జస్టిస్ నజీర్: కోర్టుల్లో న్యాయమూర్తుల తీర్పులు.. వారు రిటైరయ్యాక పదవులపై తలెత్తుతున్న ప్రశ్నలు

ఫొటో సోర్స్, SUPREME COURT BAR ASSOCIATION
- రచయిత, దిల్‌నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్‌గా జస్టిస్ (రిటైర్డ్) ఎస్ అబ్దుల్ నజీర్‌ను నియమించారు.
కర్ణాటకకు చెందిన జస్టిస్ నజీర్ ఈ ఏడాది జనవరి 4న జడ్జిగా పదవీ విరమణ పొందారు.
సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నప్పుడు, ఆయన అనేక ముఖ్యమైన తీర్పులలో కీలక పాత్ర పోషించారు.
2019 నవంబర్‌లో అయోధ్యలోని బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదంపై చారిత్రక తీర్పు వెలువరించిన ధర్మాసనంలో జస్టిస్ నజీర్ సభ్యులుగా ఉన్నారు.
ఇది కాకుండా, ప్రభుత్వ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించిన ధర్మాసనంలో, ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధమని ప్రకటించిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ నజీర్ ఉన్నారు.
జస్టిస్ నజీర్‌ను గవర్నర్‌గా చేయాలనే నిర్ణయంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
అయితే, పదవీ విరమణ తరువాత ప్రభుత్వంలో కీలక పదవులను పొందిన జడ్జిలు చాలామందే ఉన్నారు.

ఫొటో సోర్స్, PRATHYUSH THOMAS/WIKIPEDIA
రిటైర్ అయిన తరువాత ముఖ్య పదవుల్లో...
2014లో సుప్రీంకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ పి. సదాశివంను కేరళ గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది.
సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన పదవీకాలం వివాదరహితంగా ముగిసింది. పలు కీలక తీర్పులలో ఆయన పాలుపంచుకున్నారు.
ఆయనను కేరళ గవర్నర్‌గా నియమించినప్పుడు న్యాయవ్యవస్థకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి 1992లో రిటైర్ అయిన జస్టిస్ ఫాతిమా బీవీ 1997లో తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యారు.
2002లో ఆమె గవర్నర్ పదవి నుంచి రిటైర్ కావాల్సి ఉండగా, కొన్ని నెలల ముందు తమిళనాడులో జయలలితను ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించారు. అది వివాదాలకు దారి తీయడంతో జస్టిస్ ఫాతిమా బీవీ గవర్నర్ పదవికి ముందే రాజీనామా చేయాల్సి వచ్చింది.
1952లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఫజల్ అలీ పదవీ విరమణ తరువాత ఒడిశా గవర్నర్‌గా నియమితులయ్యారు.

ఫొటో సోర్స్, PTI
రంజన్ గొగోయ్ పదవీ విరమణ తరువాత రాజ్యసభకు వెళ్లినప్పుడు..
భారత 46వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌ను 2020 మార్చిలో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాజ్యసభకు నామినేట్ చేశారు.
2019లో అయోధ్య వివాదంపై తీర్పు చెప్పేందుకు ఏర్పాటు చేసిన ధర్మాసనానికి రంజన్ గొగోయ్ అధ్యక్షత వహించారు.
రాఫెల్ ఒప్పందంపై దర్యాప్తు, రాహుల్ గాంధీపై కోర్టు ధిక్కార కేసులను కూడా ఆయనే విచారించారు.
రాఫెల్ డీల్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ డీల్‌పై దర్యాప్తుకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను రంజన్ గొగోయ్ ధర్మాసనం కొట్టివేసింది.
జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లను కూడా జస్టిస్ రంజన్ గొగోయ్ కొట్టివేశారు.
జస్టిస్ రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు పంపినప్పుడు.. పదవీ విరమణ చేసిన వెంటనే న్యాయమూర్తులు రాజకీయాల్లోకి వస్తారా అంటూ ప్రశ్నలు తలెత్తాయి.
2018 జూలై 7న, జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ సుప్రీంకోర్టు నుంచి పదవీ విరమణ చేసిన కొన్ని గంటల్లోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) చైర్మన్‌గా నియమితులయ్యారు.
ఆయన్ను ట్రిబ్యునల్‌కు చైర్మన్‌గా నియమించడంపై వివాదాలు లేవు కానీ, పదవీ విరమణ చేసిన కొన్ని గంటల్లోనే జరిగిన నియామకంపై సందేహాలు తలెత్తాయి.
జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఎస్సీఎస్టీ చట్టంపై ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైంది. ఆ తీర్పు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రక్షణ కోసం చేసిన చట్టంలోని కొన్ని నిబంధనలను బలహీనపరిచింది.
జస్టిస్ గోయెల్ కంటే ముందు, జస్టిస్ స్వతంత్ర కుమార్ ఎన్‌జీటీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన పదవీ విరమణ తరువాత ఎన్‌జీటీ చైర్మన్ పదవి ఎనిమిది నెలల పాటు ఖాళీగా ఉంది. జస్టిస్ గోయెల్ జడ్జిగా రిటైర్ అయిన వెంటనే అందులోకి వచ్చారు.
భారత 21వ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రాను 1998లో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపింది. రాజ్యసభకు వెళ్లిన రెండో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంగనాథ్ మిశ్రా.
ఆయనకు ముందు, జస్టిస్ బహరుల్ ఇస్లాం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కానీ, బహరుల్ ఇస్లాం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడానికి ముందే, 1962 నుంచి 1972 మధ్య కాంగ్రెస్ టిక్కెట్‌పై రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
జస్టిస్ బహరుల్ ఇస్లాం 1983 జనవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశాక, అదే సంవత్సరం జూన్‌లో కాంగ్రెస్ ఆయనను తిరిగి రాజ్యసభకు పంపింది.

ఫొటో సోర్స్, PTI
కూలింగ్ ఆఫ్ పీరియడ్
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా రిటైర్ అవుతున్నవారికి కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉండదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
జస్టిస్ ఆర్‌ఎం లోధా తన రిటైర్మెంట్ రోజున చేసిన ప్రసంగంలో, "న్యాయమూర్తులు రిటైర్ అయిన తరువాత మరొక పదవిని స్వీకరించడానికి రెండేళ్ల కూలింగ్-ఆఫ్ వ్యవధి ఉండాలి" అన్నారు.
అయితే, 2014 అక్టోబర్‌లో జడ్జిలకు నిర్థారిత కూలింగ్ ఆఫ్ పీరియడ్‌ను నిర్ణయించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఆ సమయంలో జస్టిస్ పి. సదాశివం జడ్జిగా రిటైర్ అయిన వెంటనే కేరళ గవర్నర్ పదవిని స్వీకరించడంపై చర్చ జరిగింది. దీనికి సంబంధించి దాఖలైన పిల్‌ను అప్పటి ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్తా నేతృత్వంలోని బెంచ్ కొట్టివేసింది. కోర్టు అలాంటి పరిమితిని విధించలేదని బెంచ్ పేర్కొంది.
రిటైర్డ్ జడ్జిని ప్రభుత్వ పదవుల్లో నియమించే ముందు సుప్రీంకోర్టు, హైకోర్టులను సంప్రదించాలని ఆ పిల్‌లో డిమాండ్ చేశారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(7) ప్రకారం, సుప్రీంకోర్టు నుంచి రిటైర్ అయిన న్యాయమూర్తులు న్యాయవ్యవస్థలో ఉన్న ఎలాంటి పదవినీ నిర్వహించకూడదు. పదవీ విరమణ తరువాత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏ కోర్టులోనూ ప్రాక్టీస్ చేయలేరు.
1958లో లా కమిషన్ ఆఫ్ ఇండియా పద్నాలుగో నివేదికలో, న్యాయమూర్తులు పదవీ విరమణ తరువాత ప్రభుత్వ పదవులను చేపట్టడాన్ని నిషేధించాలని సిఫారసు చేసింది. అయితే, ఈ సిఫారసు అమలు కాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
గవర్నర్‌గా జస్టిస్ నజీర్ నియామకంపై ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి?
2013లో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీజేపీ నాయకుడు అరుణ్ జైట్లీ రాజ్యసభలో ఈ అంశం గురించి మాట్లాడారు.
"సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రిటైర్ అయిన తరువాత ప్రభుత్వ పదవులు పొందాలనే కోరిక, వారి తీర్పులను ప్రభావితం చేస్తుంది. ఇది చాలా ప్రమాదం. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయకుండా ఇది అడ్డుకుంది" అన్నారు అరుణ్ జైట్లీ.
అరుణ్ జైట్లీ ప్రకటనను ఉటంకిస్తూ జస్టిస్ నజీర్ నియామకంపై కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తింది.
"ఇలా ఇంతకుముందు కూడా జరిగిందని చెప్పడం సమాధానం కాదు. ఈరోజుల్లో రిటైర్ అయిన వెంటనే ప్రభుత్వ పదవులను కట్టబెడుతున్న వేగం సిద్ధాంతపరంగా తప్పు. దాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. ప్రత్యేకంగా మేం ఎవర్నీ వేలెత్తి చూపట్లేదు" అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా జస్టిస్ నజీర్ నియామకాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) నేత, రాజ్యసభ ఎంపీ ఏఏ రహీమ్ విమర్శించారు. ఈ నియామకం రాజ్యాంగ విలువలకు అనుగుణంగా లేదన్నారు.
"ఆయన (నజీర్) ఈ పదవిని చేపట్టడానికి నిరాకరించాలి. దేశం.. న్యాయ వ్యవస్థపై విశ్వాసం కోల్పోకూడదు. మోదీ ప్రభుత్వం చేసే ఇలాంటి నిర్ణయాలు భారత ప్రజాస్వామ్యానికి మచ్చ. ఆయన అయోధ్య కేసులో తీర్పు ఇచ్చిన ధర్మాసనంలో సభ్యులు. 2021 డిసెంబర్ 26న హైదరాబాద్‌లో జరిగిన అఖిల భారత న్యాయవాదుల మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తరువాత అది వివాదం అయింది. ఈ మండలి సంఘ్ పరివార్‌తో అనుబంధం కలిగి ఉంది" అని ఆయన అన్నారు.
గవర్నర్ పదవిపైనే అభ్యంతరాలు ఎందుకు?
సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలను మాత్రమే నియమించే కొన్ని పదవులు ఉన్నాయి. ఉదాహరణకు, నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్‌పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్. ఆయన నియామకంపై ఎలాంటి వివాదం లేదు.
గవర్నర్ అంటే రాజకీయ పదవి. దీనికి రిటైర్డ్ జడ్జిలను ఎన్నుకోకూడదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి నియామకాలు న్యాయవ్యవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిపై ప్రభావం చూపుతాయని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే అభిప్రాయపడ్డారు.
2014లో సంజయ్ హెగ్డే రాసిన ఒక వ్యాసంలో, "నిష్పక్షపాత న్యాయవ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఉండడం అన్నది న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించడానికి చాలా అవసరం. రిటైర్మెంట్ తరువాత జడ్జిలకు ఇచ్చే పదవులు అంతకుముందు వారి తీర్పులను ప్రభావితం చేస్తాయనే సందేహం ప్రజలకు కలగవచ్చు" అన్నారు.

ఇవి కూడా చదవండి:
- బడ్జెట్ 2023: లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో వచ్చే మార్పులు ఏంటి, కొత్తగా పాలసీ తీసుకునే వాళ్లు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
- మోదీ కన్నా మన్మోహన్ సింగ్ ఎక్కువగా పనిచేశారు: అసెంబ్లీలో కేసీఆర్ ఫైర్
- భూకంపాల నుంచి హైదరాబాద్ ఎంత వరకూ సురక్షితం?
- దావూదీ బోహ్రా ముస్లింల కార్యక్రమానికి నరేంద్ర మోదీ ఎందుకు వెళ్లారు?
- లిథియం: జమ్మూకశ్మీర్‌లో బయటపడ్డ ఈ నిక్షేపాలతో ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమ ఊపందుకుంటుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













