Hindu Religion: రాజరాజ చోళుడు హిందువు కాదా, అసలు హిందూ అనే మతమే లేదా, చరిత్ర ఏం చెబుతోంది?

పొన్నియనల్ సెల్వన్-1 చిత్రంలో రాజరాజ చోళునిగా జయం రవి నటించారు

ఫొటో సోర్స్, Facebook/Lyca Producations

ఫొటో క్యాప్షన్, పొన్నియనల్ సెల్వన్-1 చిత్రంలో రాజరాజ చోళునిగా జయం రవి నటించారు
    • రచయిత, ప్రమీల కృష్ణన్
    • హోదా, బీబీసీ తమిళ్

పొన్నియన్ సెల్వన్-1 సినిమాలోని ప్రధాన పాత్ర అయిన రాజరాజ చోళుడు కేంద్రంగా ఇప్పుడు వివాదం అలుముకుంటోంది.

రాజరాజ చోళుడు హిందువు కాదంటూ తమిళ సినిమా డైరెక్టర్ వెట్రిమారన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సమాజంలో పెద్ద చర్చకు దారి తీశాయి.

తమిళనాడుకు చెందిన దళిత పార్టీ 'విడుదలై చిరుతిగల్ కట్చి' నాయకుడు 'తొల్ తిరుమావలవన్' 60వ పుట్టిన రోజు వేడుకలకు ఇటీవల వెట్రిమారన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఇప్పటికే మన గుర్తింపుల్లో చాలా వాటిని తుడిచి వేశారు. తిరువళ్లువర్‌(ప్రాచీన తమిళ కవి)కు కాషాయం చుట్టారు. రాజరాజ చోళున్ని హిందూ రాజుగా చిత్రీకరిస్తున్నారు.

ఇలాంటివి మన సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. ఇది సినిమాలోనూ జరుగుతుంది. ఇప్పటికే అనేక గుర్తింపులను సినిమా నుంచి తుడిచేశారు. తమిళ ప్రజల ఉనికి లాగేసుకుంటున్నారు. దాన్ని మనం రక్షించుకోవాలి' అని వెట్రిమారన్ అన్నారు.

కమల్ హాసన్

ఫొటో సోర్స్, Twitter/Kamal Haasan

ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్‌హాసన్‌ కూడా వెట్రిమారన్‌కు మద్దతు పలికారు. చోళుల కాలంలో ‘హిందూ’ అని పిలిచే మతమే లేదని ఆయన అన్నారు.

‘రాజరాజ చోళుని కాలంలో హిందూ మతం అనేది లేదు. నాడు వైష్ణవం, శైవం, సమనంగా ఉన్నాయి. వీరందరినీ కలిపి ఎలా పిలవాలో తెలియక బ్రిటీషర్లు హిందూ అనే పదాన్ని సృష్టించారు. తూత్తుకుడి పేరును టుటికోరిన్‌గా బ్రిటిషర్లు ఎలా మార్చారో ఇది అలాగే జరిగింది’ అని కమల్ హాసన్ అన్నారు.

చోళ రాజు రాజరాజ చోళుడు
ఫొటో క్యాప్షన్, చోళ రాజు రాజరాజ చోళుడు

రాజరాజ చోళుడు హిందువు కాదా?

చోళ రాజుల్లో ఒకడైన రాజరాజ చోళుడు, క్రీ.శ.985 నుంచి 1014 మధ్య చోళ సామ్రాజ్యాన్ని పాలించాడు. రాజరాజ చోళుడు ప్రధాన కేంద్రంగా రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా మణిరత్నం తీసిన పీఎస్-1 సినిమా ఇటీవలే విడుదలైంది.

వెట్రిమారన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా 'రాజరాజ చోళుడు హిందూ రాజు. భారతీయులందరూ హిందువులే' అని మరొక తమిళ దర్శకుడు పెరరసు అన్నారు.

ఈ వాదోపవాదాల మధ్య రాజరాజ చోళుని మతం మీద సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తమిళ టీవీ చానెళ్లు సైతం దీని మీద డిబేట్లు పెడుతున్నాయి.

ఈ వివాదం మీద మాట్లాడే ముందు హిందుత్వ చరిత్రను, రాజరాజ చోళుని కాలాన్ని పోల్చి చూడాలని హిస్టరీ ప్రొఫెసర్ ఎ.కరుణానందమ్ అన్నారు.

‘‘క్రీ.శ.10, 11 శతాబ్దాలలో రాజరాజ చోళుడు జీవించాడు. కానీ హిందూ అనే పదాన్ని ఆయన చనిపోయిన చాలా ఏళ్ల తరువాత తొలిసారి వాడారు. రాజరాజ చోళుడు బతికి ఉన్నప్పుడు హిందూ అనే పదమే ఉనికిలో లేదు. ఇప్పటి వరకు మనకు దొరికిన అన్ని చోళ శాసనాలను గమనిస్తే వాటిలో ఎక్కడా హిందూ అనే పదాన్ని ప్రస్తావించలేదు.

ఆ రోజుల్లో ఒక మతాన్ని సూచించే పదంగా హిందూ అనే శబ్దం ఏ భాషలోనూ లేదు. తమిళం కూడా అందుకు మినహాయింపు కాదు. కాబట్టి రాజరాజ చోళున్ని హిందూ రాజుగా చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

రాజరాజ చోళుని కాలంలో శైవం, వైష్ణవం ప్రధాన మతాలుగా ఉన్నాయి. ఆయన పాలనలో శైవం బాగా ప్రాచుర్యం పొందింది. అప్పటికి హైందవం ఒక మతంగా లేదు. జైనం, బౌద్ధం పతనావస్థలో ఉన్నాయి. శైవం, వైష్ణవ మతాలు మళ్లీ చిన్నచిన్న శాఖలుగా విడిపోయాయి. అలా శైవంలో ఏర్పడిన పశుపత అనే శాఖకు చెందిన వాడు రాజరాజ చోళుడు. కాబట్టి ఆయన హిందూ రాజు కాదు.

నేటి హైందవాన్ని రాజరాజ చోళుని కాలం నాటి మతాలతో పోల్చడమనేది చాలా పెద్ద తప్పు. వాయువ్యం నుంచి వచ్చిన పర్షియన్లు, గ్రీకులు భారత్‌ను సింధూ అని పిలిచారు. అంటే సింధూ నది ప్రాంతంలో నివసించే వారు అని అర్థం. కాలక్రమంలో సింధూ కాస్త హిందూగా మారింది. సింధూ అంటే నది అని అర్థం. కానీ హిందూ అనే పదానికి ఎటువంటి అర్థం లేదు. రాజకీయ నేతలు హిందూ అనే పదాన్ని మతంగా మార్చారు’’ అని కరుణానందమ్ అభిప్రాయపడ్డారు.

శివుడు

ఫొటో సోర్స్, Getty Images

హిందూ మతం లేదా? శైవం, వైష్ణవం అందులో భాగం కాదా?

రాజరాజ చోళుని కాలంలో శైవం ప్రధానంగా ఉండేదని, 'రాజరాజం' అనే పుస్తకం రాసిన వి.జీవకుమార్ అన్నారు.

'రాజరాజ చోళుని కాలంలో శైవ దేవాలయాల్లో ఆచరించే మతాన్ని శైవం అని పిలిచేవారు. శైవభక్తి గీత సంకలనాలైన తెవారం, తిరుమురైలలో కూడా శైవంగానే పేర్కొన్నారు. ఇప్పటికీ శైవాన్ని ప్రత్యేక మతంగా భావించే వాళ్లు చాలా మందే ఉన్నారు.

శివలింగాన్ని మాత్రమే పూజించే లింగాయతులు తాము హిందువులమని చెప్పుకోరు. రాజరాజ చోళుని కాలంలో శైవం మాదిరిగానే జైనం, బౌద్ధాన్ని కూడా ప్రజలు ఆచరించేవారు. అంతేకాదు ఏ దైవాన్ని కొలవని సిద్ధులు కూడా ఉండేవారు.

రాజరాజ చోళుడు శైవాన్ని అనుసరించినప్పటికీ ఆయన కాలంలో అనేక మతాలు ఉన్నాయి. కాబట్టి ఆయనను ఏదో ఒక మతానికి చెందిన వ్యక్తిగా భావించలేం.

అనేక మంది దేవుళ్లను, దేవతలను పూజించే వాళ్లను ఒక గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు బ్రిటిషర్లు హిందూ అనే పదాన్ని ఉపయోగించారు.

క్రైస్తవులు, ముస్లింలు కాని ప్రజలను గుర్తించేందుకు సర్ విలియమ్ జోన్స్ అనే అనే బ్రిటిష్ వ్యక్తి తొలిసారి హిందూ అనే పదాన్ని వాడారు.

బ్రిటీష్ చట్టాలను సవరించే క్రమంలో క్రైస్తవులు కాని వారిని హిందువులుగా జోన్స్ పిలిచారు. అక్కడ హిందూ అనేది మతపరమైన గుర్తింపు కాదు. అదొక పేరు మాత్రమే' అని జీవకుమార్ వివరించారు.

శ్రీ పద్మనాభ స్వామి

ఫొటో సోర్స్, Facebook/Sree Padmanabha Swamy Temple

శివుడు, విష్ణువులను హిందూ మతంలో కలిపారా?

నేటి హిందూ ఆచారాల ఆధారంగా రాజరాజ చోళున్ని హిందువుగా పిలవడం తప్పు అని చెన్నై యూనివర్సిటీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ రిలీజియస్ థాట్ విభాగంలో పని చేస్తున్న ప్రొఫెసర్ శరవణన్ అన్నారు.

'హిందూ అనే పదం దేవుళ్లను లేదా మతాలను సూచించదు. మనం నేడు హిందూ అంటూ.. వేద కాలం నాటి సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నాం. అంటే యజ్ఞయాగాల గురించి చెబుతున్నాం. కాబట్టి హిందూ అనేది సనాతన, వర్ణాశ్రమ ధర్మాలను సూచిస్తోంది.

కానీ తమిళులు ఆచరించిన మతాలు, వాటి పద్ధతులు అందుకు చాలా భిన్నమైనవి.

9వ శతాబ్దంలో ఆరు మతాలను సూచించేలా 'షన్మత' అనే పదాన్ని శంకరాచార్యుడు వాడారు.

వీటిలో శైవం... అంటే శివున్ని ఆరాధించడం, వైష్ణవం... విష్ణువును పూజించడంతోపాటు మురుగ(కుమార స్వామి)ను కొలిచే మతం కౌమరమ్ ఉంది. సూర్యున్ని అర్చించే మతం సౌరమ్ అయింది. వినాయకుడిని కొలిచే వారి మతం గణపత్యం. ఆదిశక్తిని కొలిచే వారిది శాక్తేయం. అలా నాడు ఆది శంకరాచార్యుడు మతాలను విభజించారు.

అందువల్ల నేటి హిందూ అనే పదం ఆధారంగా రాజరాజ చోళున్ని హిందూ రాజు అని చెప్పడం తప్పు అవుతుంది.

తమిళ ప్రాచీన రచనలైన తిరుక్కురళ్, సిలప్పదికారాలలో హిందువుల గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఆ తరువాత వచ్చిన రాజ్యాలు, రాజుల కాలంలో శక్తిమంతమైన స్థానాలలో ఉన్న వ్యక్తులు... వేదాలు ఉన్నతమైనవని, బ్రాహ్మణులు ఉన్నతమైన వారు అనే ఆలోచనలను సృష్టించారు.

ఆ తరువాత వారు శైవంలో ప్రధాన దేవుడైన శివుణ్ణి హిందూ మతంలో కలుపుకున్నారు. అలా శైవాన్ని హైందవంగా వారు పిలవడం ప్రారంభించారు. వైష్ణవం విషయంలోనూ అదే జరిగింది. కరుడు గట్టిన శైవులు ఎవరూ తాము హిందువులమని చెప్పుకోరు. అలా పిలిచినా వారు ఒప్పుకోరు’’ అని శరవణన్ తెలిపారు.

బీజేపీ జెండాలు

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో పుట్టిన వారంతా హిందువులేనా?

రాజరాజ చోళుడు హిందువు కాదంటూ వెట్రిమారన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ విమర్శిస్తోంది.

'శివుని గుడి కట్టించిన రాజు ముస్లిమా? లేక క్రైస్తవుడా? లేక బౌద్ధుడా?' అని బీజేపీ మాజీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా ప్రశ్నించారు.

'హిందూ అనేది ఒక మతం కాదు అదొక జీవనశైలి. కాబట్టి ఆ పదం వాడటంలో తప్పు లేదు. ఇండియా అని పిలిచే హిందుస్థాన్‌లో ఉన్న వారు అంతా హిందువులే. శైవులు, వైష్ణవులు పరస్పరం కలహాలకు దిగినప్పుడు ఆ ఘర్షణలను ఆపి ఏకం చేసింది హిందూ అనే పదమే.

శైవులు, వైష్ణవులు కొట్లాటలతో రక్తాన్ని పారించి ఉండొచ్చు... తలలను నరుక్కొని ఉండొచ్చు... కానీ ఆ హింసను ఆపింది హిందూ పదం. ఆ రెండు వర్గాలను కలిపింది హిందూ పదం. కాబట్టి ఆ పదం వాడటంలో తప్పు లేదు' అని తమిళనాడు బీజేపీ నేత నారాయణన్ తిరుపతి అన్నారు.

వీడియో క్యాప్షన్, భార్యను మోస్తూ తిరుమల మెట్లెక్కిన భర్త, ఈ వీడియోపై దంపతులు ఏమన్నారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)