ఫిలిప్పో ఆసెల్లా: ఈ బ్రిటన్ ప్రొఫెసర్‌ను భారత్‌లో ఎందుకు అడుగుపెట్టనివ్వలేదు? ఎయిర్‌పోర్ట్ నుంచే వెనక్కి ఎందుకు పంపించారు?

ఫొటో సోర్స్, Filippo Osella
- రచయిత, సౌతిక్ బిస్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
యూకేకి చెందిన ప్రొఫెసర్ ఫిలిప్పో ఆసెల్లా భారతదేశంలో పరిశోధన కోసం మార్చి 24న కేరళ వచ్చారు. 65 సంవత్సరాల ఆసెల్లా సస్సెక్స్ యూనివర్సిటీలో ఆంథ్రోపాలజిస్ట్ గా పని చేస్తున్నారు. ఆయన గత 30 సంవత్సరాలుగా పరిశోధనల నిమిత్తం భారతదేశానికి వస్తూనే ఉన్నారు.
ఆయన కేరళకు చాలా సార్లు వచ్చారు. ఆయన ఈ పర్యటనలో భాగంగా రెండు రోజుల పాటు రాష్ట్రంలో మత్స్యకార సమాజాల గురించి జరగనున్న సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. ఆయన స్థానిక వాతావరణ పరిశోధన శాస్త్రవేత్తలతో కలిసి వాతావరణ సూచనలను ముందుగానే తెలుసుకునే విధానాలను రూపొందిస్తున్నారు. ఇది జరిగితే కొన్ని లక్షల మంది మత్స్యకారుల ప్రాణాలను కాపాడవచ్చు.
కానీ, ఈ సారి ఆయనకు దేశంలో ఊహించని షాక్ ఎదురయింది.
ఆయన విమానం దిగి ఇమ్మిగ్రేషన్ కోసం వెళ్ళగానే, అటు నుంచి ఆటే ఆయనను తిరిగి వెనక్కి పంపించారు. ఆయన ఫోటో, వేలి ముద్రలు తీసుకుని భారతదేశంలో ఉండేందుకు అనుమతి లేదని అధికారులు చెప్పారు. ఆయన అధ్యయనానికి యూకే ప్రభుత్వం పాక్షికంగా నిధులను అందచేస్తోంది.
అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయనను వెనక్కి ఎందుకు పంపారో ఆయనకు తెలియదు.
"నాకు మాట రాలేదు. నన్నెందుకు వెనక్కి పంపిస్తున్నారని అడిగినప్పుడు, ప్రభుత్వ ఆదేశాలను చర్చించలేం అని సమాధానం చెప్పారు. నీతో మేము మాట్లాడం" అని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెప్పినట్లు ప్రొఫెసర్ ఆసెల్లా జూమ్ ఇంటర్వ్యూలో చెప్పారు.
మరో అరగంటలో ఆయన దుబాయ్ వెళ్లే ఫ్లైట్‌లో ఉన్నారు. ఆ తర్వాత 36 గంటల పాటు రకరకాల విమానాలు పట్టుకుని, అనేక ఎయిర్‌పోర్టులలో ఆగుతూ చివరకు లండన్ చేరుకున్నారు.
లండన్ చేరి ఫోన్ ఆన్ చూసేటప్పటికి ఆయనను డిపోర్ట్ చేసిన వార్త భారతదేశంలో వైరల్ అయినట్లు తెలిసింది.
ఆయనకు మద్దతు ప్రకటిస్తూ సుమారు 400 ఈ మెయిల్‌లు, సందేశాలు వచ్చినట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, Filippo Osella
ఆయన హీత్రూ ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళడానికి పట్టిన రెండు గంటల సమయంలో ఈ మొత్తం సంఘటన పట్ల ఆయనకు కలిగిన భావనను 1843 పదాల్లో రాశారు.
ఇమ్మిగ్రేషన్ అధికారులు చాలా దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. భారతదేశంలో తన స్నేహితులను సంప్రదించేందుకు కూడా అవకాశమివ్వలేదని తెలిపారు.
ఆయన బ్యాగులో ఉన్న బీపీ మందులను తీసుకోవడానికి కూడా అంగీకరించలేదని, నోరు మూసుకుని ఉండకపోతే భద్రతా అధికారులు ఆయనను నిర్బంధంలోకి తీసుకుంటారని చెప్పినట్లు వివరించారు.
1985 నుంచి లెక్కలేనన్ని సార్లు భారతదేశానికి వస్తూ వెళుతున్న ఆయనను దేశం నుంచి తిప్పి పంపిస్తారని కనీస ఊహ కూడా లేదని అన్నారు. ఆయనకు ఒక ఏడాది పాటు ఉండే మల్టిపుల్ ఎంట్రీ రీసెర్చ్ వీసా ఉంది. భారత్ నుంచి తిరిగి వెళ్లాల్సిన తేదీ ఏప్రిల్ 07 నాటికి మరో నాలుగు రోజులు గడువు ఉంది.
భారతదేశం అధ్యయనకారులకు, టీచర్లకు వారి పరిశోధనలను పరిశీలించి అవి ప్రభుత్వ నిబంధనలు, విధానాలకు అనుగుణంగా ఉంటే వీసాలు ఇస్తుంది.
వివరణ లేకుండా వీసాలు రద్దు చేసినప్పుడు వీసాలు ఆమోదించాల్సి అవసరేమేముందని ప్రొఫెసర్ ఆసెల్లా ప్రశ్నిస్తున్నారు.
ప్రొఫెసర్ ఆసెల్లా గతంలో భారతదేశం విచ్చేసినప్పుడు వీసాలను దుర్వినియోగం చేశారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ప్రభుత్వ అధికారి చెప్పారు. అయితే, ఆయన వీసాను ఏ విధంగా దుర్వినియోగం చేశారో వివరించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రొఫెసర్ ఆసెల్లా మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. ఆయన 2019లో కేరళకు ఒక సమావేశానికి హాజరవ్వడానికి వచ్చినప్పుడు ఆయనకు కాన్ఫరెన్స్ వీసా ఉందని తెలిపారు.
గత సెప్టెంబరులో వచ్చినప్పుడు ఆయన దగ్గర రీసెర్చ్ వీసా ఉంది.
ఆయన త్రివేండ్రంలో కూడా రీసెర్చ్ ప్రాజెక్ట్‌లో భాగంగా హాజరవుతుండటంతో అది రీసెర్చ్ వీసా పరిధిలోకే వస్తుందని యూకేలో వీసా ఏజెన్సీ చెప్పినట్లు తెలిపారు.
విదేశీ రచయతలు, అధ్యయనకారులను భారతదేశం నుంచి వెనక్కి తిప్పి పంపించడం ఇది మొదటి సారి కాదు.
2018లో క్యాథరిన్ హమ్మెల్ అనే ఆస్ట్రేలియా రచయత, కవి కూడా మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా పై భారత్ కు వచ్చినప్పుడు, ఆమెను బెంగళూరు నుంచి వెనక్కి పంపించారు. అదే సంవత్సరంలో పాకిస్తాన్ ప్రొఫెసర్ ఆనీ జమాన్‌కు దిల్లీ దగ్గర ఒక యూనివర్సిటీ సమావేశానికి హాజరయ్యేందుకు వీసాను తిరస్కరించారు.
కానీ, ఆసెల్లాకు కేరళ రెండో ఇల్లు లాంటిది.
ఆయన 80వ దశకం మధ్యలో కేరళలోని ఎల్హావా జాతి ప్రజల సామాజిక కదలికల గురించి చేస్తున్న పరిశోధనల కోసం రెండున్నర సంవత్సరాలు గడిపారు.
ఆయన స్థానిక భాష మలయాళం కూడా నేర్చుకున్నారు. ఆయన అధ్యయన పర్యటనల్లో భాగంగా కేరళలో దాదాపు 8 సంవత్సరాలు ఉన్నానని చెప్పారు.
ఆయన దేశంలోని ప్రముఖ మత ఆచారాలు, దేవాలయాల్లో జరిపే ఉత్సవాలు, విగ్రహ పూజల గురించి కూడా పరిశోధన చేశారు.
కేరళలోని పురుషాధిక్యత పై ఆయన పుస్తకాన్ని కూడా రచించారు. ఆయన రాష్ట్రం నుంచి ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్లడం వల్ల ముస్లిం వ్యాపారవేత్తలు, ఇస్లాం సంస్కరణోద్యమాల పై కలిగే ప్రభావాల గురించి కూడా అధ్యయనం చేశారు. చవక ఉత్పత్తులను దేశంలోకి దిగుమతి చేసేందుకు చైనాకు వెళ్లిన భారతీయ వర్తకులతో కూడా కలిసి ప్రయాణం చేశారు. ఆయన మలయాళం సూపర్ స్టార్ మామూట్టి గురించి కూడా రాశారు.
"నాకు చాలా రంగాల్లో ప్రవేశముంది" అని అన్నారు.
ఆయన కోస్తా జిల్లాల్లో ఉండే మత్స్యకారుల కోసం వాతావరణ సూచనలను ముందుగానే కనిపెట్టే విధానాల గురించి అధ్యయనం చేస్తున్నారు.
ఆయన ప్రసారాలు యాప్స్, ఇంటర్‌నెట్ రేడియో ద్వారా ఆన్‌లైన్‌లో లభిస్తాయి.
సముద్రంలో తలెత్తే ఆటుపోట్లు, ఎప్పటికప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులు మత్స్యకారుల వృత్తిని ప్రమాదంలో పడేస్తున్నాయి.
2015 - 2021 మధ్యలో తలెత్తిన సముద్ర విపత్తులలో ప్రతీ ఆరు రోజులకొక ఒక మత్స్యకారుడు మరణించినట్లు ఇన్సూరెన్సు డేటా చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
- రష్యా ఆక్రమణలో యుక్రేనియన్లు: ‘మమ్మల్ని చీల్చి చెండాడేందుకు ఒక రాక్షసుడికి అప్పగించినట్లు ఉంది’
- వాంగ్ యీ: చైనా విదేశాంగ మంత్రి భారత్‌లో ఎందుకు పర్యటిస్తున్నారు? రెండు దేశాలూ మళ్లీ దగ్గరవుతున్నాయా?
- లైంగికంగా వేధించే భర్త నుంచి భార్యకు ఇకపై న్యాయం లభిస్తుందా... కర్ణాటక హైకోర్టు తీర్పు ఏం చెబుతోంది?
- కిలో బియ్యం 200, ఉల్లిపాయలు 250, గోధుమ పిండి 220, పాలపొడి 1345.. అక్కడ బతకలేక భారత్‌కు వస్తున్న ప్రజలు
- చైనా: 132 మందితో వెళ్తున్న ఆ విమానం ఎలా కుప్పకూలింది... సాంకేతిక లోపమా, విద్రోహ చర్యా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















