ఇతర మతాల విషయంలో నిష్పాక్షికంగా ఉండేందుకు న్యాయమూర్తి నాస్తికుడు కానవసరం లేదు: జస్టిస్ డీవై చంద్రచూడ్

జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, అయోధ్యలో రామ మందిరం, ఆర్టికల్ 370, న్యాయ స్వేచ్ఛ
ఫొటో క్యాప్షన్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్

అయోధ్యలో రామ మందిర నిర్మాణం కేసులో తీర్పు వెలువరించడానికి ముందు, ఈ సమస్యకు పరిష్కారం చూపించమని దేవుడిని ప్రార్థించాననే వార్తల్ని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ తిరస్కరించారు.

అయోధ్య వివాదంలో తీర్పు, ఆర్టికల్ 370, న్యాయ శాఖలో పారదర్శకతతో పాటు అనేక అంశాలపైన జస్టిస్ చంద్రచూడ్ బీబీసీ ప్రతినిధి స్టీవెన్ సేకర్‌తో ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

"రామ మందిర వివాదంపై నిర్ణయం తీసుకోవడానికి ముందు మార్గం చూపించాలని మీరు భగవంతుడిని ప్రార్థించారా?" అని స్టీవెన్ అడిగారు.

ఈ ప్రశ్నకు జస్టిస్ చంద్రచూడ్ సమాధానం ఇస్తూ "ఇది పూర్తిగా అబద్దం. సామాజిక మాధ్యమాల్లో ఈ ప్రచారం జరిగింది. నా వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు" అని చెప్పారు.

జస్టిస్ డీవై చంద్రచూడ్ 2022 నవంబర్ నుంచి 2024 నవంబర్ 10వరకు భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.

చంద్రచూడ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలోనే అనేక ముఖ్యమైన అంశాల మీద సుప్రీంకోర్టు తీర్పులు వెల్లడించింది.

కొన్ని తీర్పుల విషయంలో ఆయనపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రాజకీయ ఒత్తిడి ఉందనే ఆరోపణలు వినిపించాయి.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, అయోధ్యలో రామ మందిరం, ఆర్టికల్ 370, న్యాయ స్వేచ్ఛ
ఫొటో క్యాప్షన్, బీబీసీ ప్రతినిధి స్టీవెన్ సేకర్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను పలు అంశాలపై ప్రశ్నించారు.

న్యాయ స్వేచ్ఛ

నరేంద్ర మోదీ భారతదేశాన్ని ఏక పార్టీ పాలన కిందకు తెచ్చేందుకు, బీజేపీని రక్షించుకోవడానికి, ప్రత్యర్థుల్ని అణచి వేయడానికి కోర్టులను ఆశ్రయించారని విశ్లేషకులు, దౌత్యవేత్తలు, ప్రతిపక్షాలు చెప్తున్నారంటూ 2023లో న్యూయార్క్‌టైమ్స్ రాసింది.

న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రస్తావిస్తూ, స్టీవెన్ సేకర్ మీరు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న కాలంలో రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొన్నారా అని అడిగినప్పుడు జస్టిస్ డీవై చంద్రచూడ్ "ది న్యూయార్క్ టైమ్స్‌లో రాసిందంతా పూర్తిగా అబద్దం. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడంలో వాళ్లు విఫలం అయ్యారు. 2024 ఎన్నికలు ఒకే దేశం- ఒకే పార్టీ అనే ఆలోచనను భగ్నం చేశాయి. భారత దేశంలోని రాష్ట్రాల్లో ప్రాంతీయ ఆశలు, ఆకాంక్షలే ముఖ్యం. అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. వాటి పని తీరు అద్బుతంగా ఉంది" అని చెప్పారు.

కొన్నేళ్లుగా అనేక మంది ప్రతిపక్ష నాయకులు, పౌర సమాజ కార్యకర్తలు, జర్నలిస్టులను జైళ్లలో పెట్టారు. 2023లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి పరువు నష్టం దావా కేసులో గుజరాత్ కోర్టు శిక్ష విధించింది. దీని వల్ల ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశం ఏర్పడింది. అయితే తర్వాత సుప్రీంకోర్టు ఈ తీర్పుపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

రాహుల్ గాంధీ కేసులో సుప్రీంకోర్టు జోక్యంతో న్యాయ వ్యవస్థ మీద రాజకీయ జోక్యం లేదని భావించవచ్చా? అని స్టీవెన్.. జస్టిస్ చంద్రచూడ్‌ను అడిగారు.

ఈ ప్రశ్నపై స్పందించిన జస్టిస్ చంద్రచూడ్ "2024లో సుప్రీంకోర్టులో 21,300 బెయిల్ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటి మీద సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనర్థం ఏంటంటే చట్టం తన పని తాను చేస్తోందని. అమెరికా, బ్రిటన్ లేదా ఆస్ట్రేలియా, ప్రతి దేశానికి తనదైన న్యాయప్రక్రియ ఉంటుంది" అని అన్నారు.

"అయితే ఉన్నత న్యాయస్థానాలు, ప్రత్యేకించి సుప్రీంకోర్టులో వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడతామని స్పష్టమైన సందేశం ఇచ్చాయి. వివిధ కేసుల్లో తీర్పులు తప్పుగా ఇచ్చారనో, కరెక్టుగా ఇచ్చారనో వేర్వేరు అభిప్రాయాలు ఉండవచ్చు. అయితే దీనిపై పరిష్కారాలు ఉన్నాయి. వాస్తవం ఏంటంటే వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడే విషయంలో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ముందుంది" అని చంద్రచూడ్ చెప్పారు.

జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, అయోధ్యలో రామ మందిరం, ఆర్టికల్ 370, న్యాయ స్వేచ్ఛ

ఫొటో సోర్స్, Getty Images

ఆర్టికల్ 370

జమ్ముకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ 2023లో సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నాయకత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ తీర్పు చెప్పింది.

సుప్రీంకోర్టు తీర్పును అనేకమంది న్యాయ నిపుణులు విమర్శించారు. రాజ్యాంగాన్ని రక్షించడంలో జస్టిస్ డీవై చంద్రచూడ్ విఫలమయ్యారని అన్నారు.

బీబీసీ ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.

"ఈ కేసులో ఇచ్చిన తీర్పులో కొంత భాగం నేను రాశాను. ఆర్టికల్ 370ను రాజ్యాంగం రాసినప్పుడే అందులో పొందుపరిచారు. అది కూడా మార్చగలిగిన నిబంధనలు అనే భాగంలో చేర్చారు. తర్వాత దానికి తాత్కాలిక మార్చగలిగిన నిబంధనలు అని పేరు పెట్టారు"

"కాబట్టి రాజ్యాంగం రాసినప్పుడు ఈ నిబంధన క్రమేపీ అంతరించిపోతుందని భావించారు. ఒక ప్రతిపాదనను అంతరించి పోవడానికి 75 సంవత్సరాలు తక్కువ సమయం అనుకోవాలా?" అని చంద్రచూడ్ అన్నారు.

ఆర్టికల్ 370ని రద్దు చేయడమే కాదు, జమ్ముకశ్మీర్‌కు ఉన్న రాష్ట్ర హోదాను తొలగించారు. దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు గడువు విధించలేదు కదా అని స్టీవెన్ సేకర్ అడిగారు.

ఈ ప్రశ్నకు స్పందనగా జస్టిస్ చంద్రచూడ్ "జమ్మూ కశ్మీర్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియ స్థాపనకు సుప్రీంకోర్టు 2024 సెప్టెంబర్ 30ని డెడ్‌లైన్‌గా పెట్టింది. 2024 అక్టోబర్‌లో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రకటన వచ్చింది" అని చంద్రచూడ్ చెప్పారు.

కాగా.. సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, దుష్యంత్ దవే ఈ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.

ఈ ఆరోపణలపై స్పందించిన డీవై చంద్రచూడ్.. "చూడండి. ఇప్పుడక్కడ ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాకుండా మరో పార్టీకి అక్కడ చాలా ప్రశాంతంగా అధికారం దక్కింది. జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యం విజయవంతమైందని ఇది స్పష్టం చేస్తోంది" అని చంద్రచూడ్ అన్నారు.

జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా రద్దు చేయడంపై స్పందిస్తూ "జమ్ముకశ్మీర్‌ను మూడు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చేటప్పుడు.. రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్దరిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్లను సుప్రీంకోర్టు ఆమోదించింది" అని చంద్రచూడ్ అన్నారు.

అయితే సుప్రీంకోర్టు జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణకు ఎలాంటి గడువు నిర్ణయించలేదు. "ఆ కోణంలో చూస్తే సుప్రీంకోర్టు ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వ జవాబుదారీతనాన్ని పరిగణనలోకి తీసుకుంది. మేం రాజ్యాంగ హక్కులను ఉపయోగించుకోలేదనే విమర్శ సరైనది కాదు" అని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి చెప్పారు.

జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, అయోధ్యలో రామ మందిరం, ఆర్టికల్ 370, న్యాయ స్వేచ్ఛ

మైనార్టీల వ్యవహారాలు

పౌరసత్వ సవరణ చట్టం పొరుగు దేశాల్లోని హిందువులకు భారత పౌరసత్వం ఇవ్వడం గురించి ప్రస్తావిస్తుంది. అయితే భారత రాజ్యాంగం మాత్రం, జాతి, మతం లాంటి వాటిని పట్టించుకోకుండా అందరినీ సమానంగా చూడాలని చెబుతోంది.

పౌరసత్వ సవరణ చట్టంతో భారతదేశంలోని మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించవచ్చని అనిపించలేదా?

ఈ ప్రశ్నకు సమాధానంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ "బ్రిటన్‌లో కోర్టుకు కూడా అలాంటి చట్టాన్ని రద్దు చేసే హక్కు లేదు. కానీ భారతదేశంలో ఉంది. పౌరసత్వం అంశం ఇప్పటికీ కోర్టులోనే ఉంది" అని చెప్పారు.

"నా పదవీకాలంలో రాజ్యాంగ ధర్మాసనం కోసం 62 తీర్పులు రాశాను. సమాఖ్య నిర్మాణం, రాష్ట్రాలకు మరిన్ని హక్కులు అనే అంశంతో పాటు అనేక రాజ్యాంగపరమైన అంశాల గురించి 20 ఏళ్లుగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులపై మా తీర్పుల ద్వారా రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇచ్చాం. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి మైనారిటీ హోదా ఉండాలా వద్దా అని మేం నిర్ణయించాం. 1968 నాటి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మేము రద్దు చేశాం" అని తెలిపారు.

జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, అయోధ్యలో రామ మందిరం, ఆర్టికల్ 370, న్యాయ స్వేచ్ఛ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2024 జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్యలోని రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ చేశారు.

రామమందిర నిర్మాణ వివాదంపై తీర్పు

రాజ్యాంగపరమైన అంశాల మాదిరిగానే సుప్రీంకోర్టులో బాబ్రీ మసీదు రామ్ మందిర్ నిర్మాణానికి సంబంధించి పాత కేసు ఒకటి నడుస్తోంది.

1992లో అయోధ్యలో బాబ్రీ మసీదును ధ్వంసం చేశారు. 2019లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు చెప్పింది.

"ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు జస్టిస్ డీవై చంద్రచూడ్ సమస్యకు పరిష్కారం చూపించాలని భగవంతుడిని ప్రార్థించారు" అని అనేక కథనాలు వచ్చాయని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి చెప్పారు.

కొన్ని కథనాలు అయితే "నేను దేవుడి ముందు కూర్చుని ఏదో ఒక పరిష్కారం కనుక్కోవాలని ప్రార్థించినట్లు కూడా వచ్చింది" అని రాసినట్లు చంద్రచూడ్ చెప్పారు.

సామాజిక మాధ్యమాల్లో ఒక వర్గం ఈ వదంతులను వ్యాపింప జేసిందని జస్టిస్ చంద్రచూడ్ బీబీసీ ఇంటర్వ్యూలో చెప్పారు. "ఇది పూర్తిగా అవాస్తవం" అని అన్నారాయన.

"ఇది పూర్తిగా తప్పు అని గతంలోనే స్పష్టం చేశాను. మళ్ళీ స్పష్టం చేస్తున్నాను. మీరెవరైనా న్యాయమూర్తి గురించి సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకోవాలని అనుకుంటే మీకు తప్పుడు సమాచారం అందుతుంది" అని ఆయన అన్నారు.

"నేను ఆస్తికుడిని అనే నిజాన్ని నేను కాదనను. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి న్యాయమూర్తిగా స్వతంత్రంగా వ్యవహరించడానికి నాస్తికుడు కానవసరం లేదు. నేను నా మతానికి ప్రాముఖ్యం ఇస్తాను.నా మతం అన్ని మతాలను గౌరవిస్తుంది. ఏ మతానికి చెందిన వ్యక్తికైనా అందరికీ సమానంగా న్యాయం చేయాలి. నేను చెప్పింది ఏమిటంటే ఇది నా మతం అని"

"న్యాయ సృజన కేవలం మేధో సామర్థ్యం, నైపుణ్యానికి సంబంధించిన విషయం కాదు. ఇది అవగాహనకు సంబంధించినది కూడా. అనేక ఏళ్లుగా నడుస్తున్న కేసుల్లో మీరు శాంతిని ఎలా గుర్తిస్తారు. శాంతి, సహనాన్ని కనుగొనడానికి వేర్వేరు న్యాయమూర్తులు వేర్వేరు మార్గాలను కలిగి ఉంటారు. ప్రార్థన, ధ్యానం నాకు చాలా ముఖ్యం. దేశంలోని ప్రతి సమాజాన్ని, సమూహాన్ని సమానంగా చూసుకోవాలని ఇది నాకు నేర్పుతుంది" అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.

జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, అయోధ్యలో రామ మందిరం, ఆర్టికల్ 370, న్యాయ స్వేచ్ఛ

ఫొటో సోర్స్, X/BJP4INDIA

ఫొటో క్యాప్షన్, 2024 సెప్టెంబర్‌లో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి నివాసంలో జరిగిన గణపతి పూజ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు.

సీజేఐ ఇంటికి ప్రధాన మంత్రి

కొన్ని నెలల క్రితం, జస్టిస్ చంద్రచూడ్ నివాసంలో జరిగిన వినాయకుడి పూజలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్న చిత్రం బాగా పాపులర్ అయింది.

దీనిపై జస్టిస్ చంద్రచూడ్ చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన ప్రధాని మోదీకి చాలా సన్నిహితుడని చెప్పడానికి ఇదొక స్పష్టమైన సంకేతం అని, ప్రధాన న్యాయమూర్తికి అంత దగ్గరగా ఉండటం వల్ల మోదీ తీర్పులను ప్రభావితం చేస్తారని ఆరోపణలు వచ్చాయి.

ఇది పొరపాటా కాదా అనే ప్రశ్నకు జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ "రాజ్యాంగ బాధ్యతల గురించి మాట్లాడేటప్పుడు, ప్రాథమిక మర్యాదల గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. రాజ్యాంగపరంగా ఉన్నత పదవులు నిర్వహిస్తున్న వారి ప్రాథమిక మర్యాదలకు, వ్యాజ్యాలకు సంబంధం లేదని అర్థం చేసుకునేంత పరిణతి మన వ్యవస్థకు ఉందని నేను భావిస్తున్నాను. ఈ సమావేశానికి ముందు, ఎన్నికల బాండ్లపై మేం తీర్పు చెప్పాం. ఎన్నికల నిధుల కోసం బాండ్లను ప్రవేశపెట్టిన చట్టాన్ని రద్దు చేసాం. దీని తరువాత కూడా కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చింది" అని గుర్తు చేశారు.

గత ఎనిమిది సంవత్సరాలలో మీరు ఎప్పుడైనా కార్యనిర్వాహక శాఖకు తలొగ్గారా అని అడిగినప్పుడు, తన పదవీకాలంలో తీర్పులు చెప్పేటప్పుడు ఎప్పుడూ రాజకీయ ఒత్తిడికి లోనవ్వలేదని అన్నారు.

అయితే, న్యాయవ్యవస్థ పని సమష్టిగా ఉంటుందని, అనేక సందర్భాలలో ఇతర న్యాయమూర్తుల సలహాలు తీసుకుంటానని చెప్పారు.

"ఒక విషయాన్ని పదే పదే చెబుతున్నాను. ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ పాత్ర పార్లమెంటులో ప్రతిపక్షం లాంటిది కాదు. మేం చట్టం ప్రకారం పని చేయడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి ఇక్కడ ఉన్నాం" అని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి బీబీసీ ఇంటర్వ్యూలో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)