ఇరాన్: నికా షకరామీ చనిపోవడానికి ముందు హిజాబ్‌ను తగులబెట్టినట్లు చూపిస్తున్న వీడియోలు

ఫొటో సోర్స్, BBC Persian source/Twitter
ఇరాన్‌లో ఇటీవల కనిపించకుండా పోయిన 16 ఏళ్ల నికా షకరామీ కొద్ది రోజుల తరువాత శవమై కనిపించింది.
తను కనిపించకుండా పోవడానికి ముందు ఆ అమ్మాయి హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో కనిపిస్తోందని నికా తల్లి బీబీసీ పర్షియన్‌కు తెలిపారు.
సెప్టెంబరు 20న ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో జరిగిన ప్రదర్శనల్లో నికా హిజాబ్‌ను తగలబెడుతూ కనిపించింది. ఇస్లామిక్ రిపబ్లిక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఆ తరువాత ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది. చివరిసారిగా తన స్నేహితులతో మాట్లాడిన నికా, తనను పోలీసులు తరుముతున్నారని చెప్పింది.

ఫొటో సోర్స్, Twitter
అయితే నికా మరణానికి, హిజాబ్ నిరసన ప్రదర్శనలకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. అందుకు సంబంధించి వారు ఒక సీసీటీవీ వీడియోను విడుదల చేశారు. కానీ అదంతా అబద్ధమని ఆ వీడియోలో తన కూతురు లేదని నికా తల్లి నస్రీన్ అన్నారు. తన బిడ్డను భద్రతా దళాలే చంపాయని ఆమె ఆరోపిస్తున్నారు.
కానీ నిర్మాణంలో ఉన్న భవనం మీద నుంచి నికాను తోసి వేయడం వల్లే చనిపోయిందని అధికారులు చెబుతున్నారు. అక్కడ పని చేసే వాళ్లు నికాను కిందకు తోసి ఉండొచ్చని వారు అంటున్నారు.
ఒక టీనేజీ అమ్మాయి ఒక సందులోని బిల్డింగ్ తలుపు తీసుకొని లోపలకు వెళ్తున్న సీసీటీవీ ఫుటేజీని ఇరాన్ ప్రభుత్వ టీవీ చానెల్ గతవారం విడుదల చేసింది. కాస్త బూజరగా ఉన్న ఆ దృశ్యాలు స్పష్టంగా లేవు. అందులోని అమ్మాయి నికానే అని వారు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కానీ ఆ వీడియోలోని అమ్మాయి తన కూతురు కాదని నస్రీన్, బీబీసీ పర్షియన్‌తో అన్నారు. ఆ వీడియోలో వ్యక్తి నికా మాదిరిగా నడవడం లేదని మరొక బంధువు చెప్పారు.
'తాము చెప్పినట్లు చేయకపోతే నా సోదరుని నాలుగేళ్ల బిడ్డను తీసుకెళ్తామని వారు బెదిరించారు' అని ఆమె తెలిపారు.
ప్రస్తుతం ఇరాన్‌లో జరుగుతున్న నిరసన ప్రదర్శనలకు వ్యతిరేకంగా గత బుధవారం టీవీలో మాట్లాడుతూ కనిపించారు మొహసెన్. కెమెరాలో కనిపించని కొందరు ఆయనకు చేస్తున్న సూచనలు వినిపించాయి. అసభ్య పదజాలంతో ఆయనను దూషించారు.
నికా బిల్డింగ్ మీద నుంచి పడిపోవడం వల్ల చనిపోయిందని టీవీలో చెబుతూ కనిపించారు అతాష్. ఆ ప్రకటనలు చేసిన తరువాత వారిని విడిచి పెట్టారు.

ఫొటో సోర్స్, BBC Persian source
నికా కనిపించకుండా పోయిన 10 రోజుల తరువాత మార్చురీలో ఆమె మృతదేహం కనిపించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నికాను గుర్తించేందుకు కొద్ద సెకండ్లు మాత్రమే తమను అధికారులు అనుమతించారని వారు చెప్పారు. 'నికా 5 రోజుల పాటు తమ కస్టడీలో ఉంది. ఆ తరువాత జైలు అధికారులకు తనను అప్పగించాం' అని రెవల్యూషన్ గార్డ్స్ తనకు చెప్పారని అతాష్ తెలిపారు.
సోషల్ మీడియాలో ఉన్న వీడియోలో కనిపించిన మాదిరిగా హిజాబ్ వ్యతిరేక నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న కొద్ది గంటల తరువాత నికా కనిపించకుండా పోయిందని నస్రీన్ తెలిపారు. ఆ వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం నల్లని డ్రెస్సులో ఉన్న ఒక అమ్మాయి కాలిపోతున్న హిజాబ్‌ను ఊపుతోంది. ఆమె చుట్టూ ఉన్న వాళ్లు ఇరాన్ సుప్రీం లీడర్‌ను ఉద్దేశించి 'నియంత చావాలి' అంటూ నినాదాలు చేస్తున్నారు. అదే ఘటనను మరొక యాంగిల్ చూపించే వీడియో కూడా సోషల్ మీడియాలో కనిపించింది.
'నికా మాదిరిగానే నేను కూడా హిజాబ్‌ను బలవంతంగా రుద్దడాన్ని చిన్నప్పటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నా. కానీ వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపే ధైర్యం నా తరం వాళ్లకు లేకుండా పోయింది. నా తరం వాళ్లు అణచివేత, అవమానం, బెదిరింపులను ఏళ్ల తరబడి చవిచూశారు. కానీ నా కూతురు వాటికి వ్యతిరేకంగా గొంతు ఎత్తింది. అలా నినదించడానికి తనకు పూర్తి హక్కు ఉంది' అని నస్రీన్ బీబీసీ పర్షియన్‌తో అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
మాషా అమీని మరణం తరువాత ఇరాన్‌లో చెలరేగిన హిజాబ్ వ్యతిరేక నిరసనల్లో 'జనరేషన్ జీ' ముందు ఉండి పోరాడుతోంది. 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వాళ్లను జనరేషన్ జీ అంటున్నారు.
బయట ప్రదేశాల్లో హిజాబ్ నిబంధనలు ఉల్లంఘించింది అంటూ పోయిన నెలలో మాషా అమీని అనే 22 ఏళ్ల అమ్మాయిని పోలీసులు అరెస్టు చేశారు. తరువాత కస్టడీలో చనిపోయి కనిపించింది మాషా.
నాటి నుంచి జరుగుతున్న హిజాబ్ వ్యతిరేక ప్రదర్శనల్లో నికా వంటి అమ్మాయిలు ఎందరో చనిపోయారు.
సెప్టెంబరు 21న వెస్ట్ తెహ్రాన్‌లోని కరాజ్‌లో నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న 22 ఏళ్ల హదీస్ నజాఫీని భద్రతా దళాలు కాల్చి చంపినట్లు ఆ అమ్మాయి కుటుంబం చెబుతోంది. సెప్టెంబరు 23న కరాజ్‌లోనే జరిగిన మరొక నిరసన ప్రదర్శల్లో పోలీసులు పదేపదే తల మీద కొట్టడం వల్ల 16 ఏళ్ల సరీనా చనిపోయినట్లు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపించింది.
ఈ నిరసన ప్రదర్శనల్లో మొత్తం 28 మంది పిల్లలు చనిపోయినట్లు 'ఇరేనియన్ సొసైటీ ఫర్ ప్రొటెక్టింగ్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్' సోమవారం తెలిపింది. ఎంతో మంది పిల్లలను అరెస్టు చేసి నిర్బంధ కేంద్రాల్లో ఉంచుతున్నారని ఆరోపించింది.
ఇవి కూడా చదవండి:
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- లేపాక్షిలో స్తంభం నిజంగా గాల్లో వేలాడుతోందా, దాని వెనకున్న వాస్తవాలేంటి ?
- ఎస్.ఎస్.రాజమౌళి: యాడ్ ఫిల్మ్ మేకర్ నుంచి పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ దాకా...
- రాజరాజ చోళుడు హిందువు కాదా, అసలు హిందూ అనే మతమే లేదా, చరిత్ర ఏం చెబుతోంది?
- శ్రీకాకుళం జిల్లా: బట్టలు ఉతకం అన్న రజకులు.. ఇతర కులాల సహాయ నిరాకరణ.. ఏం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









