బ్రిటన్: పద్నాలుగేళ్ల పాటు ఆహారంపై ఆంక్షలు
బ్రిటన్‌లో 14 ఏళ్ల పాటు ప్రజలందరికీ ఆహారానికి పరిమిత కోటా (రేషన్) అమలు చేశారు. పసిపిల్లల పాలు, చాక్లెట్ల నుంచి టీ, కాఫీలతో పాటు మాంసాహారం వరకూ అన్నిటికీ రేషన్ విధించారు. దుస్తులు కూడా పరిమితంగానే కొనుక్కోవాలి. అందుకోసం రేషన్ పుస్తకాలను కూడా ప్రజలకు జారీచేశారు.
1939లో మొదలైన రెండో ప్రపంచ యుద్ధం కారణంగా బ్రిటన్‌లో ఆహార పదార్థాలకు కొరత తలెత్తింది. అప్పటికి బ్రిటన్‌లో లభ్యమయ్యే ఆహారంలో మూడో వంతు కన్నా తక్కువే ఆ దేశంలో ఉత్పత్తయ్యేది.

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధ కాలంలో బ్రిటన్‌కు నౌకల ద్వారా ఆహార పదార్థాలను దిగుమతి చేసుకోవడం కష్టంగా మారింది. శత్రు దేశాలు బ్రిటన్ ఆహార నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం దీనికి కారణం.
దీంతో ప్రజలకు ఆహార కొరత లేకుండా చూడటానికి, అందరికీ సక్రమంగా ఆహారం అందేలా చేయటానికి, ఎవరూ ఆహారపదార్థాలను పెద్ద మొత్తంలో నిల్వచేసుకోకుండా నిరోధించడానికి ఈ రేషన్ పద్ధతిని విధించారు.

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధం మొదలైన నాలుగు నెలల తర్వాత 1940 జనవరి 8న ఆహార పదార్థాలపై రేషన్ అమలులోకి వచ్చింది. రొట్టెలు తయారు చేయడానికి ఉపయోగంచే పిండి, వెన్న, పంచదార వంటి నిత్యావసర పదార్థాలతో పాటు దుస్తులు, ఇంటి సామాను, ఇంధనం వంటి వస్తువులపైనా పరిమితులు విధించారు.
1940 మార్చి 11న అన్ని రకాల మాంసం పైనా రేషన్ విధించారు. దుస్తుల కొనుగోళ్లకు కూపన్లు ప్రవేశపెట్టారు. దీనివల్ల బ్రిటన్‌లో నల్లబజారు కూడా తయారైంది. షాపుల ముందు భారీ క్యూలు ఉండేవి. అదనంగా ఆహారం అవసరమైన వారు వేరే వస్తువులను మార్చుకునేవారు.

ఫొటో సోర్స్, Getty Images
స్వీట్లు, చాక్లెట్లపై 1942 జూలై 26న రేషన్ విధించారు.
యుద్ధ సమయంలో బ్రిటన్ ప్రజలకు సమతుల ఆహారం లభించేలా ఆహార మంత్రిత్వశాఖకు చెందిన నిపుణులు చర్యలు చేపట్టారు.
పరిమితంగా లభించే పదార్థాలతో ఆరోగ్యవంతమైన ఆహారాలను తయారు చేసుకునే మార్గాలను ప్రజలకు చేరవేయడానికి పోటాటో పీట్, డాక్టర్ కారట్ వంటి క్యారెక్టర్లను ఉపయోగించుకున్నారు. రేడియో కార్యక్రమాలు ప్రసారం చేసేవారు.

ఫొటో సోర్స్, Getty Images
గర్భిణిలకు కొంత అదనంగా ఆహారం అందించడానికి ప్రత్యేకంగా ఆకుపచ్చ రేషన్ పుస్తకాలు ఇచ్చేవారు. పసివారి కోసం కొన్ని నెలలు పాలు కూడా అదనంగా ఇచ్చేవారు.
యుద్ధ కాలంలో మాంసం కోసం కోళ్లు, కుందేళ్లు, పందులు వంటి వాటిని ఇళ్ల వద్ద పెంచుకునే వారు. పండే ఏ స్థలంలోనైనా కూరగాయలు పండించుకునేవారు.
రేషన్ అమలులో ఉన్న కాలంలో ఆహారం వృధా చేయడం నేరం కింద చేర్చారు. రెస్టారెంట్లలో ఆహార పదార్థాల పరిమాణం తగ్గిపోయింది.

ఫొటో సోర్స్, Getty Images
యుద్ధం ముగిసిన మూడేళ్ల తర్వాత ఈ పరిమితులను క్రమంగా తొలగించారు. 1948లో రేషన్ ప్రక్రియ తొలగించటం మొదలైనప్పటికీ.. మరో ఐదేళ్లకు కానీ పరిమితులు పూర్తిగా రద్దు కాలేదు.
1948 జూలై 25న తొలుత పిండి మీద, మరుసటి ఏడాది మార్చిలో దుస్తుల మీద రేషన్ రద్దు చేశారు. 1950 మే 19న పండ్లు, చాకొలెట్ బిస్కెట్లు, జెల్లీలు తదితర ఆహార పదార్థాలనూ రేషన్ నుంచి మినహాయించారు.

ఫొటో సోర్స్, Getty Images
1939లో విధించిన పెట్రోల్ రేషన్‌ను 1950 మేలో తొలగించారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో సోప్ మీద కూడా రేషన్ రద్దయింది.
ఆ తర్వాత మూడేళ్లకు పంచదార విక్రయాల మీద రేషన్ తొలగించగా.. 1954 మే నెలలో వెన్న మీద కూడా ఆంక్షలు ఎత్తేశారు.

ఫొటో సోర్స్, Getty Images
అదే ఏడాది ఫిబ్రవరిలో పోర్క్ (పంది మాంసం) విక్రయం మీద రేషన్ తొలగించిన బ్రిటన్ సర్కారు.. జూలై 14న మిగతా మాంసం విక్రయాలన్నిటి మీదా పరిమితులను పూర్తిగా ఎత్తివేసింది.
దీంతో బ్రిటన్ వాసుల పద్నాలుగేళ్ల రేషన్ కష్టాలకు తెరపడ్డట్టయింది. ఈ రేషన్ రద్దయిన ఘటనను చాలా మంది రేషన్ పుస్తకాలను బహిరంగ సమావేశాల్లో చించివేసి పండుగలా జరుపుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









