రష్యా ఆక్రమణలో యుక్రేనియన్లు: ‘మమ్మల్ని చీల్చి చెండాడేందుకు ఒక రాక్షసుడికి అప్పగించినట్లు ఉంది’

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, ఒలేస్యా గెరాసిమెంకో, అనస్టాసియా సోరోకా
- హోదా, బీబీసీ రష్యా
మెలిటోపోల్ ఒక చిన్న పట్టణం. అక్కడ లక్షా 50 వేల కంటే కాస్త ఎక్కువ జనాభా ఉంటుంది.
యుక్రెయిన్ బలాలు పోరాడకుండానే వెళ్లిపోయాయని, నైరుతి దిశగా 250 కి.మీ దూరంలో ఉన్న క్రైమియా నుంచి రష్యా బలగాలు లోపలికి చొరబడ్డాయని అక్కడి స్థానికులు బీబీసీతో చెప్పారు.
''బహుశా, అలా చేయడమే సరైనది'' అని మరియుపూల్, చెర్నిహివ్ నగరాల దుస్థితిపై అవగాహన ఉన్న ఒక మహిళ అభిప్రాయపడ్డారు. గత కొన్ని వారాలుగా మరియుపూల్, చెర్నిహివ్ నగరాల్లో ఇరు దేశాల సైనికుల మధ్య భీకరమైన పోరాటాలు, బాంబు దాడులు జరుగుతున్నాయి. అక్కడ సాధారణ పౌరుల మరణాల సంఖ్య కూడా చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది.
''కానీ మమ్మల్ని చీల్చి చెండాడేందుకు ఒక రాక్షసుని దగ్గర విడిచిపెట్టి పోయినట్లు ఉందని'' ఆమె ఆవేశంగా అన్నారు.
ఖేర్సన్ నగరం మెలిటోపోల్‌కు దాదాపు రెట్టింపు పరిమాణంలో ఉంటుంది. అక్కడ జనాభా 2,90,000. యుద్ధం ప్రారంభమైన మొదటి గంటల్లోనే ఈ ప్రదేశాన్ని రష్యా ఆక్రమించుకుందని స్థానిక జర్నలిస్టు బీబీసీకి చెప్పారు.
రష్యా పురోగమనానికి యుక్రెయిన్ బలగాల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురు కాలేదు. కేవలం కొంతమంది వ్యక్తులు, స్థానిక ప్రాదేశిక రక్షణ దళాలు పెట్రోలు బాంబులు, కలాష్నికోవ్ తుపాకులతో రష్యాను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

ఫొటో సోర్స్, Media Platform Vhoru
''యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలతో రష్యా బలగాలు ఇక్కడికి చేరుకున్నాయి. ప్రాదేశిక రక్షణ దళాలను లొంగిపోమని వారు అడిగి ఉండొచ్చు. కానీ అలా చేయకుండా వారిని మెషీన్ గన్లతో కాల్చివేశారు. వారి మృతదేహాలను కూడా ఎవరినీ తీసుకెళ్లనివ్వలేదు. మిగతా వారు వాటిని చూసి భయపడాలని రష్యా సైనికులు అనుకున్నారు'' అని జర్నలిస్టు చెప్పారు.
ఆయన చెప్పిన ఈ మాటలను ఖేర్సన్‌లోని మరో ఐదుగురు కూడా ధ్రువీకరించారు. కానీ నగరాన్ని స్వాధీనం చేసుకునే సమయంలో ప్రాదేశిక దళాలపై ఫైరింగ్ జరిపినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ నివేదించలేదు.
ఖేర్సన్‌లోకి రష్యా ఆర్మీ ప్రవేశించిన తర్వాత మొదటి 24 గంటల్లో అక్కడ భీకర కాల్పులు జరిగినట్లు బీబీసీకి తెలిసింది. ''మేం ఇంట్లోనే ఉండిపోయాం. కానీ ఇళ్లపై, చెట్లపై, కార్లపై కాల్పుల శబ్ధాలు మేం విన్నాం'' అని అక్కడి నివాసితుల్లో ఒకరు చెప్పారు.
ఆ మరుసటి రోజు రష్యా సైనికులు, స్థానిక టీవీ సెంటర్ దగ్గరకు వెళ్లి... రష్యా చానెళ్లను ప్రసారం చేయాల్సిందిగా ఇంజినీర్లపై ఒత్తిడి తెచ్చారు.

ఫొటో సోర్స్, Igor Tsurkan/suspilne.kherson
రష్యా సైనికులు ప్రవేశపెట్టిన ప్రాథమిక నిబంధనల గురించి ఒక ఖేర్సన్ నివాసితుడు మాకు వివరించారు. తాము చెప్పిన కొన్ని నిబంధనలు పాటించినంత వరకు ఖేర్సన్‌లో సాధారణ జీవితమే గడపవచ్చని, యుక్రెయిన్ జెండాలను కూడా తొలగించబోమని తమకు చెప్పినట్లు ఆయన తెలిపారు.
''రష్యా సైనికులు మమ్మల్ని తనిఖీలు చేసుకోవడానికి మేం అనుమతి ఇవ్వాల్సి వచ్చింది. మా ఫోన్లను, సోషల్ మీడియా పోస్టులతో పాటు వ్యక్తిగత సందేశాలను వారు తనిఖీ చేశారు. ఒకవేళ వారికి ఫోనులో ఏదైనా నచ్చకపోతే, వాటిని తీసుకొని వెళ్లిపోతారు'' అని స్థానికులు చెప్పారు.
త్వరలోనే అక్కడ రష్యా వ్యతిరేక ర్యాలీలు ప్రారంభమయ్యాయి. రష్యా సైనికులు ఆశ్చర్యపోయారని, తొలుత వారు భయపడ్డారని ఖేర్సన్ నివాసితులు చెప్పారు.
''రష్యా బలగాలు నగరంలోని సెంట్రల్ స్క్వేర్ దగ్గరకు సైనికులు, సాయుధ వాహనాలతో వచ్చాయి. నిరసనకారులను వెనక్కి నెట్టేందుకు ప్రయత్నించాయి. అయినప్పటికీ ప్రజలు బెదరలేదు. దీంతో వారు ఆయోమయానికి లోనయ్యారు'' అని బీబీసీతో ఒక స్థానిక మహిళ అన్నారు.
కానీ మెలిటోపోల్‌లో పరిస్థితి ఇందుకు భిన్నం. నిరసనకారులను చావబాదడానికి, వారిని నిర్బంధించడానికి రష్యా సైనికులకు ఎక్కువ సమయం పట్టలేదు.
నిరసన కార్యక్రమాలను నడిపిస్తోన్న కార్యకర్తలను రష్యా సైనికులు లక్ష్యంగా చేసుకున్నారు. నెమ్మదిగా వారు కనిపించడం మాయమైంది అని బీబీసీతో ఒక స్థానికుడు చెప్పారు.

''ప్రారంభంలో మేం రోజూ నిరసనలు చేపట్టాం. కానీ క్రమేపీ వారు ప్రజలను నిర్బంధించడం మొదలుపెట్టారు. చాలా ఘోరంగా కొట్టారు'' అని ఒక మహిళ మాతో అన్నారు.
మెలిటోపోల్ నగర మేయర్ ఇవాన్ ఫెడరోవ్‌ను రష్యా సైనికులు కిడ్నాప్ చేయడంతో అక్కడ మార్చి 11న ఒక పెద్ద నిరసన కార్యక్రమం జరిగింది.
మార్చి 14న ఈ నిరసన మరింత భారీ స్థాయిలో జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కొంతమంది ప్రజలు దీని గురించి బీబీసీకి వివరించారు.
''రష్యన్లు చాలా సాయుధ వాహనాలతో సెంట్రల్ స్క్వేర్‌కు చేరుకున్నారు. దాదాపు 100కు పైగా సైనికులు అందరినీ చుట్టుముట్టారు.''
''కాల్చడానికి పొజిషన్లు తీసుకొని కొంతమంది సైనికులు సిద్ధంగా ఉన్నారు. వారు నిరసనకారులను ఇబ్బంది పెట్టారు. వారి దగ్గర నుంచి ఐడీలను లాక్కున్నారు. మా పాస్‌పోర్ట్‌లు విలువ లేని ఒక కాగితపు ముక్కలు అని మాతో అన్నారు'' అని ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఒక మహిళ, బీబీసీకి తెలిపారు. మరోవైపు ఖేర్సన్‌లో కూడా రష్యా సైనికులు ఆగ్రహంగా ఉన్నారు.

మార్చి 21న రష్యా వ్యతిరేక నిరసన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రష్యా సైనికులు కాల్పుల్లో ఒక పౌరుడు గాయపడ్డారు. ఆ తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్‌లో కూడా ఇబ్బందులు ఎదురయ్యాయని స్థానికులు చెప్పారు.
ఖేర్సన్‌లో షూటింగ్ గురించి రష్యా రక్షణ మంత్రిత్వ శాఖను బీబీసీ అడిగింది. కానీ వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. రష్యా అధికారుల నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు.
మెలిటోపోల్ లో మరింత ఎక్కువ స్థాయిలో హింస చెలరేగిందని ప్రజలు చెబుతున్నారు.
యుక్రెయిన్ జాతీయ జెండాను భుజాల చుట్టూ కప్పుకున్న ఒక టీనేజీ జంటను రష్యన్ సైనికులు బలవంతంగా పట్టుకోవడం చూశానని ఒక మహిళ చెప్పారు.
"వారిద్దరికీ 17 సంవత్సరాలు కంటే ఎక్కువ ఉండవు" అని ఆమె అన్నారు.
"ఇక్కడ మీరేం చేస్తున్నారు" అని నేను రష్యన్ సైనికులను అడిగాను. ‘‘వీళ్ళు పిల్లలు" అని అన్నాను.
‘‘అంతలోనే ఆ టీనేజీ అబ్బాయి "యుక్రెయిన్ వర్ధిల్లాలి" అని అరిచాడు. ఆ సైనికులు "ఇది రష్యా" అని అంటూ ఆ అబ్బాయిని కొట్టడం మొదలుపెట్టారు. నేనా జెండాను చేతిలోకి తీసుకుని నా చుట్టూ కప్పుకున్నాను" అని చెప్పారు.
రష్యన్ సైనికులు బెదిరిస్తున్నప్పటికీ ఒంటికి చుట్టుకున్న జెండాను తీయడానికి ఒప్పుకోలేదని ఆమె చెప్పారు.
"వాళ్ళు నన్ను భయపెట్టాలని చూశారు. బెదిరించారు. ఏం చేసుకుంటారో చేసుకోండి నేను పట్టించుకోను" అని చెప్పాను.

ఫొటో సోర్స్, Reuters
యుక్రెయిన్ బంధించిన తొమ్మిది మంది రష్యన్ సైనికులను విడుదల చేసినందుకు బదులుగా మార్చి 16న రష్యా మెలిటోపోల్ మేయర్ ను విడుదల చేసింది.
ఆ తర్వాత, నిరసనలు చేయడం అసాధ్యంగా మారింది.
"మాస్కోలో జీవితం ఇలాగే ఉండి ఉంటుంది" అని మెలిటోపోల్ నివాసి ఒకరు బీబీసీకి చెప్పారు.
"మేమొకచోట ఎక్కడైనా గుమిగూడడం మొదలుపెట్టగానే సైనికులొచ్చి మమ్మల్ని దూరంగా తరిమేశారు.
సంఘీభావం పెంపొందించేందుకు ప్రజలు జూమ్‌లో ర్యాలీలు నిర్వహించడం మొదలుపెట్టినట్లు ఒక మెలిటోపోల్ నివాసి చెప్పారు.
మరో వైపు, ఖేర్సన్ లో రష్యన్ సైనికులు యుక్రెయిన్ పోలీసులు, సరిహద్దు రక్షణ చూసే సభ్యులు, విలేఖరులు, సామాజిక కార్యకర్తల ఇళ్ల పై దాడులు చేయడం మొదలుపెట్టారు.
ఈ దాడులు హింసాత్మకంగా ఉన్నాయని కొంత మంది చెబుతున్నారు. రష్యా సైనికులు తలుపులు పగలగొట్టి ఇళ్లల్లోకి చొరబడుతున్నారని చెప్పారు. ఒకరింట్లోకి దూరి బాత్ రూమ్ లోని సింక్, టాయిలెట్ బౌల్ పగలగొట్టినట్లు చెప్పారు.
ఖేర్సన్ నగరంలో రష్యన్ భాష ఎక్కువగా మాట్లాడుతుండటంతో ఈ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకోవడం సులభమవుతుందని రష్యా సేనలు భావించి ఉంటాయని ఒక స్థానికుడు అనుమానాన్ని వ్యక్తం చేశారు.
"ఖేర్సన్ నగరంలో రష్యాకు విరివిగా మద్దతు దొరుకుతుందని రష్యా ప్రచారం చేస్తోంది. కానీ, వాస్తవ పరిస్థితి మరోలా ఉంది".
రష్యన్ సేనలు స్థానికులకు ఆహార పొట్లాలను పంచడం ద్వారా వారి మనసులు గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. నిరాశ్రయులు, అల్పాదాయ వర్గాల వారు రష్యన్లు ఇచ్చే ఆహారాన్ని స్వీకరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
"ఆహారాన్ని సరఫరా చేసిన తర్వాత రష్యా చేస్తున్న పనికి కృతజ్ఞులమై ఉంటామని చెప్పమని అడుగుతూ వారి వీడియోలు తీస్తున్నారు"

ఫొటో సోర్స్, Reuters
ఖేర్సన్ లో ఎవరికీ యుక్రెయిన్ అధీనంలో ఉన్న భూభాగంలోకి దాటి రావడం సాధ్యం కాదు. కానీ, రష్యన్ సైన్యం అక్కడి నుంచి రష్యా ఆక్రమిత క్రైమియాకు బస్సులను నడుపుతోంది.
రష్యా ఆక్రమణ ఎన్నాళ్ళో సాగదని, యుక్రెయిన్ సేనలు త్వరలోనే నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటారని స్థానికులు బీబీసీకి చెప్పారు.
"ఈ పోరాటం చాలా భీభత్సంగా ఉండవచ్చని ఆందోళనగా ఉంది. రష్యన్లు నగరంలోకి వచ్చేందుకు రోడ్లన్నిటినీ తవ్వేస్తారు. వాళ్ళు మికోలైవ్‌లో కూడా ఇలాగే చేసినట్లు చెప్పారు. కానీ, మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. మేము దాక్కుని ఈ ఆక్రమణను తప్పించుకునేందుకు ఏదైనా చేస్తాం" అని ఒక స్థానికుడు చెప్పారు.
రష్యన్ సేనలు విస్తృతంగా నివాస స్థలాల్లోకి చొరబడటం గురించి వచ్చిన ఆరోపణల పై రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించలేదు.

మెలిటోపోల్‌లో కూడా మేము మాట్లాడిన వ్యక్తులు రష్యాకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు.
1920లలో బోల్షెవిక్‌లు తన తాతమ్మను ధనిక భూస్వామి అని ఆరోపిస్తూ ఆమెను అరెస్టు చేసి దేశం నుంచి బహిష్కరిస్తామని బెదిరించినట్లు ఒక మహిళ చెప్పారు.
ఆమె ఆ సమయంలో తన మిల్లును, ఇంటిని కాల్చేసి ఒక షెడ్‌లోకి వెళ్లినట్లు చెప్పారు. ఇదంతా ఆమె కేవలం తన సొంత భూభాగంలోనే ఉండాలని చేసినట్లు ఆమె మనుమరాలు చెప్పారు.
"నేను కూడా అదే విధంగా చేయవచ్చు. నేనెక్కడికీ వెళ్ళటం లేదు" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వాంగ్ యీ: చైనా విదేశాంగ మంత్రి భారత్‌లో ఎందుకు పర్యటిస్తున్నారు? రెండు దేశాలూ మళ్లీ దగ్గరవుతున్నాయా?
- లైంగికంగా వేధించే భర్త నుంచి భార్యకు ఇకపై న్యాయం లభిస్తుందా... కర్ణాటక హైకోర్టు తీర్పు ఏం చెబుతోంది?
- RRR చుట్టూ ఇంత సందడి ఎందుకు? ఎవరి నోటా విన్నా ఆ సినిమా మాటే వినిపించేలా ఎలా చేస్తారు?
- కిలో బియ్యం 200, ఉల్లిపాయలు 250, గోధుమ పిండి 220, పాలపొడి 1345.. అక్కడ బతకలేక భారత్‌కు వస్తున్న ప్రజలు
- చైనా: 132 మందితో వెళ్తున్న ఆ విమానం ఎలా కుప్పకూలింది... సాంకేతిక లోపమా, విద్రోహ చర్యా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














