రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా; వారంలో రెండోసారి

ఫొటో సోర్స్, AFP
ఉత్తర కొరియా రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం ఉత్తర కొరియా తూర్పు తీరంలో వోన్సన్ నగర సమీపం నుంచి బుధవారం తెల్లవారుఝామున వీటిని ప్రయోగించినట్లు చెప్పింది.
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం చేపట్టడం వారం రోజుల్లో ఇది రెండోసారి.
ఉత్తర, దక్షిణ కొరియాలను విభజించే 'డీమిలిటరైజ్డ్ జోన్ (డీఎంజడ్)'లో జూన్‌లో ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్-ఉన్, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సమావేశం తర్వాత గత వారం ఉత్తర కొరియా ఒకసారి క్షిపణి ప్రయోగం జరిపింది. ఆగస్టులో అమెరికాతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టదలచిన దక్షిణ కొరియాకు ఇదో గట్టి హెచ్చరిక అని అప్పుడు వ్యాఖ్యానించింది.
ఈ వార్షిక సైనిక విన్యాసాలపై ఇంతకుముందు ఆగ్రహం వ్యక్తంచేసిన ఉత్తర కొరియా, వీటిని యుద్ధ సన్నాహాలుగా భావిస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
బుధవారం నాటి క్షిపణి ప్రయోగం వోన్సన్ నౌకాశ్రయానికి సమీపంలోని కల్మా ప్రాంతం నుంచి జరిగింది. 20 నిమిషాల వ్యవధిలో ఉత్తర కొరియా రెండు క్షిపణులను ప్రయోగించింది.
క్షిపణులు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. గరిష్ఠంగా 30 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లాయి. తర్వాత జపాన్ సముద్రంలో పడ్డాయి. దీనిని 'తూర్పు సముద్రం' అని కూడా అంటారు.
గతంలో ప్రయోగించిన క్షిపణుల కన్నా ఈ క్షిపణులు భిన్నమైనవని దక్షిణ కొరియా రక్షణశాఖ మంత్రి జియోంగ్ కెయాంగ్-డూ చెప్పారు.
వీటి ప్రయోగం తర్వాత జపాన్ భద్రతపై ఎలాంటి ప్రభావమూ పడలేదని జపాన్ ప్రధానమంత్రి షింజో అబే స్పష్టం చేశారు.
ఈ ప్రయోగానికి ఆరు రోజుల ముందు రెండు స్వల్ప శ్రేణి క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించింది. ఒకటి సుమారు 690 కిలోమీటర్లు, మరొకటి 430 కిలోమీటర్ల దూరం వెళ్లాయి.
అణు నిరాయుధీకరణపై చర్చలు తిరిగి ప్రారంభించాలని కిమ్, ట్రంప్ జూన్‌లో జరిపిన సమావేశంలో అంగీకరించారు.

ఫొటో సోర్స్, Reuters
రద్దు డిమాండ్‌ను అంగీకరించని అమెరికా, దక్షిణ కొరియా
సంయుక్త సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా ఇంతకుముందు ఆగ్రహం వ్యక్తంచేసింది. నిరుడు ట్రంప్, కిమ్ తొలిసారి సమావేశమైనప్పుడు ఒక సంయుక్త ప్రకటనపై సంతకాలు చేశారని, ఈ ప్రకటన స్ఫూర్తికి ఈ విన్యాసాలు విరుద్ధమని తప్పుబట్టింది. అణు నిరాయుధీకరణ చర్చల పునఃప్రారంభాన్ని ఈ చర్య దెబ్బతీస్తుందని హెచ్చరించింది.
విన్యాసాలు రద్దు చేసుకోవాలన్న ఉత్తర కొరియా డిమాండ్‌ను అమెరికా, దక్షిణ కొరియా అంగీకరించలేదు. అయితే వీటి విస్తృతిని గణనీయంగా తగ్గించాయి.
ఈ విన్యాసాల దృష్ట్యా ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు కొనసాగిస్తూ వెళ్తుందని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే మేధోసంస్థ 'సెంటర్ ఫర్ నేషనల్ ఇంట్రెస్ట్'కు చెందిన హ్యారీ కజియానిస్ అభిప్రాయపడ్డారు. "సంయుక్త సైనిక విన్యాసాలను ఆపేయండి, లేదంటే మా సైనిక పాటవాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాం" అనే సందేశాన్ని ఉత్తర కొరియా పంపాలనుకొంటోందని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- టిక్‌టాక్ యాప్‌ను ప్రభుత్వం ఎందుకు నిషేధించాలనుకుంటోంది?
- అరటి పళ్లపై జీఎస్టీ ఎంత? రెస్టారెంట్లలో తింటే దేనికి పన్ను కట్టాలి? దేనికి అక్కర్లేదు?
- Man vs Wild: డిస్కవరీ చానల్ షోలో బియర్ గ్రిల్స్‌తో ప్రధాని మోదీ అరణ్యయాత్ర
- హైటెక్ వ్యవసాయం: ఆహార ఉత్పత్తుల దిగుబడిని పెంచడంలో టెక్నాలజీ పాత్ర ఏమిటి...
- ఆఫీస్‌లో టిక్‌టాక్ వీడియోలు తీసి పోస్ట్ చేసినందుకు 11 మంది ఉద్యోగులపై చర్యలు
- ఐఫోన్ వివాదం: వినియోగదారులకు క్షమాపణలు చెప్పిన యాపిల్ సంస్థ
- మెటికలు విరుచుకుంటే కీళ్లనొప్పులు వస్తాయా..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








