అమెరికా వర్సెస్ ఇరాన్: మూడో రోజు జరిగిన వరస పరిణామాలేంటి?

అమెరికా వర్సెస్ ఇరాన్

ఫొటో సోర్స్, Getty Images

చదివే సమయం: 4 నిమిషాలు

ఇరాన్ దివంగత సుప్రీంలీడర్ అలీ ఖమేనీ భార్య చనిపోయారని ఇరాన్ ప్రభుత్వ టీవీ - చానల్ టు నిర్ధరించింది.

ఖమేనీ భార్య మాన్‌సౌరె ఖొజస్టెబగ్‌హర్జాదెహ్ తన ఇంట్లోనే చనిపోయారని ఆ చానెల్ పేర్కొంది.

ఆమె కోమాలో ఉన్నారని ఇంతకుముందు ఇరాన్ మీడియా తెలిపింది.

ఖమేనీ-మాన్‌సౌరె దంపతులకు ఆరుగురు పిల్లలు.

వారిలో నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
లెబనాన్, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా
ఫొటో క్యాప్షన్, ఇరాన్ మిస్సైల్‌తో దాడి చేసిన ప్రాంతాన్ని నెతన్యాహు పరిశీలించారు.

ఇరాన్ దాడి చేసిన ప్రాంతాన్ని పరిశీలించిన నెతన్యాహు

ఇజ్రాయెల్‌పై ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్‌తో దాడి చేసిన ప్రాంతాన్ని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పరిశీలించారు. ఆదివారం ఇరాన్ ఈ దాడి చేసింది. టెల్ అవీవ్, జెరూసలేం మధ్యలో ఉన్న బీట్ షెమాష్ వద్ద ఇరాన్ ప్రయోగించిన క్షిపణి పేలడంతో ముగ్గురు టీనేజర్లు సహా తొమ్మిదిమంది చనిపోయారు.

ఇరాన్ అణ్వాయుధాలను, వాటిని ప్రయోగించే సామర్థ్యాన్ని పొందితే అది మొత్తం మానవాళికి ప్రమాదంగా మారుతుందని నెతన్యాహు అన్నారు.

''మా రక్షణ కోసం మేం చర్యలు తీసుకున్నాం. అలా చేయడం ద్వారా మరెందరో ప్రజలను కూడా రక్షిస్తున్నాం. ఈ ప్రపంచాన్ని కాపాడే గొప్ప ప్రయత్నంలో మాతో కలిసి పనిచేసిన మా మంచి స్నేహితుడు, ప్రపంచ నాయకుడు డోనల్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇజ్రాయెల్ సైన్యం తెహ్రాన్‌పై దాడులు కొనసాగిస్తోంది. ఇది ఎప్పటికీ ముగియని యుద్ధమని అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు.

లెబనాన్, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడితర్వాతి దృశ్యం

లెబనాన్‌పై ఇజ్రాయెల్ వరుస దాడులు

లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మిలిటెంట్ గ్రూపులు ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగిస్తున్నాయని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది.

బేరూత్, దక్షిణ లెబనాన్‌లపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 31 మంది చనిపోయారని లెబనాన్ ఆరోగ్యశాఖ చెప్పింది. హిజ్బొల్లా దాడులకు ప్రతిగా తాము దాడులు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది.

ఆదివారం బేరూత్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హిజ్బొల్లా ఇంటెలిజెన్స్ చీఫ్ హెస్సేన్ మాకెల్డ్ చనిపోయారని ఐడీఎఫ్ తెలిపింది.

''ఉగ్రవాది, హిజ్బొల్లా ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్ హెడ్ హుస్సేన్ మాకెల్డ్‌ను అంతమొందించాం'' అని ఒక ప్రకటనలో ఐడీఎఫ్ తెలిపింది.

లెబనాన్, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, లెబనాన్‌లో పేలుడు దృశ్యాలు

మరోవైపు తక్షణమే లెబనాన్ వీడాలని ఆ దేశంలో ఉన్న తమ పౌరులకు అమెరికా సూచించింది.

''లెబనాన్‌కు వెళ్లవద్దని అమెరికా ప్రజలను కోరుతున్నాం. ఇప్పటికే లెబనాన్‌లో ఉన్నావారు అక్కడినుంచి వచ్చేయాలి. కమర్షియల్ విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి'' అని బేరూత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం 'ఎక్స్'లో తెలిపింది.

హిజ్బొల్లాకు గట్టిపట్టున్న బేరూత్‌లోని దాహియె ప్రాంతంలో భారీ పేలుడు శబ్దం వినిపించిందని బీబీసీ ప్రతినిధులు రిపోర్ట్ చేశారు.

లెబనాన్, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా

ఫొటో సోర్స్, Reuters

అమెరికా, గల్ఫ్ మిత్రదేశాల సంయుక్త ప్రకటన

పొరుగుదేశాలపై ఇరాన్ దాడులు సోమవారం నాడు కూడా కొనసాగాయి. సౌదీ అరేబియాలో ఒక ఆయిల్ రిఫైనరీపై దాడి జరిగింది. అయితే అక్కడి పరిస్థితి అదుపులో ఉంది. ఖతార్‌లో ఓ భారీ గ్యాస్ ప్లాంట్‌పైనా ఇరాన్ దాడి చేసింది. బహ్రెయిన్, దుబాయ్‌లోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టు వార్తలొచ్చాయి.

ఇరాన్ దాడుల తర్వాత తమ ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశామని ఖతార్ ప్రకటించింది.

అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధర భారీగా పెరిగింది. ఒక దశలో ఇది 42శాతానికి పైగా పెరిగింది.

అమెరికా, దాని గల్ఫ్ మిత్రదేశాలు బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇరాన్ చర్యలు 'ప్రమాదకరమైన ఉద్రిక్తతలను పెంచుతున్నాయని' పశ్చిమాసియాలో శాంతిని, స్థిరత్వాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయని ఆ ప్రకటనలో ఆరోపించాయి.

ఇరాన్ దాడుల్లో తమ సైన్యానికి చెందిన నలుగురు చనిపోయారని అమెరికా చెప్పింది. అయితే ఎక్కడ చనిపోయారో వెల్లడించలేదు.

సైప్రస్‌లోని యూకే సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్న రెండు డ్రోన్లను సైప్రస్ సైన్యం అడ్డుకుంది. .

ఇరాన్‌పై అమెరికా దాడులను యూరప్ పూర్తిగా సమర్థిస్తోందని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే చెప్పారు.

లెబనాన్, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, అమెరికా రక్షణ సెక్రటరీ పీటర్ హెగ్సెత్

యుద్ధాన్ని మేం ప్రారంభించలేదు..కానీ ముగిస్తాం- అమెరికా

ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీపై అమెరికా రక్షణశాఖ సెక్రటరీ పీట్ హెగ్సెత్ మాట్లాడారు.

ఈ ఆపరేషన్‌ను అమెరికా-ఇరాక్ యుద్ధంతో పోల్చడాన్ని ఆయన తప్పుబట్టారు.

పశ్చిమాసియాకు కొత్తరూపు ఇవ్వడానికి ఇది చరిత్రాత్మక అవకాశమని హెగ్సెత్ అన్నారు.

నమ్మశక్యంగాని ఈ అవకాశాన్నుంచి ఇరాన్ ప్రజలు లాభం పొందుతారని ఆశిస్తున్నట్టు హెగ్సెత్ చెప్పారు.

''తెలివిగా వ్యవహరించాలి'' అని ఇరాన్ భద్రతాబలగాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

''మేం ఈ యుద్ధాన్ని ప్రారంభించలేదు. కానీ ట్రంప్ నాయకత్వంలో దీన్ని ముగిస్తున్నాం'' అని హెగ్సెత్ వ్యాఖ్యానించారు.

తదుపరి నోటీసులొచ్చేవరకు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయం అక్కడి తమ దేశ ప్రజలకు సూచించింది. అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ప్రదర్శనలు, గుంపులవైపు వెళ్లొద్దని తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)