'యోనిలో పొగాకు పేస్ట్', పశ్చిమ ఆఫ్రికా మహిళలు ఈ డ్రగ్‌కు ఎందుకు బానిసలవుతున్నారు?

టబా ముద్ధ
ఫొటో క్యాప్షన్, టబా ముద్ధ
    • రచయిత, అజిజాత్ ఓలావోలువా
    • హోదా, సీనియర్ కరస్పాండెంట్
    • నుంచి, వెస్ట్ ఆఫ్రికా

(హెచ్చరిక: ఈ వార్తలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. 'టబా' అనుభవాలను వివరించిన వ్యక్తుల పేర్లు మార్చాం)

ఈ కథనంలోని మహిళ గుర్తింపును రహస్యంగా ఉంచడానికి మేం ఆమె పేరు మార్చాం. ఈ కథనంలో ఆమె పేరును మార్చి ‘ఐషాతు’ అని వ్యవహరిస్తున్నాం.

ఐషాతు.. గాంబియాలో నివసిస్తున్న ఒక వితంతువైన తల్లి.

తాను పదిహేనేళ్లుగా అప్పుడప్పుడు ‘టబా’ ఉపయోగించేదాన్నని.. చివరకు దానికి బానిస అయ్యానని ఆమె బీబీసీతో చెప్పారు.

పశ్చిమ ఆఫ్రికాలో పురుషులు, మహిళలు అనేక దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న పొగాకు పొడిని స్థానికంగా టబా అని అంటారు.

ముక్కుతో పీల్చడం, పొగ తాగడం, నోట్లో నమలడం వంటి పద్ధతుల్లో దీన్ని ఉపయోగిస్తుంటారు.

అయితే... ఐషాతు, ఇంకా అనేక మంది మహిళలు ‘టబా’ను రహస్యంగా కొనుగోలు చేస్తారు.

ఐషాతు, ఇంకా అనేక మంది మహిళలు పొగాకు పొడితో చేసిన పేస్ట్‌ను తమ యోనిలో మార్గంలో ఉంచుతారు.

ఐషాతు టబాను ఇలా ఉపయోగించడానికి బానిసైనట్లు చెప్పారు. అలా చేయడం వల్ల తాను జీవితంలో ఎంతగా నష్టపోయానో వివరించారు.

'టబా' వ్యతిరేక ప్రచారకర్తల సమావేశానికి హాజరైన ఐషాతును మేం ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లోని నర్స్ కార్యాలయం దగ్గర కలిశాం. తాను అసలు ఈ అలవాటును ఎందుకు మొదలుపెట్టానా అని ఎంతగానో పశ్చాత్తాపపడుతున్నానని చెప్పారు.

గాంబియా దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల నెట్‌వర్క్ ద్వారా 'టబా' రహస్యంగా విక్రయిస్తున్నారు.

ఇది స్థానిక మార్కెట్లలో విరివిగా లభిస్తోంది. ఎక్కువగా మహిళలే దీన్ని కొనడం, అమ్మడం చేస్తుంటారు.

గత కొన్నేళ్లలో 'టబా' అసలు రూపం మారిపోయింది. ఇప్పుడు ఈ పొగాకు పొడిలో వివిధ ఇతర పదార్థాలను కలిపి పేస్టులా తయారుచేస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఐషాతు

‘గర్భాశయ క్యాన్సర్ వచ్చింది’

తాను 2021లో గర్భం దాల్చినప్పుడు ఈ ‘టబా’ వాడకం ఆపేయాలన్న విషయం తనకు తెలుసని ఐషాతు చెప్పారు.

అంతకుముందు గర్భం దాల్చిన సమయాల్లో టబా వాడకం మానేసిన ఐషాతు ఈసారి మాత్రం మానలేదు.

ఫలితంగా తన గర్భం పోవడానికి టబాయే కారణమని ఆమె అన్నారు.

బిడ్డ మరణానికి 'టబా' వాడకమే ప్రత్యక్ష కారణమని ఐషాతు బలంగా నమ్ముతున్నారు.

గర్భంలోని బిడ్డ కదలికలు ఆగిపోయాయని ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్లారు.

"బిడ్డ చనిపోయిందని డాక్టర్ నాకు చెప్పారు. అందుకే వారు సిజేరియన్ చేయాల్సి వచ్చింది. బయటకు తీసినప్పుడు నా బిడ్డ చర్మం కాలిపోయినట్లుగా ఉంది. నేను వాడిన 'టబా' నా బిడ్డను చంపేసిందని అప్పుడే అర్థమైంది" అని ఐషాతు ఆవేదనతో చెప్పారు.

అయితే.. ఆమె చెప్పిన కారణం వైద్యపరంగా నిర్ధరణకాలేదు.

తాను 'టబా' ఉపయోగించిన ప్రతిసారీ తన యోని లోపల మంటగా అనిపించేదని ఐషాతు చెప్పారు.

బరువు తగ్గడానికి, గర్భందాల్చడానికి సహాయపడుతుందన్న నమ్మకంతో కొన్నేళ్ల క్రితం 'టబా' వాడటం మొదలుపెట్టినట్లు ఐషాతు చెప్పారు. కానీ, అది ఈ రెండింటికీ ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు.

"టబా మీ శరీరంలోకి చేరినప్పుడు, అది మిమ్మల్ని తన ఆధీనంలోకి తీసుకుంటుంది. మీకు నార్మల్‌గా అనిపించాలంటే దానిని వాడుతూనే ఉండాలి. టబా నాకు ఆనందాన్ని ఇచ్చింది, కానీ నాలో శృంగార కోరికను తగ్గించేసింది" అని ఐషాతు చెప్పారు.

"టబాకు బానిసయ్యాను, రోజుకు మూడు నాలుగు సార్లు దానిని యోనిలో రాసుకునేదానిని. బిడ్డను కోల్పోయిన తర్వాత టబా వాడటం మానేశాను. కానీ అప్పటికే నాకు గర్భాశయ క్యాన్సర్ ఉందనే విషయం నాకు తెలియదు" అని వివరించారు.

తనకు క్యాన్సర్ ఉన్నట్లు రెండేళ్ల క్రితమే నిర్ధరణ అయిందని ఆమె చెప్పారు.

'మూడు రోజులు లేకపోయేసరికి పిచ్చెక్కినట్లయింది'

మరోచోట, ఒక మామిడి చెట్టు కింద కూర్చున్న రషీదా (అది ఆమె అసలు పేరు కాదు) కనిపించారు. ఆమె కూడా టబా బాధితురాలే.

తాను ఏడేళ్లుగా టబా వాడుతున్నానని, తన భర్తకు ఈ విషయం తెలియదని రషీదా బీబీసీతో చెప్పారు.

ఈ టబా వ్యసనం తన జీవితాన్ని ఎలా నాశనం చేసిందో వివరిస్తూ, ఆమె కన్నీళ్లు ఆపుకోవడానికి ప్రయత్నించారు.

ఆసుపత్రిలో మరణించిన తన వదినను గుర్తుచేసుకుంటూ, "నేను మూడు రోజుల పాటు ఆమెతో ఉండాల్సి వచ్చింది. కానీ టబా తీసుకెళ్లడం మర్చిపోయాను. అప్పుడు నాకు ఎంత పిచ్చిగా అనిపించిందంటే, దేనిమీదా దృష్టి పెట్టలేకపోయాను" అని చెప్పారు.

టబా తన జీవితంలో నిత్యావసర వస్తువుగా ఎలా మారిపోయిందో రషీదా వివరించారు.

'నా శరీరాన్ని శుభ్రం చేస్తుంది, వాడాలని కొందరు చెప్పారు...' అన్నాారామె.

టబాను మొదటిసారి యోని మార్గంలో ఉపయోగించడం అనేది ఒక భయంకరమైన అనుభవమని దీన్ని ఉపయోగించే మహిళలు చెబుతున్నారు.

"నేను మొదటిసారి వాడినప్పుడు గంటకు పైగా స్పృహ కోల్పోయాను, మరెప్పుడూ దీనిని వాడకూడదని నిర్ణయించుకున్నాను. కానీ రెండోసారి వాడినప్పుడు చాలా వాంతులు అయ్యాయి. కానీ, దీనిని నాకు పరిచయం చేసిన వ్యక్తి, ఇది నా శరీరాన్ని శుభ్రం చేస్తుందని, కాబట్టి వాడటం కొనసాగించమని చెప్పారు" అని ఐషాతు వివరించారు.

రషీదా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

''నాకు తల తిరిగినట్లు అనిపించింది, శరీరం వణకడం మొదలైంది. మలేరియా వచ్చినట్లు అనిపించింది. ఆ తర్వాత నేను స్పృహ కోల్పోయాను. రెండో రోజు కూడా అదే అనుభవం ఎదురైంది. కానీ మూడో రోజు సరికి, అది మామూలుగానే అనిపించింది" అని చెప్పారు.

ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నా..

ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ, గాంబియా దేశంలో ‘ఒత్తిడిని అధిగమించడానికి, శక్తి లేదా ఆరోగ్యం కోసం ఒక సంప్రదాయ నివారిణి’గా 'టబా' ఇప్పటికీ బాగా ప్రాచుర్యంలో ఉంది.

టబా సప్లయర్లు, దుకాణంలో ఇతర వస్తువులను బయట ప్రదర్శనకు పెట్టి, గుట్టుగా టబా వ్యాపారం సాగిస్తారు. వీటి అమ్మకం, కొనుగోళ్లలో కోడ్ లాంగ్వేజ్ వాడుతుంటారు.

గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధ మహిళలను అడ్డంపెట్టుకొని టబా విక్రయిస్తున్నారు.

రమత్ అనే మహిళ, నార్త్ బ్యాంక్ ప్రాంతంలోని ఒక చిన్న పట్టణంలో తాను రెండేళ్లుగా టబా రహస్యంగా విక్రయిస్తున్నట్లు బీబీసీకి చెప్పారు.

టబా మిశ్రమాన్ని సాధారణంగా నైలాన్ కవర్లలో చుడతారు. దాని ఘాటైన వాసన బయటకు రాకుండా కొన్నిసార్లు అదనంగా కాగితాన్నీ చుడుతుంటారని రమత్ వివరించారు. ఒక్కో ప్యాకెట్ ధర 15 దలాసీలు (భారతీయ కరెన్సీలో సుమారు 18 రూపాయలు) ఉంటుందన్నారు.

టబా సరఫరదారులు ఈ మిశ్రమాన్ని వేటితో తయారు చేస్తారో రమత్‌కు తెలియదు, కానీ ఆమె వ్యాపారం మాత్రం జోరుగా సాగుతోంది. తాను విక్రయించే ప్రతి ఐదు కిలోల టబా పొడి మీద ఆమెకు 200 శాతం లాభం వస్తుంది.

దీన్ని అమ్మడం ప్రారంభించినప్పుడు, అది తనను ఇంతగా బానిసను చేస్తుందని ఊహించలేదని ఆమె చెప్పారు.

"ఒకవేళ నాకు లాభసాటిగా ఉండే మరో వ్యాపారం దొరికితే, దీనిని అమ్మడం మానేస్తాను. ఎందుకంటే, నా తోటి మహిళలకు ఇకపై హాని చేయడం నాకు ఇష్టం లేదు" అని రమత్ అన్నారు.

"ఒకసారి ఇన్ఫెక్షన్ నయం చేసుకోవడానికి టబా వాడాను, కానీ నేను దాదాపు చనిపోయినంత పని అయింది. ఆ రోజు నుంచి మళ్లీ ఎప్పుడూ వాడలేదు. నా కస్టమర్లలో కొందరు తమకూ ఇలాంటి అనుభవమే ఎదురైందని చెప్పారు" అని ఆమె వెల్లడించారు.

గాంబియా శిశు, సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ డిప్యూటీ పర్మనెంట్ సెక్రటరీ కజాలీ సోంకో
ఫొటో క్యాప్షన్, కజాలీ సోంకో

అంతర్జాతీయ స్థాయిలో టబా సరఫరా వ్యవస్థ...

గాంబియా ప్రభుత్వం 2020లోనే టబాను హానికరమైనదిగా ప్రకటించింది. కానీ చట్టాల అమలు సరిగా లేకపోవడంతో టబా ఇప్పటికీ విస్తృతంగా వాడుకలో ఉంది. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని గాంబియా శిశు, సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ డిప్యూటీ పర్మనెంట్ సెక్రటరీ కజాలీ సోంకో చెప్పారు.

టబా సరఫరా వ్యవస్థ గాంబియా దేశ సరిహద్దులు దాటి, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించి ఉందని అధికారులు భావిస్తున్నారు.

గినియా-బిస్సావు, సియెర్రా లియోన్, సెనెగల్‌లోని కాసమాన్స్ వంటి సుదూర ప్రాంతాల నుంచి టబాను వ్యాపారులు తెప్పిస్తున్నారు.

గాంబియా ప్రభుత్వం 2020లో టబాను మహిళలు, బాలికలకు హానికరమైన పదార్థంగా గుర్తించింది. కానీ క్షేత్రస్థాయిలో ఈ ఆంక్షల ప్రభావం పెద్దగా లేదు. వ్యాపారులను, వినియోగదారులను నిరోధించడానికి ఇప్పటివరకు ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు.

టబా వాడకం చట్టవిరుద్ధం కానప్పటికీ, పొగాకు ఉత్పత్తులను వాడటానికి చట్టబద్ధమైన వయస్సు 18 ఏళ్లు.

అయితే, పిల్లలు కూడా టబా వాడుతున్నారని 'మదర్స్ హెల్త్ ఫౌండేషన్' తదితర సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

"గాంబియా మహిళల ఆరోగ్యానికి టబా హాని కలిగిస్తోందని ప్రభుత్వం గుర్తించింది. దీనిని అరికట్టడానికి అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి, విధానాలు, కార్యక్రమాలను రూపొందించడానికి కట్టుబడి ఉన్నాం" అని కజాలీ సోంకో చెప్పారు.

ల్యాబ్‌లో టబాపై పరీక్షలు

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం...

మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ (గాంబియా యూనిట్)లో ఎపిడమియాలజిస్ట్‌గా పనిచేస్తున్న ‌డాక్టర్ బాయి చామ్.. టబా ప్రభావంపై 2023లో ఒక పరిశోధనపత్రాన్ని ప్రచురించారు.

ఇతర పొగాకు ఆధారిత ఉత్పత్తుల ప్రభావంపై ఇప్పటికే ఉన్న సమాచారాన్ని బట్టి, టబా కూడా "ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశం ఉంది" అని ఆయన బృందం కనిపెట్టింది.

డాక్టర్ చామ్ తన తదుపరి పరిశోధనలో భాగంగా టబా మిశ్రమాల నమూనాలపై రసాయన విశ్లేషణ కూడా చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన 42 మంది మహిళలను, 15 మంది పురుషులను (వీరిలో ఎక్కువ మంది ప్రస్తుతం టబా వినియోగదారుల భాగస్వాములు లేదా మాజీ వినియోగదారులు) ఇంటర్వ్యూ చేశారు.

మహిళల్లో 90 శాతం కంటే ఎక్కువ మందిలో నికోటిన్ పాయిజనింగ్ సూచనలు ఉన్నాయని డాక్టర్ చామ్ తెలిపారు. వాంతులు, విరేచనాలు, నియంత్రణ లేని మూత్రవిసర్జన, మంట, చికాకు వంటి లక్షణాలు ఉన్నట్లు చెప్పారు.

వారిలో కొందరు మహిళలు, తాము పొగాకు పొడిలో కాస్టిక్ సోడా కలుపుతున్నట్లు చెప్పారు.

డాక్టర్ చామ్ బృందం పరీక్షించిన నమూనాలలో, అత్యధిక స్థాయిలో నికోటిన్, క్యాన్సర్‌కు దారితీసే 'టొబాకో-స్పెసిఫిక్ ఎన్-నైట్రోసమైన్' (టీఎస్‌ఎన్ఏ) అనే రసాయనాలు ఉన్నట్లు కనుగొన్నారు.

టబా నమూనాలలో 3.63 మిల్లీగ్రాములు/కేజీ వరకు సీసం (లెడ్) స్థాయిలు ఉన్నట్లు ల్యాబ్ పరీక్షలలో తేలింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), తినదగిన ఆకులకు నిర్ణయించిన సురక్షిత పరిమితి 0.3 మిల్లీగ్రాములు/కేజీ కంటే ఇది 10 రెట్లు ఎక్కువ.

ఎస్సావు, బంజుల్‌ ప్రాంతాల నుంచి మరికొన్ని టబా నమూనాలను బీబీసీ సేకరించి, విశ్లేషణ కోసం లాగోస్ విశ్వవిద్యాలయానికి పంపింది.

ఆ పరీక్షా ఫలితాల్లో పిరిడిన్ డెరివేటివ్స్ అనే నికోటిన్ సంబంధిత సమ్మేళనాలు ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా, ఇందులో ఉన్న సీసం స్థాయిలు డబ్ల్యూహెచ్‌వో నిర్దేశించిన సురక్షిత పరిమితుల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని వెల్లడైంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)