‘‘నన్ను కెమెరా ముందు కూర్చోబెట్టి నీ సెక్స్ సంబంధాల గురించి చెప్పు అని అడిగారు’’

ఇరాన్ నిరసనలు

ఫొటో సోర్స్, SEPIDEH QOLIAN

    • రచయిత, ఫెరానక్ అమిది
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇరాన్‌లో జైళ్లలో ఉన్న నిరసనకారులను ఎలాంటి చిత్రహింసలు పెడుతున్నారో, నేరాంగీకారానికి ఎంత ఒత్తిడి తెస్తున్నారో ప్రముఖ ఉద్యమకారిణి సెపిడె కోలియన్ ఒక ఉత్తరంలో రాశారు.

సెపిడెహ్ కోలియన్ 2018 నుంచి జైల్లో ఉన్నారు. అప్పట్లో ఆమె ఇరాన్‌లో జరిగిన ఒక సమ్మెకు మద్దతిచ్చారు.

ఆమె చర్యలు "జాతీయ భద్రతకు ముప్పు" అని తీర్మానిస్తూ ఆమెకు అయిదేళ్ల కారాగార శిక్ష విధించారు.

ఇరాన్‌లో అత్యంత కఠోరమైన ఎవిన్ జైలు నుంచి ఆమె ఈ లేఖ రాశారు. విచారణ అధికారులు తన పట్ల, తోటి ఖైదీల పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో వివరించారు.

నేరాన్ని అంగీకరించమని బలవంతపెట్టి, వీడియోలుగా చిత్రీకరించి వాటిని ప్రభుత్వ టీవీ చానెల్‌లో ప్రసారం చేశారని ఆమె వెల్లడించారు.

ఇరాన్ నిరసనలు

ఫొటో సోర్స్, @VAHID/TWITTER

ఫొటో క్యాప్షన్, ఇరాన్ నిరసనలు

కోలియన్ ప్రస్తుతం ఇరాన్‌లో వెల్లువెత్తుతున్న నిరసనలను ప్రస్తావిస్తూ, "ఎట్టకేలకు, నేను జైలుకు వచ్చిన నాలుగేళ్లకు, ఇరాన్ వ్యాప్తంగా స్వేచ్ఛ దిశగా పడుతున్న అడుగులు శబ్దం వినిపిస్తోంది. మహిళలు, జీవితం, స్వేచ్ఛ అంటూ ఇరాన్ వాసులు చేస్తున్న నినాదాలు ఎవిన్ జైలు గోడలు బద్దలుగొట్టుకుని మరీ వినబడుతున్నాయి" అని రాశారు.

కోలియన్ ప్రస్తుతం జైల్లో ఉంటూనే లా చదువుతున్నారు. ఎవిన్ జైల్లోని "సాంస్కృతిక" విభాగం ఎలా ‘‘హింస, విచారణ’’లకు కేంద్రంగా మారిందో తన లేఖలో రాశారు.

ఆ భవనంలోనే ఆమె పరీక్షలు రాస్తారు. యువ ఖైదీలను అక్కడ బందీలుగా చేసి విచారణ చేస్తున్న దృశ్యాలను తాను చూశానని తెలిపారు.

"పరీక్ష గది యువతీయువకులతో నిండిపోయింది. వాళ్లను హింసించే వారి అరుపులు వినిపిస్తున్నాయి" అని ఆమె రాశారు.

ఇరాన్ నిరసనలు
ఫొటో క్యాప్షన్, ఇటీవల జైలు నుంచి విడుదలైన నటి అలీదూస్తికి అభినందనల వెల్లువ

2022 డిసెంబర్ 28న పరీక్ష రాయడానికి వెళ్లినప్పుడు తాను చూసిన ఒక దృశ్యాన్ని వివరించారు కోలియన్.

"గడ్డకట్టుకుపోయే చలి, మంచు కురుస్తోంది. భవనం వెలుపలి ద్వారం వద్ద పలుచటి చొక్కా వేసుకున్న ఒక యువకుడికి కళ్లకు గంతలతో విచారణ అధికారి ఎదురుగా కూర్చుని ఉన్నాడు.

అతడు తల అడ్డంగా ఊపుతూ, ప్రార్థిస్తున్నాడు.. ‘‘నేను ఎవరినీ కొట్టలేదు, దేవుడి మీద ఒట్టు’’ అంటున్నాడు.

కానీ, అతడు నేరం అంగీకరించడమే వాళ్లకు కావాల్సింది. అటుగా వెళ్తున్న నేను ‘ఒప్పుకోవద్దు. నిరంకుశులకు మరణం తప్పదు’ అని గట్టిగా అరిచాన." అని ఆమె వెల్లడించారు.

ఇరాన్ నిరసనలు

ఫొటో సోర్స్, TARANEH ALIDOOSTI

ఫొటో క్యాప్షన్, నటి అలీదూస్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తారు.

ఇప్పటి వరకు 69మంది పిల్లలు సహా 519 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు.

19,300 మందిని అరెస్ట్ చేశారని హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ న్యూస్ ఏజెన్సీ చెబుతోంది. వేలమందిని జైల్లో పెట్టారు.

అరెస్టయిన వారిలో చాలామంది మరణశిక్షను ఎదుర్కొన్నారు. వారిలో కొందరు తమ నేరాలను ఒప్పుకుంటున్న వీడియోలను టీవీలో చూపించారు.

అలా నలుగురిని ఉరి తీశారు.

వీరిపై విచారణలు ఎలాంటి న్యాయపరమైన ప్రాతినిధ్యం లేకుండా జరిగాయని, విచారణకు ముందు వారిని తీవ్రంగా హింసించారని మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు ఆరోపించారు.

అయితే, ఈ వాదనలను అధికారులు తోసిపుచ్చుతున్నారు.

గత సంవత్సరం సెప్టెంబరులో ప్రజా నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి, నిర్బంధంలోకి వెళ్లిన అనేక మంది ఆందోళనకారులు తమ నేరాలను అంగీకరిస్తున్నట్లు వీడియోలు ప్రసారమయ్యాయి.

వీరిని నేరాన్ని అంగీకరించేలా బలవంతం చేశారని ఆరోపణలు ఉన్నాయి.

ఇరాన్ నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నవారికి మరణ శిక్షలు విధిస్తున్నారు.

2018లో ఇరాన్‌లోని ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లోని ఒక చక్కెర కర్మాగారంలో కార్మికుల సమ్మె, నిరసనకు మద్దతు ఇచ్చినందుకు సెపిడే అరెస్టయ్యారు.

2018లో తనపై జరిగిన ఇంటరాగేషన్, బలవంతపు ఒప్పుకోలు ఘటనలను సెపిడె కోలియన్ తన లేఖలో గుర్తు చేసుకున్నారు.

తనను విచారించడానికి ఒక మహిళా అధికారి రావడంతో, మగవాళ్ల విచారణ కన్నా దారుణంగా ఉండకపోవచ్చని తాను ఊపిరి పీల్చుకున్నానని ఆమె వెల్లడించారు.

కనీసం లైంగిక దాడులైనా ఉండవని ఆమె భావించారు. కానీ ఆమె ఆశలు అడియాశలయ్యాయి.

సదరు మహిళా అధికారి ‘‘టేబుల్‌ను కాలితో గట్టిగా తన్ని ‘‘కమ్యూనిస్ట్ వేశ్యా, ఎవరితో పడుకున్నావు చెప్పు?’’ అని అరిచిందని ఆమె వెల్లడించారు.

జైలులో ఉన్న మరో మానవ హక్కుల మహిళా కార్యకర్త నర్గెస్ మొహమ్మదీ కూడా, ఇటీవలి నిరసనల్లో అరెస్టయిన మహిళలు జైలులో ఎలా లైంగిక వేధింపులకు గురవుతున్నారో వివరించారు. నర్గేస్ గత ఏడాది డిసెంబర్‌లో 34 ఏళ్ల జైలు శిక్షకు గురయ్యారు.

నర్గెస్ మొహమ్మదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నర్గెస్ మొహమ్మదీ

తనను విచారించడానికి వచ్చిన మహిళా విచారణాధికారిణి తన కళ్లకు కట్టిన గంతలను తొలగించారని, తర్వాత కెమెరా ఆన్ చేసి తన లైంగిక సంబంధాల గురించి చెప్పమని అడిగినట్లు కోలియన్ వెల్లడించారు. అయితే, తాను నిరాకరించానని కోలియన్ చెప్పారు.

గంటల తరబడి విచారణ తర్వాత, తనను టాయిలెట్‌కి తీసుకెళ్లమని వేడుకున్నట్లు కోలియన్ వెల్లడించారు.

లేడీస్ టాయిలెట్ దగ్గరకు తీసుకెళ్లిన సదరు అధికారిణి తనను అందులోకి నెట్టి, బయట గొళ్లెం పెట్టారని తెలిపారు.

టాయిలెట్లో బందీ అయిన తనకు, ఇంటరాగేషన్ రూమ్‌లో ఓ వ్యక్తిని హింసిస్తున్నట్లు, కొరడాతో కొడుతున్నట్లు పెద్ద అరుపులు, శబ్ధాలు వినిపించాయని కోలియన్ గుర్తు చేసుకున్నారు.

"హింస తాలూకు శబ్దాలు కొన్ని గంటలపాటు, దాదాపు ఒక రోజంతా కొనసాగాయి. అవి ఎంతసేపు జరిగాయో నాకు గుర్తు కూడా లేదు’’ అని ఆమె రాశారు.

టాయిలెట్ నుంచి విడుదలై, మూడు రోజుల పాటు సరైన నిద్ర కూడా లేని తనను కెమెరా ఉన్న గదికి తీసుకెళ్లినట్లు కోలియన్ తెలిపారు.

"నేను సగం స్పృహలో ఉన్నాను. ఆమె నుండి స్క్రిప్ట్ తీసుకున్నాను. కెమెరా ముందు కూర్చుని చదివాను" అని ఆమె రాశారు.

ఈ ఒప్పుకోలు ఆధారంగా ఆమెకు అయిదేళ్ల జైలు శిక్ష పడింది.

ఇరాన్ నిరసనలు

ఫొటో సోర్స్, MOHSEN SHEKARI

ఫొటో క్యాప్షన్, మానవహక్కుల కార్యకర్త మొహ్‌సెన్ షెకారీ మరణశిక్షను ఎదుర్కొన్నారు.

2019లో కోలియన్ ఖార్‌చక్ జైలులో ఉన్నారు. టీవీలో ప్రసారమవుతున్న ఓ ఒప్పుకోలు కార్యక్రమాన్ని చూస్తుండగా, అందులో తనను విచారించిన మహిళా అధికారిణి ఆమెకు కనిపించారు.

తనను ప్రశ్నించిన వ్యక్తి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో సంబంధాలున్న "ఇంటరాగేటర్-జర్నలిస్ట్" అమెనె సదత్ జబిపూర్‌గా కోలియన్ గుర్తించారు.

ఖైదీలను ఇలా బలవంతం నేరాంగీకరాలు చేయిస్తుండటం, వాటిని టీవీలో ప్రసారమయ్యేలా చూస్తున్నందుకు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ జబిపూర్‌పై ఆంక్షలు విధించింది.

తనపై విమర్శలు చేసిందంటూ కోలియన్ పై జబిపూర్ కోర్టుకెక్కారు. ఈ పిటిషన్ కారణంగా కోలియన్‌కు మరో ఎనిమిది నెలల అదనపు శిక్ష పడింది.

ప్రస్తుతం ఇరాన్‌లో జరుగుతున్న నిరసనలను విప్లవంగా అభివర్ణిస్తూ కోలియన్ తన లేఖను ముగించారు.

"ఈ రోజు మనకు బయట వీధుల్లో వినిపించే శబ్ధాలు, విచారణ గదుల్లో వినిపిస్తున్న శబ్ధాలకన్నా బిగ్గరగా ఉన్నాయి. ఇదే స్త్రీ జీవితం, స్వేచ్చలకు సంబంధించి నిజమైన విప్లవధ్వానం’’ అని తన లేఖలో పేర్కొన్నారు సెపిడే కోలియన్.

వీడియో క్యాప్షన్, ఉన్న ఏకైక రోడ్డుని అడ్డగించడంతో నిత్యావసర సరుకులు అయిపోతున్నాయంటున్న అర్మేనియన్లు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)