మహారాష్ట్ర: కరెంట్ బిల్లు చూసి ఆత్మహత్య చేసుకున్న కూరగాయల వ్యాపారి

ఫొటో సోర్స్, Ameya Pathak/BBC
- రచయిత, అమేయా పాఠక్
- హోదా, ఔరంగాబాద్(మహారాష్ట్ర), బీబీసీ కోసం
కరెంట్ బిల్లు మహారాష్ట్రలో ఒకరి ప్రాణం తీసింది.
ఔరంగాబాద్‌కు చెందిన జగన్నాథ్ షెల్కే(36) కూరగాయల వ్యాపారి. కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
మార్చికి సంబంధించి ఆయన ఇంటికి రూ.8.64 లక్షల కరెంటు బిల్లు వచ్చింది.
మహారాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ ఎమ్‌ఎస్‌డీసీఎల్.. ఏప్రిల్ చివరి వారంలో రూ.8.64 లక్షల బిల్లును షెల్కే ఇంటికి పంపింది.
కరెంటు బిల్లు చూసి జగన్నాథ్ కంగారుపడ్డారు.
అంత బిల్లు ఎలా వచ్చిందని విద్యుత్ అధికారులను అడిగారు.
61,178 యూనిట్ల విద్యుత్‌ను వాడినందుకు ఇంత బిల్లు వచ్చిందని అధికారులు షెల్కేకు వివరణ ఇచ్చారు.
తాను వాడుకోలేదని చెప్పినా వారు పెద్దగా పట్టించుకోలేదు.
పండ్లిక్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భరత్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఫొటో సోర్స్, Ameya Pathak/BBC
"మొత్తం బిల్లు కడతావా.. ఆస్తి స్వాధీనం చేసుకోమంటావా"
బిల్లు మొత్తం కట్టాల్సిందేనని అధికారులు తేల్చిచెప్పారు. అంత డబ్బు జగన్నాథ్ వద్ద లేదు. ఏం చేయాలో ఆతనికి తోచలేదు.
'కరెంట్ బిల్లు విషయమై నా సోదరుడు చాలాసార్లు విద్యుత్ అధికారులను కలిశారు. కానీ, ఫలితం లేదు. దీంతో చాలా ఆవేదనకు గురయ్యారు. మానసిక వేదనతో గురువారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు' అని మృతుడి బంధువు ఒకరు బీబీసీకి తెలిపారు.
కూరగాయల వ్యాపారి ప్రాణం పోయిన తర్వాత అధికారులు యూనిట్ల లెక్క తేల్చారు.
యూనిట్ల రీడింగ్‌లో తప్పు జరిగిందని గుర్తించారు.
వాస్తవంగా 6,117.8 యూనిట్లు వాడుకుంటే, దాన్ని 61,178 యూనిట్ల వాడుకున్నట్లు చూపించారు.
అంటే 6,117 తర్వాత ఉండాల్సిన చుక్క (దశాంశ బిందువు)ను తీసేశారు. దాంతో 6,117.8 యూనిట్లు కాస్త 61,178 యూనిట్లుగా మారిపోయాయి.
2800 రూపాయల బిల్లు ఎనిమిది లక్షల అరవై నాలుగు వేలైంది.
కరెంట్ బిల్లు కట్టే స్థోమత లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు జగన్నాథ్ తన సూసైడ్ లేఖలో పేర్కొన్నారు.
మృతదేహం వద్ద లభించిన ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కరెంట్ బిల్లు చూసి మానసిక వేదనకు గురయ్యాయని ఆ లేఖలో రాసుంది.

ఫొటో సోర్స్, Ameya Pathak/BBC
"అధికారులే నా సోదరుడ్ని చంపేశారు"
'అన్యాయంగా లక్షల రూపాయిల బిల్లును విద్యుత్ సిబ్బంది పంపడంతోనే జగన్నాథ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 8 రోజుల కిందట అతను నాకు ఫోన్ చేశారు. విద్యుత్ బిల్లుపై ఆందోళనగా ఉన్నట్లు చెప్పారు. తన ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని అధికారులు హెచ్చరించారని నాతో చెప్పారు. నా సోదరుడి కుటుంబానికి న్యాయం చేయాలి" అని జగన్నాథ్ సోదరుడు విఠల్ షెల్కే బీబీసీకి చెప్పారు.
"రెండు నెలల కిందటే మా అక్క పెళ్లైంది. తమ్ముడు, నేను చదువుకోడానికి ఫీజులు కూడా కట్టాలి. నాన్న ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ స్థితిలో లక్షల రూపాయిల కరెంట్ బిల్లు వచ్చింది. అదే ఆయనను షాక్‌కు గురిచేసింది. ఇది వ్యవస్థ వైఫల్యం" అని జగన్నాథ్ కూతురు అశ్విని బీబీసీతో చెప్పారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మృతదేహాన్ని తరలించడాన్ని కూడా వారు అడ్డుకున్నారు.
"బాధితుల ఫిర్యాదు మేరకు ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఐపీసీ సెక్షన్ 306 కింద బాధ్యులైన అధికారులపై కేసు నమోదు చేశాం. పూర్తి స్థాయి విచారణ అనంతరం తగిన చర్యలు చేపడుతామని" పండ్లిక్‌నగర్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ లక్ష్మీకాంత్ బీబీసీతో చెప్పారు.
జగన్నాథ్ ఆత్మహత్య లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎమ్‌ఎస్‌డీసీఎల్ అధికారులు స్పందించారు.
జగన్నాథ్ షెల్కేకు వచ్చిన బిల్లులో తప్పు దొర్లింది. ఈ ఘటనకు అకౌంట్ అసిస్టెంట్ బాధ్యుడని, అతనిపై చర్యలు తీసుకున్నామని ఎమ్‌ఎస్‌డీసీఎల్ సీనియర్ ఇంజినీర్ సురేశ్ గణేష్కర్ బీబీసీకి తెలిపారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించారని విద్యుత్ కార్యాలయంలోని అకౌంట్ అసిస్టెంట్ సుశీల్ కాశీనాథ్ కోలీను సస్పెండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









