Sophia Duleep Singh: ‘పంజాబ్ యువరాణి.. విక్టోరియా మహారాణికి దేవుడిచ్చిన కుమార్తె’.. మహిళల ఓటు హక్కు కోసం పోరాడిన సోఫియాపై పుస్తకం

Sophia Duleep Singh

ఫొటో సోర్స్, NORFOLK MUSEUMS SERVICE

ఫొటో క్యాప్షన్, సోఫియా దులీప్ సింగ్

మహిళల ఓటు హక్కు కోసం పోరాడిన ఒక భారతీయ యువరాణి కథ చిరస్థాయిగా లిఖితమైంది.

పంజాబ్ చిట్టచివరి సిక్కు పాలకుడు మహారాజా దులీప్ సింగ్ కుమార్తే సోఫియా. ఇంగ్లండ్‌లోని ఎల్వెడన్‌లో ఆమె పెరిగారు.

1900 ప్రాంతంలో మహిళల హక్కుల కోసం పోరాడేందుకు తన రాచరిక హోదానే వదులుకునేందుకు సిద్ధమై ఆమె చరిత్రకెక్కారు.

''బిడియస్థురాలే అయినా దృఢ నిశ్చయంతో ఉండే సోఫియాతో మనందరికీ సంబంధం ఉంటుంది'' అని రచయిత్రి సూఫియా అహ్మద్ అన్నారు.

9 నుంచి 13 ఏళ్ల మధ్య వయసు పిల్లల కోసం సూఫియా అహ్మద్ రాసిన ''మై స్టోరీ: ప్రిన్సెస్ సోఫియా దులీప్ సింగ్' పుస్తకాన్ని నార్‌ఫోక్‌లోని థెట్‌ఫోర్డ్‌లో ఉన్న 'ఏన్సియంట్ హౌస్ మ్యూజియం'లో ఆవిష్కరించారు.

ఆమె సోదరుడు ఫ్రెడరిక్ దులీప్ సింగ్ 1921లో ఈ మ్యూజియం స్థాపించారు.

సోఫియా (కుడివైపు)

ఫొటో సోర్స్, NORFOLK MUSEUMS SERVICE

ఫొటో క్యాప్షన్, సోఫియా (కుడివైపు ఉన్న బాలిక)

1840లో బ్రిటిష్ ప్రభుత్వం భారత్‌లోని మహారాజా దులీప్ సింగ్ రాజ్యాన్ని తమ వశం చేసుకుని ఆయన్ను ఇంగ్లండ్ పంపించేసింది.

భారతదేశానికి తిరిగి రావడానికి ఆయన ప్రయత్నాలు చేస్తూనే తనకు దక్కిన పరిహారం డబ్బుతో ఎల్వెడెన్ హాల్ కొనుగోలు చేశారు. ఆయన భార్యాపిల్లలు అక్కడే స్థిరపడిపోయారు.

మహారాజా దులీప్ సింగ్ కుటుంబానికి క్వీన్ విక్టోరియాతో మంచి స్నేహం ఉండేది. దాంతో హ్యాంప్టన్ కోర్ట్ ప్యాలస్‌లో వారికి ఓ అపార్ట్‌మెంట్ సమకూర్చారు విక్టోరియా రాణి.

మహారాజా దులీప్ సింగ్‌ను ఎల్వెడెన్ చర్చ్ యార్డ్‌లో సమాధి చేశారు
ఫొటో క్యాప్షన్, మహారాజా దులీప్ సింగ్‌ను ఎల్వెడెన్ చర్చ్ యార్డ్‌లో సమాధి చేశారు

తాను పెరిగి పెద్దదవుతున్న క్రమంలో తన జీవితార్థం వెతుక్కునే వరకు ఒక సాధారణ ఇంగ్లిష్ వనితలాగే బతికారు సోఫియా.మహిళల హక్కుల కోసం యువరాణి పోరాడారు.

ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్, ఉమెన్స్ టాక్స్ రెసిస్టెన్స్ లీగ్‌లో ఆమె సభ్యురాలిగా ఉండేవారు. 'ఓటు హక్కు ఇవ్వనిదే పన్ను చెల్లించం' అనేది ఉమెన్స్ టాక్స్ రెసిస్టెన్స్ లీగ్ నినాదం.

ఓటు హక్కు సాధన ఉద్యమంలో భాగంగా 1910లో యువరాణి సోఫియా 400 మందితో కలిసి బ్రిటన్ పార్లమెంటుకు ప్రదర్శనగా వెళ్లారు.

ఆమెతో వెళ్లినవారిలో ప్రముఖ ఓటు హక్కు ఉద్యమకారిణి ఎమెలిన్ పాంక్‌హస్ట్ కూడా ఉన్నారు.

సూఫియా అహ్మద్

ఫొటో సోర్స్, ASIF PATEL PHOTOGRAPHY

ఫొటో క్యాప్షన్, సూఫియా అహ్మద్

'సోఫియా జీవిత గాథ చిన్నారులకు ప్రేరణగా నిలుస్తుందని నాకు అనిపించింది. ఆమె బిడియస్థురాలు, కానీ.. ఫ్యాషనబుల్‌గా ఉండేవారు. ఏదైనా అనుకుంటే సాధించేవరకు విశ్రమించని తత్వం ఆమెది' అన్నారు రచయిత్రి సూఫియా అహ్మద్.

యువరాణి సోఫియా 1948 ఆగస్ట్ 22న తన 71 ఏళ్ల వయసులో మరణించారు. నార్‌ఫోక్ మ్యూజియం సర్వీస్ లెర్నింగ్ ఆఫీసర్ మెలిసా హాకర్ మాటల్లో చెప్పాలంటే... ‘‘ఆమెది అసాధారణ వ్యక్తిత్వం...పంజాబ్ యువరాణి అయినప్పటికీ ఆమె క్వీన్ విక్టోరియాకు దేవుడిచ్చిన కుమార్తె. సమానత్వం, న్యాయం కోసం పోరాడిన యోధురాలు ఆమె’’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)