Cannabis: గంజాయితో ఇక్కడ కూరలు వండుతారు, ఐస్‌ క్రీమ్‌లు, పానీయాలు అన్నింటిలోనూ..

గంజాయి

గంజాయిని సాగు చేయడంతో పాటు ఆహారంగా వినియోగించడాన్నీ థాయిలాండ్ చట్టబద్ధం చేసింది. ఒకప్పుడు ఇక్కడ డ్రగ్స్‌కు సంబంధించి నేరాలపై జీవిత ఖైదు, మరణ శిక్షలు విధించేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ మార్పులపై బీబీసీ ఆగ్నేయాసియా ప్రతినిధి జోనథన్ హెడ్ అందిస్తున్న కథనం.

21ఏళ్ల క్రితం, నా కెరియర్‌లో అత్యంత భయానక దృశ్యాలను నేను చూశాను. ఐదుగురు ఖైదీలకు మరణ శిక్ష విధించడాన్ని చూసేందుకు మాకు అనుమతించారు. ఆ ఐదుగురిలో నలుగురిని మత్తుమందుల కేసుల్లో దోషులుగా నిర్ధరించారు.

ఆ నేరస్థులు నడిచేటప్పుడు కాళ్లు, చేతులకు వేసిన సంకెళ్ల శబ్దం, వారి ముఖాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. బహుశా ఎప్పటికీ వారిని మరచిపోనేమో.

అప్పట్లో ప్రధాన మంత్రి థాక్సిన్ షినవాత్రా.. ‘‘డ్రగ్స్‌పై యుద్ధం’’ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత వేల మందిని డ్రగ్స్ సరఫరాదారులనే ఆరోపణలతో హత్యలు చేశారు.

షినవాత్రా చర్యలకు ప్రజల నుంచి కూడా మద్దతు ఉండేది. మెథాఎంఫెటామైన్ లాంటి నార్కోటిక్స్‌ వల్ల తమ సమాజంపై ప్రభావం పడుతోందని ఇక్కడి ప్రజలు భావించేవారు. డ్రగ్స్ సరఫరాదారులపై చర్యలతో మానవ హక్కుల ఉల్లంఘనలపై కూడా పెద్దగా చర్చ జరిగేదికాదు.

గంజాయి

ఫొటో సోర్స్, Getty Images

మరోవైపు ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూటెర్ట్ కూడా 2016లో ఇలానే డ్రగ్స్‌పై యుద్ధాన్ని ప్రకటించారు. సింగపూర్, మలేసియాలు కూడా డ్రగ్స్ కేసుల్లో దోషిగా నిర్ధరణ అయ్యేవారికి మరణ శిక్షలు విధిస్తూ వచ్చాయి.

ఆగ్నేయాసియా దేశాలకు వచ్చే పర్యటకులకు కూడా వారి దగ్గర స్వల్ప మొత్తంలో గంజాయి దొరికినా కఠినమైన శిక్షలు విధిస్తామని హెచ్చరించేవారు.

అయితే, గతం వారంలో రోజుల్లో థాయిలాండ్‌లో చూస్తున్న పరిణామాలను చూశాక అసలు మమ్మల్ని మేమే నమ్మలేకపోతున్నాం.

గంజాయి

ఇక్కడి కెఫేలు, దుకాణాల్లో చాలా రకాల గంజాయి ఉత్పత్తులు అమ్ముతున్నారు. గంజాయి పువ్వులను కూడా సీసాల్లో పెట్టి అందంగా అలంకరిస్తున్నారు.

ఎక్కడ చూసినా గంజాయే కనిపిస్తోంది. ఐస్ క్రీములతోపాటు ఇతర పానీయాలపైనా దీన్ని చల్లుతున్నారు. గంజాయి తినిపించిన కోళ్ల మాంసం అంటూ ప్రత్యేకంగా అమ్ముతున్నారు.

గంజాయి ఉపయోగానికి సంబంధించిన నిబంధనలను ప్రజారోగ్య మంత్రి అనుటిన్ చర్నివిరకుల్ పూర్తిగా సరళీకరించారు. ఆయన తీసుకొచ్చిన కొత్త చట్టంతో గంజాయి వినియోగానికి ప్రపంచంలోనే థాయిలాండ్ అత్యంత అనుకూలమైన ప్రాంతంగా మారింది.

ఇక్కడ గంజాయితో కూరలు కూడా వండుతున్నారు. రైతులు కూడా గంజాయి పంటలతో తమ ఆదాయం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

గంజాయి

మరోవైపు ప్రభుత్వం పంచుతున్న పది లక్షల గంజాయి మొక్కలను తీసుకొనేందుకు పెద్దయెత్తున ప్రజలు క్యూ కడుతున్నారు.

ఇప్పుడు ఇక్కడ గంజాయిని హాయిగా పండించుకోవచ్చు. అయితే, మార్కెట్‌లో వీటిని అమ్మే విషయంలో కొన్ని ఆంక్షలు అమలులో ఉన్నాయి.

‘‘ఇక్కడ ఒకటి మాత్రం సుస్పష్టం. గంజాయిని తీసుకుంటే ఇకపై ఇక్కడ జైలులో పెట్టరు’’అని టామ్ క్రూసోపన్ చెప్పారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొనేలా ఒప్పించేందుకు ఆయన చాలా ప్రయత్నించారు.

‘‘అయితే, బహిరంగ ప్రాంతాల్లో ధూమపానం, గొడవలు చేయడం, మోసాలు లాంటి చర్యలకు పాల్పడితే జైలుకు వెళ్లాల్సిందే. మరోవైపు ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అనుమతిలేని గంజాయి ఉత్పత్తులు అమ్మినా శిక్షలు విధిస్తారు. అయితే, గంజాయి మొక్కలను ఇక్కడ హాయిగా సాగు చేయొచ్చు’’అని ఆయన అన్నారు.

‘‘దీని కోసం ఎప్పటినుంచో కలలుగన్నాం. థాయిలాండ్ ఇంతలా మారుతుందని మేం ఊహించలేదు’’అని రట్టపన్ సర్నన్ అనే వ్యక్తి అన్నారు. గంజాయితో వైద్యపరమైన లాభాల గురించి ఆయన అమెరికాలో చదువుతున్నప్పుడే తెలుసుకున్నారు. అప్పటినుంచీ ఇక్కడ గంజాయి సాగును నేరంగా పరిగణించకూడదని ఆయన ప్రచారం చేపట్టడం మొదలుపెట్టారు.

ఆయన తల్లిదండ్రులతోపాటు తాతయ్య, నాన్నమ్మలు కూడా క్యాన్సర్‌తో మరణించారు. తల్లి అనారోగ్యం దెబ్బతినప్పుడు ఆమెను చూసుకునేందుకు ఆయన అమెరికా నుంచి వచ్చేశారు. నొప్పిని తగ్గించేందుకు గంజాయిని తీసుకోవాలని ఆమెను ఒప్పించేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే, గంజాయి దొరకడం ఆ కుటుంబానికి కష్టమైంది.

వీడియో క్యాప్షన్, లిక్విడ్ గంజాయి తీసుకుంటే ఇలా అయిపోతారు

సైన్యం నడిపిస్తున్న ప్రభుత్వంలో ఈ మార్పులు ఎలా వచ్చాయి?

దీనికి కారణం రాజకీయాలేనని చెప్పుకోవాలి. 2019 ఎన్నికల్లోనూ గంజాయిని చట్టబద్ధం చేస్తామని ప్రస్తుత మంత్రి అనుటిన్ చెప్పారు. వరి, చెరకు పంటలతో నష్టపోతున్న రైతులు కొత్త వాణిజ్య పంట కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో గంజాయి సాగు వారికి మంచి అవకాశంలా కనిపించింది.

గంజాయితో చేకూరే వైద్యపరమైన ప్రయోజనాల గురించీ అనుటిన్ మాట్లాడేవారు. ఖరీదైన రసాయన ఔషధాల కంటే గంజాయిని హాయిగా ఇంటి వద్దే పండించుకోవచ్చని ఆయన అన్నారు.

మరోవైపు వాణిజ్య పరమైన అంశాలూ ప్రభుత్వ చర్యలకు మరో కారణంగా చెప్పుకోవచ్చు. మొదటి మూడేళ్లలోనే గంజాయి సాగుతో పది బిలియన్ డాలర్లు (సుమారు రూ. 78,065 కోట్లు) వాణిజ్యం జరిగే అవకాశముందని క్రూసోపన్ అంచనా వేశారు. గంజాయి పర్యటకానికి ఇది చాలా మంచి అవకాశమని అన్నారు. గంజాయి ఉత్పత్తులు, గంజాయి చికిత్సల కోసం ఇక్కడికి విదేశాల నుంచి పర్యటకులు కూడా వస్తుంటారు.

గంజాయి చికిత్సల కోసం క్రూసోపన్ బ్యాంకాక్‌లో ఓ చికిత్స కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేశారు. మరోవైపు థాయిలాండ్‌లోని పెద్దపెద్ద కార్పొరేషన్లు కూడా ఈ చికిత్సా రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

అయితే, ప్రభుత్వ తాజా చర్యలకు మరో కోణం కూడా ఉంది. ఇక్కడి జైళ్లు ఖైదీలతో కిక్కిరిసిపోయాయి. మూడో వంతు ఖైదీలు డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన వారే. వీరిలో చాలా మంది మైనర్లు కూడా ఉన్నారు. ఈ జైళ్ల నిర్వహణకు ప్రభుత్వానికి చాలా ఖర్చు అవుతోంది. తాజా మార్పులలో భాగంగా గంజాయి కేసుల్లో పట్టుబడిన 4,000 మందికిపైగా ఖైదీలను విడిచిపెట్టనున్నారు.

వీడియో క్యాప్షన్, గంజాయికి అలవాటు పడ్డాడని కొడుకు కళ్లల్లో కారం కొట్టింది ఆ తల్లి

గంజాయిని కేవలం వైద్యపరమైన అవసరాలకే ఉపయోగించాలని ప్రభుత్వం చెబుతోంది. వినోదపరమైన అవసరాలకు దీన్ని వాడకూడదని అంటోంది. అయితే, ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడం చాలా కష్టమని నిపుణులు అంటారు.

లైసెన్సులు పొందిన వారి నుంచే రసీదుపై గంజాయిని విక్రయించాలని నిబంధన పెట్టినట్లు క్రూసోపన్ చెప్పారు. 18ఏళ్ల లోపు వయసున్న వారికి దీన్ని విక్రయించమని ఆయన అన్నారు.

‘‘ఈ విషయంపై మనం పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. సిగరెట్లు, ఇతర మత్తు పానీయాల్లో గంజాయి వాడకానికి కళ్లెం వేసేందుకు మన దగ్గర నిబంధనలు ఉన్నాయి’’అని ఆయన చెప్పారు.

అయితే, థాయిలాండ్ ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయోనని ఆగ్నేయాసియాలోని చుట్టుపక్కల దేశాలు జాగ్రత్తగా పరిశీలిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)