ఒక్క వారంలో ముగ్గురు బాలికలపై అత్యాచారం, సజీవ దహనం

ఫొటో సోర్స్, AFP
16 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి ఆమెను తన ఇంట్లోనే తగులబెట్టిన దారుణం మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో జరిగింది.
తనపై జరిగిన అత్యాచారం గురించి ఇంట్లో చెబుతానని బాధితురాలు అనడంతో నిందితుడు ఆమెను అక్కడికక్కడే సజీవదహనం చేసి హత్య చేశారని పోలీసులు తెలిపారు.
సాగర్ జిల్లా బాంద్రీ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ కమల్ ఠాకూర్ స్థానిక జర్నలిస్టు షురేహ్ నియాజీతో మాట్లాడుతూ, "ఘటన సమయంలో బాధితురాలి తల్లిదండ్రులు ఇంట్లో లేరు. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం" అని తెలిపారు.
రాష్ట్ర హోంమంత్రి భూపేంద్రసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
గత ఆరు నెలల్లో ఇక్కడ ఇలాంటి అత్యాచార ఘటనలు జరగడం నాల్గోసారి అని స్థానికులు చెబుతున్నారు.
మారోవైపు ఝార్ఖండ్‌లో మైనర్ బాలికపై అత్యాచారం చేసి సజీవ దహనం చేసిన ఘటనలు రెండు జరిగాయి. ఒక ఘటనలో బాలికపై నిందితులు అత్యాచారం చేసి ఆమెను సజీవంగా తగులబెట్టారు. దాంతో ఆమె చనిపోయింది. మరొక ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది.
ఇదే రాష్ట్రంలో పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఓ 17 ఏళ్ల యువతికి నిప్పంటించారు. ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC
మరో ఘటనలో 16 ఏళ్ల యువతి తనపై జరిగిన అత్యాచారం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఆమెను సజీవంగా కాల్చేశారు.
అత్యాచారంపై బాధితురాలి కుటుంబం మొదటి స్థానిక పంచాయతీ పెద్దలను ఆశ్రయించింది.
అయితే, నిందితుడికి జరిమానా విధిస్తూ పంచాయతీ తీర్పు చెప్పింది. దీంతో ఫిర్యాదు చేసిన బాధితురాలి కుటుంబంపై నిందితుడు దాడికి దిగాడు.
కాగా, పైన పేర్కొన్న మధ్యప్రదేశ్ ఘటనలో నిందితుడు రవి చంద్ర(28)ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, DIBYANGSHU SARKAR/AFP/GETTY IMAGES
ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం..
ఇటీవల భారత్‌లో అత్యాచారాల సంఖ్య బాగా పెరుగుతోంది.
"ఆధిక్యతను చాటుకోవడానికి, బలహీనమైన సముదాయాలను భయపెట్టడానికి భారత్‌లో రేప్‌ను ఓ ఆయుధంగా వాడుకునే ధోరణి బాగా పెరిగిపోయింది" అని బీబీసీ పాత్రికేయుడు సౌతిక్ బిశ్వాస్ తన ఇటీవలి వ్యాసంలో అభిప్రాయపడ్డారు.
ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని కఠువాలో 8 ఏళ్ల చిన్నారిపై కొందరు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ముస్లిం గుజ్జర్ సముదాయానికి చెందిన ఆ చిన్నారి వారం రోజుల తర్వాత తన ఇంటి సమీపంలో శవమై కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి.
మరోవైపు అధికార బీజేపీ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు నిందితులకు మద్దతుగా ర్యాలీలు తీశారు. వారి అరెస్టులను నిరసిస్తూ అతివాద హిందూ సంస్థలు ఆందోళనకు దిగాయి.
మరో ఘటనలో 16 ఏళ్ల యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు అభియోగాలు రావడంతో ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన సీబీఐ కస్టడీలో ఉన్నారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని సెంగర్ ఆరోపించారు.

2012లో దిల్లీలో 'నిర్భయ' ఘటన జరిగినప్పుడు దేశవ్యాప్తంగా అత్యాచారాల ఘటనకు వ్యతిరేకంగా ప్రజాందోళన వెల్లువెత్తింది.
ఈ ఘటనలో నిందితులైన నలుగురికి కోర్టు మరణ శిక్ష విధించింది.
నాటి యూపీఏ ప్రభుత్వం అత్యాచార ఘటనలపై విచారణకు కొత్త చట్టాలను తీసుకొచ్చింది. అయినప్పటికీ దేశంలో ఇలాంటి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








