ప్రతీక్ యాదవ్: ములాయం సింగ్ యాదవ్ కుమారుడి మృతిపై అనుమానాలేమిటి?

ఫొటో సోర్స్, Prateek Yadav
- రచయిత, సయ్యద్ మోజిజ్ ఇమామ్
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
ములాయం సింగ్ యాదవ్ రెండో కుమారుడు ప్రతీక్ యాదవ్ బుధవారం మరణించారు. ఆయన అంత్యక్రియలు గురువారం లఖ్‌నవూలో నిర్వహించారు.
రక్తం గడ్డకట్టడం వల్ల ప్రతీక్ యాదవ్ మరణించినట్టు ఆయన పోస్ట్‌మార్టం నివేదికలో పేర్కొన్నారు.
ప్రొఫెసర్ డాక్టర్ మౌసమి సింగ్ నేతృత్వంలో ముగ్గురు వైద్యుల బృందం ప్రతీక్ యాదవ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసింది.
"కార్డియోరెస్పిరేటరీ కోలాప్స్ డ్యూ టు మాసివ్ పల్మనరీ థ్రోంబోఎంబోలిజమ్" అని నివేదికలో పేర్కొన్నారు.
ఊపిరితిత్తుల ప్రధాన సిరలో రక్తం గడ్డకట్టడం వల్ల శ్వాస, గుండె కొట్టుకోవడం అకస్మాత్తుగా ఆగిపోయాయని దీనర్థం.

అయితే ఆయన మరణానికి ముందు శరీరంపై ఆరుచోట్ల గాయాలయ్యాయని కూడా ఆ నివేదికలో పేర్కొన్నారు.
ప్రతీక్ యాదవ్ ఛాతీ భాగంలో, కుడి చేతి పైభాగంలో, దిగువ భాగంలో మూడు చోట్ల గాయాలు ఉన్నట్లు తెలిపారు. అలాగే మోచేయి, ఎడమ మణికట్టు వద్ద కూడా గాయాల గుర్తులు ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొన్నారు.
ప్రతీక్ యాదవ్ గుండె, రక్తపు గడ్డలతోపాటు అంతర్గత అవయవాలను కూడా తదుపరి పరీక్షల కోసం భద్రపరిచారు.
ప్రతీక్ యాదవ్‌ను బుధవారం లఖ్‌నవూలోని సివిల్ హాస్పిటల్‌కి తీసుకొచ్చారు. హాస్పిటల్‌కి తీసుకొచ్చేసరికే ఆయన మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
"బుధవారం ఉదయం 5:55 గంటలకు ప్రతీక్ యాదవ్‌ను నిర్జీవ స్థితిలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. పోలీసులకు సమాచారం అందించాం. ఆ తర్వాత పోలీసులు మృతదేహానికి పంచనామా చేసి పోస్ట్‌మార్టం కోసం పంపారు" అని సివిల్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దేవేష్ చంద్ర పాండే బీబీసీతో చెప్పారు.
ప్రతీక్ యాదవ్ మరణం అనుమానాస్పదంగా ఉందని సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి.
ప్రతీక్ యాదవ్ పోస్ట్‌మార్టం సమయంలో కేజీఎంయూ బయట ఉన్న లఖ్‌నవూ సెంట్రల్ సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే రవిదాస్ మెహ్రోత్రా చేసిన వ్యాఖ్యలతో ఈ అంశంపై చర్చ తీవ్రమైంది.
"ఏ ఇబ్బందుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఆయన మరణం అనుమానాస్పదమే" అని రవిదాస్ మెహ్రోత్రా మీడియాతో అన్నారు.
"సాధారణ మరణమైతే పోస్ట్‌మార్టం చేయరు, అందువల్ల దీనిపై విచారణ జరపాలి" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/PRATEEK YADAV
ప్రతీక్ యాదవ్ ఛాతి, కుడి చేతి కింద భాగం, కుడి మణికట్టు, కుడి మోచేయి జాయింట్, మోచేయి పై భాగం, ఎడమ మణికట్టు వద్ద గాయాలు ఉన్నట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
"వీటిలో మూడు గాయాలు సుమారు ఐదు నుంచి ఏడు రోజుల క్రితం అయినవి కాగా, మిగిలిన మూడు గాయాలు ఒక రోజు క్రితం అయినవి" అని రిపోర్ట్‌లో ఉంది.
"అనుమానానికి దారితీసే అనేక కారణాలు ఉన్నాయి, కాబట్టి ప్రతీక్ యాదవ్ ఎలా గాయపడ్డారో విచారణ జరపాలి" అని రవిదాస్ మెహ్రోత్రా గురువారం అన్నారు.
"హత్య జరిగిందని నేను అనడం లేదు, కానీ పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాన్ని నాలుగు గంటల పాటు మార్చురీలో ఎందుకు ఉంచారు? ప్రతీక్‌ను సివిల్ ఆసుపత్రికి తీసుకువచ్చేసరికే చనిపోయి ఉన్నారు అంటే ఆసుపత్రికి తీసుకురావడంలో ఆలస్యం జరిగిందా అనే విషయంపై కూడా విచారణ జరగాలి" అని ఆయన అన్నారు.
అయితే పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మరింత దర్యాప్తు చేస్తేనే ఏం జరిగిందో స్పష్టమవుతుందని లఖ్‌నవూకు చెందిన సీనియర్ వైద్యుడు దయామ్ రజా ఖాన్ తెలిపారు.
"ప్రతీక్ శరీరంలోని వివిధ భాగాల్లో అనేక తీవ్రమైన గాయాలు ఉన్నాయని" అని ఆయన అన్నారు.
"అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మెదడులోని రెండు టెంపోరో-పారిటల్ ప్రాంతాలలో సబ్-అరాక్నాయిడ్ హెమరేజ్ ఉండటం, ఇది తీవ్రమైన తల గాయాన్ని సూచిస్తుంది. గాయాల స్వభావం, సంఖ్య, తీరు చూస్తే హింసాత్మక దాడి అనుమానాలు కనిపిస్తున్నాయి" అని ఆయన అన్నారు.
ఈ విషయాలు కేసును అత్యంత కీలకంగా మారుస్తాయని, అందుకే ఈ కేసులో నిష్పక్షపాతంగా, శాస్త్రీయంగా పూర్తి స్థాయి విచారణ అవసరం అని ఆయన అన్నారు.
"అందుబాటులో ఉన్న పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం, మరణానికి గల కారణంపై వెంటనే పూర్తి శాస్త్రీయ నిర్ధరణకు రావడం సరైందిగా కాదు. ఎందుకంటే తుది కారణాన్ని నిర్ధరించాలంటే మరింత కెమికల్, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అవసరమని ఆ నివేదిక పరిగణించింది" అని ఫోరెన్సిక్ సైన్స్‌లో పరిశోధన చేస్తున్న మీనాక్షి శుక్లా బీబీసీతో చెప్పారు.
'ఫోరెన్సిక్ సైన్స్ ప్రకారం ఒక మరణం ఎలా జరిగింది అన్నదానికి కేవలం ప్రాథమిక పోస్ట్‌మార్టం ఫలితాలు మాత్రమే సరిపోవు' అని శుక్లా అన్నారు.

ఫొటో సోర్స్, FACBOOK/PRATEEK YADAV
"వైద్యులు తుది నిర్ణయాన్ని ఇప్పుడే ఇవ్వకుండా, ఇంకా శాస్త్రీయ పరీక్షల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. దీన్నిబట్టి మరణానికి గల కారణం వెంటనే స్పష్టంగా తెలియలేదని అర్థమవుతోంది" అని మీనాక్షి శుక్లా అన్నారు.
శరీరంలో విషపదార్థాలు, మందులు, మద్యం లేదా విషపూరిత రసాయనాలు ఉన్నాయో లేదో సూచించే టాక్సికాలజీ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉందని మీనాక్షి శుక్లా తెలిపారు. అందువల్ల, విషపదార్థం, మందు, మందుల ప్రతిచర్య లేదా రసాయన కారణం వల్ల మరణం సంభవించి ఉండవచ్చని ఆలోచించే అవకాశం ఉందని ఆమె చెప్పారు.
ఈ దశలోనే మరణాన్ని సహజమైనదిగా, ప్రమాదవశాత్తు జరిగినదిగా, ఆత్మహత్యగా లేదా హత్యగా వెంటనే వర్గీకరించడం శాస్త్రీయంగా తొందరపాటు అవుతుందని ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అనుమానాస్పద పరిస్థితులలో మరణించినప్పుడు లేదా విష సంబంధిత పరీక్షలు అవసరమైనప్పుడు, విసెరా అంటే శరీరంలోని అంతర్గత అవయవ నమూనాలను ముఖ్యమైనవిగా పరిగణిస్తారు.
రసాయన, జీవ, విష శాస్త్ర పరీక్షలు చేయాల్సి ఉందని రిపోర్టులో ఉన్నట్టు మీనాక్షి శుక్లా చెప్పారు.
"ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చి పోస్ట్‌మార్టం ఫలితాలను నిర్ధరించే వరకు, మరణానికి ఖచ్చితమైన కారణాన్ని తుది నిర్ధరణగా చెప్పలేం" అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/PRATEEK YADAV
ఇంతకుముందు ప్రతీక్ యాదవ్ మేదాంత ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.
మేదాంత ఆసుపత్రికి చెందిన డాక్టర్ రుచిత శర్మ ప్రతీక్ యాదవ్‌కు చికిత్స అందిస్తున్నట్టు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పేర్కొంది.
ఊపిరితిత్తులలో అడ్డంకి ఏర్పడటం వల్ల అతని గుండె పనితీరు దెబ్బతిందని డాక్టర్ శర్మ తెలిపారు.
"కొన్ని వారాల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని ఆయన మా దగ్గరికి వచ్చారు. ఆయన బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నారు" అని ఆమె చెప్పారు.
"నేను కొన్ని రోజుల క్రితం ఆయన్ను కలిశాను. అప్పుడు కూడా తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పాను. కొన్నిసార్లు ఆర్థిక నష్టాలు ఒక వ్యక్తిని చాలా కుంగదీస్తాయి. ఆయన ఇక మనతో లేరు. కుటుంబం ఏం చెబితే అదే చేస్తాం" అని ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ములాయం మరో కుమారుడు అఖిలేష్ యాదవ్ అన్నారు.
ప్రతీక్ యాదవ్ భారతీయ జనతా పార్టీ నాయకురాలు అపర్ణా యాదవ్ భర్త. ఆయన ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కుమారుడు. సాధన గుప్తా 2022లో మరణించారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)























