అరటి పళ్లపై జీఎస్టీ ఎంత? రెస్టారెంట్లలో తింటే దేనికి పన్ను కట్టాలి? దేనికి అక్కర్లేదు?

ఫొటో సోర్స్, twitter/RahulBose1
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇప్పుడు ఉత్తర భారతంలో ఇదే హాట్ టాపిక్. హిందీ హీరో, దర్శకుడు రాహుల్ బోస్‌కు చండీఘర్‌లోని ఓ స్టార్ హోటల్ రెండు అరటి పళ్లకు 442 రూపాయల 50 పైసలు వసూలు చేసింది. అందులో జీఎస్టీ కలిపి ఉంది.
దీనిపై ప్రశ్నిస్తూ అతను విడుదల చేసిన వీడియో వైరల్ అయింది. దీంతో ఇప్పుడు అరటిపళ్లు, జీఎస్టీలపై ఉత్తర భారతంలో సోషల్ మీడియా జోకులతో హోరెత్తింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆ జోకుల సంగతి పక్కన పెడితే, అసలు ఇంతకీ అరటి పళ్లపై ఎంత జీఎస్టీ వసూలు చేయవచ్చు? రెస్టారెంట్లలో వసూలు చేసే జీఎస్టీకి పరిమితులేంటి?
భోజనంపై జీఎస్టీ
మామూలుగా ఏ హోటల్లో అయినా ఏమైనా తింటే 5 శాతం పన్ను కట్టాలి. అంటే వంద రూపాయల భోజనం చేస్తే 5 రూపాయల జీఎస్టీ కట్టాలి.
అయితే సదరు రెస్టారెంటు ఏదైనా హోటల్ (లాడ్జింగ్) లోపల ఉండి, ఆ హోటల్‌లో గది ఒక రోజుకు 7,500 రూపాయల కంటే ఎక్కువ ధర ఉంటే మాత్రం అప్పుడు ఆ హోటల్లోని రెస్టారెంట్లో భోజనంపై 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు.
ఈ చండీఘర్ హోటల్లో రూముల ధర రోజుకు 7500 కంటే ఎక్కువ కాబట్టి వారు పనిలో పనిగా అరటి పండుకూ 18 శాతం టాక్స్ వేసి చేతులు కాల్చుకున్నారు.
వాస్తవానికి తాజా పళ్లు, కూరగాయలను జీఎస్టీ నుంచి మినహాయించారు.
పళ్లు, కూరగాయలు, ఉల్లి, వెల్లుల్లి, మాంసం, గుడ్లు, పాలపై పన్ను లేదు. అయితే ఏదైనా బ్రాండు ముద్ర వేసి అమ్మే మాంసంపై పన్ను 5 శాతం ఉంటుంది.
అలాగే కొన్ని రకాల నిల్వ ఉంచిన, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలపై 5%, 12% పన్నులు ఉన్నాయి. అలాగే చాక్లెట్, కోకా ఉత్పత్తులపై 18 శాతం, కూల్ డ్రింకులపై 28 శాతం జీఎస్టీ ఉంది.

జీఎస్టీతో తగ్గిన రెస్టారెంట్ పన్నులు
జీఎస్టీ ప్రారంభం అయిన కొత్తలో నాన్-ఏసీ రెస్టారెంటుకి 12 శాతం, ఏసీ రెస్టారెంటుకు 18 శాతం, స్టార్ హోటళ్లకు 28 శాతం పన్ను ఉండేది. తరువాత అది తీసేశారు. ఇప్పుడు ఏసీ-నాన్ ఏసీ తేడా లేకుండా 5 శాతానికి తగ్గించారు. ఇక 28 శాతం జీఎస్టీ స్లాబు స్థానంలో రూ.7500 కంటే ఎక్కువ రూమ్ రేటు ఉన్న హోటళ్లు 18 శాతం వసూలు చేసే రూల్ తెచ్చారు.
జీఎస్టీ వచ్చాక మిగతా వాటి ధరలు ఎలా ఉన్నా, రెస్టారెంట్లలో తినేవాటిపై పన్ను మాత్రం తగ్గింది. అంతకు ముందు వ్యాట్ (రాష్ట్రాన్ని బట్టి మారేది - ఆంధ్ర, తెలంగాణల్లో 14.5 శాతం), సర్వీస్ టాక్స్ (6 శాతం), అర శాతం కృషి కళ్యాణ్ సెస్, అర శాతం స్వచ్ఛ భారత్ సెస్ - ఇవన్నీ కలుపుకుని తిన్నదానిపై కట్టే పన్ను మొత్తం సుమారు 20 శాతం దాటేది. ఇప్పుడది 5 శాతానికి పడిపోయింది.
కాకపోతే జీఎస్టీ రాకముందు చాలా హోటళ్లు ఈ పన్నులు వసూలు చేసేవి కావు. ఇప్పుడు పక్కాగా వసూలు చేస్తున్నారు. అందువల్ల జీఎస్టీ వచ్చాక పన్ను పెరిగినట్టుగా అనిపించింది.
ఇక కాంపోజిట్ స్కీము ఉన్న రెస్టారెంట్లు మాత్రం అసలు పన్ను వసూలు చేయకూడదు. వారు ఒక్కో బిల్లుపై పన్ను వసూలు చేయకుండా మొత్తం టర్నోవరుపై జీఎస్టీ కడతారు. తాము కాంపోజిట్ స్కీములో ఉన్నామని, పన్ను వసూలు చేయబోమని ఇలాంటి హోటళ్లు బోర్డులు పెట్టాలి.
ఇక హోటళ్లలో ఫంక్షన్లు చేసినప్పుడు హాల్స్ తీసుకుని పెట్టే భోజనాలకు 18 శాతం వసూలు చేస్తారు. ఎందుకంటే అది మళ్లీ లగ్జరీ కిందకు వస్తుంది. ఔట్‌డోర్ కేటరింగులకు కూడా 18 శాతం వసూలు చేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
మరి మందు?
ప్రస్తుతానికి మద్యంపై జీఎస్టీ లేదు. పాత పద్ధతిలో వ్యాట్ కొనసాగుతోంది. కాబట్టి బార్లో మందు తాగినప్పుడు లిక్కరుపై పన్ను విడిగా, తినే వాటిపై పన్ను విడిగా చూపించాలి. లిక్కరు పన్ను రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. తినేదానిపై మాత్రం ముందు చెప్పుకున్న నిబంధనల ప్రకారమే 5 శాతం పన్ను ఉంటుంది. ఒకవేళ 7500 రూపాయల రూములు ఉన్న హోటళ్లలోని బార్ అయితే తినేవాటిపై కూడా 18 శాతం పన్ను వేయవచ్చు.
ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే...
ఫుడ్ ఆన్‌లైన్‌లో కొన్నా జీఎస్టీ యధావిధిగా ఉంటుంది. మీరు స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్ లేదా ఫుడ్ పాండా వంటి యాప్స్‌లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చారనుకుందాం. అందులో మీకు మూడు విషయాలు కనిపిస్తాయి. మీ భోజనం బిల్లు, దానిపై జీఎస్టీ, ఆన్‌లైన్ సంస్థ వసూలు చేసే డెలివరీ చార్జ్.
మీరు వంద రూపాయల భోజనం ఆర్డర్ చేస్తే 5 రూపాయల జీఎస్టీ, 25 రూపాయల డెలివరీ చార్జ్ ఉంటుంది. ఇందులో భోజనం ధర వంద రూపాయలూ హోటల్ వారికి, పన్ను 5 రూపాయలు హోటల్ వారి ద్వారా ప్రభుత్వానికీ వెళ్తాయి.
కానీ డెలివరీ అనేది ఒక సర్వీసు కదా. కాబట్టి దానికి కూడా జీఎస్టీ ఉంది. ఆ సర్వీసు పొందినందుకు 18 శాతం పన్ను కట్టాలి. మనం ఆ యాప్‌కి చెల్లించే డెలివరీ చార్జీలో ఈ పన్ను కలిసే ఉంటుంది. కాకపోతే పేమెంట్ చేసేప్పుడు అంత స్పష్టంగా కనపడదు. మీరు యాప్‌లో నుంచి ఇన్వాయిస్ (బిల్లు) డౌన్లోడ్ చేసి చూస్తే ఈ వివరాలు ఉంటాయి. సాధారణంగా డెలివరీ యాప్ కంపెనీలు ఈ జీఎస్టీని కలిపేసి రౌండ్ ఫిగర్ చేస్తుంటాయి. ఉదాహరణకు 21.19 డెలివరీ చార్జి అయితే దానిపై 18 శాతం అంటే, 3.81 జీఎస్టీ. మొత్తం కలిపితే 25 రూపాయలు వసూలు చేస్తారు.
సర్వీస్ చార్జ్ పన్ను కాదు. అది హోటల్ వారు వసూలు చేసుకునేది. దీనికీ ప్రభుత్వానికీ సంబంధం లేదు.
ఇవి కూడా చదవండి.
- పెట్రోల్ జీఎస్టీ పరిధిలోకి వస్తే ధర పెరుగుతుందా? తగ్గుతుందా?
- జీఎస్టీ రేట్ల తగ్గింపు జాబితా: దేనిపై ఎంత తగ్గిందంటే..
- ‘వైద్యుల్లో సగం మంది ఆదాయ పన్ను కట్టలేదు’
- ఇళ్ల కొనుగోళ్లపై జీఎస్టీ తగ్గింపుతో ఎవరికి లాభం?
- కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చిన 'ఆర్టికల్ 370' రద్దు సాధ్యమేనా?
- కశ్మీర్ లోయలో అదనపు బలగాల మోహరింపు దేనికి సంకేతం
- 11 ఏళ్ల హరిప్రియ ఐక్యూ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కన్నా ఎక్కువ.. అసలు ఐక్యూను ఎలా కొలుస్తారు?
- ముత్తులక్ష్మి రెడ్డిపై గూగుల్ డూడుల్: దేశంలో తొలి మహిళా ఎమ్మెల్యే.. దేవదాసీ వ్యవస్థపై పోరాడిన మొదటి డాక్టర్
- కష్టాల్లో ఉన్న నెట్‌ఫ్లిక్స్‌ను భారతీయులు ఆదుకుంటారా
- Man vs Wild: డిస్కవరీ చానల్ షోలో బియర్ గ్రిల్స్‌తో ప్రధాని మోదీ అరణ్యయాత్ర
- భారత్‌లో రెట్టింపైన పులులు... ఇంతకూ వీటిని ఎలా లెక్కిస్తారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









