ఆంధ్ర-ఒడిశా సరిహద్దు గ్రామాల్లో గంజాయి సాగు: ‘మరో దారి లేకే గంజాయి పండిస్తున్నాం..’

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్ర-ఒడిశా బోర్డర్ (ఏవోబీ ) అనగానే ఆదివాసీలు, మావోయిస్టులు, ప్రకృతి సౌందర్యం గుర్తుకొస్తుంది.
ప్రస్తుతం ఏవోబీ అంటే ఘాటైన గంజాయి అనే చర్చ నడుస్తోంది. ఈ గంజాయి ఘాటు ఏపీ రాజకీయాల్లో సైతం కల్లోలం సృష్టిస్తోంది.
గంజాయికి కేరాఫ్ అడ్రస్ అంటూ నిత్యం వార్తల్లో ఉండే గ్రామాల్లో గంజాయి సాగు, వ్యాపారాలలో నిజమెంతో తెలుసుకునేందుకు బీబీసీ తెలుగు టీం ఆ ప్రాంతాల్లో పర్యటించింది.
ఏవోబీలోని గంజాయి తోటల్లోని పంట ఎటువంటి అడ్డంకులు లేకుండా అమ్ముడైతే ఎకరానికి రెండు సీజన్లలో సరాసరి 50 లక్షల వరకు ఆదాయం వస్తుందని, దీనికి పెట్టుబడి కేవలం ఐదు లక్షలు మాత్రమేనని చెబుతుంటారు.
ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో 10 వేల ఎకరాలకు పైనే గంజాయి సాగవుతోందని పోలీసులు బీబీసీతో చెప్పారు. అయితే ఇది 15 వేల ఎకరాల కంటే ఎక్కువే ఉండొచ్చని అనధికార అంచనాలున్నాయి.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
గంజాయి సాగుకు అనుకూలం
ఆంధ్ర- ఒడిశా భౌగోళిక, వాతావరణ పరిస్థితులు గంజాయి సాగుకు అనుకూలంగా ఉంటాయి. దాంతో ఇక్కడ గంజాయి సాగు విస్తృతంగా సాగుతోంది.
మావోయిస్టు ప్రాంతాలుగా పేరు పొందిన దట్టమైన అటవీ ప్రాంతాలు, గిరిశిఖరాల్లో ఉండే చిన్నచిన్న గిరిజన గ్రామాల్లోకి కొత్త వ్యక్తి ఎవరు వచ్చినా ఇటు మావోయిస్టులకు, అటు గంజాయి సాగుదారులకు సమాచారం అందించే వ్యవస్థలూ ఉంటాయని చెబుతున్నారు.
ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో 15 వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారనే అంచనాలున్నాయి. దాదాపు ప్రతి గ్రామంలోనూ గంజాయి తోటలుంటాయి.
వరి, పసుపు, అపరాలు (కందులు, శనగలు, మినుములు, పెసలు వంటివి) వంటి పంటలు సాగుచేస్తూ వాటితో పాటు గంజాయి మొక్కలను పెంచుతున్నారు.
గతంలో ఏజెన్సీ గ్రామాల్లో అక్కడక్కడ వందల ఎకరాల్లోనే గంజాయి తోటలు కనిపించేవి. కానీ ఇప్పుడు వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతోందని గిరిజనులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించే ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహకులు బీబీసీతో తెలిపారు.
"నిజానికి ప్రస్తుతం ఏవోబీలో గంజాయే ప్రధాన పంటగా మారినట్లు కనిపిస్తోంది. ఇది ఇక్కడి నుంచి అనేక రాష్ట్రాలకు కూడా సరఫరా అవుతోంది" అని వారన్నారు.

గంజాయి వాహనాలు సీజ్
విశాఖ జిల్లా ఏజెన్సీకి ముఖద్వారమైన నర్సీపట్నం మీదుగా ఏ స్థాయిలో గంజాయి వ్యాపారం జరుగుతుందో స్థానిక పోలీసులు సీజ్ చేసిన వాహనాలే సాక్ష్యంగా నిలుస్తాయి.
వందల సంఖ్యలో ద్విచక్రవాహనాలు, కార్లు, లారీలు, కంటైనర్లు, చివరకు స్కూల్ బస్సులు కూడా అక్రమ గంజాయి రవాణాలో పోలీసులకు చిక్కాయి.
వీటన్నింటిని సీజ్ చేసిన పోలీసులు వాటిని ఎక్కడ పెట్టాలో తెలియక, ఒకదానిపై ఒకటి పడేస్తున్నారు. దీంతో అవన్నీ తుప్పు పట్టిపోతున్నాయి.

నర్సీపట్నం పీఎస్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో స్టేషన్ పరిసరాలతో పాటు చింతపల్లి వెళ్లే దారిలో వందల సంఖ్యలో ఈ వాహనాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ దారిలో ప్రయాణించే వారంతా వీటిని వింతగా చూస్తుంటారు.
దీని గురించి స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారి బీబీసీతో మాట్లాడుతూ, "గంజాయి కేసులో సీజ్ చేసిన వాహనాలను ఎవరు క్లయిమ్ చేయరు. దాంతో ఇవి ఇలా పాడైపోతుంటాయి" అని చెప్పారు.
గంజాయి కేసులో సీజ్ చేసిన వాహనాల విలువతో పోలిస్తే... ఆ వ్యాపారంలో వచ్చే లాభం చాలా ఎక్కువ. అందుకే ఎన్నిసార్లు వాహనాలను సీజ్ చేసినా... గంజాయి అక్రమ రవాణా మాత్రం ఆపరు. పైగా ఈ వ్యాపారానికి పెట్టుబడి పెట్టే వారు ఎక్కడో ఉండి మొత్తం కథ నడిపిస్తారు. ఈ వాహనాలు, కొరియర్లపై పెట్టే డబ్బు గురించి వాళ్లు పెద్దగా పట్టించుకోరు" అని స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారి ఒకరు తెలిపారు.

ఎక్కడికైనా...వయా విశాఖయే
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో ఉన్న గిరిజన గ్రామాల్లో సాగువుతున్న గంజాయిలో పోలీసులు పట్టుకునేది కేవలం 5 శాతం లోపే అని చెబుతుంటారు.
పైగా గంజాయి అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడేది పాత్రధారులే. సూత్రధారులేవరో పెద్దగా ఎవరికీ తెలియదు. దీంతో పోలీసులు పట్టుకుని కేసులు పెట్టేది గంజాయి తోటలపై పెట్టుబడి పెట్టేవారిని మాత్రం కాదు. డబ్బుల కోసం గంజాయిని రవాణా చేసేవారిని మాత్రమే.
వీరిలో కొందరు స్థానిక గిరిజనులు ఉండగా...ఎక్కువ మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉంటారు.
ఎక్కడ గంజాయి దొరికినా విశాఖ పేరు వినిపిస్తుందని, నిజానికి ఇది వాస్తవం కాదని నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ చందోలు బీబీసీతో చెప్పారు.
"విశాఖ ఏజెన్సీలో గంజాయి పండుతున్న మాట వాస్తవమే అయినా ఒడిశాలోనే ఎక్కువ గంజాయి దొరుకుతుంది. ఒడిశాకు చెందిన ఏజెన్సీ ప్రాంతాల్లో (అవి ఏపీ ఏజెన్సీకి సరిహద్దుల్లో ఉంటాయి) గంజాయి ఎక్కువ పండటం, అక్కడ నుంచే గంజాయి ఇతర ప్రాంతాలకు వెళ్లడం జరుగుతుంది.
రవాణా అవుతున్న గంజాయిని ఒడిశాలోని కొన్ని గ్రూపులు దారికాచి, బెదిరించి దోచేస్తారు. అందుకే ఎక్కువగా విశాఖ మీదుగా తీసుకుని వెళ్తారు. ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హరియాణా, పశ్చిమబెంగాల్, సిక్కీం, నాగాలాండ్, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, చెన్నై, ఒడిశా, తెలంగాణాలకు విశాఖ మీదుగానే గంజాయి రవాణా అవుతుంది. దీంతో విశాఖ జిల్లాలో ఎక్కువగా గంజాయి పట్టుబడుతోంది. గత మూడు నెలల్లో దాదాపు 17 వేల కిలోల గంజాయిని సీజ్ చేశాం" అని ఏఎస్సీ మణికంఠ తెలిపారు.

ఆసుపత్రుల్లో సైతం గంజాయి తోటలు
ఏవోబీలో గంజాయి సాగు ఏ స్థాయిలో జరుగుతోందంటే... ఏ చిన్న ఖాళీ స్థలం దొరికినా అందులో గంజాయి మొక్కలు పెంచుతున్నారు. చివరకు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను సైతం వదలడం లేదు. చింతపల్లి మండలం బలపం పంచాయతీలో నిర్మాణంలో ఉన్న కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా కొందరు గంజాయి మొక్కలు పెంచుతున్నారు.
"మైదాన ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పెట్టుబడులు పెట్టి గిరిజనులతో గంజాయి వ్యాపారం చేయిస్తున్నారు. డబ్బు వస్తుండటంతో గిరిజనులు కూడా దీనికి అలవాటుపడ్డారు" అని కోరుకొండ ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ సంతోష్ కుమార్ చెప్పారు.
కోరుకొండ ఆరోగ్య కేంద్రం కోసం భవన నిర్మాణం పని మొదలై ఆగిపోయింది. దీంతో ఇక్కడ కూడా గంజాయి మొక్కలు పెంచుతున్నారు. ఎన్నిసార్లు తొలగించినా మళ్లీ మళ్లీ వేస్తున్నారు" అని చెప్పారు.

ఒక్కో మొక్క నుంచి రూ.500
పోలీసుల వద్ధ ఉన్న అనధికార లెక్కల ప్రకారం ఏవోబీలో జరుగుతున్న గంజాయి వ్యాపారం రూ.8వేల కోట్ల కంటే ఎక్కువే.
అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ మూడు నుంచి నాలుగు రెట్లు పెరుగుతుందని, అలా చూస్తే ఏవోబీలో పండుతున్న గంజాయి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 25 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ఇక్కడ దాదాపు 15వేల ఎకరాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటల్లో ఎక్కువ మత్తునిచ్చే శీలావతి రకం గంజాయి తోటలే అధికంగా ఉంటాయి.
సాధారణంగా ఒక గంజాయి మొక్క నుంచి పావుకిలో వరకు పొడి గంజాయి తయారవుతుంది. ఒక ఎకరం గంజాయి తోట నుంచి వెయ్యి కిలోల పొడి గంజాయి తయారవుతుందని గంజాయి వ్యాపారం చేసి, ప్రస్తుతం విశాఖ ఏజెన్సీలోని గాలిపాడు గ్రామంలో అపరాలను పండిస్తున్న కె. ఆదిబాబు చెప్పారు.
"ఏజెన్సీలో, నాణ్యతను బట్టి కిలో గంజాయి రూ. 2 వేల నుంచి 3 వేల వరకు అమ్ముతున్నారు. బయటకు వెళుతున్న కొద్దీ దీని విలువ మూడు నుంచి నాలుగు రెట్లు పెరుగుతుంది. ఇది లాభసాటిగా ఉండటంతో యువత కూడా గంజాయి సాగువైపు మొగ్గు చూపుతోంది" అని ఆదిబాబు అన్నారు.
ఈ కేసుల్లో దొరికిన వారికి శిక్షలు కూడా కఠినంగానే ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.
"మాకు దొరికిన చాలా కేసుల్లో అసలు వ్యాపారం చేస్తున్నది బయట వాళ్లేనని తేలింది. పంట సాగుచేసి, గంజాయి తరలించేది మాత్రం స్థానికులు, కొరియర్లే. అలాగే పర్యటక ప్రాంతం కావడంతో ప్రతి కొత్త ముఖాన్ని అనుమానించడం కూడా ఇబ్బందిగానే ఉంటోంది" అని నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠ చెప్పారు.

"పోలీసులు ఐదు లక్షలు అడిగారు"
విశాఖ జిల్లా చింతపల్లి మండలం అన్నవరం పంచాయితీకి చెందిన గాలిపాడు గ్రామస్థులపై గంజాయి స్మగ్లర్లంటూ తెలంగాణ పోలీసులు కాల్పులు జరిపిన సంఘటన రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర సంచలనమైంది.
ఈ కాల్పుల్లో గాయపడిన కిల్లో భీమరాజు ఆ రోజు జరిగిన సంఘటనను బీబీసీకి వివరించారు.
"నల్గొండకు చెందిన పోలీసులు అక్టోబర్ 15న మా గ్రామానికి (గాలిపాడు) వచ్చారు. గంజాయి కేసులో విచారించాలంటూ కిల్లో కామరాజును, కిల్లో రాంబాబును, నన్ను పోలీసు జీపు ఎక్కించి తీసుకెళ్తున్నారు. గంజాయి వ్యాపారంతో సంబంధం లేని వాళ్లని కూడా తీసుకుని వెళ్తున్నారంటూ పోలీసులను మా గ్రామస్థులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులు కాల్పులు జరిపారు. ఆ సంఘటనలో కామరాజు, రాంబాబులకు బుల్లెట్ గాయాలయ్యాయి. మమ్మల్ని తీసుకుని వెళ్లడానికి ముందు గ్రామానికి వచ్చిన నల్గొండ పోలీసులు నన్ను తీవ్రంగా కొట్టి, తలపై తుపాకీ పెట్టి ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే గంజాయి కేసులో అరెస్ట్ చేస్తామని బెదిరించారు" అని కిల్లో భీమరాజు బీబీసీకి చెప్పారు.
అయితే, ఈ ఆరోపణలను నల్గొండ జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ ఖండించారు.
ఆ సమయంలో కొందరు గంజాయి స్మగర్లు పోలీసులపై రాళ్లదాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని ఏవీ రంగనాథ్ చెప్పారు.
నల్గొండ పోలీసులు విశాఖ ఏజెన్సీకి వచ్చిన విషయంపై తమకు సమాచారం లేదని నర్సీపట్నం ఏఎస్సీ చెప్పారు.
అయితే నల్గొండలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి ఇచ్చిన సమచారం మేరకు ఈ కేసుతో సంబంధం ఉన్న వారిని పట్టుకునేందుకు నల్గొండ పోలీసులు విశాఖ ఏజెన్సీకి వచ్చారని చెప్పారు.

గంజాయి పండిస్తున్నాం: గిరిజనులు
వరి, పసుపు, అసరాల పంటలతో పాటు గంజాయిని కూడా సాగు చేస్తామని ఏవోబీలోని కొందరు గిరిజనులు ఒప్పుకుంటున్నారు.
సాధారణ పంటలు ఎన్ని వేసినా రాని డబ్బులు గంజాయి సాగుతో బాగా వస్తున్నాయని వారు అంటున్నారు.
ఆర్థిక సమస్యలు, ప్రభుత్వాలు తమ పట్ల వహిస్తున్ననిర్లక్ష్యమే తమను గంజాయి సాగు వైపు లాగుతున్నాయని గాలిపాడు గ్రామస్థులు బీబీసీతో చెప్పారు.
"మాతో పాటు మా చుట్టుపక్కలున్న అన్ని గ్రామాల్లో కూడా గంజాయి సాగు చేస్తున్నారు. వరితో పాటే గంజాయి పంట కూడా వేస్తాం. ప్రతి గ్రామంలో 80 శాతం మంది గంజాయి పండిస్తారు. మాకు మరో మార్గం కనిపించడం లేదు. ప్రభుత్వం గిరిజనులకు ఇస్తున్న పథకాలేమి మాకు అందడం లేదు. ఎవరికి అందుతున్నాయో తెలియడం లేదు" అని గాలిపాడు గ్రామానికి చెందిన కిల్లో వరహాలు బీబీసీతో చెప్పారు.
"పిల్లలను స్కూల్‌కు పంపాలన్నా కూడా మాకు డబ్బులు సరిపోవడం లేదు. దాంతో మా ఆర్థిక కష్టాలకు కనిపిస్తున్న ఏకైక పరిష్కరం గంజాయి సాగు చేయడం. ప్రభుత్వ పథకాలు ప్రతి గిరిజనుడికి అందేలాచేయడం, గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే గంజాయి వైపు కన్నెత్తి కూడా చూడం" అని గ్రామస్థులు అంటున్నారు.

తోటలు ధ్వంసం...పోలీసుల సన్మానం
మరోవైపు గంజాయి విషయంలో ఏవోబీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కొన్ని గ్రామాల్లోని గిరిజనులు స్వచ్చందంగా గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్నారు.
తాజాగా జీకే వీధి మండలం గుమ్మరేవుల పంచాయతీలోని 12 గ్రామాల్లో గంజాయి సాగు జోలికి వెళ్లబోమంటూ గంజాయి తోటలను గిరిజనులు ధ్వంసం చేశారు.
"మా గ్రామాలలో ఇకపై గంజాయి సాగు చేయం. తెలిసో తెలియకో గంజాయి పండించాం. ఇక్కడ గంజాయిని వివిధ రాష్ట్రాల వారు కొని పట్టుకెళ్తారు. కానీ పోలీసులకు పట్టుబడినప్పడు మాపేర్లు చెప్పడంతో మమ్మల్ని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇకపై పూర్తిగా సంప్రదాయ పంటలే వేస్తాం" అని గ్రామస్థులు అంటున్నారు.

"అయితే మాకు గిట్టుబాటు ధర కల్పించాలి. నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలి. అలా చేస్తే ఇకపై గంజాయి జోలికి వెళ్లబోమని వాగ్ధానం చేస్తున్నాం" అంటూ గుమ్మిరేవుల పంచాయితీ గ్రామాల ప్రజలు గంజాయి తోటలను నాశనం చేశారు.
గంజాయి పండించబోమని స్వచ్ఛందంగా ముందుకొచ్చిన గిరిజనులను విశాఖపట్నం ఎస్పీ బి. కృష్ణారావు సన్మానించారు.
గంజాయి కేసుల్లో ఇరుక్కుంటే జీవితాంతం కుటుంబాలకు దూరమవ్వాల్సి వస్తుందని అన్నారు.

ఫొటో సోర్స్, TelanganaCMO/FB
గంజాయి సాగు చేస్తే పథకాలు కట్
ఇటీవల తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో గంజాయి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా గంజాయి అంశంపై దృష్టి సారించింది.
ఏఓబీ నుంచి చింతూరు-భద్రాచలం మీదుగా తెలంగాణ చేరుకుని, అక్కడ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రవాణా జరుగుతోందని పోలీసులు గుర్తించారు.
గంజాయి వినియోగదారులు, విక్రయించేవారి నుంచి సరఫరా చేసే వారి వివరాలు తెలుసుకుని, రాష్ట్రంలోకి గంజాయి రాకుండా చర్యలు చేపట్టాలని తెలంగాణ సీఎం చంద్రశేఖర రావు తెలంగాణ పోలీసులను ఆదేశించారు.
ఇవి కూడా చదవండి:
- ‘భార్యను చంపేందుకు రక్తపింజరి పాము కొన్నాడు.. అయినా, చనిపోలేదని నాగుపాముతో కాటు వేయించి చంపాడు’
- యూట్యూబ్ చానళ్లపై సమంత పరువునష్టం దావా
- కోవిడ్-19 వ్యాక్సినేషన్: వంద కోట్ల డోసుల మైలురాయిని చేరుకున్న భారత్.. వ్యాక్సినేషన్ తర్వాత కూడా వైరస్ సోకుతుందా?
- కేరళ, ఉత్తరాఖండ్ వరదలు: అక్టోబరులో ఈ భారీ వర్షాలకు కారణం ఏమిటి?
- సావర్కర్ క్షమాపణ పత్రంలో ఏం రాశారు? విడుదలయ్యాక ఏం చేశారు
- ‘రేవంత్ రెడ్డిని అసెంబ్లీకి రాకుండా ఆపినట్లు ఈటెల రాజేందర్‌ను కేసీఆర్ ఆపగలరా’
- ‘బంగ్లాదేశ్‌లో ఆలయాల్లో హింస చూసి నా గుండె పగిలింది’ : అమెరికా మాజీ ఎంపీ
- 197 దేశాలు 12 రోజుల పాటు స్కాట్లాండ్లో ఎందుకు సమావేశమౌతున్నాయి? ఈ సదస్సుతో సాధించేదేమిటి?
- ఫ్యాబ్ఇండియా: అడ్వర్టైజ్మెంట్ నచ్చక కంపెనీని టార్గెట్ చేసిన హిందూ గ్రూపులు
- అడవిలో తప్పిపోయిన ఆ ఇద్దరు అయిదు రోజులు నీళ్లు లేకుండా ఎలా బతికి బయటపడ్డారు?
- మెటావర్స్ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది? ఇది మరో మహా ఆవిష్కరణ అవుతుందా?
- వీరప్పన్: అటవీ అధికారి తలతో ఫుట్‌బాల్ ఆడిన గంధపు చెక్కల స్మగ్లర్‌ను 20 నిమిషాల్లో ఎలా చంపారంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










