సురేంద్రన్ పటేల్: భారతదేశంలో ఒకప్పుడు బీడీలు చుట్టిన వ్యక్తి అమెరికాలో జడ్జి ఎలా అయ్యారు?

ఫొటో సోర్స్, SURENDRAN K PATTEL
భారతీయ సంతతికి చెందిన న్యాయవాది సురేంద్రన్ కే పటేల్ అమెరికా కోర్టులో డిస్ట్రిక్ జడ్జిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన విజయం భారతదేశంలో చర్చనీయాంశంగా మారింది.
ఒకప్పుడు భారత్‌లో బీడీలు చుట్టిన వ్యక్తి, అమెరికాలో డిస్ట్రిక్ కోర్టుకు జడ్జిగా ఎలా ఎదిగారు, ఆయన విజయవంతమైన పయనం ఎలా కొనసాగింది అనే దాన్ని బీబీసీ హిందీ ప్రతినిధి ఇమ్రాన్ ఖురేషి మనకు వివరించారు.
కేరళకు చెందిన 51 ఏళ్ల సురేంద్రన్ పటేల్ టెక్సస్ రాష్ట్రంలోని ఫోర్ట్ బెండ్ కంట్రీలో జ్యూడిషియల్ డిస్ట్రిక్ కోర్ట్‌కి 240వ జడ్జిగా నియమితులయ్యారు.
అమెరికా పౌరుడిగా మారిన ఐదేళ్లకు అంటే జనవరి 1న ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. కృషి, పట్టుదల, ఎన్నో కష్టాల ఫలితమే ఇదని పటేల్ తన జీవిత పయనం గురించి వివరించారు.
‘‘ఎంతో మంది వ్యక్తులు నాకు అండగా నిలిచారు. నా జీవితంలో ప్రతి దశలో వారెంతో సాయపడ్డారు’’ అని పటేల్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ జాబితాలో తన తల్లి మొదటి స్థానంలో ఉన్నట్టు చెప్పారు. త్యాగానికి ప్రతీకగా ఆమెను కొలిచారు.
పటేల్ చిన్నతనమంతా కటిక పేదరికంలో గడిచింది. తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. రోజూ కూలీ ద్వారా వచ్చే డబ్బులతోనే వారు ఆరుగురి పిల్లల్ని పోషించాల్సి వచ్చేది.
చిన్నతనంతో పటేల్ కూడా బీడీలు చుట్టేవారు. పొగాకు ఆకుల్ని చుట్టడం ద్వారా వీటిని తయారు చేసేవారు. ‘‘ఇలా చేయడం ద్వారా మేము రోజులో మూడు పూట్ల అన్నం తినగలిగే వాళ్లం’’ అని పటేల్ చెప్పారు.

ఫొటో సోర్స్, TWITTER/SURENDRAN K PATTEL
‘‘బీడీలు చుట్టడం కోసం నేను, మా పెద్ద అక్క అర్థరాత్రి వరకు కూర్చునే వాళ్లం’’ అని తెలిపారు.
పరీక్షల్లో సరైన మార్కులు రాకపోవడం వల్ల తాను స్కూల్ మానేయాల్సి వచ్చిందని అన్నారు.
అయితే, పెద్ద అక్క చనిపోవడం పటేల్ జీవితాన్ని పూర్తిగా మార్చి వేసింది. 15 ఏళ్ల వయసులోనే తన అక్క చనిపోయారు.
‘‘ఆ కేసును ఆత్మహత్యగా కొట్టివేశారు. కానీ, ఆ విషయంలో మాకు న్యాయం దక్కలేదని నాకు అనిపించింది. ఇప్పటికీ అది నన్ను వెంటాడుతూనే ఉంటుంది’’ అని ఈ సంఘటన గురించి బీబీసీకి తెలిపారు. కానీ, ఆ సంఘటన గురించి మరిన్ని వివరాలు పంచుకునేందుకు ఆయన నిరాకరించారు.
ఈ సంఘటననే ఆయన జీవితాన్ని మార్చి వేసింది. మళ్లీ పాఠశాలలో తిరిగి చేరేలా చేసింది. అప్పటి నుంచి ఎంతో పట్టుదలతో పటేల్ చదివారు.
డిగ్రీ కాలేజీలో చేరడానికి ముందు ఇంటర్‌మీడియేట్‌లో, కుటుంబ పోషణ కోసం ఎక్కువగా పని చేయాల్సి రావడంతో అప్పుడప్పుడు పటేల్ క్లాస్‌లకు హాజరు కాలేకపోయేవారు.
ఈ కారణంతో ఇంటర్‌మీడియేట్ తొలి ఏడాదిలో ఆయన హాజరు శాతం తగ్గింది. దీంతో ఫైనల్స్ ఎగ్జామ్స్‌కు అనుమతించమని కాలేజీ యజమాన్యం తేల్చి చెప్పింది. ఈ సమయంలో టీచర్లను ఎంతో ప్రాధేయపడి పరీక్షలకు హాజరయ్యారు.

ఫొటో సోర్స్, SURENDRAN K PATTEL
‘‘నా ఆర్థిక పరిస్థితి కారణంతో క్లాస్‌లకు రాలేకపోతున్నానని వారికి చెప్పలేదు. ఎందుకంటే వారు చూపించే దయ, జాలి నాకు వద్దనుకున్నాను’’ అని తెలిపారు.
టీచర్లు పటేల్‌కి మరో అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత పటేల్ స్నేహితుల ద్వారా వారు ఆయన ఆర్థిక పరిస్థితి తెలుసుకున్నారు. పని చేయడం తప్ప తనకు మరో అవకాశం లేదని గుర్తించారు.
ఇంటర్‌మీడియేట్ ఫలితాలు వచ్చిన తర్వాత పటేల్ ప్రతి ఒక్కర్ని ఆశ్చర్యపరిచారు. క్లాస్‌లో రెండో ర్యాంకును సంపాదించారు.
ఆ సమయంలోనే తాను న్యాయ విద్యను అభ్యసించాలని నిర్ణయించుకున్నారు. ‘‘మరొకటి నాకు చేయాలని లేదు. న్యాయ విద్యపైనే చాలా మక్కువ ఉండేది’’ అని పటేల్ తెలిపారు.
పటేల్ ఆర్థిక పరిస్థితి ఎప్పుడూ తనకు సవాలుగా నిలిచేది. కానీ, తన పయనంలో తనకు ఎదురైన వ్యక్తులు ఆయనకి సాయంగా నిలిచారు.
వారిలో ఒకరే ఉత్తుప్. కేరళలో ఈయన ఒక హోటల్ నడిపేవారు.
‘‘నాకు ఉద్యోగం ఇవ్వకపోతే, నేను చదువు ఆపేయాల్సి వస్తాదని ఆయనకు చెప్పాను. హోటల్‌లో హౌస్‌కీపింగ్ స్టాఫ్‌గా నన్ను తీసుకున్నారు’’ అని పటేల్ తెలిపారు.
ఉత్తుప్ చనిపోయేంత వరకు తాను తనతో ఉన్నట్టు చెప్పారు.
‘‘నేను జడ్జిగా నియామకం అయినట్టు తెలియగానే నా సోదరుడు మాన్యువల్ నాకు కాల్ చేశాడు’’ అని పటేల్ చెప్పారు.

ఫొటో సోర్స్, SURENDRAN K PATTEL
న్యాయవిద్యను అభ్యసించడానికి ముందు 1992లో పటేల్ పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీని పొందారు.
నాలుగేళ్ల తర్వాత, న్యాయవాది పీ అప్పుకుట్టన్ దగ్గర ఉద్యోగం పొందారు. కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో హోస్‌దుర్గ పట్టణంలో పనిచేయడం ప్రారంభించారు.
‘‘పటేల్ చాలా ఉత్సాహంగా ఉండేవారు. నేను ఆయన్ని ఎంతో నమ్మాను. అన్ని న్యాయపరమైన సమస్యలను నేను పటేల్‌కు ఇచ్చే వాణ్ని. ఎందుకంటే, పటేల్‌కు వాటిని చేయగలిగే సామర్థ్యం ఉండేది’’ అని అప్పుకుట్టన్ బీబీసీకి తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఒక ఆస్పత్రిలో తన భార్య సుభకు ఉద్యోగం వచ్చేంత వరకు అంటే దశాబ్దం పాటు అప్పుకుట్టన్ వద్దనే పటేల్ పనిచేశారు.
ఢిల్లీలో ఆమెకు ఉద్యోగం వచ్చిన తర్వాత, తన వృత్తికి ఆటంకం కలిగించకూడదనే ఉద్దేశ్యంతో, పటేల్ కూడా భార్యతో కలిసి ఢిల్లీ వచ్చారు.
కొన్ని నెలల పాటు ఒక సుప్రీంకోర్టు న్యాయవాది వద్ద పటేల్ పనిచేశారు. అయితే, ఈ సారి తన భార్య వృత్తిలో భాగంగా అమెరికాకి వెళ్లాల్సి వచ్చింది.
‘‘నా వృత్తిపరమైన జీవితం వదిలిపెట్టడానికి నేను సంతోషంగా లేనప్పటికీ, ఆమెతో అమెరికా వెళ్లాల్సి వచ్చింది. ఆమె లేకుండా, నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాణ్ని కాదు’’ అని పటేల్ తెలిపారు.

ఫొటో సోర్స్, TWITTER / SURENDRAN K PATTEL
2007లో పటేల్ తన భార్యతో కలిసి టెక్సాస్ వెళ్లారు. అక్కడే కొంత కాలం పాటు గ్రోసరీ స్టోర్‌లో పనిచేశారు.
ఆ తర్వాత టెక్సాస్‌లో బార్ ఎగ్జామ్స్ రాయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ లా విద్యలో డిగ్రీని పొందారు.
డెమొక్రాటిక్ పార్టీతో కలిసి జడ్జి పోస్టుకు దరఖాస్తు చేయాలని పటేల్ నిర్ణయించుకున్నారు.
కానీ, అక్కడ ఆయనకు అవమానకర పరిస్థితులు ఎదురయ్యారు. ప్రచారం నిర్వహించే సమయంలో తన భారతీయ యాసను చాలా ఎగతాళి చేసేవారని ఆయన అన్నారు.
‘‘కానీ, నేను బాధపడలేదు. కొన్ని సార్లు ప్రచారాలు చాలా ఇబ్బందిగా అనిపించేవి. ఎంతకాలం ఇక్కడ నివసిస్తామన్నది నేను ఆలోచించలేదు. ఈ కమ్యూనిటీకి ఎంత కాలం సేవ చేయగలుగుతామన్నది మాత్రమే ఆలోచించాను’’ అని పటేల్ చెప్పారు.
అమెరికా ప్రయాణం తనకు కలిసొచ్చిన విషయం. ‘‘2017లోనే నేను అమెరికన్ పౌరుడిగా మారాను. ఇప్పుడు 2022లో ఎన్నికల్లో గెలుపొందాను. మరో దేశంలో ఇది జరుగుతుందని నేను అసలు ఊహించలేదు. ’’ అని తెలిపారు.
ఇది తన వ్యక్తిగత విషయానికి కూడా ఒక ప్రత్యేకమైన గెలుపుగా చెప్పారు.
టెక్సాస్‌లో ప్రాక్టీస్ చేస్తూనే, సీనియర్ న్యాయవాది గ్లెండెన్ బీ ఆడమ్స్‌తో పటేల్‌కు సానిహిత్యం ఏర్పడింది.
ఆడమ్స్ చనిపోయినప్పుడు, తన భార్య రోసలీ ఆడమ్స్ భర్త అంత్యక్రియల్లో సాయం చేయాలని పటేల్‌ను కోరారు.
బుధవారం ఆయన కొత్త బాధ్యతలు చేపట్టిన సమయంలో, రోసలి ఆడమ్స్ తన కోర్టు రూమ్‌లో జడ్జిగా తాను ధరించబోయే వస్త్రాలను తనకు అందించారు.
ఇవి కూడా చదవండి:
- కోడి పందాలు: పోలీసులు హెచ్చరిస్తున్నా రూ.కోట్లలో పందాలు ఎలా జరుగుతున్నాయి?
- బ్రిటన్: ‘మా అమ్మ డయానా మరణం వెనుక అసలు కారణాలపై నా ప్రశ్నలు ఇంకా అలాగే ఉన్నాయి’ - ప్రిన్స్ హ్యారీ
- మెగలొడాన్: తిమింగలాలనే మింగేసే అతి పెద్ద షార్క్ కోరను వెదికి పట్టుకున్న 9 ఏళ్ల బాలిక
- Naatu Naatu Song: తెలుగు సినీ సంగీత ప్రపంచానికి 'పెద్దన్న' ఎంఎం కీరవాణి
- ‘‘నన్ను కెమెరా ముందు కూర్చోబెట్టి నీ సెక్స్ సంబంధాల గురించి చెప్పు అని అడిగారు’’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














