బయో డైవర్సిటీ డే: ఒక పక్షి తెలుగు గంగ ప్రాజెక్టు ఆపింది.. ఒక సాలీడు 'తెలంగాణ' పేరు పెట్టుకుంది

ఫొటో సోర్స్, iStock
- రచయిత, ప్రవీణ్ కాసం
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక 'కోడి' జాడ కోసం కడప జిల్లాలోని ఫారెస్టు అధికారులు అడవి అంతా జల్లెడ పడుతున్నారు. ఒక పిల్లి కోసం శేషాచలం కొండల్లో అణువణువు గాలిస్తున్నారు.
ఎందుకిదంతా.. ఏమిటీ వాటిలోని ప్రత్యేకత అంటే.. అవన్నీ అరుదుగా కనిపించే జీవాలు.. అంతరిస్తున్న మూగప్రాణులు.
అలాంటి వాటి మనుగడ కోసమే ప్రపంచమంతా ఏకమై ప్రత్యేకంగా సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది.
ప్రతీయేటా ఈ రోజున( మే 22) బయో డైవర్సిటీ డేగా జరుపుకుంటూ మానవ మనుగడకు జీవ వైవిధ్యం ఎంత ముఖ్యమో చాటిచెబుతోంది.
ఈ నేపథ్యంలో తెలుగు నేలపై ఉన్న కొన్ని అరుదైన జీవజాతుల గురించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బయో డైవర్సిటీ అధికారులు, రిటైర్డు ఐఎఫ్ఎస్ అధికారి శివకుమార్ తెలిపిన వివరాలు..
కలివి కోడి
ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో అరుదుగా కనిపించే ఒక రకం పక్షి ఇది.
ఇంగ్లిష్‌లో దీన్ని జెర్డాన్స్ కోర్సర్ అంటారు.
భారత పక్షి శాస్త్ర పితామహుడిగా పిలిచే సలీం అలీ కూడా ఈ పక్షి కోసం ఎంతో తపించారు.
1986 జనవరి 5న ఐతన్న అనే స్థానిక గొర్రెల కాపరి ఈ పక్షిని పట్టుకోవడంతో ప్రపంచమంతా దీని గురించి తెలిసింది.
ఆయన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం ఐతయ్యను వాచర్‌గా నియమించింది.
ఈ పక్షి ఆవాస ప్రాంతం నుంచే తెలుగు గంగ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుండటంపై పర్యావరణకారులు కోర్టుకు వెళ్లారు.
దీంతో ప్రభుత్వం తెలుగు గంగ ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ తర్వాత ప్రాజెక్టును దారి మళ్లించింది.
ప్రస్తుతం ఈ పక్షి ఉందా.. అంతరించిందా అనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి.
థామిసస్ తెలంగాణేన్సిస్
ఎండ్రకాయ (క్రాబ్)లా ప్రవర్తిస్తూ అడవుల్లో సంచరించే ఒక అరుదైన సాలీడు ఇది.
ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) పరిశోధకులు తెలంగాణలో ఇటీవల దీన్ని గుర్తించారు.
సాలీడులో ఉండే అనేక కుటుంబాలతో పోల్చి చూసి అధ్యయనం చేసిన తర్వాత దీన్ని ప్రత్యేకమైన సాలీడుగా నిర్ధారించారు.
అందుకే దీనికి థామిసస్ తెలంగాణేన్సిస్ అని తెలంగాణ రాష్ట్రం పేరు వచ్చేలా పెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
పునుగుపిల్లి
తిరుమల వేంకటేశ్వరస్వామి పూజాదికాల్లో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న అరుదైన జీవి.
దీని తైలాన్ని శ్రీవారి పూజాదికాల్లో ఉపయోగిస్తుంటారు.
శేషాచలం అడవుల్లో అరుదుగా కనిపించే ఈ జీవి అంతరించిపోతున్న దశలో ఉంది.
తన గ్రంథుల నుంచి అరుదైన సుగంధ ద్రవ్యాలను వెదజల్లడం దీని ప్రత్యేకత.
దీని తైలాన్ని ఒంటి నొప్పులను తగ్గించే మందుగా కూడా వినియోగిస్తుంటారు.
ఇది తిని విసర్జించిన కాఫీ గింజలకు మార్కెట్‌లో భారీ డిమాండ్ ఉంది.
బట్టమేకల పక్షి
కర్నూలు జిల్లా రోళ్లపాడులో మాత్రమే కనిపించే అరుదైన జీవి.
పొడవైన మెడ, మీటరు వరకు పొడువు ఉండే ఈ పక్షి అంతరించిపోయే దశకు చేరుతోంది.
రైతు నేస్తంగా దీనికి పేరుంది. పంటలోని క్రిమికీటకాలను తినేస్తూ పంటసంరక్షణలో ఇది ఉపయోగపడుతుంది.
దీని సంరక్షణ కోసం ప్రభుత్వం రోళ్లపాడు ప్రాంతాన్ని బట్టమేకల పక్షి సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
దేవాంగు పిల్లి
శేషాచలం అడువుల్లో కనిపించే మరో అరుదైన జీవి.
పేరులో పిల్లి ఉన్నా ఇది కోతి జాతికి చెందినది.
రాత్రివేళలో సంచరిస్తూ కీటకాలను తింటూ చెట్ల కొమ్మల మీద ఉంటుంది.
బంగారుబల్లి
తిరుమల కొండల్లో ఉండే మరో అరుదైన జీవి. దీన్ని ఆంగ్లంలో గోల్డెన్ గేకోగా పిలుస్తారు.
రాత్రిళ్లు మాత్రమే ఇది సంచరిస్తుంది. ఎక్కువగా రాళ్ల అంచుల్లో చీకటి ప్రదేశాల్లోనే ఉంటుంది.
వీటి శబ్ధం చాలా వింతగా ఉంటుంది.
కొండగొర్రె
కేవలం దక్కన్ పీఠభూమిలో మాత్రమే కనిపించే అరుదైన జీవి.
తలపై నాలుగు కొమ్ములు ఉండటం దీని ప్రత్యేకత.
ముందు కొమ్ములు పెద్దగా, వెనుక కొమ్ములు చాలా చిన్నగా ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
- ‘నా న్యూడ్ చిత్రాలు గీశాక, నా కాళ్లకు నమస్కరిస్తారు’
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- భగత్ సింగ్ పిస్టల్ 85 ఏళ్ల తర్వాత ఎలా దొరికింది?
- మహారాష్ట్ర: కరెంట్ బిల్లు చూసి ఆత్మహత్య చేసుకున్న కూరగాయల వ్యాపారి
- #BBCSpecial : ప్లాస్టిక్ ఆవులు! ‘మారాల్సింది మనుషులే.. నోరులేని జీవాలు కాదు’
- పులులు, ఎలుగుబంట్లు, మొసళ్లు ఈయన నేస్తాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








