RRR విడుదల వాయిదా: కోవిడ్‌తో దెబ్బతిన్న సినిమా థియేటర్ల భవిష్యత్తు ఏంటి... ఓటీటీల ప్రభావం ఎంత?

ఆర్ఆర్ఆర్ వాయిదా

ఫొటో సోర్స్, FB/RRR

    • రచయిత, ప్రదీప్ సర్దానా
    • హోదా, సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం

యావత్ భారతదేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల వాయిదా పడింది.

కొత్త సంవత్సరం కానుకగా జనవరి 7న ఈ చిత్రం విడుదల కావల్సి ఉండగా, పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడుతుండడంతో వాయిదా వేస్తున్నట్లు ఈ చిత్రబృందం ప్రకటించింది.

గత ఏడాది కాలంలో కోవిడ్ కారణంగా ఎన్నో థియేటర్లు మూతపడడంతో అనేక చిత్రాలు ఓటీటీలో విడుదల అయ్యాయి.

2021 సంవత్సరంలో మొత్తం 400 భారతీయ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలయ్యాయి.

తెలుగుతో పాటు తమిళం, మళయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ, మరాఠీ, పంజాబీ, గుజరాతీ, భోజ్‌పురితో సహా మరికొన్ని ఇతర భాషల్లో ఒరిజినల్ సీరీస్ వెలువడ్డాయి.

ఓటీటీలో ఇంత పెద్ద సంఖ్యలో చలనచిత్రాలు, వెబ్ సీరీస్ విడుదల కావడం చూస్తుంటే భారతదేశంలో ఈ వేదిక ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో స్పష్టమవుతోంది.

దాంతో, ఓటీటీలు, థియేటర్లకు ముప్పుగా మారాయనే అభిప్రాయాలు వెలువడ్డాయి.

అయితే, 2021లో థియేటర్లలో విడుదలైన సినిమాల డేటాను విశ్లేషిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయపడ్డాయి.

ట్రెండ్ పరిశీలిస్తే భవిష్యత్తులో ఓటీటీ రిలీజులు ఎంత పెరిగినా థియేటర్లకేమీ ముప్పు వాటిల్లదని స్పష్టం అవుతోంది.

స్పైడర్ మ్యాన్: నో వే హోం

ఫొటో సోర్స్, SONY PICTURES

ఫొటో క్యాప్షన్, స్పైడర్ మ్యాన్: నో వే హోం

థియేటర్ మ్యాజిక్ కొనసాగుతుంది

సినిమాల ప్రదర్శనకు ఓటీటీ ఒక అదనపు వేదికగా, విభిన్న మాధ్యమంగా మారింది. కానీ, ఈ ప్లాట్‌ఫారమ్ థియేటర్లకు ప్రత్యామ్నాయం కాలేదు. థియేటర్‌లో సినిమా చూడాలనే అభిరుచి ప్రేక్షకుల్లో చెక్కుచెదరలేదనే చెప్పవచ్చు. థియేటర్ చేసే మ్యాజిక్ ఇంకా పనిచేస్తోంది.

గత 18 నెలలుగా థియేటర్ vs ఓటీటీ యుద్ధం జరుగుతోంది. కానీ 2021వ సంవత్సరం చివరి రెండు నెలల్లో ఈ యుద్ధానికి చెక్ పడింది. థియేటర్ల క్రేజ్ తగ్గలేదని మరోసారి నిరూపణ అయింది.

ఏడాది పొడవునా ఓటీటీలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా, ఈ రెండు నెలల్లో థియేటర్లలో విడుదలైన సినిమాలు వాటిన్నంటినీ నెట్టుకుంటూ దూసుకెళిపోయాయి.

కోవిడ్ పెద్ద హీరోల సినిమాలకూ గండికొట్టింది. అవి కూడా ఓటీటీలోనే రిలీజ్ అయ్యే పరిస్థితి కల్పించింది.

2020 జూన్‌లో అమితాబ్ బచ్చన్ సినిమా 'గులాబో సితాబో' అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయింది. దాంతో, భారతీయ చలనచిత్ర రంగంలో సరికొత్త శకం ప్రారంభమైంది.

దీని తరువాత ఓటీటీ విడుదల ఊపందుకుంది. కాలం గడుస్తున్నకొద్దీ కరోనావైరస్‌లో పుట్టుకొస్తున్న కొత్త రకాలను చూస్తుంటే ఓటీటీ విడుదల ఇదే జోరుతో కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

పెద్ద సినిమాలను కూడా ఇంట్లో కూర్చుని, నచ్చినట్టు, చౌకగా చూడడం ప్రేక్షకులకు అలవాటైంది కూడా.

ఇక థియేటర్లకు రారు అని అనుకున్న సమయంలో నవంబర్, డిసెంబర్ నెలల్లో విడుదలైన సినిమాలు ఈ ఆలోచన తప్పని నిరూపించాయి.

రూ. 200 కోట్ల దిశగా దూసుకుపోతున్న పుష్ప

ఫొటో సోర్స్, TWITTER/PUSHPA

ఫొటో క్యాప్షన్, రూ. 200 కోట్ల దిశగా దూసుకుపోతున్న పుష్ప

'సూర్యవంశీ', 'పుష్ప', 'స్పైడర్‌ మ్యాన్‌' చిత్రాలు థియేటర్లను ఊపేశాయి

దీపావళి సందర్భంగా నవంబర్ 5న థియేటర్‌లో విడుదలైన హిందీ సినిమా 'సూర్యవంశీ' (అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్‌) బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

'సూర్యవంశీ' తొలి రోజే రూ. 26.29 కోట్లు వసూలు చేసింది. మూడు రోజుల్లో వీకెండ్ కలెక్షన్ రూ.77 కోట్లు దాటడంతో యావత్ సినీ పరిశ్రమ విస్మయానికి గురయింది. ఇప్పటివరకు, ఈ సినిమా రూ. 195 కోట్లకు పైగా బిజినెస్ చేసింది.

డిసెంబర్ 18న విడుదలైన హాలీవుడ్ సినిమా 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' హిందీ వెర్షన్, డిసెంబర్ 17న విడుదలైన తెలుగు సినిమా 'పుష్ప'కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది.

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా తెలుగుతో సహా మొత్తం 5 భాషల్లో విడుదలైన 'పుష్ప-ది రైజ్' సినిమా తొలిరోజే 52 కోట్లు వసూలు చేసింది. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం .. అన్నివైపుల నుంచి ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, సినిమా టిక్కెట్లపై వివాదం ఎక్కడ మొదలైంది? దీని వెనుక మూడు కోణాలు

అన్ని భాషల్లో కలిపి 'పుష్ప' 10 రోజుల్లో మొత్తం రూ.179 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది త్వరలో రూ.200 కోట్లను చేరుకుంటుందని అంచనా.

చాలా కాలంగా థియేటర్లలో విడుదల కోసం ఎదురుచూస్తున్న '83' చిత్రం డిసెంబర్ 24న విడుదలైంది. మొదటి రోజు నుంచే మంచి కలక్షన్లు రాబడుతోంది.

రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ డైరెక్టర్ కబీర్ ఖాన్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన '83' మొదటి మూడు రోజుల్లో అంటే వారాంతం వరకు రూ.47 కోట్ల బిజినెస్ చేసింది. అయితే, తరువాత కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇప్పటివరకు సుమారు రూ. 55 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది.

డిసెంబర్ 24 నుంచి కొన్నీ నగారాల్లో నైట్ కర్ఫ్యూలు విధించారు. చాలాచోట్ల థియేటర్లు 50 శాతం కెపాసిటీకి వచ్చేశాయన్నది గమనించాల్సిన విషయం.

మరోపక్క, '83', 'పుష్ప' గట్టి పోటీ ఇస్తున్నా స్పైడర్ మ్యాన్ సినిమా రూ. 200 కోట్లు సాధించే దిశగా సాగిపోతోంది.

సూర్యవంశీ

ఫొటో సోర్స్, FACEBOOK/KATRINAKAIF

ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు

సూర్యవంశీ, పుష్ప, స్పైడర్ మ్యాన్ సినిమాలు థియేటర్ యజమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయనే చెప్పవచ్చు.

"కరోనా సెకండ్ వేవ్ తరువాత, 2021 చివరి రెండు నెలల్లో థియేటర్లు తెరుచుకోవడం, పెద్ద సినిమాలు విడుదల కావడం, వాటిని ప్రేక్షకులు ఆదరించడం చూస్తుంటే మంచిరోజులు వస్తున్నాయనిపిస్తోంది. కోవిడ్ వల్ల థియేటర్లలో సినిమాలు చూసే అలవాటు ప్రేక్షకులకు పోయింది అన్న భయం మొదలైంది. కానీ, థియేటర్ల పట్ల ప్రేక్షకులకు ఉన్న ప్రేమ చెక్కుచెదరలేదు. వాళ్లు సినిమాలు చూడ్డానికి వస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు" అని 'మల్టిప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా' ప్రెసిడెంట్ కమల్ జ్ఞాన్‌చందాని అన్నారు.

"టీవీ, ఓటీటీలు ఇంతకుముందు కూడా ఉన్నాయి. వాటితో మాకెప్పుడూ సానుకూల సంబంధమే ఉంది. ఈ రెండు వేదికలూ ముందుకు సాగడానికి ఒకదానికొకటి సహాయం చేసుకుంటున్నాయి. అందుకే, ఓటీటీ వల్ల థియేటర్లకు ముప్పు ఉందని అనుకోను. కొత్త సంవత్సరంలో చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. 2022లో ప్రతీ రెండు నెలలకు థియేటర్‌లో ఒక మూవీ అయినా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిస్తున్నాను" అని ఆయన అన్నారు.

ఇవే కాకుండా 2021 చివరి మూడు నెలల్లో థియేటర్లో విడుదలైన మరి కొన్ని సినిమాలు కూడా కొత్త ఆశలు చిగురింపజేశాయి.

"2021 మొదటి త్రైమాసికంలో కూడా కొన్ని సినిమాలు ఆశ కలిగించాయి. కానీ కరోనా సెకండ్ వేవ్ రావడంతో మొత్తం కుదేలైపోయింది. చాలా సినిమా థియేటర్లు మూతబడ్డాయి. కానీ, చివరి త్రైమాసికంలో సాధించిన విజయంతో మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం" అని దేశంలోని ప్రముఖ థియేటర్లలో ఒకటైన సినీపోలిస్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దేవాంగ్ సంపత్ అన్నారు.

వీడియో క్యాప్షన్, క్లబ్, ఐటెం.. జయమాలిని, జ్యోతిలక్ష్మి, ముమైత్ ఖాన్, సమంత.. పేరు, తార మారినా డ్యాన్స్ అదే

"హిందీతో పాటు ఇంగ్లిష్, ప్రాంతీయ భాషా చిత్రాలు కూడా బాగా ఆడుతున్నాయి. సౌత్ ఇండియన్ సినిమాలు ఎప్పుడూ మంచి వసూళ్లను సాధిస్తున్నాయి. ఆ తర్వాత, ఈసారి పంజాబీ సినిమాలు కూడా బాగా ఆడాయి. హిందీలో 'సూర్యవంశీ', '83' సినిమాలు చాలా ఆశలు రేకెత్తించాయి. మరోవైపు 'స్పైడర్ మ్యాన్' కొత్త చరిత్ర సృష్టిస్తోంది. థియేటర్లో సినిమా చూడ్డం ఎప్పుడూ వినోదమేనని ప్రేక్షకులు నిరూపించారు" అని ఆయన అన్నారు.

ఈ ఏడాది మొత్తం 50 హిందీ సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఇందులో చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కొన్ని పెద్ద బ్యానర్లు, పెద్ద స్టార్స్ ఉన్న సినిమాలు కూడా రాణించలేకపోయాయి. మే 13న ఓటీటీతో పాటు కొన్ని థియేటర్లలో విడుదలైన సల్మాన్ ఖాన్ చిత్రం 'రాధే' నిరాశపరిచింది.

అలాగే నవంబర్‌లో జాన్ అబ్రహం 'సత్యమేవ్ జయతే-2', యశ్ రాజ్ బ్యానర్‌పై రాణి ముఖర్జీ, సైఫ్ అలీ ఖాన్ నటించిన 'బంటీ ఔర్ బబ్లీ-2' ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి.

అంతకు ముందు సెప్టెంబర్‌లో కంగనా రనౌత్ నటంచిన సినిమా 'తలవి' కేవలం రూ. 25 లక్షలు మాత్రమే వసూలు చేసింది. అమితాబ్ బచ్చన్ నటించిన చిత్రం 'చెహ్రే' కూడా కేవలం రూ.3.50 కోట్ల బిజినెస్ చేయడం వల్ల ఫ్లాప్ అయింది. అక్షయ్ కుమార్ సినిమా 'బెల్ బాటమ్' రూ.27 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది.

83

ఫొటో సోర్స్, RELIANCE ENTERTAINMENT

వెళుతూ వెళుతూ 2021 మంచి బహుమతినిచ్చింది

"ఈ ఏడాది ప్రారంభంలో తమిళంలో ‘మాస్టర్‌’ వంటి సినిమాలు సౌత్‌లో మంచి వసూళ్లను సాధించాయి. అయితే, మిగతాచోట్ల మాత్రం నిరాశే మిగిలింది. కానీ ఆగస్టు నుంచి థియేటర్లు నెమ్మదిగా ఊపందుకోవడంతో ప్రీ కోవిడ్ కాలానికి చేరుకున్నట్లు అనిపించింది" అని పెద్ద స్కీన్లకు పేరు పొందిన ఐనాక్స్ మార్కెటింగ్ ఏవీపీ పునీత్ గుప్తా చెప్పారు.

"సినిమా ప్రారంభమవడానికి ముందు, మధ్యలో చూపించే ప్రకటనల వల్ల కూడా మేం కొంత లాభం పొందుతున్నాం. ఇంతకు ముందు కన్నా దాదాపు 70 శాతం ఆదాయం ప్రకటనల ద్వారా వస్తున్నాయి. థియేటర్‌లో అమ్మే ఆహారపదార్థాల వల్ల 20 శాతం ఆదాయం వస్తోంది. దీని దృష్టిలో ఉంచుకుని మేం కొత్త రకాల ఆహారపదార్థాలను లిస్టులో జోడించాం. కొత్త సంవత్సరంలో ఆర్‌ఆర్‌ఆర్, గంగూబాయి, కేజీఎఫ్-2 వంటి చిత్రాల విజయంతో థియేటర్లకు పునర్వైభవం పూర్తిగా వస్తుందని ఆశిస్తున్నాం. సినిమాలు బాగుంటే ప్రేక్షకులు హాయిగా థియేటర్‌కి వచ్చి చూస్తారు" అని ఆయన అన్నారు.

ఓటీటీల్లో కూడా 2021లో పెద్ద పెద్ద సినిమాలే విడుదల అయ్యాయి. దృశ్యం-2, జై భీమ్, సర్దార్ ఉద్దం, మిమి లాంటి సినిమాలు విజయవంతమయ్యాయి.

ప్రస్తుతం ఉన్న అనిశ్చితి దృష్ట్యా థియేటర్ల కోసం వేచి చూడడం కంటే ఓటీటీలో విడుదల చేయం మేలని అనేకమంది నిర్మాతలు భావిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, RRRకు చే గువేరా సినిమా స్ఫూర్తినిచ్చిందా

“ఓటీటీ పరిశ్రమ వృద్ధి కరోనా కాలానికి ముందే జరిగింది. కరోనా కాలంలో దీని వేగం పుంజుకుంది. దాంతో, ఓటీటీ ఆదాయం మరింత పెరిగింది. అయితే సినిమాల విషయానికి వస్తే థియేటర్‌లో చూసి ఆనందించే అనుభవం మరెక్కడా రాదు. టీవీ, వీడియోలు వచ్చాక థియేటర్లు మూతపడతాయని అన్నారు. ఓటీటీలు వచ్చినప్పుడూ అదే మాట వినిపించింది. కానీ, ఎన్ని వచ్చినా, ఏం వచ్చినా థియేటర్ల హవా కొనసాగుతూనే ఉంది" అని నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఇంటర్నేషనల్ ఒరిజినల్ ఫిల్మ్ మాజీ డైరెక్టర్ సృష్టి బహ్ల్ ఆర్య అన్నారు.

కాబట్టి, థియేటర్లకు కోవిడ్ భయం తప్ప ఓటీటీ భయం లేదని అర్థమవుతోంది.

కోవిడ్ మళ్లీ విజృంభిస్తే థియేటర్లు మూతబడతాయి. ఇప్పుడిప్పుడే చిగురిస్తున్న ఆశలన్నీ వాడిపోతాయనే భయం ఉంది.

ఏది ఏమైనా ప్రేక్షకులు థియేటర్‌లో సినిమాలు చూడకుండా ఉండలేరని తేలిపోయింది. సూర్యవంశీ, పుష్ప, స్పైడర్ మ్యాన్ చిత్రాలు ఈ విషయాన్ని మరోసారి గట్టిగా నిరూపించాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)