అన్నం ఎక్కువగా తింటే ముందుగానే మెనోపాజ్..!

ఫొటో సోర్స్, Getty Images
ఆహారానికీ మెనోపాజ్‌కూ చాలా దగ్గరి సంబంధం ఉందని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం చెబుతోంది.
కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తరచూ తీసుకోవడం వల్ల మెనోపాజ్ త్వరగా వచ్చే అవకాశం ఉందని యూకేలో నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
అక్కడి యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ 914మంది మహిళలపై ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.
అన్నం, పాస్తాలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల సగటు వయసు కంటే ఏడాదిన్నర ముందుగానే మెనోపాజ్ వస్తుందని లీడ్స్ అధ్యయనకర్తలు చెబుతున్నారు.
మరోపక్క ఆయిలీ ఫిష్, బటానీ, బీన్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల సహజంగా వచ్చే మెనోపాజ్ కూడా ఆలస్యమవుతుందని తెలుస్తోంది.
వీటితో పాటు జన్యు ప్రభావం కూడా మెనోపాజ్‌పై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆహార ప్రభావం ఎంత స్థాయిలో మెనోపాజ్‌పై ఉంటుందో ఇంకా పూర్తిగా తేలలేదనీ, కాబట్టి తమ ఆహారపు అలవాట్ల గురించి మహిళలు అంతగా భయపడాల్సిన అవసరం లేదనీ వాళ్లు చెబుతున్నారు.
అధ్యయనంలో పాల్గొన్న మహిళల ఆహార అలవాట్లను అధ్యయనకర్తలు తెలుసుకున్నారు. ఆ తరవాత ఫలితాలను ‘ది జర్నల్ ఆఫ్ ఎపిడిమియాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్’లో ప్రచురించారు.
బటానీ, బీన్స్ లాంటి కాయధాన్యాలను ఎక్కువగా తీసుకున్నవారిలో మెనోపాజ్ ఏడాదిన్నర ఆలస్యంగా వచ్చినట్టు గుర్తించారు.
రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు, ముఖ్యంగా అన్నం, పాస్తా ఎక్కువగా తీసుకునేవాళ్లలో మెనోపాజ్ ఏడాదిన్నర ముందుగా వస్తుందని కూడా గ్రహించారు.
మహిళల బరువు, పునరుత్పత్తి వ్యవస్థ తీరు లాంటి రకరకాల అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే అధ్యయనకర్తలు ఈ ఫలితాలను వెల్లడించారు.
యాంటీ ఆక్సిడెంట్లకు పీరియడ్స్‌ను నియంత్రించే శక్తి ఉంటుంది. అందుకే అవి ఎక్కువగా ఉండే ఆహారం మెనోపాజ్‌పై ప్రభావం చూపుతుంది.
మరోపక్క రిఫైన్డ్ కార్బొహైడ్రేట్లకు మెనోపాజ్‌ను వేగవంతం చేసే గుణం ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
‘మెనోపాజ్‌పై ఆహార ప్రభావాన్ని అంచనా వేయడం ద్వారా అనేక సానుకూలతులుంటాయి. మెనోపాజ్ సంబంధిత అనారోగ్యాలను ముందుగానే నివారించే వీలుంటుంది’ అని ఈ అధ్యయనంలో భాగం పంచుకున్న జేనెట్ కేడ్ అనే ప్రొఫెసర్ చెప్పారు.
త్వరగా మెనోపాజ్ దశకు చేరుకునే వాళ్లలో ఆస్టియోపోరోసిస్‌తో పాటు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. అదే ఆలస్యంగా మెనోపాజ్ వచ్చే వాళ్లలో బ్రెస్ట్, వూంబ్, ఒవేరియన్ క్యాన్సర్లకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
’ఈ అధ్యయనం వల్ల ఆహారానికీ, మెనోపాజ్‌కూ ఉన్న సంబంధం గురించి పూర్తిగా తెలియకపోయినా, కొందరిలో ఎందుకు మెనోపాజ్ త్వరగా వస్తుందనే విషయంపై అవగాహన మాత్రం ఏర్పడుతుంది’ అని బ్రిటిష్ మెనోపాజ్ సొసైటీ చైర్‌విమెన్ కేతీ అబెర్నెతీ అన్నారు.
‘మెనోపాజ్‌ను అంచనావేయడానికి వాళ్లు చేసిన అధ్యయనం ఆసక్తికరం. కానీ ఆహారమొక్కటే కాదు, అనేక ఇతర కారణాలపై కూడా మెనోపాజ్ ఆధారపడి ఉంటుంది’ అని సెయింట్ జార్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ సాఫ్రాన్ వైట్ హెడ్ తెలిపారు.
శరీరంలోని జీవక్రియలు కూడా పీరియడ్స్‌ను నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తాయని ఇంపీరియల్ కాలేజ్ క్లినికిల్ సీనియర్ లెక్చరర్ డాక్టర్.చన్నా జయసేన పేర్కొన్నారు.
‘ఆహారం మెనోపాజ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాన్ని ఇలాంటి అధ్యయనాలు నిర్దిష్టంగా రుజువు చేయలేకపోతున్నాయి. అవి రుజువయ్యేదాకా మహిళలు తమ ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం ఉందని నేననుకోవట్లేదు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









