ఎన్‌సీఈఆర్‌టీ ఎనిమిదో తరగతి పుస్తకంపై సుప్రీంకోర్ట్ సీరియస్

ఫొటో సోర్స్, Getty Images
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) రూపొందించిన ఎనిమిదో తరగతి సోషల్ సైన్స్ పుస్తకంపై గురువారం సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దానిని నిషేధించాలని ఆదేశించింది.
'న్యాయవ్యవస్థలో అవినీతి' (కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ) అనే శీర్షికతో ఉన్న ఒక అధ్యాయం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఎన్‌సీఈఆర్‌టీపై ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఎన్‌సీఈఆర్‌టీ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన ఈ కేసును చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తోంది.
ఈ పుస్తకంలోని ఒక అధ్యాయంలో 'న్యాయవ్యవస్థలో అవినీతి, పెండింగ్‌లో ఉన్న కేసులు' గురించి చర్చ ఉంది.
''ఇది న్యాయవ్యవస్థను అప్రతిష్ట పాలు చేసేందుకు జరిగిన కుట్రలా కనిపిస్తోంది'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.


ఫొటో సోర్స్, Getty Images
'ఇదొక పథకం ప్రకారం చేసిందే అనిపిస్తోంది...'
''పుస్తకంలోని ఆ చాప్టర్‌లో అంశాలను ప్రాథమికంగా పరిశీలించినప్పుడు, ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ నుంచి వచ్చిన పరిపాలనాపరమైన సమాధానంతో కలిపి చదివితే ఇది వ్యవస్థాగత అధికారాన్ని బలహీనపరిచేందుకు, న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేందుకు ఒక పథకం ప్రకారం చేసిన ప్రయత్నంగా మాకు అనిపిస్తోంది'' అని ధర్మాసనం పేర్కొంది.
ఒకవేళ దీనిని నియంత్రించకుండా వదిలేస్తే, అది న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించింది.
''ఈ పుస్తకం కేవలం విద్యార్థులకే పరిమితం కాదని మనం గుర్తుంచుకోవాలి. ఇది ఉపాధ్యాయుల నుంచి విద్యార్థులకు, ఆపై తల్లిదండ్రులకు, అంటే మొత్తం సమాజానికి, రాబోయే తరాలకు చేరుతుంది'' అని ధర్మాసనం అభిప్రాయపడింది.
అంతేకాకుండా, ''మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్రపై ఈ ప్రచురణలో ఒక పూర్తి అధ్యాయాన్ని కేటాయించారు. కానీ, ఒక్క కలం పోటుతో సుప్రీంకోర్టు, హైకోర్టులు, జిల్లా కోర్టుల ఘనమైన చరిత్రను పూర్తిగా విస్మరించారు" అని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఈ పుస్తకానికి సంబంధించిన అన్ని ప్రతులను... అవి డిజిటల్ రూపంలో ఉన్నా, ఆన్‌లైన్‌లో ఉన్నా లేదా హార్డ్ కాపీల రూపంలో ఉన్నా వెంటనే వెనక్కి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.

ఫొటో సోర్స్, ANI
చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే...
''ఎన్‌సీఈఆర్‌టీ, కేంద్ర, రాష్ట్ర విద్యా శాఖలు లేదా ఇతర సంబంధిత విభాగాల సమన్వయంతో ప్రస్తుతం వాడుకలో ఉన్న, స్టాక్ రూమ్‌లలో ఉన్న లేదా విద్యా సంస్థలు, దుకాణాలలో అందుబాటులో ఉన్న హార్డ్ కాపీలు లేదా సాఫ్ట్ కాపీలన్నింటినీ తక్షణమే స్వాధీనం చేసుకుని, ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలి" అని సుప్రీంకోర్టు తన ఆదేశాలలో స్పష్టం చేసింది.
ఈ పుస్తకాలను ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్వాధీనం చేసుకునేలా చూడాలని, సంబంధిత వ్యక్తులు కోర్టు ఆదేశాల అమలుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
డైరెక్టర్‌పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ఆదేశిస్తూ ఎన్‌సీఈఆర్‌టీకి నోటీసులు జారీ చేసింది.
ఇలా బుధవారం సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసిన తర్వాత, ఎన్‌సీఈఆర్‌టీ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఆ పుస్తకాన్ని ఉపసంహరించుకుంటామని, ఆ చాప్టర్ ప్రచురణ పట్ల క్షమాపణలు కోరుతున్నామని అందులో తెలిపింది.
అయితే, ఈ క్షమాపణ నిజాయితీతో కూడినదేనా లేక కేవలం కోర్టు తీసుకునే తీవ్ర పరిణామాల నుంచి తప్పించుకోవడానికి చేసిన అధికారిక ప్రక్రియా అనేది తాము విచారిస్తామని కోర్టు పేర్కొంది.
ఈ కేసు తదుపరి విచారణను మార్చి 11వ తేదీకి వాయిదా వేసింది.
కోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, ఈ చాప్టర్‌ను రూపొందించడంలో పాలుపంచుకున్న వ్యక్తులను భవిష్యత్తులో మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఎటువంటి కార్యకలాపాల్లోనూ చేర్చుకోబోమని చెప్పారు. దీనిపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ, ఇది 'చాలా స్వల్ప శిక్ష' కావచ్చునని మౌఖికంగా వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎన్సీఈఆర్టీ క్షమాపణలు...
ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలోని "న్యాయవ్యవస్థలో అవినీతి" అనే శీర్షికతో ఉన్న అధ్యాయంపై బుధవారం సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తంచేయడంతో, ఎన్‌సీఈఆర్‌టీ క్షమాపణలు చెబుతూ వివాదాస్పదమైన సదరు పుస్తకాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది.
ఒక అధ్యాయంలో "అనుచిత పాఠ్యాంశాలు" పొరపాటున చేరాయని, ఇది నిర్ణయం తీసుకోవడంలో జరిగిన పొరపాటు అని అంగీకరిస్తూ ఎన్‌సీఈఆర్‌టీ ప్రెస్ నోట్ విడుదల చేసింది.
'ఎక్స్‌ప్లోరింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్' పుస్తకాన్ని పరిశీలించినప్పుడు, 4వ అధ్యాయం 'మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర'లో కొన్ని అనుచిత అంశాలు, నిర్ణయాత్మక లోపాలు పొరపాటున చోటుచేసుకున్నాయని గుర్తించాం" అని వివరణ ఇచ్చింది.
విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం కూడా ఇదే విధమైన ఆందోళన వ్యక్తం చేసిందని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పుస్తక పంపిణీపై కఠినమైన నిషేధం విధించేలా ఆదేశించిందని ఎన్‌సీఈఆర్‌టీ బోర్డు తెలిపింది.
ఈ పుస్తకంలో చాప్టర్ ఒక ముందస్తు ప్రణాళికతో చేసిన చర్యగా పేర్కొంటూ, దీనిపై సుమోటోగా విచారణ చేపడతామని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ చెప్పిన కొన్ని గంటలకే ఎన్‌సీఈఆర్‌టీ నుంచి క్షమాపణలతో ప్రెస్ నోట్ విడుదలైంది.
''న్యాయవ్యవస్థను అప్రతిష్ట పాలుచేసేందుకు ఎవరినీ అనుమతించబోం'' అని ప్రధాన న్యాయమూర్తి నొక్కి చెప్పారు.
అయితే, తాము న్యాయవ్యవస్థకు అత్యున్నత గౌరవం ఇస్తామని, దానిని భారత రాజ్యాంగ సంరక్షకులుగా, ప్రాథమిక హక్కుల పరిరక్షకులుగా భావిస్తామని ఎన్‌సీఈఆర్‌టీ బోర్డు పేర్కొంది.

ఫొటో సోర్స్, Sondeep Shankar/Getty Images
ఆ ‘చాప్టర్’పై సిబల్ తీవ్ర అభ్యంతరం
ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో భారత న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ల గురించి ప్రస్తావించారు. అవినీతి, కోర్టుల్లో పేరుకుపోయిన కేసులు, న్యాయమూర్తుల కొరత వంటి అంశాలను అందులో పేర్కొన్నారు.
అంతేకాకుండా, "రాష్ట్ర, కేంద్ర స్థాయిల్లో న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచడానికి, పారదర్శకతను నిర్ధరించడానికి సాంకేతికతను ఉపయోగించడంతో పాటు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని కూడా అందులో వివరించారు.
అయితే, కార్యనిర్వాహక వ్యవస్థ, బ్యూరోక్రసీ వంటి ఇతర విభాగాల్లో అవినీతి గురించి ప్రస్తావించకుండా, కేవలం న్యాయవ్యవస్థలో అవినీతిపై ఒక ప్రత్యేక అధ్యాయాన్ని తీసుకురావడం పట్ల బుధవారం నాడు న్యాయవ్యవస్థకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో, ‘‘ఈ పుస్తకంలో న్యాయవ్యవస్థలోని అవినీతిపై ఒక అధ్యాయం ఉన్నప్పుడు, మరి రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రజాసేవకులు, దర్యాప్తు సంస్థల్లో విస్తృతంగా ఉన్న అవినీతి మాటేమిటి? వాటిని ఎందుకు విస్మరిస్తున్నారు?’’ అని రాశారు.
ఈ అంశాన్ని కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీలు ఈ అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లి, అత్యవసర విచారణను కోరారు. పుస్తకంలోని ఆ అధ్యాయం 'ఆక్షేపణీయం' అన్నారు. దీనిపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ, సుప్రీంకోర్టు దీనిపై సుమోటోగా విచారణ చేపడుతుందని చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













