Japan: ఒకప్పుడు అణు విధ్వంసంతో బాధపడ్డ జపాన్ ఇప్పుడు అణు బాంబులు తయారు చేయాలని ఎందుకు అనుకుంటోంది?

మాజీ జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాజీ జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే
    • రచయిత, రూపర్ట్ వింగ్ ఫీల్డ్‌- హేయస్
    • హోదా, బీబీసీ న్యూస్ టోక్యో

న్యూక్లియర్ దాడుల గురించి జపాన్ సుదీర్ఘమైన ఆలోచన చేస్తోందా? ఇదొక దారుణమైన ఆలోచన. ప్రపంచంలో న్యూక్లియర్ దాడికి గురైన ఒకే ఒక్క దేశం జపాన్. జపాన్ న్యూక్లియర్ ఆయుధాలను సమకూర్చుకుంటుందనే ఆలోచన అసలు ఊహించలేనిది. ప్రజలు దీనిని ఎప్పటికీ ఆమోదించలేరు.

మాజీ జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే కొన్ని వారాల క్రితం ఇందుకు భిన్నమైన సూచనలు చేశారు. ఆయన రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సుదీర్ఘ కాలం పాటు జపాన్ ప్రధాన మంత్రిగా పని చేశారు. జపాన్ సీరియస్‌గా న్యూక్లియర్ ఆయుధాల గురించి ఆలోచించవలసిన తరుణం వచ్చిందని ఆయన గట్టిగా, బహిరంగంగా చెప్పడం మొదలుపెట్టారు.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ శాంతియుత మార్గానికి కట్టుబడి ఉండాలని రాజ్యాంగంలో పొందుపరిచింది. అయితే, జపాన్ ఒకవేళ న్యూక్లియర్ ఆయుధాలను తయారు చేయడానికి పూనుకుంటే దాని ప్రాధమిక సూత్రం నుంచి పక్కకు తప్పుకున్నట్లే అవుతుంది.

కానీ, రష్యా యుక్రెయిన్ పై దాడి చేసిన నేపథ్యంలో అబే నుంచి ఇటువంటి పిలుపు రావడం యాదృచ్చికం కాదు.

అబే పిలుపును సమర్ధిస్తున్నవారంతా, సమృద్ధిగా, భారీగా ఆయుధ సంపత్తిని కలిగిన బలమైన పొరుగు దేశాలున్నప్పుడు జపాన్ పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు యుక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని ఒక ఉదాహరణగా చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, హిరోషిమా, నగాసాకి నగరాల్లో అణుబాంబులు సృష్టించిన విధ్వంసం

జపాన్ న్యూక్లియర్ ఆయుధాలను సమకూర్చుకోవడానికి తగిన చర్చను లేవనెత్తేందుకు ఇది సరైన సమయమని అబే అనుకుంటున్నారని 'ఆసియా'స్ రికోనింగ్' పుస్తక రచయత, సిడ్నీ లోని లోవీ ఇన్స్టిట్యూట్‌కు చెందిన రిచర్డ్ మెక్‌గ్రెగర్ అభిప్రాయపడ్డారు.

ఈ చర్చ ద్వారా జపాన్ ప్రజలను ఈ విషయంలో ఒప్పించేందుకు ప్రయత్నించాలని ఆయన భావిస్తున్నట్లు చెప్పారు.

"ఈ దేశంలో ఉన్న మంచి విషయం ఇదే. ఆయన నిజానికి మొండిగా ఉన్న ప్రజాభిప్రాయాన్నిసేకరించాలని అనుకుంటున్నారు" అని ఆయన బీబీసీకి చెప్పారు.

గత సంవత్సరం జరిగిన ఒక సర్వేలో 75% మంది జపాన్ ప్రజలు అణ్వాయుధ నిరోధక ఒప్పందం పై సంతకం చేయడానికి మద్దతు పలికారు.

న్యూక్లియర్ ఆయుధాల పై అబే ఇచ్చిన పిలుపుకు హిరోషిమా, నాగసాకి ఆటం బాంబు దాడికి గురై కోలుకున్న బాధితుల గ్రూపులు మాత్రం ఆగ్రహంతో ప్రతిస్పందించారు. ప్రస్తుత ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా కూడా హిరోషిమాకు చెందినవారే. ఆయన అబే చేసిన ప్రతిపాదనను ఆమోదయోగ్యం కాదంటూ తోసిపుచ్చారు.

కానీ, యుక్రెయిన్ యుద్ధం దిగ్భ్రాంతిని కలిగించిందని అబేకు తెలుసు. ఒక వైపు న్యూక్లియర్ సంపత్తి కలిగిన ఉత్తర కొరియా, మరో వైపు శక్తివంతమైన చైనా వల్ల ఊహించని ముప్పు ఉండవచ్చని జపాన్ ప్రజానీకం ఆందోళన చెందుతున్నారని కూడా ఆయనకు తెలుసు.

జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా

షింజో అబేకు ప్రొఫెసర్ యోచీ చిరకాల స్నేహితుడు, సలహాదారుడు.

"చైనా లేదా ఉత్తర కొరియాను ఎదుర్కొనేందుకు జపాన్ స్వతంత్ర శక్తిగా ఉండటం అవసరమని ఆయన అభిప్రాయం" అని ప్రొఫెసర్ షిమాడా అన్నారు.

"నూక్లియర్ ఆయుధ భాండాగారాన్ని సమకూర్చుకోవల్సిన అవసరముంది. కానీ, జపాన్ న్యూక్లియర్ ఆయుధాలను సమకూర్చుకోవాలని రాజకీయ నాయకులు ప్రచారం చేయడం ఆత్మహత్యా సదృశం అవుతుంది. అందుకే అబే ఈ అంశం పై చర్చ జరగాలని అనుకుంటున్నారు" అని అన్నారు.

"ప్రస్తుతానికి అమెరికా ఇస్తున్న న్యూక్లియర్ డిటరెంట్ల పై ఆధారపడాలని జపాన్ ప్రభుత్వం భావిస్తోంది. కానీ, అమెరికా న్యూక్లియర్ ఆయుధాలను జపాన్ కు పంపేందుకు జపాన్ అనుమతించదు. అది పూర్తిగా స్వార్ధపూరిత చర్య".

"జపాన్ న్యూక్లియర్ ఆయుధాలను సొంతంగా తయారు చేయాలని అబే సూచించటం లేదు. అమెరికా నుంచి తెచ్చుకోవచ్చని చెబుతున్నారు. జర్మనీ, బెల్జియం, ఇటలీ, నెథర్లాండ్స్ లాంటి దేశాలు తమ భూభాగంలో అమెరికా చేసిన న్యూక్లియర్ ఆయుధాలను దాచి పెట్టి ఉంచాయనే విషయాన్ని చాలా మంది మర్చిపోయారు" అని అన్నారు.

ఒక వేళ న్యూక్లియర్ యుద్ధం మొదలైతే, న్యూక్లియర్ రహిత దేశాలు తమ సొంత వైమానిక దళం ద్వారా ఆ ఆయుధాలను అమెరికా తరుపున ప్రయోగిస్తాయి.

ప్రస్తుతం అబే కూడా జపాన్‌కు ఇదే విధమైన సూచన చేస్తున్నారు.

దీని ఫలితాలు రావడానికి చాలా సమయం పట్టవచ్చు. జపాన్ చట్టం 1971 నుంచి జపాన్ భూభాగంలో న్యూక్లియర్ ఆయుధాలను పూర్తిగా నిషేధిస్తోంది. ప్రస్తుతం ఈ నిషేధం పై చర్చకు అబే పిలుపునిస్తున్నారు.

ఉత్తర కొరియా న్యూక్లియర్ ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా న్యూక్లియర్ ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ర్యోజో కాటో అమెరికాకు జపాన్ రాయబారిగా పని చేశారు. ఆయన జపాన్ అమెరికా కూటమికి ఎప్పుడూ మద్దతిస్తారు. "ఒక వైపు ఉత్తర కొరియా న్యూక్లియర్ ఆయుధాలను కలిగి ఉంటే, జపాన్ కేవలం అమెరికా అందచేస్తున్న న్యూక్లియర్ గొడుగు మీద మాత్రమే ఆధారపడలేదు" అని అన్నారు.

"జపాన్ పై న్యూక్లియర్ ఆయుధాలను ప్రయోగించాలని ఏ నాయకుడైనా అనుకోవచ్చు. లేదా రాజకీయంగా బెదిరించేందుకు వాడవచ్చు. జపాన్‌కి ఎప్పుడూ బెదిరింపు ముప్పు ఉంటుంది. రక్షణ విషయంలో మరిన్ని చర్యలు చేపట్టాల్సి ఉంది" అని అన్నారు.

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఆక్రమణదారులు జపాన్‌లో శాంతియుత తత్వాన్ని ప్రవేశపెట్టారు. అమెరికా ప్రభుత్వం, జపాన్‌లో రాజకీయ నిపుణులు కూడా ప్రస్తుతం ఈ తత్వాన్నే సమర్థిస్తున్నారు.

"శాంతియుత రాజ్యాంగం అవలంబించేందుకు అమెరికా జపాన్‌ను కట్టిపెట్టి ఉంచకుండా ఉండాల్సిందని చాలా మంది అమెరికన్లు భావిస్తారు" అని రిచర్డ్ మెక్‌గ్రెగర్ అన్నారు.

"కానీ, ఈ విధమైన రాజ్యాంగాన్ని అమెరికన్లు జపాన్ పై విధించడాన్ని అబే లాంటి చాలా మంది ప్రతిఘటిస్తారు. వారికి అమెరికాతో సత్సంబంధాల అవసరం ఉండటంతో వారి కోపాన్ని లోలోపలే అణుచుకుంటారు. వారు చైనాను సొంతంగా ఎదుర్కోలేరని తెలుసు. ఈ శాంతియుత రాజ్యాంగాన్ని అమ్మినవారికి, కొన్నవారికి కూడా న్యూనత ఉంది.

రాజ్యాంగం ఏమి చెబుతున్నప్పటికీ, జపాన్ దగ్గర ఆయుధ సంపత్తి లేదని చెప్పడానికి లేదు.

జపాన్ నావికా దళం ప్రపంచంలోనే శక్తివంతమైన నావికా దళాల్లో ఒకటి. ఇది బ్రిటన్ రాయల్ నేవీ కంటే పెద్దది. అయితే, జపాన్ దగ్గర లాంగ్ రేంజ్ స్ట్రైక్ సామర్ధ్యం లేదు.

"జపాన్ తన స్థితిని మార్చుకోవాలని అందరూ కోరుకుంటున్నారు" అని షిమాడా అంటున్నారు.

శత్రు దేశం పై దాడి చేసేందుకు వీలుగా జపాన్ దగ్గర ఆయుధాలు ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు. ప్రస్తుతం జపాన్‌లో అధికారంలో ఉన్న లిబరల్ డెమొక్రటిక్ పార్టీలో అత్యధిక మంది రాజకీయ వేత్తలు కూడా జపాన్‌కు ఆయుధ సామర్ధ్యం ఉండాలని భావిస్తున్నారు.

యుక్రెయిన్ లో విధ్వంసం జరిగిన తర్వాత దృశ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ లో విధ్వంసం జరిగిన తర్వాత దృశ్యం

"పుతిన్ యుక్రెయిన్ పై చేస్తున్న దాడులు దీనిని మరింత వేగవంతం చేయాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి" అని ప్రొఫెసర్ షిమాడా అంటారు.

"ఒక న్యూక్లియర్ రహిత దేశం పై న్యూక్లియర్ ఆయుధాలను ప్రయోగిస్తానని పుతిన్ బెదిరించారు. ఇది జపాన్‌లో చాలా మంది రాజకీయ నాయకులకు ఒక గేమ్ చేంజర్ లాంటిది".

"ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో రష్యా శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉంది. పుతిన్ అమానుషంగా ప్రవర్తిస్తున్నారని అందరికీ తెలుసు. కానీ, ఇది చాలా దిగ్భ్రాంతిని కలుగచేస్తోంది. ఆఖరుకు ఆయనను కూడా" అని షిమాడా అన్నారు.

యుక్రెయిన్ మాదిరిగా కాకుండా జపాన్‌కు అమెరికాతో సంపూర్ణ కూటమి ఉంది. జపాన్ పై ఏ దేశం దాడి చేసినా దానిని తిప్పి కొడతామని వాషింగ్టన్ ఇచ్చిన హామీ కూడా ఉంది. ఆఖరుకు న్యూక్లియర్ ఆయుధాలతో దాడి చేసినా కూడా అమెరికా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు హామీ ఇచ్చింది.

ఈ విషయంలో అమెరికా ఆధిక్యత సాధించింది. కానీ, చైనా అమెరికాతో సమానంగా మిలిటరీ శక్తిని సంపాదిస్తోంది.

వీడియో క్యాప్షన్, పెర్ల్ హార్బర్: అమెరికాపై జపాన్ దాడికి 80ఏళ్లు.. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది?

"మాజీ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మీ భద్రత గురించి మీరే చూసుకోవాలని ప్రకటించారు" అని 'ది అబే లెగసీ' రచయత హిరోమీ మురకామి అన్నారు.

"ఆయన ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అమెరికాలో చాలా మంది ఇదే ధోరణితో ఉన్నారని నేననుకుంటున్నాను. పూర్తిగా అమెరికా మీద ఆధారపడలేం" అని అన్నారు.

జపాన్ పొరుగు దేశాల నుంచి రక్షించుకోవడానికి మరింత బలం సంపాదించుకునేందుకు అమెరికా-జపాన్ కూటమిని బలపరచడం ముఖ్యమని కాటో లాంటివారంటారు.

ఎప్పటికైనా జపాన్ సొంతంగా న్యూక్లియర్ ఆయుధాలను తిప్పికొట్టగలిగే సామర్ధ్యాన్ని సంపాదించాలని ప్రొఫెసర్ షిమాడా అంటారు.

"జపాన్‌లో చాలా మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. దీనిని ఎన్నో ఏళ్ల నుంచి తప్పించుకుంటూ వస్తున్నాం" అని మురకామి అన్నారు.

"జపాన్ నాయకులు దీనిని చర్చకు తీసుకువచ్చి ప్రజలకు చూపించాలి. ఈ బూటక ప్రపంచంలో ఇక పై బ్రతకలేం" అని అన్నారు.

యుక్రెయిన్‌లో పరిస్థితి నిజంగా దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కానీ, ఇది జపాన్‌లోని నాయకులను, ప్రజలను కూడా ఆలోచించేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)