిన ఈ నగరంలో గత కొన్ని వారాలుగా కొన్ని ప్రాంతాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి.

ఈ వారం మొదట్లో తూర్పు షాంఘై ప్రాంతంలో నివసించే వారిని ఇళ్లకే పరిమితమై ఉండమని ఆదేశించారు. ఇప్పుడు పశ్చిమ ప్రాంతంలో కూడా శుక్రవారం నుంచి లాక్‌డౌన్ ప్రకటించారు.

నగరంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో తిరిగి లాక్‌డౌన్‌లు విధించడం మొదలుపెట్టారు.

నగరంలో మార్చి 1 నుంచి 20,000 కోవిడ్ ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. గత రెండేళ్లలో నమోదైన కేసుల కంటే ఈ మార్చి నెలలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

చైనా జీరో కోవిడ్ వ్యూహానికి ఒమిక్రాన్ వేరియంట్ ఎప్పటికప్పుడు సవాలు విసురుతోంది.

వీడియో క్యాప్షన్, కోవిడ్-19: చైనాలో చాలా ప్రాంతాల్లో మళ్లీ లాక్‌డౌన్, మనకూ మరో వేవ్ తప్పదా?

చైనా ఆర్థిక రాజధానిలో లాక్‌డౌన్లను కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేసి సాధారణ జీవితాన్ని యధావిధిగా నడపాలని అధికారులు ప్రయత్నాలు చేశారు.

ఈ నగరాన్ని హువాంగ్ పూ నది రెండు భాగాలుగా విభజిస్తుంది. నగరం మొత్తం లాక్‌డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ఆదివారం ప్రకటించారు.

ఈ నదికి ఉత్తరంగా ఉన్న పుడోంగ్ ప్రాంతంలో ప్రజలను సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు ఇంటి దగ్గరే ఉండమని ఆదేశించారు. పశ్చిమ తీరంలో ఉన్న పూక్సి శుక్రవారం నుంచి లాక్‌డౌన్‌లోకి వెళుతుంది.

షాంఘై వాసులందరికీ సామూహిక కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఈ వారం మొదట్లో పూక్సిలో లాక్‌డౌన్‌ పొడిగిస్తారనే వదంతులు రావడంతో, ప్రజలు సూపర్ మార్కెట్‌లకు క్యూలు కట్టారు.

ఇవన్నీ వదంతులని మంగళవారం అధికారులు కొట్టిపారేశారు.

కానీ, పశ్చిమ తీరంలో ఉన్న ప్రజలు మాత్రం ఆయా హోసింగ్ కమిటీల నుంచి ఏడు రోజుల వరకు బయటకు వెళ్లేందుకు అనుమతి లేదని చెబుతూ నోటీసులు అందుకున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.

Presentational grey line
సూపర్ మార్కెట్లలో ఖాళీ షెల్ఫ్‌లు

ఫొటో సోర్స్, Edward Lawrence

ఫొటో క్యాప్షన్, సూపర్ మార్కెట్లలో ఖాళీ షెల్ఫ్‌లు

ఈ నగరంలో నివాసముంటున్న బీబీసీ ప్రతినిధులు మరిన్ని వివరాలందించారు.

పూక్సి నుంచి:

"సోమవారం నేను హువాంగ్ పూ, జింగాన్, షూ హుయీ నగరాల మీదుగా సైక్లింగ్ చేశాను. వీధులన్నీ నిత్యావసరాలు కొనుక్కునేందుకు వచ్చిన వారితో నిండిపోయాయి.

సూపర్ మార్కెట్లు, మాంసం, చేపలు, ఇతర లైవ్ స్టాక్ అమ్మే మార్కెట్ల దగ్గర క్యూలు షాపు బయట వరకు వచ్చేశాయి. షాపులోకి వెళ్లేందుకు కొనుగోలుదారులను పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తున్నారు.

"వీధి పక్కనే ఉండే మార్కెట్‌లో ఒక మాంసం దుకాణం వ్యక్తి తాజా పంది మాంసం బయటకు తీయగానే, కస్టమర్లు ఆయనను చుట్టుముట్టారు"

"మంగళవారం కొన్ని మార్కెట్లు నిశ్శబ్దంగా ఉన్నాయి. నగరంలో కీలకమైన షాపింగ్ ఏరియా సింటెండి చాలా నిశ్శబ్దంగా ఉంది.

ఆపిల్, కోచ్, స్టార్ బక్స్ తెరిచే ఉన్నాయి. కానీ, కస్టమర్లు లేరు.

పూక్సి నుంచి:

"కొన్ని వారాల క్రితం నుంచే మా కాంపౌండ్‌లో లాక్‌డౌన్ అమలులో ఉంది. ఎక్కువ రోజుల పాటు పనులకు వెళ్లకపోతే, కొంత మంది ఉద్యోగాలు కోల్పోతామేమోనని భయపడుతున్నారు. చాలా రోజులు ఐసోలేషన్‌లో ఉండిపోవడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పారు.

"మాకు కోవిడ్ పరీక్షలు చేసుకోవడం, ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసుకోవడంతోనే రోజులు గడుస్తున్నాయి. తాజా ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం కోసం ప్రతి రోజు ఉదయం 6 గంటలకు అలారం పెట్టుకుంటున్నాను. ఆర్డర్ చేయడం ఆలస్యమైతే, స్టాక్ అయిపోవడంతో ఆర్డర్లు క్యాన్సల్ చేస్తున్నారు. కొన్నిసార్లు డెలివెరీ ఇచ్చేందుకు డ్రైవర్లు లేకపోవడంతో కూడా క్యాన్సల్ చేస్తున్నారు.

"ఎదురు చూపులు ఎక్కువ, సమాధానాలు మితంగా ఉంటున్నాయి" అని అన్నారు.

పుడోంగ్:

"కోవిడ్ పరీక్ష ఎప్పుడు చేస్తారు? బయట నడిచేందుకు అనుమతిస్తారా? ఫుడ్ ఆర్డర్ ఎప్పుడొస్తుందో యాప్ చెక్ చేసుకున్నారా? ఇవే మాకు రోజులో ఎదురయ్యే ముఖ్యమైన ప్రశ్నలు.

"గత కొన్ని రోజుల నుంచి మేము వీధి చివర్లో ఉండే రోడ్డు వరకు కూడా వెళ్లలేకపోయాం. మా పక్కింటి వాళ్ళు కావల్సిన వారెవరైనా తీసుకుని వెళ్లేందుకు ఇంటి ముందు పెద్ద మంచి నీళ్ల బాటిళ్లు పెట్టారు. మరికొంత మంది కూరగాయలు, గుడ్లు లాంటివి అందరూ కొనుక్కునే ఏర్పాట్లు చేశారు.

"2.5 కోట్ల జనాభా ఉన్న నగరంలో కొన్ని రోజుల వ్యవధిలో పరీక్షలు చేసి, విశ్లేషించి కోవిడ్ చర్యలను అమలు చేయడం సాధ్యమేనా అని మేమాలోచిస్తున్నాం. మేము కొన్ని వారాలుగా ఈ పరిస్థితి కోసం సిద్ధం అవుతున్నాం" అని అన్నారు.

Presentational grey line

ఆఫీసులోనే క్వారంటైన్

సోమవారం నుంచి లాక్‌డౌన్ ప్రకటించనున్న నేపథ్యంలో లూజియాజుయీ జిల్లాలో 20,000కి పైగా ఆర్థిక సంస్థలు తమ సిబ్బందిని ఆఫీసుకు వచ్చి పని చేయమని ఆదేశించాయి. బిజినెస్ సాఫీగా సాగేందుకు వీలుగా లాక్ డౌన్ సమయంలో ఆఫీసులోనే ఉండి పని చేయాలని యాజమాన్యాలు చెప్పినట్లు అధికారులు తెలిపారు.

చాలా సంస్థలు స్లీపింగ్ బ్యాగులు, రాత్రి పూట పని చేసే సిబ్బంది కోసం ప్రాథమిక సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశాయి.

"వైరస్ వల్ల స్టాక్ మార్కెట్ పని చేయడం మానదు" అని ఒక ఉద్యోగి ది గ్లోబల్ టైమ్స్‌కు చెప్పారు.

మార్చి 11న ఒక మహిళ జిమ్‌లో ఉండగా ఆమె నివసించే కమ్యూనిటీలో లాక్‌డౌన్ ప్రకటించారు. నాలుగు రోజుల పాటు ఆమె జిమ్‌లోనే క్వారంటైన్‌లో ఉండాల్సి వచ్చింది. జిమ్‌లో సిబ్బంది ఇచ్చిన తిండి తింటూ యోగా మ్యాట్ల పైన, దుప్పట్లు కప్పుకుని పడుకున్నారు. జిమ్‌లో ఉన్నంతసేపూ వ్యాయామం చేస్తూ గడిపానని ఆమె ఒక పత్రికకు చెప్పారు.

మరొక మహిళ ఒక రెస్టారంట్‌లో ఉండిపోవాల్సి వచ్చింది.

కానీ, ఈ నిబంధనలు చాలా మందికి ఆందోళన కలిగించాయి.

షాంఘైలో ఒక భవన సముదాయంలో ప్రజలు లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. నెల రోజుల పాటు లాక్‌డౌన్‌లో ఉన్న తర్వాత తిండి సరుకుల కొరత ఏర్పడిందని స్థానికులు ఫిర్యాదులు చేశారు.

కొంత మంది సోషల్ మీడియా వేదిక వీబో ద్వారా ఔషధాలు, చికిత్స లాంటి సహాయం కోసం అభ్యర్ధనలు చేశారు.

కోవిడ్ సోకిన వారిని లక్షణాలు లేకపోయినా కూడా వేర్ హౌస్‌లు, ఎగ్జిబిషన్ హాల్స్‌కు, లేదా క్వారంటైన్ కేంద్రాలకు పంపారు. కొంతమంది ప్రాథమిక వసతులు బాలేవని ఫిర్యాదు చేశారు. టాయిలెట్లు బాగోలేవని క్వారంటైన్ లో ఉన్న ఒక వ్యక్తి చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

వ్యాపారాలు దెబ్బ తినకుండా ఉండేందుకు కొన్ని చర్యలను చేపట్టనున్నట్టు షాంఘై అధికారులు చెప్పారు.

కోవిడ్ పరీక్షలకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ బుధవారం ఉదయం ప్రకటన విడుదల చేశారు.

"అర్థం చేసుకుని సహకరిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెబుతున్నాం" అని ప్రకటనలో పేర్కొన్నారు.

వీడియో క్యాప్షన్, ఒమిక్రాన్: దక్షిణాఫ్రికా నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలేంటి...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)