కిమ్ జోంగ్ ఉన్ భయపడుతున్నారా? భయపెడుతున్నారా? ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు ఎందుకు?

కిమ్ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా జీడీపీలో సుమారు అయిదొంతులు మిలిటరీ కోసం ఖర్చు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, KCNA VIA REUTERS

ఫొటో క్యాప్షన్, కిమ్ జోంగ్ ఉన్, ఉత్తర కొరియా జీడీపీలో సుమారు అయిదొంతులు మిలిటరీ కోసం ఖర్చు చేస్తున్నారు.
    • రచయిత, రూపర్ట్ వింగ్‌ఫీల్డ్-హేయస్
    • హోదా, బీబీసీ న్యూస్, టోక్యో

ఉత్తర కొరియా మళ్లీ క్షిపణి పరీక్షలు చేపట్టడం జపాన్‌ను చిన్నగా కుదిపింది. 2017 ఆగస్టులో కూడా ఆ దేశం చేపట్టిన మిస్సైల్ పరీక్షల సైరన్ మోతలు జపాన్‌కు వినిపించాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి చాలా భిన్నంగా ఉంది.

ఎటువంటి హెచ్చరికలు లేకుండానే ఉత్తర కొరియా ఒక ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని (ఐసీబీఎం) జపాన్ మీదుగా పసిఫిక్ మహాసముద్రంలోకి ప్రయోగించింది. ఇది సాహసమనే చెప్పాలి.

అయితే, ఈసారి ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణులన్నీ తక్కువ దూరాన్ని కలిగి ఉన్నవి. జపాన్ తీరానికి చాలా దూరంగా సముద్రంలో ల్యాండ్ అయ్యాయి.

ప్రస్తుతానికి కిమ్ జోంగ్ ఉన్ కాస్త వెనక్కు తగ్గినట్టే కనిపిస్తున్నారు. కానీ, తాను అనుకున్న ఫలితాలు రాకపోతే మళ్లీ మొదలుపెట్టే అవకాశం ఉంది.

జనవరిలో హైపర్‌సోనిక్ క్షిపణి పరీక్ష.. ఉత్తర కొరియా స్టేట్ మీడియా విడుదల చేసిన చిత్రం

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, జనవరిలో హైపర్‌సోనిక్ క్షిపణి పరీక్ష.. ఉత్తర కొరియా స్టేట్ మీడియా విడుదల చేసిన చిత్రం

ఇంతకీ కిమ్ జోంగ్ ఉన్‌ ఏం కోరుకుంటున్నారు?

నార్త్ కొరియా పూర్తి, సమర్థవంతమైన అణు నిరోధక శక్తిగా మారే ప్రయత్నాలు చేస్తోందని మిలటరీ విశ్లేషకులు అంటున్నారు.

"నా అభిప్రాయంలో ఇది ఊహించదగినదే. నార్త్ కొరియా సాంకేతికతను మనం తక్కువ అంచనా వేస్తున్నాం. అలాగే, ఇప్పుడు అది సంక్షోభంలో ఉందని భావిస్తున్నాం. అందుకే మనకు ఆశ్చర్యంగా ఉంది. నార్త్ కొరియా కచ్చితంగా తన సైనిక సామర్థ్యాలను పెంపొందించుకుంటూ మనం ఊహించిన దానికంటే వేగంగా ముందుకు కదులుతోంది" అని మాజీ దక్షిణ కొరియా నౌకాదళ కమాండర్ ప్రొఫెసర్ కిమ్ డోంగ్ యుప్ అన్నారు.

జనవరి 5, 10 తేదీలలో జరిపిన పరీక్షల తరువాత, "హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్" (హెచ్‌జీవీ), "మాన్యువరబుల్ రీ-ఎంట్రీ వెహికల్" (ఎంఏఆర్‌వీ) అనే క్షిపణులను విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తర కొరియా పేర్కొంది.

దీని అర్థమేమిటి?

ఈ ప్రాంతంలో అమెరికా, జపాన్‌లు మోహరిస్తున్న ఖరీదైన, సంక్లిష్టమైన క్షిపణి రక్షణ వ్యవస్థలను ఓడించగల సాంకేతికతను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తోందని అర్థం.

"అమెరికా పసిగట్టకుండా వేగంగా తప్పించుకోగలిగే, క్లిష్టతరమైన క్షిపణులను తయారుచేయడమే నార్త్ కొరియా లక్ష్యం అన్నది స్పష్టమవుతోంది" అని సెంటర్ ఫర్ ఏ న్యూ అమెరికన్ సెంచరీకి చెందిన డ్యూయెన్ కిమ్ అభిప్రాయపడ్డారు.

"శత్రు క్షిపణి రక్షణ వ్యవస్థను నిస్త్రాణం చేయడమే నార్త్ కొరియా అంతిమ లక్ష్యం. తేలు కొండి లాంటి నిరోధక వ్యవస్థను తయారుచేసుకోవాలని భావిస్తోంది" అని కిమ్ డోంగ్ యుప్ కూడా అంగీకరించారు.

తేలు తనను తాను కాపాడుకోవడానికి, ఎర వేసి దాడి చేయడానికి కూడా కొండిని ఉపయోగిస్తుంది. వీటిల్లో ఉత్తర కొరియా లక్ష్యమేది?

"ఉత్తర కొరియా ప్రధాన ఉద్దేశ్యం దాడి చేయడం కాదు, తమను తాము రక్షించుకోవడమే. వైవిధ్యమైన నిరోధక సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు ఆ దేశం ప్రయత్నిస్తోంది" అని ప్రొఫెసర్ కిమ్ అభిప్రాయపడ్డారు.

పలువురు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే, దక్షిణ కొరియా నుంచి లేదా అమెరికా నుంచి దాడులను తప్పించుకోవడానికి తగిన అణు సామర్థ్యాన్ని పెంచుకునే లక్ష్యానికి ఉత్తర కొరియా చాలా దూరంలో ఉంది.

కాగా, ఉత్తర కొరియాపై దాడి చేసే ఉద్దేశాలు తమకు లేవని ఈ రెండు దేశాలు స్పష్టం చేశాయి.

అయినప్పటికీ, ఈ చిన్న, పేద దేశం తమ జీడీపీలో సుమారు అయిదొంతులు మిలటరీపై ఎందుకు ఖర్చుపెడుతోంది?

తమను తాము రక్షించుకోవడానికి తగినన్ని ఆయుధాలు తమ వద్ద లేవని ఆ దేశం భావించడమే ఇందుకు కారణమని కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌లో పరిశోధకుడు అంకిత్ పాండా అభిప్రాయపడ్డారు.

"తమకు భద్రత లేదని కిమ్ జోంగ్ ఉన్ భావిస్తున్నారు. చైనా, రష్యా సహా ఆయన ఎవరినీ నమ్మడం లేదు. అందుకే మనం ఊహించిన దాని కన్నా ఎక్కువ సామర్థ్యాన్ని అభివృద్ధిపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు" అని అంకిత్ అన్నారు.

అయితే, ఇతర నిపుణులు అంకిత్ అభిప్రాయాలతో ఏకీభవించట్లేదు.

గత సంవత్సరం పరీక్షించిన కొత్త క్రూయిజ్ క్షిపణి చిత్రాలు

ఫొటో సోర్స్, KCNA

ఫొటో క్యాప్షన్, గత సంవత్సరం పరీక్షించిన కొత్త క్రూయిజ్ క్షిపణి చిత్రాలు

'నార్త్ కొరియా లక్ష్యాలు వేరు'

నార్త్ కొరియా తన అణు, క్షిపణి ప్రోగ్రాంల విషయంలో ఇంతకన్నా ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను కలిగి ఉందని దక్షిణ కొరియాలోని డోంగ్సియో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ బ్రియాన్ ఆర్ మైయర్స్ అంటున్నారు.

దక్షిణ కొరియాతో శాంతి ఒప్పందం, కొరియా ద్వీపకల్పం నుంచి అమెరికా ఉపసంహరణపై చర్చలు జరుపడానికి తన ఆయుధాగారాన్ని పరపతిగా ఉపయోగించాలనేది ఉత్తర కొరియా లక్ష్యమని ఆయన అభిప్రాయపడ్డారు. తరువాత, దక్షిణ కొరియాను జయించడం సులభమవుతుందని నార్త్ కొరియా భావిస్తోందని అన్నారు.

అయితే, స్వల్ప కాలంలో ఉత్తర కొరియాకు మరో లక్ష్యం కూడా ఉంది.

నార్త్ కొరియా ఇంతకన్నా ముందుకు వెళ్లాలంటే, తమ అణు, క్షిపణి కార్యక్రమాల కారణంగా ఐక్యరాజ్య సమితి విధించిన ఆంక్షలను ఎత్తివేయాలి. అది జరగలాంటే అమెరికాతో చర్చలు జరపాలి.

చారిత్రాకంగా ఉత్తర కొరియాకు అమెరికా దృష్టిని ఆకర్షించే మార్గం సంక్షోభాన్ని సృష్టించడం. అదే ఇప్పుడు జరుగుతోందని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు.

"అలా చూస్తే, నా వరకూ ఇది మంచి సంకేతమే. శాంతి చర్చలు ప్రారంభించడానికి ముందే వీలైనంత ఎక్కువ స్థాయిలో క్షిపణి పరీక్షలు జరపాలని కిమ్ జోంగ్ ఉన్ భావిస్తున్నారు. అలా చేయడం ద్వారా కచ్చితమైన రోడ్ మ్యాప్‌తో చర్చలు జరిపేందుకు జో బైడెన్ ముందుకొస్తారని ఆశిస్తున్నారు" అని దక్షిణ కొరియా జాతీయ భద్రతా సలహా బోర్డు సభ్యుడు కిమ్ యాంగ్‌జున్ అన్నారు.

ఇదే నిజమైతే, కిమ్ జోంగ్ ఉన్‌కు నిరాశ తప్పదు. ఎందుకంటే, మొదట, జో బైడెన్ యుక్రెయిన్ సంక్షోభంలో బిజీగా ఉన్నారు.

రెండు, ఉత్తర కొరియాతో చర్చలు జరపడానికి గత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కున్న ఉత్సాహంలో కొంచం కూడా జో బైడెన్‌కు లేదు.

"అజెండాలో తమకు చోటు కల్పించుకోవడం, ప్రాధాన్యతను పెంచుకోవడంలో ఉత్తర కొరియన్లు ఘటికులే. కానీ, జో బైడెన్, కిమ్ జోంగ్ ఉన్‌ను నిరంకుశుడిగా పేర్కొన్నారు. కిమ్‌తో స్నేహం వలన రాజకీయంగా బైడెన్‌కు ఒరిగేదేమీ లేదు. కాబట్టి బైడెన్ దృష్టిని ఆకర్షించడమే ఇప్పుడున్న పెద్ద సవాలు" అని అంకిత్ పాండా అన్నారు.

వీడియో క్యాప్షన్, ఉ.కొరియాతో యుద్ధం వస్తే పరిణామాలు ఎలా ఉండొచ్చనే అంశంపై అమెరికా నిపుణులు ఇద్దరు బీబీసీతో మాట్లాడారు.

సంక్షోభం సృష్టించడం నార్త్ కొరియాకు కొత్త కాదు

ఇదంతా కొత్తేం కాదు. గతంలో మనం చాలాసార్లు చూసినదే.

2010లో దక్షిణ కొరియా నౌకాదళ కొర్వెట్ చియోనాన్‌ను నార్త్ కొరియా ముంచింది. ఆపై కొన్ని నెలల తరువాత దక్షిణ కొరియా బయట ద్వీపాలలో ఒకదానిపై బాంబు దాడి చేయడం ప్రారంభించింది.

మళ్లీ 2017లో జపాన్ మీదుగా లాంగ్ రేంజ్ క్షిపణిని ప్రయోగించి, గువామ్‌పై దాడి చేస్తామని బెదిరించింది.

రాబోయే నెలల్లో ఇలాంటిదే మరొకటి జరగవచ్చు.

"మళ్లీ సంక్షోభం తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అమెరికా తమను సీరియస్‌గా తీసుకోవాలని నార్త్ కొరియా భావిస్తోంది. వాళ్ల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని, అమెరికా అధ్యక్షుడు దాన్ని గుర్తించాలని భావిస్తోంది. కానీ, నార్త్ కొరియా ఆశలు అంత తొందరగా నెరవేరుతాయని నేను భావించట్లేదు" అని అంకిత్ పాండా అన్నారు.

వీడియో క్యాప్షన్, ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు ప్రకటించే ఈమె ఎవరో తెలుసా!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)