అర్జెంటీనా: కల్తీ కొకైన్ తీసుకోవడంతో 16 మంది మృతి

కొకైన్

ఫొటో సోర్స్, Getty Images

కల్తీ కొకైన్ తీసుకోవడం వల్ల అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనీసం 16 మంది చనిపోయారని, మరో 50 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు.

చట్టవిరుద్ధమైన ఈ మాదక ద్రవ్యాన్ని ఒక రకం విషం లేదా ఇతర పదార్థాలతో కల్తీ చేసుంటారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

"డ్రగ్స్ తీసుకునేవారు ఎవరైనా గత 24 గంటల్లో కొకైన్ కొనుగోలు చేసుంటే దానిని పారేయాలి" అని ఆ ప్రావిన్స్ రక్షణ మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.

నగరంలోని ఒకే శివారు ప్రాంతం నుంచి అందరూ ఈ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేశారు.

వీడియో క్యాప్షన్, ప్లాస్టిక్ సర్జరీలకు డబ్బు కోసం సెక్స్ ఒప్పందాలు

అధికారులు తనిఖీల్లో దొరికిన మాదక ద్రవ్యాలను బాధితులు తీసుకున్న వాటితో పోల్చి చూడడానికి పోస్టుమార్టం నివేదికల కోసం వేచిచూస్తున్నారు.

బాధితుల్లో రాజధాని ప్రాంతానికి చెందిన హర్లింఘామ్, ట్రెస్ డీ ఫెబ్రేరో, శాన్ మార్టిన్ జిల్లాలకు చెందినవారు ఉన్నారు. వీరందరినీ స్థానిక ఆస్పత్రుల్లో చేర్పించారు.

హర్లింఘామ్‌లోని ఒక ఆస్పత్రి బయట ఒక ఖాళీ పోలీసు వాహనంపై దాడి చేసిన బాధితుల బంధువులు కొందరు దానిని ధ్వంసం చేశారని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి.

కోకా మొక్కల ఆకుల నుంచి తీసే కొకైన్(హైడ్రోక్లోరైడ్) అత్యంత మత్తు కలిగించే డ్రగ్.

వీడియో క్యాప్షన్, పంజాబ్‌: డ్రగ్స్ సమస్య ఇప్పుడు ఎలా ఉంది?

అమెరికాలో డ్రగ్ వినియోగానికి సంబంధించి 2019లో విడుదలైన ఒక నివేదికలో ఒక వ్యక్తి అత్యధికంగా కొకైన్ వినియోగించే దేశాల్లో అమెరికా, ఉరుగ్వే తర్వాత అర్జెంటీనా మూడో స్థానంలో నిలిచింది.

శాన్ మార్టిన్‌లో పోలీసులు నలుగురు బాధితులను గుర్తించారు. వీరిలో ఒకరు ట్రెస్ డీ ఫెబ్రేరో శివార్లలోని ఒక వ్యక్తి నుంచి కొనుగోలు చేశామని చెప్పారు. తర్వాత అక్కడ తనిఖీలు నిర్వహించారని స్థానిక పత్రికలు తెలిపాయి.

మృతుల్లో ఒకరి బంధువు అందించిన అలాంటి కొకైన్ పాకెట్లనే ఈ దాడుల్లో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వీడియో క్యాప్షన్, దక్షిణాఫ్రికా: డ్రగ్ మాఫియా, క్రిమినల్స్ మధ్య నుంచి ఎదిగిన ఒక ఒలింపిక్ కల

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)