కొమురం భీమ్: ‘అడవి దున్న’కు ఆదివాసీ వీరుడి పేరు.. వెల్లువెత్తుతున్న విమర్శలు

అమరధామం
    • రచయిత, ఎస్.ప్రవీణ్ కుమార్
    • హోదా, బీబీసీ కోసం

‘ఆదివాసీ’ వీరుడు కొమురం భీమ్ పేరు మరోమారు వార్తల్లోకి వచ్చింది. హైదరాబాద్ నెహ్రూ జూపార్క్‌లో ఇటీవల పుట్టిన ‘అడవి దున్న’ (ఇండియన్ గౌర్) దూడకు అక్కడి సిబ్బంది కొమురం భీమ్ అని పేరు పెట్టడం వివాదానికి దారితీసింది.

వివిధ వర్గాల నుండి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో ఆ పేరును మార్చే యోచనలో తెలంగాణ అటవీ శాఖ ఉంది.

జూన్ 2న హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్‌లో ఓ అడవి దున్న పుట్టింది. అదే రోజు ఖడ్గమృగం దూడ కూడా ఒకటి జన్మించింది. ఖడ్గమృగం దూడకు “నంద” అని పేరు పెట్టిన అధికారులు.. అడవి దున్న దూడకు కొమురం భీమ్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఈ పేరే వివాదానికి కారణమైంది.

అడవి దున్న

ఫొటో సోర్స్, S Praveen Kumar

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అధికారులు జూన్ 5న జూపార్క్‌లోనే నామకరణ కార్యక్రమం నిర్వహించారు.

అయితే తమ యోధుని పేరు ‘అడవి దున్న‘ కు పెట్టడాన్ని ఆదివాసీలు తప్పుపట్టారు.

ఇది ముమ్మాటికీ అవమానించే చర్య అని వారు అంటున్నారు. ముఖ్యంగా కొమురం భీమ్ పోరాట ప్రాంతం అయిన ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు ఈ అంశంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కొమురం సోనే రావ్

ఫొటో సోర్స్, S Praveen Kumar

ఫొటో క్యాప్షన్, కొమురం సోనే రావ్

ఆయన దైవంతో సమానం

ఈ వివాదంపై కొమురం భీమ్ మునిమనుమడు కొమురం సోనేరావ్ బీబీసీతో మాట్లాడుతూ... “నాకు నిన్ననే ఈ విషయం తెలిసింది. జూ అధికారుల తీరు తప్పు. కొమురం భీమ్ ఓ పోరాట యోధుడు. ఆదివాసీలకు దైవంతో సమానం. అడవి దున్నకు ఆ పేరు పెట్టడం ఆయనను అవమానించడమే, ఇది సరికాదు” అని అన్నారు.

మరోవైపు ఆదివాసీ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

“కొమురం భీమ్ మా జాతి నాయకుడు. ఆదివాసీ హక్కుల కోసం నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన వ్యక్తి. ఆయన్ను దున్నపోతుతో పోల్చడం ఎంత వరకు సబబు? ఇది అవమాన పరచడమే. కాలంటే నెహ్రూ జూ పార్క్‌కు కొమురం భీమ్ పేరు పెట్టండి” అని ఆదివాసీ హక్కుల పోరాట సమితి, ఆదిలాబాద్ జిల్లా అద్యక్షుడు గోడం గణేష్ బీబీసీ తో చెప్పారు.

గోండ్ ఆదివాసీ తెగకు చెందిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్ ఈ అంశంపై స్పందించారు. ‘తెలంగాణలో భీమ్ మొదటి పోరాటయోధుడు. మనుషులను మనుషులతో పోల్చాలి కానీ, ఆదివాసీ వీరుణ్ణి దున్నపోతుతో పోల్చడం సరికాదు. ఈ అంశాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తాం’’అని ఆయన బీబీసీతో అన్నారు.

ఆదివాసీలను అవమానపరిచే ఈ చర్యకు బాధ్యులైన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా సోయం బాపురావ్ డిమాండ్ చేశారు.

కొమురం భీమ్

ఫొటో సోర్స్, P Srinivas

కొమురం భీమ్ పేరు చుట్టూ వివాదాలు

గతంలోనూ కొమురం భీమ్ పేరు చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. గతంలో పవన్ కల్యాణ్ “కొమురం పులి” సినిమా సందర్భంగా.. ఈమధ్య కాలంలో దర్శకుడు రాజమౌళీ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ విడుదల సందర్భంగా ఈ పేరు వార్తల్లో నిలిచింది.

పోరాట యోధుణ్ని కమర్షియల్ వస్తువుగా వాడుకుంటున్నారని ఆదివాసీలు ఆరోపిస్తూ వస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కెరామెరి మండలం ‘జోడెన్ ఘాట్’ కొండల్లో నిజాం రాచరికానికి వ్యతిరేకంగా 1940ల్లో కొమురం భీమ్ సాయుధ పోరాటం చేశారు. ముఖ్యంగా అటవీ సంపద, భూములపై యాజమాన్య హక్కుల కోసం ఆయన పోరాటం సాగింది.

నిజాం పోలీసుల కాల్పుల్లో ఆయన తన అనుచరులతో పాటు అసువులుబాసారు. ఈ పోరాట సమయంలో ఇచ్చిందే జల్, జంగిల్, జమీన్ ( నీరు, అడవి, భూమి) అన్న పాపులర్ నినాదం.

“ఆదివాసీలు అగ్గువకు దొరికారా. ఇది అవమానించడం కాదా? ఆదివాసీలు అమాయకులని అలా పేర్లు పెట్టడం, వారిని రెచ్చగొట్టడమే ఇది మంచి విషయం కాదు.. ప్రకృతిని, మనుషులను విధ్వంసం చేయొద్దు అని కొమురం భీమ్ చెప్పారు. ఆయన ఆలోచనాపరుడు. అద్భుతమైన భారతీయుడు’’ అని ప్రముఖ తెలంగాణ కథా రచయిత ‘‘అల్లం రాజయ్య’’ బీబీసీతో చెప్పారు.

అల్లం రాజయ్య సహ రచయిత ‘సాహూ’ తో కలిసి ‘కొమురం భీమ్’అనే నవలను రాశారు. కొమురం భీమ్ చరిత్ర బయటి ప్రపంచానికి తెలియజేయడంలో ఇది ఎంతగానో తోడ్పడింది.

వీడియో క్యాప్షన్, తెలంగాణ చరిత్రలో 'జలియన్‌వాలా బాగ్' మారణకాండ

మార్పుకు సిద్ధం

ఈ వివాదం పెద్దదవుతుండడంతో తెలంగాణ అటవీ అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు.

“నెహ్రూ జూ పార్క్ సిబ్బంది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అడవి దున్న దూడకు కొమురం భీమ్ పేరు పెట్టుకున్నారు.

ఆదివాసులు.. అడవి, వన్య ప్రాణులతో మంచి సంబంధాలు కలవారు. నిజానికి వారు అడవి, అందులోని ప్రాణుల సంరక్షులుగా మేం భావిస్తాం.

అడవి దున్నకు ఆ పేరు పెట్టడం వల్ల వారి మనోభావాలు దెబ్బతిని ఉంటే.. తప్పకుండా మేం సరిదిద్దుకుంటాం” అని తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేచర్ ఆఫ్ ఫారెస్ట్ (పిసిసిఎఫ్) శోభ బీబీసీతో అన్నారు.

ఈ అంశంపై వివరణతో కూడిన ప్రకటన చేయాల్సిందిగా తెలంగాణ ఫారెస్ట్ అధికారులు.. నెహ్రూ జూ పార్క్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)