బంగ్లాదేశ్‌‌లోని భారత దౌత్యవేత్తల భార్యాపిల్లలు స్వదేశానికి.. బంగ్లాదేశ్ ఏమంది?

బంగ్లాదేశ్, తాత్కాలిక ప్రభుత్వం, విదేశాంగ మంత్రిత్వ శాఖ సలహాదారు, తౌహిద్ హుస్సేన్‌, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్

ఫొటో సోర్స్, @DrSJaishankar

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహాదారు తౌహిద్ హుస్సేన్‌తో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్. (ఫైల్ ఫోటో)
    • రచయిత, శుభజ్యోతి ఘోష్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత్ బంగ్లాదేశ్‌ను 'నాన్ ఫ్యామిలీ డిప్లొమేటిక్ పోస్టింగ్ డెస్టినేషన్స్' (కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్లని దౌత్య నియామక స్థలం)గా ప్రకటించాలని నిర్ణయించారన్నది బీబీసీకి అందిన సమాచారం.

అంటే.. బంగ్లాదేశ్‌లో నియమితులయ్యే భారత దౌత్యవేత్తలు, అధికారులు ఇకపై వారి జీవిత భాగస్వాములు, పిల్లలను తమతో తీసుకెళ్లలేరు.

ఇప్పటివరకు, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ 'నాన్-ఫ్యామిలీ' కేటగిరీని ఇరాక్, అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, దక్షిణ సూడాన్ వంటి కొన్ని దేశాలకు మాత్రమే వర్తింపజేసింది.

తాజా నిర్ణయంతో బంగ్లాదేశ్ కూడా ఈ జాబితాలో చేరింది.

బీబీసీకి అందిన సమాచారం ప్రకారం ఈ నిర్ణయం జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది.

బంగ్లాదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న భారత అధికారులకు ఈ మేరకు వారి జీవిత భాగస్వాములు, పిల్లలు జనవరి 8 నాటికి భారతదేశానికి తిరిగి రావాలని తెలియజేసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

పాఠశాలలో చదువుతున్న పిల్లలున్న అధికారులకు ఇందుకోసం అదనంగా ఏడు రోజుల సమయం ఇచ్చారు.

దీంతో గత గురువారం (జనవరి 15) నాటికి ఢాకా, చిట్టగాంగ్, ఖుల్నా, సిల్హెట్, రాజ్‌షాహీలో ఉన్న భారతీయ మిషన్లలో పనిచేస్తున్న అధికారుల కుటుంబాలు భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది.

ఈ నిర్ణయంపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇంకా ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు.

అయితే సౌత్ బ్లాక్‌లోని అనేక వర్గాలు బీబీసీ మాట్లాడినప్పుడు ఈ నిర్ణయాన్ని ధ్రువీకరించాయి.

బంగ్లాదేశ్‌,భారత్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా భారత్‌లో జరిగిన నిరసనలు(ఫైల్ ఫోటో)

"బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరిలో జరగనున్న సాధారణ ఎన్నికలకు ముందు అక్కడ భద్రత పరిస్థితులు మరింత క్షీణించే అవకాశం ఉందన్న ఆందోళనలతోనే ఈ చర్య తీసుకున్నారు. ఎందుకంటే ఇది హై కమిషన్ సిబ్బంది కుటుంబాలకు ప్రమాదంగా మారవచ్చు" అని బంగ్లాదేశ్‌లో భారత మాజీ హైకమిషనర్ పినాక్ రంజన్ చక్రవర్తి అభిప్రాయపడ్డారు.

"ఎన్నికలకు ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అసాధారణమేమీ కాదని నేను అనుకుంటున్నా. భారత పౌరుల కుటుంబాలను లేదా దౌత్య సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని హింస జరగవచ్చని భారతదేశానికి కొంత నిఘా సమాచారం అంది ఉండొచ్చు. అందుకే బంగ్లాదేశ్‌ను నాన్-ఫ్యామిలీ నియామక ప్రాంతంగా ప్రకటించారు" అని ఆయన బీబీసీతో అన్నారు.

"అంతేకాకుండా అవామీ లీగ్ వంటి ప్రధాన రాజకీయ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతించడం లేదు. ఈ నిర్ణయం గురించి చాలా వివాదాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఎన్నికలకు ముందు లేదా తరువాత హింస జరిగే అవకాశాన్ని తోసిపుచ్చలేం" అని ఆయన అన్నారు.

అయితే, ఈ నిర్ణయం తాత్కాలికమేనని చక్రవర్తి భావిస్తున్నారు.

"ఎన్నికల తర్వాత, ఏదో ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పరిస్థితులు స్థిరంగా మారితే, ఈ విధానాన్ని సమీక్షించవచ్చు. అధికారులు మళ్లీ వారి కుటుంబాలతో బంగ్లాదేశ్‌లో నివసించడానికి అనుమతి లభించవచ్చు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య ఒకరికొకరి దౌత్యవేత్తల భద్రతపై కొంతకాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయన్న విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి.

ఈ సమస్య రెండు దేశాలు ఒకరి హైకమిషనర్లను మరొకరు పిలిపించుకునే స్థాయికి చేరుకుంది.

డిసెంబర్ 20న.. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న వేధింపులను నిరసిస్తూ నిరసన తెలుపుతున్న ఒక సమూహం దిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషనర్ రియాజ్ హమీదుల్లా నివాసానికి చాలా దగ్గరగా వచ్చినట్లు ఆరోపణలున్నాయి.

ఈ తరువాత, బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారు తౌహిద్ హుస్సేన్ మాట్లాడుతూ.. దిల్లీలోని చాణక్యపురి వంటి అత్యంత సురక్షితమైన దౌత్య ప్రాంతంలో నిరసనకారులు అలా చేయడానికి అనుమతించినందునే వారు తమ హైకమిషనర్ నివాసానికి అంత దగ్గరగా చేరుకోగలిగారు అని అన్నారు.

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఆరోపణను తోసిపుచ్చింది.

బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద భద్రత ఉల్లంఘన ఆరోపణలను నిరాధారమని పేర్కొంటూ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటన విడుదల చేశారు.

షేక్ హసీనా, బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Getty Images

'అతిగా స్పందించారు'

ఈ సంఘటన జరిగిన వారంలోనే బంగ్లాదేశ్‌ను 'నాన్ ఫ్యామిలీ' దౌత్య స్థానంగా మార్చాలని భారత్ నిర్ణయించింది.

ఢాకాలో కనీసం రెండు పర్యాయాలు పనిచేసిన మరో మాజీ సీనియర్ భారత దౌత్యవేత్త దీనిపై మాట్లాడుతూ.. ఈ చర్య తనకు ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు.

"బంగ్లాదేశ్ చాలా ఏళ్లుగా అమెరికన్ దౌత్యవేత్తలకు 'నాన్ ఫ్యామిలీ' పోస్టింగానే ఉంది" అని ఆయన అన్నారు.

"2016లో ఢాకాలోని హోలీ ఆర్టిసాన్ బేకరీపై ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుంచి, బంగ్లాదేశ్‌లో ఉన్న అమెరికా దౌత్యవేత్తలు తమ జీవిత భాగస్వాములు, పిల్లలను తమతో తీసుకురావడానికి అనుమతిలేదు. వారిలో చాలా మంది ఈ నిర్ణయాన్ని మార్చడానికి తీవ్రంగా ప్రయత్నించారని నాకు తెలుసు, కానీ దాన్ని రద్దు చేయలేదు" అని ఆయన బీబీసీతో అన్నారు.

"అమెరికా సుమారు ఒక దశాబ్దం నుంచి ఈ నియమాన్ని అమల్లో ఉంచింది. అలా చూస్తే మనం ఇంకా ఇప్పుడు అమలు చేస్తున్నాం" అని ఆయన అన్నారు.

కాగా బంగ్లాదేశ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహాదారు తౌహిద్ హుస్సేన్ ‘బీబీసీ’ ప్రతినిధి ఇషాద్రిత లాహిరితో ఈ విషయంపై మాట్లాడుతూ.. "భారతీయుల భద్రతకు మేం భరోసా ఇవ్వలేకపోయాం అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు" అన్నారు.

"భారత్.. బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్‌తో సమాన వర్గంలో ఉంచుతుందా లేదా అనేది ఆ దేశ నిర్ణయం. ఇది విచారకరం, కానీ నేను వారి నిర్ణయాన్ని మార్చలేను. వారు ఇక్కడ సురక్షితంగా లేరని భావిస్తే, అలాగే చేయనివ్వండి. వారు ఇక్కడ భద్రతలోపాన్ని ఎదుర్కొన్న సందర్భమే లేదు" అని ఆయన అన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)