ఇరాన్ పశ్చిమాసియాలోని ముస్లిం దేశాలపై ఎందుకు దాడి చేస్తోంది?

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్‌పై జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కార్యాలయం చుట్టూ ఉన్న ప్రాంతాలను కూడా అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల తర్వాత ఇరాన్ పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.
"బహ్రెయిన్‌లోని ఒక అమెరికా నౌకా స్థావరంపై దాడి చేశాం. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున చేస్తున్న నిరంతర దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ ఈ ప్రాంతమంతటా దాడులు ప్రారంభించింది" అని ఇరాన్ సైన్యం తెలిపింది.
" అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా 'ట్రూత్‌ఫుల్ ప్రామిస్ 4' ఆపరేషన్ కింద అమెరికా స్థావరాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటున్నట్టు" ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్‌జీసీ) ఒక ప్రకటనలో తెలిపింది.
పశ్చిమాసియాలో ఉన్న తన పౌరులకు అమెరికా హెచ్చరిక జారీ చేసింది.
''ఇళ్లల్లో సురక్షితంగా ఉండాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దోహా, బహ్రెయిన్‌లోని తన పౌరులను అమెరికా ప్రభుత్వం కోరుతోంది" అని అమెరికా తన ప్రకటనలో పేర్కొంది.


పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడులు
ఇరాన్ ఆత్మరక్షణ కోసం అన్ని సైనిక మార్గాలను ఉపయోగిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అన్నారు.
సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఇరాక్ వంటి దేశాలలోని తన సహచరులకు అరాఘ్చి ఫోన్ చేసినట్టు ఒక ప్రకటనలో తెలిపారు.
ఇరాన్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి "ఆత్మరక్షణకు చట్టబద్ధమైన హక్కు కింద తన రక్షణ, సైనిక సామర్థ్యాలన్నింటినీ" ఉపయోగిస్తుందని అరాఘ్చి చెప్పినట్టు ప్రకటనలో ఉంది.
ఆ దేశాలు తమ స్థావరాలను, భూభాగాలను దాడుల కోసం అమెరికా, ఇజ్రాయెల్ దుర్వినియోగం చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాటిదేనని కూడా అరాఘ్చి చెప్పినట్టు ఆ ప్రకటనలో ఉంది.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఈ ప్రకటన చేయడానికి ముందు, ఖతార్ రాజధాని దోహాలో దాడులు, సైరన్ల శబ్దం వినిపించింది.
"దేశాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన అనేక దాడులను విజయవంతంగా తిప్పికొట్టాం" అని ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది.
"అమెరికా తయారు చేసిన పేట్రియాట్ బ్యాటరీ ఇరాన్ క్షిపణిని అడ్డగించింది" అని ఖతార్ అధికారి ఒకరు ఏఎఫ్‌పీకి తెలిపారు.
ఖతార్ రాజధాని దోహా సమీపంలోని అల్ ఉదీద్ వైమానిక స్థావరం పశ్చిమాసియాలో అమెరికా సెంట్రల్ కమాండ్ వైమానిక కార్యకలాపాలకు ప్రధాన కార్యాలయం.
కువైట్‌లోని ఒక హైవేపై తీసిన చిత్రాలు బీబీసీకి లభించాయి. దాడి జరిగినట్టు ఆరోపించిన ప్రాంతంలో, దాడి తర్వాతి పరిస్థితులు ఆ ఫోటోల్లో ఉన్నాయి. ఓ కాలిపోయిన ట్రక్కు కూడా వాటిలో ఉంది.
అంతకుముందు, కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి కల్నల్ సౌద్ అబ్దుల్ అజీజ్ అల్-అత్వాన్ ఫేస్‌బుక్ లో ఓ పోస్ట్ చేశారు.
"అలీ అల్-సలేం వైమానిక స్థావరం(అమెరికా వైమానిక దళం ఉన్న ప్రాంతం) లక్ష్యంగా అనేక బాలిస్టిక్ క్షిపణులతో దాడి జరిగింది. కానీ, కువైట్ వైమానిక దళాలు వాటిని విజయవంతంగా అడ్డుకున్నాయి" అని అన్నారు.

బహ్రెయిన్, యూఏఈ ఏమన్నాయంటే...
బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ 'ఎక్స్'లో ఎమర్జెన్సీ సైరన్ సమాచారాన్ని పోస్ట్ చేసింది. పౌరులు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని బహ్రెయిన్ కూడా విజ్ఞప్తి చేసింది.
బహ్రెయిన్‌లో ఉన్న అమెరికా నేవీ 5వ ఫ్లీట్ సర్వీస్ సెంటర్‌పై క్షిపణి దాడి జరిగినట్టు బహ్రెయిన్‌లోని నేషనల్ కమ్యూనికేషన్ సెంటర్ తెలిపింది.
"మరింత సమాచారం తగిన సమయంలో అందిస్తాం. అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నాం'' అని ప్రకటనలో ఉంది.
అమెరికన్ నేవీకి చెందిన 'యునైటెడ్ స్టేట్స్ ఫిఫ్త్ ఫ్లీట్' ప్రధాన కార్యాలయం బహ్రెయిన్‌లో ఉంది. గల్ఫ్, ఎర్రసముద్రం, అరేబియా సముద్రం, హిందూమహాసముద్రంలోని కొన్ని ప్రాంతాలు ఈ ఫ్లీట్ పరిధిలో ఉంటాయి.
బహ్రెయిన్‌పై క్షిపణి, డ్రోన్ దాడులు జరిగే అవకాశం ఉందని, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని బహ్రెయిన్‌లోని అమెరికా కార్యాలయం దాడికి ముందే హెచ్చరించింది.
"ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసిందని'' యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటనలో తెలిపింది.
"యూఏఈ గగనతల రక్షణ వ్యవస్థలు క్షిపణులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయని, అనేక క్షిపణులను విజయవంతంగా అడ్డగించాయని" తెలిపింది.
"అబుదాబిలోని ఒక నివాస ప్రాంతంలో కొంత ఆస్తి నష్టం వాటిల్లింది. ఆసియన్ ఒకరు మరణించారు" అని యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది ఉద్రిక్తతలను పెంచే చర్య అని ఆరోపించింది. ప్రతీకారం తీర్చుకునే హక్కు తమకు ఉందని తెలిపింది.
అబుదాబిలో కూడా అమెరికా సైనిక స్థావరం ఉంది. యూఏఈ రాజధాని అబుదాబికి దక్షిణాన అల్ దఫ్రా అమెరికా వైమానిక స్థావరం ఉంది.
అల్ దఫ్రా ఎయిర్ బేస్ నుంచి అమెరికా వైమానిక దళం, యూఏఈ వైమానిక దళంతో కలిసి పనిచేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి?
పశ్చిమాసియాలో అనేక అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. బహ్రెయిన్ అమెరికా నేవీ ఐదవ నౌకాదళానికి ప్రధాన కార్యాలయం. ఇది గల్ఫ్, చుట్టుపక్కల జలాల్లో కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది.
ఖతార్ రాజధాని దోహా సమీపంలోని అల్ ఉదీద్ వైమానిక స్థావరం పశ్చిమాసియాలో అమెరికా సెంట్రల్ కమాండ్ వైమానిక కార్యకలాపాలకు ప్రధాన కార్యాలయం.
ఇది పశ్చిమాసియాలో అతిపెద్ద అమెరికా వైమానిక స్థావరం. ఇక్కడ దాదాపు 10 వేల మంది అమెరికా సైనికులు ఉన్నారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అల్ దఫ్రా యూఎస్ ఎయిర్ బేస్ కూడా యూఎస్ ఎయిర్ ఫోర్స్‌కు ముఖ్యమైన స్థావరం.
దుబయ్‌లోని జెబెల్ అలీ ఓడరేవు అధికారిక అమెరికా సైనిక స్థావరం కాదు. కానీ, ఈ ప్రాంతంలోని ప్రధాన అమెరికా నేవీ ఓడరేవు.
ఇరాక్‌లోని ఐన్ అల్-అసద్ వైమానిక స్థావరంలో అమెరికా భాగస్వామ్యం ఉంది. ఉత్తర ఇరాక్‌లోని ఎర్బిల్ వైమానిక స్థావరం కూడా ఈ ప్రాంతంలో కీలకమైన అమెరికా స్థావరం.
సౌదీ అరేబియాలో 2,300కు పైగా అమెరికా సైనికులు సౌదీ ప్రభుత్వంతో కలిసి గగనతల, క్షిపణి రక్షణ భాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం అమెరికా సైనిక కార్యకలాపాలకు కీలకమైన ప్రదేశం.
జోర్డాన్‌లోని లెవాంట్ ప్రాంతంలో అమెరికా ఎయిర్ ఫోర్సెస్ సెంట్రల్ 332వ ఎయిర్ ఎక్స్‌పెడిషనరీ వింగ్ కార్యకలాపాలకు మువాఫాక్ అల్ సాల్టి ఎయిర్ బేస్ కీలకం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













