Dubai Visa: యూఏఈలో కొత్త వీసా విధానాలు.. దుబాయ్ వెళ్లాలంటే ఎలా, ఏ వీసా తీసుకోవాలి?

దుబాయి వీసా

ఫొటో సోర్స్, DUBAI INFORMATION SERVICE

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటించిన కొత్త వీసా నిబంధనలు ఈ నెల మూడో తేదీ నుంచి అమలులోకి వచ్చాయి.

కొత్త వీసా నిబంధనల్లో భాగంగా, పర్యటకులకు దీర్ఘకాల వీసాలు, వృత్తి నిపుణులకు దీర్ఘకాల సదుపాయాలు కల్పిస్తామని యూఏఈ తెలిపింది.

పారిశ్రామికవేత్తలు, మదుపరులు, ప్రొఫెషనల్స్ కోసం కొత్త పదేళ్ల గోల్డెన్ వీసా పథకాన్ని తీసుకొచ్చారు.

యూఏఈ తీసుకొచ్చిన కొత్త నిబంధనలు భారత్‌కు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే అక్కడ పెద్ద సంఖ్యలో భారతీయులు పనిచేస్తున్నారు. వీరిలో తెలుగు ప్రజలు కూడా పెద్దయెత్తున ఉంటారు.

మొత్తంగా యూఏఈలో 34 లక్షల మందికిపైగా భారతీయులు ఉన్నారు. వీరిలో కేరళ నుంచి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల కోసం అక్కడకు ఎక్కువగా వెళ్తుంటారు. కొత్త గ్రీన్ వీసా విధానంతో వీరికి మేలు జరిగే అవకాశముంటుంది.

తాజా మార్పులను యూఏఈ తీసుకొచ్చిన భారీ విధాన నిర్ణయ మార్పుల్లో ఒకటిగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరింత మంది మదుపరులు, పర్యటకులు, ప్రొఫెషనల్స్‌ను దేశానికి ఆకర్షించడమే లక్ష్యంగా కొత్త మార్పులు తీసుకొచ్చినట్లు యూఏఈ చెబుతోంది.

ఏటా పెద్దయెత్తున భారత పర్యటకులు కూడా యూఏఈకి వెళ్తుంటారు. దీంతో మొత్తంగా కొత్త వీసా విధానంతో ఎవరికి మేలు జరుగుతుంది? ఇప్పుడు చూద్దాం.

దుబాయి వీసా

ఫొటో సోర్స్, DUBAI VISA INFORMATION

గ్రీన్ వీసా

గ్రీన్ వీసాపై వచ్చే వలసదారులు ఐదేళ్ల వరకు యూఏఈలో ఉండొచ్చు. దీన్ని పునరుద్ధరించే అవకాశమూ ఉంటుంది.

ఇదొక సెల్ఫ్ స్పాన్సర్డ్ వీసా. అంటే యూఏఈ పౌరుడు, లేదా ఉద్యోగ సంస్థ దీనికి స్పాన్సర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫ్రీల్యాన్సర్లు, నైపుణ్య కార్మికులు, మదుపరులు, వారి జీవిత భాగస్వాములు దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

గ్రీన్ వీసా పొందేవారికి మరికొన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి. వీరి జీవిత భాగస్వామి, పిల్లలు, సమీప బంధువులను కూడా వీరితోపాటు తీసుకెళ్లొచ్చు. 25ఏళ్లలోపు వయసుండే పిల్లలను తల్లిదండ్రులు తమతోపాటు తీసుకురావొచ్చు. ఇదివరకు ఈ వయసు 18ఏళ్లుగా ఉండేది. అవివాహితలైన కుమార్తెలు, వికలాంగ పిల్లలకు వయసుతో సంబంధం లేదు. వీసా చివర్లో మరో ఆరు నెలలు గ్రీన్ కార్డుదారులకు అదనంగా నివాసం ఉండేందుకు అవకాశం ఇస్తారు.

దుబాయి వీసా

పదేళ్ల గోల్డెన్ వీసా

విదేశీ పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు, వైద్య నిపుణులు, సైన్స్‌తోపాటు ఇతర సాంకేతిక రంగాల్లో పనిచేసే నిపుణులు, మేలిమి నైపుణ్యాలుగల విద్యార్థులకు గోల్డెన్ వీసా ఇస్తారు.

గోల్డెన్ వీసా పథకాన్ని 2020 నుంచి అమలు చేస్తున్నారు. మేలిమి నైపుణ్యాల గల వారికి యూఏఈకి ఆహ్వానించడమే దీని లక్ష్యం. ప్రస్తుతం దీన్ని పదేళ్ల వరకు కాలానికి జారీచేస్తున్నట్లు ప్రకటించారు.

గోల్డెన్ వీసా దారులకు మరికొన్ని సదుపాయాలను ప్రస్తుతం ప్రకటించారు. వారి వ్యాపారాలపై వారికి వంద శాతం హక్కులు ఉంటాయి. ఇదివరకు ఆరు నెలలపాటు వీరు విదేశాల్లో గడిపితే, వీరు తమ నివాస హక్కులను కోల్పోయేవారు. ఇప్పుడు పదేళ్లపాటు జారీచేసే గోల్డెన్ వీసాలో నిబంధన ఎత్తివేశారు. అంటే ఒకసారి ఈ వీసా పొందిన తర్వాత విదేశాల్లో నచ్చినన్నీ రోజులు ఉండొచ్చు. మరోవైపు తమతోపాటు తీసుకొచ్చే సహాయకులపై నిబంధనలు కూడా ఎత్తివేశారు.

కొత్త పథకం ప్రకారం.. గోల్డెన్ వీసా పొందినవారు తమ జీవిత భాగస్వామితోపాటు వయసుతో సంబంధం లేకుండా తమ పిల్లలకు వీసా స్పాన్సర్ చేయొచ్చు. ఒకవేళ గోల్డెన్ వీసాదారుడు మరణించినా, వారి కుటుంబ సభ్యులు తమ వీసా కాలం పూర్తయ్యేవరకు ఇక్కడే ఉండొచ్చు.

సైన్స్, ఇంజినీరింగ్, మెడిసిన్, ఐటీ, బిజినెస్, అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్ నిపుణులకు ఎక్కువగా గోల్డెన్ వీసా జారీచేస్తుంటారు.

ఇదివరకు నెల వారీ జీతం 50 వేల ఏఈడీలు -దిర్హమ్‌లు (11 లక్షలు) ఉండేవారికి మాత్రమే ఈ వీసాలు ఇచ్చేవారు. ఇప్పుడు దీన్ని 30 వేల ఏఈడీ (6.6 లక్షలు)కు తగ్గించారు.

దుబాయి వీసా

ఫొటో సోర్స్, Getty Images

పర్యటకుల కోసం..

పర్యటక వీసాపై యూఏఈకి వెళ్లే వారు 60 రోజులు అదనంగా అక్కడ ఉండేలా నిబంధనలు తీసుకొచ్చారు. ఇదివరకు ఇది 30 రోజులుగా ఉండేది.

మరోవైపు ఐదేళ్ల మల్టీ-ఎంట్రీ పర్యటక వీసాలను కూడా ప్రవేశపెట్టారు. దీని కింద వరుసగా 90 రోజులు యూఏఈలో గడపొచ్చు. యూఏఈకి వచ్చే ఎక్కువమంది సాధారణంగా దుబాయ్‌కు వెళ్తుంటారు. ఇది అంతర్జాతీయ షాపింగ్ హబ్‌గా ప్రఖ్యాతిగాంచింది.

కొత్త వీసా విధానం వల్ల చాలా మందికి స్పాన్సర్‌లు లేదా హోస్ట్‌లను వెతుక్కోవాల్సిన అవసరం తప్పింది. మరోవైపు ప్రపంచంలోని తొలి 500 యూనివర్సిటీల విద్యార్థులకు కూడా వీసాలు సరళతరం చేశారు.

వీడియో క్యాప్షన్, నూపుర్ శర్మ వివాదంతో గల్ఫ్‌లో తమపైన ఎలాంటి ప్రభావం పడలేదన్న ప్రవాస భారతీయులు

పెద్దమొత్తంలో భారతీయులు

మొత్తంగా 34 లక్షల మంది భారతీయులు యూఏఈలో జీవిస్తున్నారు. ఎమిరేట్స్‌లో భారతీయులదే అతిపెద్ద విదేశీ కమ్యూనిటీ.

భారత విదేశాంగ శాఖ సమాచారం ప్రకారం.. యూఏఈ నుంచి ఏటా 1.70 బిలియన్ డాలర్ల (రూ13,894 కోట్లు) పెట్టుబడులు వస్తున్నాయి. వీటిలో 1.16 బిలియన్ డాలర్లు (రూ.9,481 కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) రూపంలో, మిగతావి పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల రూపంలో వస్తున్నాయి. ఎఫ్‌డీఐల విషయంలో భారత్‌లో యూఏఈ తొమ్మిదో దేశం.

మరోవైపు యూఏఈలో ఇటీవల కాలంలో భారత సంస్థల పెట్టుబడులు కూడా పెరిగాయి. మొత్తంగా యూఏఈలో భారతీయ కంపెనీల పెట్టుబడులు 85 బిలియన్ డాలర్ల (రూ.6,94,718 కోట్లు) వరకు ఉంటాయి. 2018లో యూఏఈ సెంట్రల్ బ్యాంకు విడుదలచేసిన వివరాల ప్రకారం.. దుబాయ్‌లో పనిచేస్తున్న భారతీయులు ఆ ఏడాది 17.56 బిలియన్ డాలర్లు(రూ. 1,43,521 కోట్లు) తమ స్వదేశానికి పంపించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)