Sky Scrapers: ఆకాశ హర్మ్యాలకు ఇక కాలం చెల్లిందా, ఇది కూడా కోవిడ్ ఎఫెక్టేనా?

అమెరికాలో 1930లో నిర్మాణ దశలో ఉన్న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, పక్కనే క్రిస్లర్ బిల్డింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికాలో 1930లో నిర్మాణ దశలో ఉన్న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, పక్కనే క్రిస్లర్ బిల్డింగ్

ఆకాశ హర్మ్యాలు, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాన్ని తగ్గించాలని ఇటీవలే చైనా నిర్ణయించుకుంది. వాటిని విలాస భవనాలుగా ఆ దేశం పరిగణిస్తోంది. ఆఫీసులు ఖాళీగా ఉండటం, ఉన్నవి కూడా మూసేసినట్లుగా ఉంటుండంతో ఎత్తయిన టవర్ బిల్డింగ్‌లపై పునరాలోచన మొదలైంది. చైనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణి కనిపిస్తోంది.

ఇప్పటికి 90 ఏళ్ల కిందట, ప్రపంచం ఒక మహమ్మారి నుంచి బైటపడి, ఆ తర్వాత ఆర్ధిక మాంద్యం అంచులకు చేరిన పరిస్థితులలో బహుళ అంతస్తుల భవనాల స్వర్ణయుగం మొదలైంది. ఆరంభంలో క్రిస్లర్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ లాంటి నిర్మాణాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

1930 నాటికి నిర్మాణం పూర్తి చేసుకున్న క్రిస్లర్ బిల్డింగ్ అప్పట్లో ప్రపంచంలోనే అతి ఎత్తయిన బిల్డింగ్‌గా పేరు తెచ్చుకుంది.

మరుసటి సంవత్సరం ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఆ రికార్డును సొంతం చేసుకుంది. కానీ, అంత పెద్ద భవనం ఉన్నా, అందులో అద్దెకు తీసుకుని ఆఫీసుల నిర్వహించే ప్రక్రియ మాత్రం చాలా నెమ్మదిగా సాగింది.

దీంతో ఈ భవనం ఎంప్టీ స్టేట్ బిల్డింగ్ ( ఖాళీ స్టేట్ బిల్డింగ్) అని కొన్నాళ్లు పిలిపించుకుంది. అయితే 1933లో కింగ్‌ కాంగ్ మూవీలో కనిపించిన తర్వాత ఈ బిల్డింగ్‌లో లీజులు జోరందుకున్నాయి.

ఆకాశహర్మ్యాల రెండో స్వర్ణయుగం గత 20 సంవత్సరాలుగా కొనసాగుతోంది. కానీ నిర్మాణాలు మాత్రం మందకొడిగా సాగుతున్నాయి. చాలా ప్రాజెక్టులు ఆగిపోయాయి.

'కౌన్సిల్ ఆన్ టాల్ బిల్డింగ్స్ అండ్ అర్బన్ హాబిటేట్' ప్రకారం, అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2020లో ప్రపంచవ్యాప్తంగా పూర్తయిన ఎత్తయిన భవనాల సంఖ్యలో 20% తగ్గుదల కనిపించింది. ఇది చైనాలో ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. మొన్నమొన్నటి వరకు చైనాలో టవర్ బిల్డింగ్‌లు విపరీతమైన వేగంతో పెరిగాయి.

షాంఘైలోని ఆకాశహర్మ్యాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షాంఘైలోని ఆకాశహర్మ్యాలు

కోవిడ్ అనంతర ప్రపంచం ఆకాశ హర్మ్యాలను నిర్మించలేదా?

ఇలాంటి అభిప్రాయాలు గతంలో కూడా వినిపించాయి. 9/11 ఘటనల తర్వాత ఆకాశ హర్మ్యాలకు కాలం చెల్లిందని కొందరు వాదించారు. కానీ, అది నిజం కాదని తర్వాత జరిగిన నిర్మాణాలను చూస్తే అర్ధమవుతుంది.

గత శతాబ్దం మొత్తంలో నిర్మించిన వాటి కంటే, గడిచిన 20 ఏళ్లలో నిర్మించిన ఆకాశ హర్మ్యాల సంఖ్య ఎక్కువ.

ట్విన్ టవర్స్‌పై దాడుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా అవలంబించిన కట్టుదిట్టమైన భవన ప్రమాణాల కారణంగా, గతం కంటే ఇప్పుడు మరింత సురక్షితంగా, పర్యావరణహితంగా ఉన్నాయి ఆకాశ హర్మ్యాలు.

ప్రపంచంలోనే ఎత్తయిన భవనాలు అన్న పేరు ఒకదేశపు భాగ్యరాశిగా మారగలదని కూడా నిరూపణ అయ్యింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లోని పెట్రోనాస్ టవర్స్, దుబయ్‌లోని బుర్జ్ లీఫా లాంటి భవనాలు ఇందుకు ఉదాహరణలు.

మారుమూల ఎడారి ప్రాంతంలో కూడా బుర్జ్ ఖలీపా సిరులు కురిపిస్తోంది.

భారీ టవర్ బిల్డింగ్‌లు కొత్త కొత్త అభివృద్ధి నమూనాలుగా మారుతున్నాయి. "బుర్జ్ ఖలీఫా 300 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైంది. అనుకున్న లక్ష్యాలను సాధించింది'' అని ఆండ్రియన్ స్మిత్- గోర్డాన్ గిల్ ఆర్కిటెక్చర్ సంస్థ వ్యవస్థాపక భాగస్వామి ఆండ్రియన్ స్మిత్ అన్నారు.

ప్రస్తుతం బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యం

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యం

అతి ఎత్తయిన టవర్ బిల్డింగ్‌లు

వారి సంస్థే బుర్జ్ ఖలీఫా భవనాన్ని నిర్మించింది. వారి ఆధ్వర్యంలోనే నిర్మితమవుతున్న జెడ్డా టవర్ నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అతి ఎత్తయిన టవర్‌గా ప్రసిద్ధికెక్కనుంది.

ఒకప్పుడు అధిక జనసాంద్రత, అధిక భూమి విలువ అనేవి ఆకాశ హర్మ్యాల నిర్మాణానికి కారణమైంది. కానీ, ఇప్పుడు 500 మీటర్ల ఎత్తయిన భవనం నిర్మాణానికి సరైన కారణం ఉండాలంటారు కమ్రాన్ మోజమీ. ఆయన ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ డబ్ల్యూ ఎస్‌పీ మేనేజింగ్ డైరక్టర్‌గా పని చేస్తున్నారు.

వారి సంస్థ నిర్మించిన భవనాల్లో లండన్‌లో అతి ఎత్తయిన భవనం 'ది షార్డ్', ఆమెరికలో ‘వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్’, ఆసియాలోనే ఎత్తయిన షాంఘై టవర్‌లు ఉన్నాయి.

''సాధ్యమైనంత పొదుపుగా ఎలా నిర్మించాలన్న దానిపై దృష్టిపెట్టాలి. దుబయ్‌లాంటి నగరాలో ఎత్తయిన భవనాలతో ప్రయోజనం ఉంటుంది. కానీ, షాంఘై, మన్‌హట్టన్ వంటి ప్రసిద్ధ నగరాలలో వీటి అవసరం లేదు. ఈ రోజుల్లో ఐకానిక్ టవర్ అంటే దాని రూపమే కాదు, దాని నుంచి విడుదలయ్యే కర్బన ఉద్గారాల గురించి కూడా ఆలోచించాలి'' అని కమ్రాన్ అన్నారు.

ఎత్తయిన భవనాలను అడ్వెంచర్స్‌ కోసం ఉపయోగించడం పెరుగుతోంది

ఫొటో సోర్స్, CLIMB IMAGES

ఫొటో క్యాప్షన్, ఎత్తయిన భవనాలను అడ్వెంచర్స్‌ కోసం ఉపయోగించడం పెరుగుతోంది

కాలుష్యం

నేటి రోజుల్లో భవనాల కారణంగా కాలుష్యం పెరిగిపోతోందని ప్రముఖ విమర్శకుడు డేవిడ్ బ్రస్సాట్ అన్నారు.

"గతంలో రోజూ పని చేసుకోవడానికి వెళుతూ రోడ్డు పక్కన ఉన్న భవనాలను ఆశ్చర్యంగా చూసుకుంటూ వెళ్లే వారు. కానీ ఇప్పుడు ఈ ఎత్తయిన భవనాలు అనే అర్బన్ అడవిలో పని చేసీ చేసీ ప్రజలకు బోర్ కొట్టింది'' అని బ్రస్సాట్ వ్యాఖ్యానించారు.

పట్ణణ జీవితంలో అద్భుతంలాగా కనిపించే సౌకర్యాలుంటాయి. అంటే పబ్లిక్ ప్లేస్‌లు, ప్రజా రవాణా సాధానాలు, రెస్టారెంట్లు, మ్యూజియాలు, క్లబ్‌లకు సులభంగా వెళ్లే అవకాశం ఉంటుంది.

కానీ, కోవిడ్ వీటన్నింటినీ మార్చేసింది. నగరాలన్నీ ఇప్పుడు వెనక్కి వెళుతున్నాయి. వాటిలాగే ఆకాశ హర్మ్యాలు కూడా వెనక్కి వచ్చే అవకాశం ఉంది.

''విభిన్న నివాస, కార్యాలయాల భవనాలు ఉన్న ప్రాంతం మిగతా వాటికంటే సమర్ధవంతంగా కోవిడ్‌లాంటి మహమ్మారులను ఎదుర్కోగలవని నిరూపణ అయ్యింది'' అని ప్రముఖ రియల్ సంస్థ ఆర్ఎ‌క్స్‌ ఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్కాట్ రెచ్లర్ చెప్పారు.

అలాగని ఆఫీసులకు మార్కెట్ తగ్గిపోలేదని రెచ్లర్ అభిప్రాయ పడ్డారు. ''నిపుణులు మళ్లీ న్యూయార్క్‌లో అడుగుపెట్టారు. వాళ్లు ఇక్కడే ఉండాలని, పని చేయాలనీ కోరుకుంటున్నారు. 21వ శతాబ్దపు అత్యంత సౌకర్యాలతో కూడిన ఆఫీసు స్థలాలకు డిమాండ్ ఎప్పటిలాగే ఉంది'' అన్నారు రెచ్లర్.

న్యూయార్క్ నగరంలో ప్రజారోగ్య శాఖ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఇక్కడ జనరల్ వ్యాక్సినేషన్ 87%శాతం ఉంది. ఆఫీసు బిల్డింగ్‌ల లోపల ఖాళీలు కూడా పోస్ట్-పాండమిక్ అవసరాలకు అనుగుణంగా మారుతున్నాయి. మరింత స్వచ్ఛమైన గాలి, సూర్యకాంతి, ఓపెన్ స్పేస్‌లు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు

కోవిడ్ నిబంధనల ప్రకారం డెస్కులు పక్కపక్కనే కాకుండా దూరదూరంగా ఏర్పాటు చేస్తున్నారు.

''డిమాండ్ తగ్గదు. కానీ, ఆఫీసులలో పని చేసే వారి సంఖ్యలో తేడా ఉంది. ఇకపై ఉద్యోగులందరూ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆఫీసుకు రావాలని షెడ్యూలు వేయలేరు. తక్కువ మందికి ఎక్కువ స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుంది'' కమ్రాన్ మోజమీ అన్నారు.

ఎత్తయిన భవనాల నిర్మాణంపై చైనా అనేక నిబంధనలు విధించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎత్తయిన భవనాల నిర్మాణంపై చైనా అనేక నిబంధనలు విధించింది

ఖాళీగా భవనాలు

ఆకాశహర్మ్యాలు పెద్ద పెద్ద నగరాల్లోనే ఉంటాయి. ఇప్పుడు చాలామంది ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. ఎక్కువమంది తిరిగి ఆఫీసులకు రావాలని కోరుకోవడం లేదు.

యోగా ప్యాంట్లతో పని చేయడంలో ఉండే సౌకర్యాన్ని చాలా కాలం అనుభవించారు. అయితే, పూర్తిగా ఇంటి నుంచే పని చేయడం కుదరదు. ఇందులో కొన్ని సమస్యలు కూడా ఉంటాయి.

''అన్ని పనులు ఇంటి నుంచి పని చేస్తూ వివరించడం కష్టం. ఒక కంప్యూటర్ స్క్రీన్‌పై బిల్డింగ్‌ మోడల్‌ను వివరించే ప్రజెంటేషన్‌ లాంటివి అర్ధం చేసుకోవడం క్లయింట్లకు కష్టంగా ఉంటుంది" అని ఆండ్రియన్ స్మిత్ అన్నారు.

చరిత్రలో అనేక సంక్షోభాలు ఆవిష్కరణలకు దారితీశాయి. కానీ, కోవిడ్ అనంతర పరిస్థితులు ఆకాశహర్మ్యాల విషయంలో అందుకు భిన్నమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఆకాశాన్నంటే భవనాల నిర్మాణంలో అగ్రగామిగా ఉన్న చైనా ఇప్పుడు వాటిని నిర్మించకూడదని నిర్ణయించుకుంది.

వీడియో క్యాప్షన్, ఏమిటీ తైవాన్? ఎందుకీ టెన్షన్

గత రెండు దశాబ్దాలలో ప్రపంచ వ్యాప్తంగా 115 సూపర్ టాల్ బిల్డింగ్‌లు ( సుమారు 300 మీటర్లకు పైగా ఎత్తున్నవి) నిర్మితమైతే, అందులో 85 భవనాలు ఒక్క చైనాలోనే ఉన్నాయి.

అలాంటి చైనా, ఇప్పుడు అసలు అలాంటి భవనాలే నిర్మించవద్దని నిర్ణయం తీసుకుంది.

కోవిడ్ వల్ల కలిగిన నష్టాలను పూడ్చుకునే పనిలో పడింది చైనా. ఇందులో భాగంగానే ఖాళీగా ఉన్న భవనాలను పూరించాలని, ఇందుకోసం కొత్త భవనాల నిర్మించవద్దన్నది చైనా ప్రణాళిక.

అంతకు ముందున్న నిర్మాణ నిబంధనలతోపాటు, 2020లో కొత్తగా నిర్మించబోయే ఆకాశహర్మ్యాల ఎత్తు, డిజైన్‌లకు ప్రభుత్వం పరిమితులను ప్రకటించింది.

వీటితోపాటు ఈఫిల్ టవర్, క్రెమ్లిన్‌ లాంటి పాశ్చాత్య దేశాల మోడళ్లను ఇక్కడ దింపే ప్రయత్నాలు ఇకపై కుదరవని తేల్చి చెప్పింది. ఇలాంటి భవనాలు ఇప్పటికే చైనాలో పలు చోట్ల కనిపిస్తుంటాయి.

షాంఘై నగరం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షాంఘై నగరం

చైనాలో నిబంధనలు కఠినం

ఇక ఈ ఏడాది జూలై నుంచి నిబంధనలను కఠినతరం చేశారు. ఈసారి ఎత్తును లక్ష్యంగా చేసుకున్నారు. 500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో భవనాలు నిర్మించడానికి వీలు లేదు. 250 మీటర్ల ఎత్తు దాటిన భవనాలకు కూడా అనేక నిబంధనలు విధించారు.

30 లక్షలమందికన్నా తక్కువ జనాభా ఉన్న నగరాలలో 150 మీటర్లు దాటి భవనాలు నిర్మించడానికి వీలు లేదని తేల్చి చెప్పింది.

దీని వెనక ఆర్ధిక కారణాలు కూడా ఉన్నాయి. చైనాలో ఎక్కువ భారీ భవనాలను పాశ్చాత్య దేశాల సంస్థలే నిర్మించాయి.

''ప్రజలు కష్టపడి పని చేసి ఉత్పాదకతను పెంచడంపై ఆ దేశం ఇన్నాళ్లు దృష్టి పెట్టింది. ఇందుకోసం అవసరమైన వాటికంటే ఎక్కువగా ఆఫీసు, నివాస సముదాయాలను నిర్మించింది. ఇప్పుడు మళ్లీ నిర్మించాల్సిన అవసరం లేదు'' అని ఆండ్రియన్ స్మిత్ వ్యాఖ్యానించారు.

''ఆర్ధికంగా లాభాలను కలిగించేలా అంటే అద్దెకు ఇవ్వడానికి వీలుగా అనేక భవనాలను నిర్మించారు. అంటే వాళ్లు ఒకరకంగా అమెరికా రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లా వ్యవహరించారు'' అని స్మిత్ అభిప్రాయపడ్డారు.

ఎత్తయిన, ఖరీదైన భవనాలను నిర్మించే వారిని, అందులో పని చేసే వారిని కోవిడ్ పునరాలోచనలో పడేసింది. అవసరం, అనుకూలత, పర్యావరణ హితం కోరే భవనాలు మాత్రమే నిర్మించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)