అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టిన చైనా, తీవ్రంగా స్పందించిన భారత్

ఫొటో సోర్స్, Getty Images
చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన 15 ప్రాంతాల పేర్లను మార్చింది. వాటికి కొత్తగా చైనీస్ పేర్లను పెట్టింది.
అరుణాచల్‌ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌లో ఒక భాగంగా పరిగణిస్తోన్న చైనా... తాజా పేర్లను తమ అధికారిక పత్రాల్లో, మ్యాపులలో ఉపయోగించనుంది.
చైనా చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. 'అరుణాచల్‌ప్రదేశ్ ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగంగానే ఉంది. ఇకముందు కూడా అలాగే ఉంటుంది. కేవలం పేర్లు మార్చినంత మాత్రాన అబద్ధాలు నిజమైపోవు'' అని వ్యాఖ్యానించింది.
కొత్తగా అమల్లోకి వచ్చిన 'సరిహద్దు చట్టం' కింద చైనా ఈ పేర్ల జాబితాను విడుదల చేసింది. ఈ చట్టం 2022 జనవరి 1న అమల్లోకి వచ్చింది. దీనిపై భారత్ ఆందోళనను వ్యక్తం చేసింది.
చైనా కమ్యూనిస్టు పార్టీకి అనుకూల పత్రికగా భావించే ''ద ఇంగ్లీష్ డైలీ గ్లోబల్ టైమ్స్' దీనికి సంబంధించిన వార్తను గురువారం ప్రచురించింది.
జాంగ్‌నాన్ (అరుణాచల్‌ప్రదేశ్‌కు చైనీస్ పేరు)కు చెందిన 15 ప్రదేశాల పేర్లను చైనీస్, టిబెటన్, రోమన్ భాషల్లో విడుదల చేసినట్లు బుధవారం చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిందని 'ద ఇంగ్లీష్ డైలీ గ్లోబల్ టైమ్స్' పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
చైనా లక్ష్యం ఏంటి?
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం ఈ అంశంపై మాట్లాడారు. ''ఇది మేం చూశాం. అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రాంతాల పేర్లను మార్చేందుకు చైనా ప్రయత్నించడం ఇది తొలిసారి కాదు. 2017 ఏప్రిల్‌లో కూడా చైనా ఇలాగే చేసింది'' అని ఆయన అన్నారు.
2017లో చైనా ప్రభుత్వం తొలిసారిగా అరుణాచల్ ప్రదేశ్‌కు ఆరు ప్రాంతాలకు అధికారిక పేర్లను జారీ చేసింది. ఆ సమయంలో, దలైలామా అరుణాచల్ ప్రదేశ్‌లో సందర్శించడానికి వ్యతిరేకంగా చైనా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో ఒక భాగంగా ఈ చర్యను పరిగణించారు.
కానీ గతం కంటే ఎక్కువ ప్రదేశాలకు తాజాగా చైనా పేర్లను మార్చింది. మొత్తం 15 ప్రాంతాలను ఈ జాబితాలో చేర్చింది. ఇందులో అరుణాచల్ ప్రదేశ్‌లోని 11 జిల్లాలకు చెందిన 8 నగరాలు, 4 పర్వత ప్రాంతాలు, 2 నదులు, ఒక కనుమ మార్గం ఉంది. ఇవి పశ్చిమాన తవాంగ్ నుంచి తూర్పున అంజౌ వరకు విస్తరించి ఉన్నాయి.
అరుణాచల్‌ప్రదేశ్‌లోని 90,000 చ.కి.మీ మేర ప్రాంతం తమదే అని చైనా వాదిస్తోంది.
ఈ పేర్లను విడుదల చేసిన తర్వాత, చైనాలోని అన్ని అధికారిక మ్యాపుల్లో ఈ ప్రాంతాలను తాజా పేర్లతోనే సూచిస్తారు. ఇది కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితమవుతుంది. దీనివల్ల అరుణాచల్ ప్రదేశ్ భూభాగాలపై చైనా ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదు. కానీ ప్రాదేశిక వివాదాల పరంగా చైనా అనుసరిస్తోన్న కొత్త విధానాన్ని ఇది సూచిస్తుంది.
''జాతీయ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి చైనా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. జాతీయ భద్రతను మెరుగుపరచడానికి, ప్రాంతీయ ఉద్రిక్తల నేపథ్యంలో భారత్‌తో సహా సరిహద్దు వివాదాల్లో చట్టపరంగా ముందుకెళ్లడానికి ఇది అవసరం'' అని చైనీస్ సోషల్ సైన్సెస్ అకాడమీలో సరిహద్దు వ్యవహారాల నిపుణుడు చాంగ్ యాంగ్‌ప్యాంగ్ అన్నారు.
భారతదేశ భూభాగాలపై తమ ఏకపక్ష వాదనను నొక్కి చెప్పేందుకే చైనా మరోసారి ఈ తరహా ప్రయత్నాన్ని చేసిందని దీన్నిబట్టి అర్థమవుతుంది. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టడం కూడా ఈ ప్రయత్నాల్లో భాగమే.

ఫొటో సోర్స్, Getty Images
కొత్త చట్టం ఏంటి?
భారతదేశంతో వాస్తవాధీన నియంత్రణ రేఖ వెంబడి ప్రతిష్టంభన మధ్య, చైనా 2021 మార్చిలో కొత్త సరిహద్దు చట్టాన్ని రూపొందించింది. ఇది 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది.
జాతీయ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి పౌర, సైనిక అధికారులకు ఈ చట్టంలో అనేక బాధ్యతలను అప్పగించారు.
ఈ చట్టంలో సరిహద్దు వర్ణన నుంచి సరిహద్దు రక్షణ, నిర్వహణ, వలసలు, వాణిజ్యం వరకు ఇలా ఏడు అధ్యాయాలకు సంబంధించిన 62 ఆర్టికల్స్ ఉన్నాయి.
తాజాగా పేర్ల మార్పు అంశం, సరిహద్దు చట్టంలోని ఆర్టికల్ 7తో ముడిపడి ఉంది. ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లో సరిహద్దు విద్యను ఈ ఆర్టికల్ ప్రోత్సహిస్తోంది.
చైనా సైన్యం... ఏదైనా ఆక్రమణను, దూకుడును, రెచ్చగొట్టే చర్యలను సమర్థంగా, పటిష్టంగా ఎదుర్కొనేందుకు సైనిక విన్యాసాలు చేపట్టవచ్చునని ఆర్టికల్ 22 పేర్కొంటోంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
''వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వద్ద చైనా సైన్యం ఉల్లంఘనలను చట్టబద్ధం చేయడమే చైనా కొత్త సరిహద్దు చట్టం-2020 ఉద్దేశంగా న్యూఢిల్లీ భావిస్తోందని'' ఆంగ్ల పత్రిక 'ద హిందూ' పేర్కొంది.
సరిహద్దు వెంబడి గ్రామాలను నిర్మించడానికి చైనా, 2017లో ప్రణాళికలు రచించింది. ఈ మేరకు భారత్, భూటాన్, నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో 628 గ్రామాలను ఏర్పాటు చేసింది. అక్కడ నివసించేందుకు ఎక్కువగా గొర్రెల కాపరులను తరలిస్తున్నారు.
చైనా 60 కొత్త భవనాలను నిర్మించినట్లు 2021 నవంబర్‌లో ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలిసింది. ఇవి అరుణాచల్ ప్రదేశ్‌లో భాగంగా ఉన్నాయని భారత్ చెబుతోంది. 2020 చివర్లో ఏర్పాటైన గ్రామాలకు తూర్పున 100 కి.మీ దూరంలో ఈ భవనాలు ఉన్నాయి.
1959 నుంచి చైనా నియంత్రణలో ఉన్న ఈ ప్రాంతంలో, చైనీస్ సైన్యం నిర్మాణాలు చేపడుతోంది. తమ వాదనలను మరింత బలంగా వినిపించడానికి పౌరుల కోసం నిర్మాణాలను చేపడుతోంది. దీనిపై ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తోంది. దీని గురించి చర్చలు జరుగుతున్నాయి.
ఈ కొత్త చట్టంపై భారత్ 2021 అక్టోబర్‌లో ఆందోళనను వ్యక్తం చేసింది. 'కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టాలనే చైనా ఏకపక్ష నిర్ణయం, సరిహద్దు నిర్వహణ అంశంలో అమల్లో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపవచ్చు. ఇది మాకు ఆందోళన కలిగించే అంశం'' అని పేర్కొంది.

ఫొటో సోర్స్, @NARENDRAMODI
అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా వాదన
చైనా ముందు నుంచి కూడా అరుణాచల్ ప్రదేశ్ గురించి నిరంతరం వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. భారత్ ప్రతీసారి వాటిని తిప్పికొడుతూనే ఉంది.
అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమే అని చైనా చెబుతోంది. దాన్ని దక్షిణ టిబెట్‌గా పిలుస్తోంది.
తమ వాదనను బలపరుచుకునేందుకు, అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్‌కు చెందిన సీనియర్ నేతలు, నాయకుల పర్యటన సందర్భంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోంది.
2021 అక్టోబర్‌లో భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయడు పర్యటనపై కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ... సరిహద్దు వివాదాన్ని ఇంకా పెంచే చర్యలకు భారత్ పూనుకోవద్దని పేర్కొంది.
అరుణాచల్ ప్రదేశ్‌లో భారత నేతలను పర్యటించవద్దని చైనా అభ్యంతరం చెప్పడంలో ఎలాంటి లాజిక్ లేదని భారత్ విమర్శించింది.
2019లో ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ల పర్యటన సందర్భంగా కూడా చైనా నిరసన వ్యక్తం చేసింది. 2020లో హోం మంత్రి అమిత్ షా పర్యటనను కూడా వ్యతిరేకించింది.
ఇవి కూడా చదవండి:
- దళిత యువకుడు గెడ్డం శ్రీనుది హత్యా, ఆత్మహత్యా... మూడునెలలుగా ఎందుకు తేలడం లేదు?
- వాట్సాప్ మెసేజ్‌లో లింక్ క్లిక్ చేయమన్నారు... రెండున్నర లక్షలు కొల్లగొట్టారు - ప్రెస్‌రివ్యూ
- కొత్త ఏడాదిలో కాస్త హేతుబద్ధంగా ఉందామా... ఇవిగో మూడు మార్గాలు
- RRR విడుదల వాయిదా: కోవిడ్‌తో దెబ్బతిన్న సినిమా థియేటర్ల భవిష్యత్తు ఏంటి... ఓటీటీల ప్రభావం ఎంత?
- హైదరాబాద్‌లో పెరిగిన పెళ్లిళ్లు.. అమ్మాయిల వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచే బిల్లు గురించి ఎందుకు భయపడుతున్నారు?
- చరిత్రలో మొట్టమొదటి రివెంజ్ పోర్న్ కేసు.. భార్య నగ్న చిత్రాలు బయటపెట్టిన భర్త.. ఏం జరిగింది?
- మరోసారి రష్యా నమ్మకం గెలుచుకున్న భారత్... అమెరికాను దూరం పెడుతోందా?
- జీరో గురుత్వాకర్షణ శక్తిలో ప్రయాణించిన తొలి వికలాంగ వ్యోమగామి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














