సముద్రగుప్త: 'ఇండియన్ నెపోలియన్'గా పేరున్న ఈ చక్రవర్తి రాజ్యంలో అన్నీ బంగారు నాణేలే ఎందుకు ఉండేవి?

ఫొటో సోర్స్, museumsofindia.gov.in
- రచయిత, రెహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
వయసు మళ్లడంతో ఒకటో చంద్రగుప్తుడు సింహాసనాన్ని తన కొడుకు సముద్రగుప్తుడికి అప్పగించాడు. అయితే చంద్రగుప్తుడికి సముద్రగుప్తుడు పెద్ద కొడుకు కాదు. అయినా రాజ్యాన్ని ఇచ్చాడు.
తండ్రి నమ్మకాన్ని నిలబెడుతూ, సరైన వారసుడిని తానేనని నిరూపించుకున్నాడు సముద్రగుప్తుడు. నిజాయితీ, ధైర్యం, ధర్మబుద్ధితో తండ్రి మనసును గెలుచుకున్నాడని చరిత్రకారులు ఆయన గురించి చెబుతారు. రాజ్యా పాలనను చంద్రగుప్తుడు తన కొడుకుకు అందించిన విధానం అలహాబాద్ శిలా శాసనాల్లో స్పష్టంగా వివరించి ఉంది.
''సముద్రగుప్తుడిని ప్రేమతో ఆలింగనం చేసుకున్న చంద్రగుప్తుడు.. 'నువ్వు చాలా గొప్ప మనసున్న వ్యక్తివి' అన్నాడు. చంద్రగుప్తుడు ఈ మాటలు అన్నప్పుడు, ఆయన శరీరంలోని రోమాలు అంతులేని అనురాగంతో నిక్కబొడుచుకున్నాయి'' అని ఆ శాసనాల్లో ఉంది.
''ఈ ప్రకటన వచ్చిన తర్వాత.. కొంతమంది సభికులకు పట్టలేనంత ఆనందం కలగగా.. కొందరు నిరాశ పడ్డారు. చంద్రగుప్తుడు చెమ్మగిల్లిన కళ్లతో కొడుకు సముద్రగుప్తుడిని చూసి, 'ప్రపంచాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇక నీది' అని అన్నాడు.
సముద్రగుప్తుడిని వారసుడిగా చంద్రగుప్తుడు ఎంపిక చేయడంలో ఎలాంటి సందేహం లేనప్పటికీ...కొందరు ఆధునిక చరిత్రకారులు మాత్రం, చక్రవర్తిగా మారే సమయంలో పోటీదారుల నుంచి సముద్ర గుప్తుడు కొంత సంఘర్షణ ఎదుర్కోవాల్సి వచ్చిందని భావించారు.

సముద్రగుప్త అనేది పేరా? బిరుదా?
సముద్రగుప్తుడిపై పోటీదారులుగా మొదట వినిపించిన పేరు కాచ్. ఈయన ఒకటో చంద్రగుప్తుడికి పెద్ద కొడుకు.
కాచ్ పేరుతో బంగారు నాణేలు లభ్యం కావడంతో, ఆయన కొంతకాలం సింహాసనాన్ని అధిష్టించి ఉండొచ్చని కొందరు చరిత్రకారులు భావిస్తారు. అయితే, ఆయన ఉనికిపై చరిత్రకారుల్లో ఏకాభిప్రాయం లేదు.
''ఇంపీరియల్ హిస్టరీ ఆఫ్ ఇండియా'' అనే పుస్తకంలో కె.పి జయస్వాల్ రాసిన వివరాల్లో.. ''సముద్రగుప్తుడిపై తిరుగుబాటు చేసిన సోదరుడు భష్మ్ మరో పేరే కాచ్'' అని పేర్కొన్నారు.
కాచ్, భష్మ్ ఇద్దరూ ఒకే వ్యక్తులని, గుప్త సింహాసనాన్ని దక్కించుకునేందుకు సముద్ర గుప్తుడిపై భష్మ్ పోరాడారని చరిత్రకారులు పరమేశ్వరీ లాల్ గుప్తా, శ్రీ రామ్‌గోయల్, లాల్తా ప్రసాద్ పాండెే భావించారు.
అయితే సముద్రగుప్త అనేది కూడా ఒక వ్యక్తి పేరు కాదని, అదొక బిరుదు అని కొన్నివర్గాల్లో వినిపించేది.
'ద గుప్తా ఎంపైర్' అనే పేరుతో రాధాకుముద్ ముఖర్జీ ఒక పుస్తకం రాశారు.
దానిలో పేర్కొన్న వివరాల్లో.. ‘‘సముద్ర తీరం వరకు ఎవరి సామ్రాజ్యమైతే విస్తరించి ఉంటుందో, వారి సామ్రాజ్యాన్ని సముద్రం రక్షిస్తుందనేది ఈ బిరుదు అర్థం. రెండో చంద్రగుప్తుడికి చెందిన మథుర శాసనాల్లో కూడా సముద్రగుప్తుడి కీర్తి ప్రతిష్ఠలు నాలుగు సముద్రాల వరకు విస్తరించాయి’’ అని ఉంది.

ఫొటో సోర్స్, Bhairavi
కవే కాదు మహా శక్తివంతుడు సముద్రగుప్తుడు
సముద్రగుప్తుడు 318 సంవత్సరంలో పుట్టినట్టు చెబుతారు చరిత్రకారులు. ఐదేళ్ల వయసులో లిపి, గణితంలో ప్రాథమిక విద్య అభ్యసించాడు. ఆ తర్వాత పరిపాలన, రాజనీతిపై శిక్షణ పొందాడు.
సముద్రగుప్తుడు అనేక శాస్త్ర గ్రంథాల్లో నిష్ణాతుడైన పండితుడని అలహాబాద్ శాసనాల ద్వారా వెల్లడైంది.
కవిత్వంలో ఆయన ప్రవేశం ఉంది. అందుకే ఆయనకు ‘కవిరాజ’ అనే బిరుదు కూడా వచ్చింది. ఆయన ఆస్థానంలో హరిషేణ, వాసుబంధు వంటి ప్రఖ్యాత సాహితీవేత్తలు ఉండేవారు.
అనేక నాణేలపై ఆయన వీణ వాయిస్తున్నట్లు ఉంటుంది. ధైర్యానికి ప్రతీకగా నిలిచాడు.
అలహాబాద్ శాసనాల్లో రాసిన వివరాల్లో, '''పర్శు'(గొడ్డలి), 'శర్'(బాణం), 'శంకు'(బల్లెం), 'శక్తి'(ఈటె), 'అసి'(ఖడ్గం),'తోమర్'(గద) వంటి ఆయుధాల కారణంగా ఏర్పడిన వందలాది గాయాల గుర్తులతో సముద్రగుప్తుడి శరీరం అత్యంత సౌందర్యంగా, అందంగా మారింది'' అని పేర్కొన్నారు.
సముద్రగుప్తుడిని అసాధారణమైన సామర్థ్యాలున్న వ్యక్తిగా కూడా చెబుతుంటారు.
ఎందుకంటే, యోధుడు, పాలకుడు, కవి, సంగీత విద్వాంసుడు, పరోపకారి వంటి ఎన్నో విశిష్ట లక్షణాలు ఆయనకు ఉన్నాయి.
మొదటి నుంచీ సముద్రగుప్తుడికి భారతదేశాన్ని రాజకీయంగా ఏకం చేసి, తన ఆధీనంలోకి తీసుకురావాలనే బలమైన ఆశయం ఉండేది. దానికోసం ఆయన తన జీవితాంతం కృషి చేశాడని చరిత్రకారులు చెబుతారు.

ఫొటో సోర్స్, Motilal Banarasidas
ఉత్తర, దక్షిణాది రాజుల విషయంలో భిన్నమైన విధానాలు
ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు.
కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు.
'' పాటలీపుత్ర (నేటి పట్నా) నుంచి ఈ రాష్ట్రాలను నియంత్రించడం అంత తేలిక కాకపోవడమే దీనికి కారణం కావొచ్చు. ఎందుకంటే, ఆ సమయంలో రవాణా, సమాచార సాధనాలు చాలా పరిమితం. ఇవి మాత్రమే కాక, పంజాబ్, తూర్పు రాజ్‌పుతానా, మాల్వాలకు చెందిన మారుమూల ప్రాంతాలకు ఆయన స్వయం ప్రతిపత్తి కల్పించారు. శకులు, కుషాణులు వంటి విదేశీ పాలకుల నుంచి కాపాడుకునేందుకు, ఈ రాజ్యాలను 'బఫర్ స్టేట్స్'గా ఉపయోగించేవారు'' అని 'సముద్రగుప్త: ఏ మిలిటరీ జీనియస్' అనే పుస్తకంలో సాథ్రోంగలా సంగటమ్ రాశారు.
సముద్ర గుప్తుడి కాలంలో పాటలీపుత్ర మరోసారి తన వైభవాన్ని పొందింది. తన పాలన అత్యున్నత దశలో ఉన్నప్పుడు, సముద్రగుప్తుడు మొత్తం గంగా లోయను నియంత్రించేవాడు. తూర్పు బెంగాల్, అస్సాం, నేపాల్ పాలకులు కూడా ఆయనకు పన్నులు, కానుకలు పంపించేవారు.
''సముద్రగుప్తుడి అధికారం అస్సాం నుంచి పంజాబ్ సరిహద్దుల వరకు విస్తరించింది. మౌర్యులు లాగానే ఏకీకృత సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించాలనుకున్నారు. ఉత్తర భారతంలోని 9 రాష్ట్రాలను ఆయన తన రాజ్యంలో విలీనం చేసుకున్నట్లు అలహాబాద్ శాసనాల్లో స్పష్టంగా ఉంది. అయితే, యుద్ధకాంక్ష కలిగిన రాజస్థానీ తెగలు, సరిహద్దు రాష్ట్రాలు ఆయనపట్ల తమకున్న గౌరవాన్ని వ్యక్తం చేస్తూనే, తమ స్వతంత్రను కొనసాగించాయి. దక్షిణాదిన కాంచీవరాన్ని ఆయన జయించారు. కానీ, పన్నులు చెల్లించిన తర్వాత, అక్కడి రాజులకు తిరిగి రాజ్యాన్ని అప్పగించారు'' అని 'ద వండర్ దట్ వాజ్ ఇండియా' అనే పుస్తకంలో ఎ.ఎల్. బాశమ్ రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
బంగారు నాణేలు చలామణి
సముద్రగుప్తుడి రాజ్యంలో కేవలం బంగారు నాణేలు మాత్రమే చలామణి అయ్యేవని, అసలు వెండి నాణేలు కనిపించేవి కాదని చరిత్రకారులు చెబుతున్నారు. దీనినిబట్టి ఆయన రాజ్యం ఎంత ధనిక రాజ్యంగా ఉండేదో అంచనా వేయొచ్చు.
''సముద్రగుప్తుడు ఎనిమిది రకాల నాణేలను ముద్రించారు. ఈ నాణేలకు వాడిన బంగారాన్ని ఆయన తన దండయాత్రల సమయంలో సేకరించారు'' అని రాధాకుముద్ ముఖర్జీ రాశారు.
భారత్ వెలుపల ఉన్న గాంధార, శ్రీలంక, కాబూల్ వంటి ఇతర రాజ్యాలతో కూడా సముద్రగుప్తుడు దౌత్య సంబంధాలను నిర్వహించేవారు. ఇది ఆయన అంతర్జాతీయ వైఖరిని తెలియజేస్తోంది.
తమిళ రాజ్యాలతో నేరుగా ఎలాంటి సంబంధాలను పెట్టుకోనప్పటికీ, శ్రీలంకతో మాత్రం సన్నిహిత సంబంధాలు ఉండేవి.
కేవలం గుప్త చక్రవర్తుల్లోనే కాక, భారత్‌లోని ఏ ఇతర చక్రవర్తులతో పోల్చిచూసినా.. ఎన్నో విషయాల్లో ఈయన వ్యక్తిత్వం గొప్పగా ఉంటుందని చరిత్రకారులు చెబుతారు.
ప్రఖ్యాత చరిత్రకారుడు డాక్టర్ రాధేశరణ్ తన "ఎంపరర్ సముద్రగుప్త" పుస్తకంలో ఇలా రాశారు.
"ఆయన తన కాలంలో ఒక ప్రత్యేకమైన చక్రవర్తి. ఆయన పని విధానం ఇతర చక్రవర్తుల కంటే ఆచరణాత్మకమైనది. ఆర్థికంగా, ఆయన సామ్రాజ్యం బహుశా ప్రపంచంలోనే అత్యంత సుసంపన్నమైనది" అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Bhairavi
‘ఒక్క యుద్ధాన్ని కూడా ఓడిపోలేదు’
తన కాలానికి మూడు శతాబ్దాల ముందు కుప్పకూలిన మౌర్య సామ్రాజ్యంతో సమానమైన ఒక శక్తివంతమైన సైన్యాన్ని పునర్నిర్మించిన ఘనత సముద్రగుప్తుడికే దక్కుతుంది.
తన జీవితమంతా మిలటరీ క్యాంపుల్లో, తన సైనికులతో గడిపాడు సముద్రగుప్తుడు.
సముద్రగుప్తుడిని 'నెపోలియన్ ఆఫ్ ఇండియా' (భారతదేశపు నెపోలియన్) అని డాక్టర్. విన్సెంట్ స్మిత్ అభివర్ణించారు. మిలటరీ కమాండర్‌కు ఉన్న అన్ని సామర్థ్యాలు, లక్షణాలు సముద్రగుప్తుడికి ఉన్నాయని ఆయన చెప్పారు.
వందలాది యుద్ధాలలో ఆయన పాల్గొన్నట్లు అలహాబాద్ శాసనాల్లో ఉంది. ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన లంక దీవుల వరకు, వాయువ్య భారత్ నుంచి తూర్పున బెంగాల్, అస్సాం, నేపాల్ వరకు సముద్రగుప్తుడు తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు.
భారత్‌లో ఆయనకెలాంటి ప్రత్యర్థులులేరని అలహాబాద్ శాసనాల్లో చాలా స్పష్టంగా ఉంది.
తన సామ్రాజ్యంలో చాలా ప్రాంతాలను స్వతంత్రంగా ఉండేందుకు ఆయన అనుమతించాడు. ఈ స్వతంత్ర ప్రాంతాలు చక్రవర్తి అధికారానికి గౌరవమిస్తూనే.. తమ అంతర్గత పాలనను స్వతంత్రంగా చేపట్టవచ్చు.
చరిత్రకారుడు బాలకృష్ణ గోవింద్ గోఖలే తన 'సముద్ర గుప్త: లైఫ్ అండ్ టైమ్స్' పుస్తకంలో ఇలా రాశారు. "నెపోలియన్ నిస్సందేహంగా ఒక సమర్థుడైన విజేతే. కానీ, ఇద్దరు చక్రవర్తుల సమకాలీన పరిస్థితులు, విజయాలు, లక్ష్యాలను పరిశీలించిన తర్వాత.. నెపోలియన్ కంటే సముద్రగుప్తుడు చాలా ముందున్నట్లు అనిపిస్తోంది. నెపోలియన్ మాదిరిగా కాకుండా.. సముద్రగుప్తుడు ఎప్పుడూ సైనికంగా ఓటమిని చూడలేదు. వాకాటకులపై తన పోరాటంలో ఆయన కొంచెం కష్టపడాల్సి వచ్చింది. కానీ, చివరికి విజయం సాధించారు" అని తన పుస్తకంలో పేర్కొన్నారు.
45 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత.. క్రీ.శ.380లో సముద్రగుప్తుడు తుది శ్వాస విడిచాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














