పాకిస్తాన్‌కు సహాయం చేస్తే సౌదీ అరేబియాకు ఏంటి లాభం?

సౌదీ అరేబియా

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. మే నెల నుంచి ఇప్పటి వరకు పాక్‌ కరెన్సీ 13.6% క్షీణించింది. ప్రస్తుతం ఒక్క డాలర్ విలువ పాకిస్తాన్‌ కరెన్సీలో దాదాపు 173 రూపాయలు. మంగళవారం గరిష్టంగా అది రూ.175.80కి చేరుకుంది.

పాకిస్తాన్ దిగుమతి బిల్లు కూడా పెరుగుతోంది. దీంతో విదేశీ మారక నిల్వలు అడుగంటుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి భారతదేశ విదేశీ మారక నిల్వలు 427 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇది క్రమంగా పెరుగుతూ సెప్టెంబరు మొదటి వారంలో 582 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే గత ఎనిమిది నెలల్లో 36.3 శాతం పెరిగింది.

మరోవైపు, గత ఏడాది చివరి నాటికి పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు 17.93 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో 19.96 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంటే గత ఎనిమిది నెలల్లో కేవలం 11.3% మాత్రమే పెరిగింది.

అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎమ్‌ఎఫ్‌) నుండి 6 బిలియన్ డాలర్ల ప్యాకేజీని పొందే పనిలో పాకిస్తాన్ నిమగ్నమై ఉంది.

సౌదీ అరేబియా

ఫొటో సోర్స్, Getty Images

కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ

పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలకు ఇది చాలా ముఖ్యమైన ప్యాకేజీ. గత ఐదు వారాలుగా పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు క్షీణిస్తూనే ఉన్నాయి. అక్టోబర్ 15 నాటికి విదేశీ మారక నిల్వలు 17.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. పాకిస్తాన్ కరెన్సీ రూపాయి ఆసియాలోనే అత్యంత బలహీన కరెన్సీగా మారింది.

వచ్చే మూడు, నాలుగేళ్లలో 14 బిలియన్ డాలర్ల విదేశీ అప్పులను తిరిగి చెల్లించాల్సి ఉంటుందని పాకిస్తాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని డెబ్ట్‌ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ ఉమర్ జాహిద్ చెప్పారు.

ఇలాంటి పరిస్థితిలో సౌదీ అరేబియా మరోసారి పాకిస్తాన్‌కు సాయం చేయడానికి ముందుకొచ్చింది. పాకిస్తాన్‌కు 4.2 బిలియన్ డాలర్ల సాయాన్ని సౌదీ అరేబియా ప్రకటించింది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వాతావరణ మార్పు కార్యక్రమంలో పాల్గొనేందుకు రియాద్‌కు వెళ్లినప్పుడు సౌదీ అరేబియా ఈ ప్రకటన చేసింది.

సౌదీ అరేబియా, యూఏఈలు గతంలో చాలాసార్లు పాకిస్తాన్‌కు ఇలాంటి సాయం చేశాయి. ఇవి కాకుండా, 1980ల నుండి 13వ సారి ఐఎమ్‌ఎఫ్‌ ద్వారా సహాయం పొందడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది.

సౌదీ అరేబియా చేసిన ఈ ప్రకటన అనంతరం, పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్, సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. "పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్‌కు మూడు బిలియన్ డాలర్లు, చమురు కోసం 1.2 బిలియన్ డాలర్లు ఇచ్చినందుకు సౌదీ యువరాజుకు ధన్యవాదాలు. క్లిష్ట సమయాల్లో పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా అండగా నిలిచింది" అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.

సౌదీ అరేబియా

ఫొటో సోర్స్, Getty Images

ఇమ్రాన్ ఖాన్ యూటర్న్

ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) సౌదీ నుండి సహాయం తీసుకోవడంపై చేసిన పాత ట్వీట్ పాకిస్తాన్‌లో వైరల్ అవుతోంది. పాకిస్తాన్‌లోని నయా దౌర్ మీడియా సీఈవో ముర్తాజా సోలంగి ఆ ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఇమ్రాన్‌ పార్టీ పీటీఐ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో 2014 సెప్టెంబర్ 20న ఇమ్రాన్ ఖాన్ ప్రకటనను ట్వీట్ చేసింది. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కాదు. ''సాయం కోసం సౌదీ, అమెరికాలకు వెళ్లడం చాలా సిగ్గుచేటు'' అని నాడు ఇమ్రాన్‌ఖాన్‌ పేర్కొన్నారు.

"ప్రధానమంత్రి మీరు ఖచ్చితంగా చెప్పింది నిజమే" అంటూ ముర్తాజా సోలంగి వ్యంగ్యంగా పోస్ట్‌ చేశారు.

ఇమ్రాన్‌ ఖాన్‌లా దేశ ఆర్థిక వ్యవస్థను మరెవరూ దిగజార్చలేదని పాకిస్తాన్ వ్యూహాత్మక విశ్లేషకులు ఇక్బాల్ లతీఫ్ పేర్కొన్నారు.

"2018లో పాకిస్తాన్ జీడీపీ 315 బిలియన్లు డాలర్లు, ఇప్పుడు 255 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. కరాచీ స్టాక్ ఎక్సేంజ్ మార్కెట్ క్యాప్ 112 బిలియన్‌ డాలర్లు కాగా ఇప్పుడు 43.7 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. పాకిస్తాన్‌లో తలసరి ఆదాయం 2018లో సంవత్సరానికి 1540 డాలర్లుగా ఉంది, అది ఇప్పుడు 1140 డాలర్లకు తగ్గింది" అని ఇంతకు ముందు ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడిన వీడియోను పోస్ట్‌ చేశారు.

"మరోసారి సౌదీ అరేబియాను వందల కోట్ల డాలర్లు అడుక్కుంటున్నారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను నిర్వహించేది ఇలాగేనా?" అంటూ పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త కైజర్ బెంగాలీ ట్వీట్‌ చేశారు.

పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్‌కు మూడు బిలియన్ డాలర్లు ఇచ్చినందుకు ప్రతిఫలంగా సౌదీ అరేబియా 3.5% వడ్డీని వసూలు చేస్తుందని పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త యాసిర్ మహమూద్ తెలిపారు.

అయితే, 4.2 బిలియన్ డాలర్ల రుణంపై సౌదీ అరేబియా 3.2% వడ్డీని వసూలు చేస్తుందని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆర్థిక సలహాదారు షౌకత్ తారిన్ పేర్కొన్నారు.

2019లో పాకిస్తాన్‌కు ఒక నెల దిగుమతికి సరిపడే విదేశీ మారక నిల్వలు మాత్రమే మిగిలి ఉండే పరిస్థితి తలెత్తింది. ఆ సమయంలో చైనా, సౌదీ అరేబియా, యూఏఈలు ఆరు బిలియన్ డాలర్ల రుణం ఇచ్చి ఆదుకున్నాయి.

సౌదీ అరేబియా చేస్తున్న సాయానికి, వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి ఉంటుందని పాక్ ఆర్థికవేత్తలు చెబుతున్నప్పటికీ, ఆ రుణాన్ని పాక్ ప్రభుత్వం తన ఘనతగా చెప్పుకొంటోంది.

సౌదీ అరేబియా

ఫొటో సోర్స్, Getty Images

పాకిస్తాన్‌కు సౌదీ ఇంత రుణం ఎందుకు ఇస్తుంది?

ఇరాన్, సౌదీల మధ్య శత్రుత్వం పాతది. పాకిస్తాన్ ద్వారా ఇరాన్‌ను తమ ఆధీనంలో ఉంచుకోవాలని సౌదీ భావిస్తోందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఫ్రాన్స్‌లో నివసిస్తున్న పాకిస్తాన్-ఇన్-ఎక్సైల్ అవార్డు విజేత జర్నలిస్ట్ తహా సిద్ధిఖీ, 2019 ఫిబ్రవరి 16న అల్-జజీరాలో ఇదే అంశంపై వ్రాశారు.

"సౌదీ అరేబియా ఆర్థిక ప్యాకేజీలు, పెట్టుబడి వాగ్దానాల ద్వారా ఆర్థికంగా చిక్కుకున్న పాకిస్తాన్ ప్రభుత్వ విధేయతను చురగొనాలని ప్రయత్నిస్తుంది. ఇరాన్ పాకిస్తాన్ పొరుగు దేశం. దీంతో సౌదీకి అనుకూలంగా ఉండేలా పాకిస్తాన్ సరిహద్దు విధానాలను రూపొందించేలా చేసింది" అని తహా సిద్ధిఖీ తన కథనంలో రాశారు.

"రెండు దేశాల మధ్య సంబంధాలలో సౌదీ రుణాలు కొత్త విషయం కాదు. సౌదీ డబ్బు, అమెరికా విధానం కారణంగా పాకిస్తాన్‌ ఎల్లప్పుడూ సౌదీకి ఆత్మీయంగా ఉంటుంది. జనరల్ జియా-ఉల్-హక్ 1977లో వామపక్ష భావజాలం ఉన్న జుల్ఫికర్ అలీ భుట్టోను అధికారం నుండి తొలగించినప్పుడు ఈ సంబంధం తెరపైకి వచ్చింది. అమెరికాకు చేరువ కావడానికి ఇలా చేశారు" అని తహా సిద్ధిఖీ పేర్కొన్నారు.

"ఫిబ్రవరి 1979లో ఇరాన్ విప్లవం, అదే ఏడాది డిసెంబర్‌లో అఫ్గానిస్తాన్‌పై సోవియట్ యూనియన్ దాడి చేసింది. ఈ రెండు సంఘటనలు అమెరికా విదేశాంగ విధానంలో పాకిస్తాన్‌ ప్రాముఖ్యాన్ని పెంచేలా చేశాయి"

సౌదీ అరేబియా

ఫొటో సోర్స్, Getty Images

"పశ్చిమాసియాలో ఇరాన్, సోవియట్ ప్రభావాన్ని తగ్గించడానికి ఆ ప్రాంతంలోని దేశాలతో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని అమెరికా భావించింది. అటువంటి పరిస్థితిలో, పాకిస్తాన్ అమెరికాకు ప్రత్యేకమైనది. అదే సమయంలో పాక్‌, సౌదీ అరేబియాకు మిత్రదేశంగా కూడా మారింది"

"1973లో చమురు ధరలు పెరగడంతో, సౌదీకి చమురు నుండి చాలా డబ్బు వచ్చింది. ఈ డబ్బు ద్వారా అరబ్, ముస్లిం ప్రపంచంలో చెక్‌బుక్ దౌత్యాన్ని సౌదీ ముందుకు తీసుకువెళ్లిందని చెబుతారు. పాకిస్తాన్‌లో అమెరికా ఆమోదించిన పథకంలో సౌదీ కూడా పెట్టుబడి పెట్టింది. వీటిలో అఫ్గానిస్తాన్‌లోని సోవియట్ వ్యతిరేక సాయుధ సమూహాలకు శిక్షణ ఇవ్వడం కూడా ఉంది"

"పాకిస్తాన్‌కు సౌదీ సహాయం అనేక విధాలుగా అందింది. సైనిక, పౌర సహాయం రూపంలో మాత్రమే కాకుండా మతపరమైన అంశాల్లో సహకారం కూడా ఉంది. జియా-ఉల్-హక్ ప్రభుత్వం కూడా మసీదులు, మదర్సాలలో సౌదీ స్వచ్ఛంద సంస్థలను అనుమతించింది. ఈ సహాయం షియా వ్యతిరేక, సనాతన ఇస్లాంను ప్రోత్సహించే రూపంలో ఉంది. పాకిస్తాన్‌లో సున్నీ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని కూడా సౌదీపై ఆరోపణలు వచ్చాయి. దీంతో షియా ముస్లింలపై హింస కూడా పెరిగింది. ఇరాన్‌లోనూ ఇలాంటి దాడులు జరిగాయని ఆరోపణలు వచ్చాయి"

ప్రపంచంలో అణుశక్తి ఉన్న ఏకైక ఇస్లామిక్ దేశం పాకిస్తాన్ మాత్రమే. ఈసారి ఇమ్రాన్ ఖాన్ సౌదీ వెళ్లినప్పుడు సౌదీ అరేబియా భద్రతకు ముప్పు వచ్చినప్పుడల్లా.. ప్రపంచం ఎటువైపు ఉన్నా పాకిస్తాన్ మాత్రం సౌదీకి అండగా నిలుస్తుందన్నారు. సౌదీ సైన్యానికి శిక్షణ ఇవ్వడంలోనూ పాకిస్తాన్ సహకరించింది.

కశ్మీర్ విషయంలో భారత్‌కు వ్యతిరేకంగా సౌదీ అరేబియా మాట్లాడాలని పాకిస్తాన్ కోరుతున్నప్పటికీ, కొన్నేళ్లుగా కశ్మీర్‌పై తటస్థ వైఖరిని సౌదీ కొనసాగిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)