World Coconut Day: కోనసీమకు కొబ్బరి ఎలా వచ్చింది, ఎలా విస్తరించింది

- రచయిత, శంకర్.వి
- హోదా, బీబీసీ కోసం
కోనసీమ అనగానే అందరికీ ముందుగా కొబ్బరి చెట్లే గుర్తుకువస్తాయి. లక్ష ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పరచుకున్న కొబ్బరి తోటలు, గోదావరి పంట కాలువలు, పచ్చని పొలాలతో ఆ ప్రాంతమంతా కళకళలాడుతూ ఉంటుంది.
కోనసీమ వాసుల జీవితాలు కొబ్బరి సాగుతో బాగా ముడిపడిపోయాయి.
కోనసీమ నుంచి కొబ్బరి వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. కానీ, రవాణా సదుపాయాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల తగినంత అభివృద్ధి జరగలేదన్నది కోనసీమ వాసుల ఆవేదన.
కొబ్బరి ఆధారిత పరిశ్రమలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారు కోరుతున్నారు. ఇటీవల కొబ్బరికి పెరుగుతున్న తెగుళ్లకు తగిన విరుగుడు సకాలంలో అందించే ఏర్పాట్లు చేయాలని ఆశిస్తున్నారు.

కొట్టుకువచ్చాయా?
కోనసీమకు, కొబ్బరి తోటలకు మూడు శతాబ్దాలకు పూర్వమే అనుబంధం ఏర్పడిందని చెబుతారు.
కోనసీమ భౌగోళికంగా ఓ ద్వీపంలా ఉంటుంది. మూడు వైపులా గోదావరి పాయలు ప్రవహిస్తుంటాయి. వశిష్ట, వైనతేయ, గౌతమీ పాయల ప్రవాహం కోనసీమను సస్యశ్యామలం చేసింది. మరోదిక్కున బంగాళాఖాతం ఉంది.
బంగాళాఖాతం తీరప్రాంతం కావడంతోనే కొబ్బరి సాగు మొదలైందని కొందరి అభిప్రాయం. ఇండోనేసియా, థాయిలాండ్ వంటి తూర్పు ఆసియా దేశాల నుంచి తుపాన్లు, ఇతర సందర్భాల్లో కొబ్బరి కాయలు కొట్టుకువచ్చి ఉంటాయని తమ పూర్వీకుల అంటుండేవారని కోనసీమ కొబ్బరి రైతుల సంఘం ప్రతినిధి అడ్డాల గోపాలకృష్ణ బీబీసీతో అన్నారు.
ఈ వాదనకు శాస్త్రీయ ఆధారాలు లేకపోయినప్పటికీ, చాలా మంది దీనితో ఏకీభవిస్తున్నారు.
సముద్రం ద్వారా కొట్టుకువచ్చిన కొన్ని కొబ్బరికాయలు కోనసీమ ప్రాంతంలో మొలిచాయని, వాటి కాయలు తమకు ఉపయోపడటంతో రానురాను స్థానికులు కొబ్బరి సాగు చేశారన్న అంచనాలు ఉన్నాయి.
కోనసీమ చాలా తరాలుగా కొబ్బరి సాగులో తలమునకలై ఉంది.

ఫొటో సోర్స్, Barcroft Media/gettyimages
స్థానికుల జీవితాల్లో ఇదో భాగమైపోయింది. కొబ్బరి ఆకులతో ఇళ్లు వేసుకుని ఉంటారు. కొబ్బరి పీచుని వివిధ రకాలుగా వాడుతారు. కొబ్బరి కాయల విక్రయంతో బతుకు సాగిస్తుంటారు.
‘కొబ్బరి చెట్టు కొడుకు కన్నా మిన్న’ అని కొందరు అంటుంటారంటే, అది వారికి ఎంత విలువైందో అర్థం చేసుకోవచ్చు. పది కొబ్బరి చెట్లు ఉంటే జీవనం సాఫీగా సాగిపోతుందని కూడా స్థానికులు భావిస్తుంటారు.
ప్రస్తుతం కోనసీమలో 54వేల హెక్టార్లలో కొబ్బరి పంట పండిస్తున్నట్టు అంబాజీపేట పరిశోధనా కేంద్రం రికార్డులు చెబుతున్నాయి.
దేశమంతా 21.40 లక్షల హెక్టార్లలో కొబ్బరి సాగవుతుండగా అత్యధికం కేరళలో 8లక్షల హెక్టార్లు, తమిళనాడులో 5.17లక్షల హెక్టార్లు, కర్ణాటకలో 4.65లక్షల హెక్టార్లలో కొబ్బరి పంట ఉంది, వాటి తర్వాత ఏపీ నాలుగో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 1.30లక్షల హెక్టార్లకు కొబ్బరి సాగు విస్తరించింది.
ఇటీవల తీర ప్రాంతాలతో పాటుగా మెట్ట సహా అన్ని రకాల భూముల్లోనూ కొబ్బరి పంట వైపు రైతులు మొగ్గుచూపుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.

ఉత్పాదకతలో ముందున్న ఏపీ
కొబ్బరి సాగులో విస్తీర్ణపరంగా నాలుగో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉత్పాదకతలో మాత్రం ముందంజలో నిలిచింది.
హెక్టార్‌కు సగటున ఏడాదికి ఉత్పత్తి చేసే కాయలు లెక్కగడితే, కేరళలో 7,486, కర్ణాటకలో 9,745 ఉండగా తమిళనాడులో 14,872 గా ఉంది. ఏపీలో మాత్రం 14,997 అని 2015 నాటి కోకోనట్ బోర్డ్ లెక్కలు చెబుతున్నాయి.
లక్షదీవుల తర్వాత ఏపీలోనే అత్యధికంగా కొబ్బరి ఉత్పాదకత కనిపిస్తోంది.
2015లో 184.4 కోట్ల కొబ్బరి కాయల ఉత్పత్తి జరగ్గా మొత్తం దేశీయ ఉత్పత్తిలో ఏపీ వాటా 8.44 శాతంగా ఉంది.
ఇక విస్తీర్ణం, ఉత్పాదకత, ఉత్పత్తి విషయాల్లో ఆంధ్రప్రదేశ్‌లో కోనసీమదే ప్రధాన వాటా. కొబ్బరి సాగవుతున్న మొత్తం విస్తీర్ణంలో దాదాపుగా 45శాతం కోనసీమలోనే ఉంది. ఉత్పత్తిలోనూ, ఉత్పాదకతలోనూ కోనసీమ దేశంలోనే గుర్తింపు పొందింది.
దీనికి ప్రధాన కారణం గోదావరి తీర ప్రాంతం కావడం వల్ల నేలస్వభావం కొబ్బరికి అనుకూలంగా ఉండటమేనని శాస్త్రవేత్తలు చెబుతుంటారు.
అంబాజీపేటలోని కొబ్బరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బీవీకే భగవాన్ బీబీసీతో ఈ విషయం మాట్లాడారు.
‘‘కోనసీమలో నేల స్వభావరీత్యా కొబ్బరి పంటకు బాగా అనుకూలం. నిత్యం నీటి సదుపాయం ఉంటుంది. భూగర్భ నీటిమట్టం కూడా ఆశాజనకంగా ఉంటుంది. పైగా మట్టి తేలికగా ఉండటంతో కొబ్బరి వేళ్లు విస్తరించేందుకు తోడ్పడుతుంది. వాతావరణం కూడా సానుకూలం. సమపాళ్లలో వర్షం, ఎండ ఉంటాయి. నీటికి లోటు లేదు కాబట్టి కోనసీమలో కొబ్బరి పంట వేగంగా పెరిగింది. దిగుబడి ఆశించిన స్థాయిలో ఉంటోంది’’ అని వివరించారు.

రైతులకు కలవరం..
సహజంగా కొబ్బరిలో నీళ్ల కాయలకు వేసవిలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. కానీ, కోనసీమలో అత్యధికులు నీళ్ల కాయలకు ప్రాధాన్యం ఇవ్వరు. దిగుబడి తగ్గుతుందనే అభిప్రాయంతో ఎక్కువ మంది వాటిని తీయడానికి మొగ్గుచూపడం లేదు.
టెంకాయలకు పండుగల సీజన్‌లో డిమాండ్ కనిపిస్తుంది. వాటిలో కూడా నాణ్యతను బట్టి ధర ఉంటుంది. ధర లేని సమయంలో రైతులు కొబ్బరిని అటక మీద పోస్తారు. ఇలా ఆరు నెలలు ఉంచిన కురిడీ ధర ఎక్కువగా ఉన్నప్పుడు అమ్ముతారు.
వాతావరణం పొడిగా ఉంటే కురిడీ కొబ్బరికి ఏడాది పొడవునా మార్కెట్ ఉంటుంది.
నీటి కొబ్బరికాయను కొట్టి అరపలు మీదకు పేర్చి ఎండు కొబ్బరి తయారు చేస్తారు. దీనికి నిరంతరం ధర ఉంటుంది. కొబ్బరి నూనె తయారీలో దీన్నే అధికంగా వినియోగిస్తారు.

కేరళ, తమిళనాడులతో పోలిస్తే ఏపీలో కొబ్బరి పరిమాణం చిన్నదిగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అయినా, ఏపీ కొబ్బరికి మంచి డిమాండ్ ఉంది. రాజస్థాన్, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ సహా వివిధ ఉత్తరాది రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతోంది.
మార్కెట్‌లో ధరలు స్థిరంగా లేకపోవడం మూలంగా రైతులకు సమస్యలు వస్తున్నాయని, సకాలంలో నాబార్డ్ వంటి సంస్థల తోడ్పాటు ఉండటం లేదని భారతీయ కిసాన్ సంఘం ప్రతినిధి ముత్యాల జమీల్ బీబీసీతో చెప్పారు.
‘‘కొబ్బరి మార్కెట్ స్థిరంగా ఉండదు. సీజన్లను బట్టి మారుతూ ఉంటుంది. ఒక్కోసారి ధరలు బాగా పడిపోయిన సమయంలో రైతులకు సమస్యలు వస్తున్నాయి. అలాంటప్పుడు నాబార్డ్ సకాలంలో జోక్యం చేసుకోవాలి. నాబార్డ్ సెంటర్ల ద్వారా కొబ్బరిని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. కానీ, అలా జరగడంలో జాప్యం రైతులను చిక్కుల్లో నెడుతోంది. నిల్వ చేసుకునే సామర్థ్యం లేని సాధారణ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ కాలం నిల్వ చేసుకునేందుకు అనుగుణంగా గిడ్డంగులు గానీ, కోల్డ్ స్టోరేజీలు గానీ కోనసీమలో లేవు. అందుకు తగ్గట్టుగా నాబార్డ్, ప్రభుత్వాలు వ్యవహరిస్తే రైతులకు ఉపశమనం ఉంటుంది’’ అని ఆయన అన్నారు.
అంబాజీపేట కేంద్రంగా కొబ్బరి మార్కెట్ విస్తరించింది. నిత్యం అంబాజీపేట నుంచి కొబ్బరి ఎగుమతులు జరుగుతాయి.
అయితే, ప్రస్తుతం మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉన్నాయని వ్యాపారి అప్పన బాలాజీ బీబీసీతో అన్నారు.
‘‘అనేక రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తుంటాం. కొబ్బరి మార్కెట్లో 400 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. మార్కెట్‌లో ఇటీవల ఆటుపోట్లు ఎక్కువగా ఉంటున్నాయి. కొందరు వ్యాపారులు దీనిని తట్టుకుని నిలవలేకపోతున్నారు. కోనసీమకు కొబ్బరి పంట కారణంగానే గుర్తింపు వచ్చింది. కోనసీమ కొబ్బరి అంటే దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. దానికి అనుగుణంగా నాణ్యత పాటిస్తున్నాం. కోవిడ్ సమయంలో ఎగుమతులు లేక చాలా అవస్థలు పడ్డాం. వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. దిగుబడి చేసిన కొబ్బరిని ఏం చేయాలో తెలియక రైతులు కూడా అవస్థలు పాలయ్యారు’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
1996లో పెద్ద దెబ్బ
కోనసీమ తీర ప్రాంతం కావడంతో తుపాన్ల తాకిడి ఎక్కువ. ఏటా ఓవైపు గోదావరి వరదలు, మరోవైపు తుపాన్లు కోనసీమవాసులను కలవరపెడుతూ ఉంటాయి.
ఈ ఏడాది గోదావరికి వచ్చిన పెద్ద వరదలతో కోనసీమ లంకలు, అనేక లోతట్టు గ్రామాల వాసులు నిరాశ్రయులయ్యారు. అన్నింటికీ మించి 1996 తుపాను కోనసీమ మీద పెద్ద ప్రభావం చూపింది.
ప్రధానంగా అమలాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని 9 మండలాలు సముద్రాన్ని ఆనుకుని ఉన్నాయి. ఆయా మండలాల్లో తుపాను విరుచుకుపడింది.
వందల మంది ప్రాణాలు తీసిన పెనుతుపాను... కొబ్బరి సాగును కూడా తీవ్రంగా దెబ్బతీసింది. వేల కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. మిగిలిన చెట్లు కూడా దిగుబడి లేక బోసిపోయాయి.
కోనసీమ కొబ్బరి మీద 1996 నవంబర్ 6 నాటి తుపాను ఎన్నడూ చూడని స్థాయిలో ప్రభావం చూపించిందని కోనసీమ వాసులు చెబుతున్నారు.
1996 తుపాను చేసిన నష్టం నుంచి కోలుకోవడానికి కోనసీమకు సుదీర్ఘ సమయం పట్టిందని సీనియర్ పాత్రికేయుడు టీకే విశ్వనాథం బీబీసీతో అన్నారు.
‘‘ఒక్క రాత్రిలో తుపాను బీభత్సం సృష్టించింది. సహాయక చర్యలు చేపట్టేందుకే పక్షం రోజులు పట్టింది. ఆ సమయంలో కొబ్బరి పంటకు అపార నష్టం జరిగింది. చాలా చెట్లు విరిగిపోయాయి. నిలబడినవి కూడా మళ్లీ యథాస్థితికి రావడానికి చాలా సమయం పట్టింది. ఆ తర్వాత వివిధ తెగుళ్లు కొబ్బరిపంటను పీడిస్తున్నాయి. ఇరియోఫిడ్ మైట్ కారణంగా కాయ పరిమాణం క్షీణించింది. దానికి విరుగుడు కనుగొనడానికి సమయం పట్టడంతో కోనసీమ కొబ్బరి రైతులు నష్టపోవాల్సి వచ్చింది’’ అని వివరించారు.
కోనసీమ కొబ్బరి రైతులకు మరింత సేవలు అందించేందుకు 1955లో కొబ్బరి పరిశోధనా కేంద్రాన్ని అంబాజీపేటలో ప్రారంభించారు.
అప్పటి నుంచి అంబాజీపేట పరిశోధనా కేంద్రం చాలా కృషి చేసిందని ఆ కేంద్రం చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బీవీకే భగవాన్ బీబీసీకి తెలిపారు.
‘‘వివిధ కొబ్బరి హైబ్రీడ్ రకాలు తయారుచేశాం. అందులో కొన్ని బాగా ప్రాచుర్యం పొందాయి. ఇటీవల గోదావరి గంగా రకాన్ని మంచి దిగుబడినిచ్చేలా రూపొందించాం. రైతుల్లో చాలా మంది దాని పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇక కొన్ని తెగుళ్లు ప్రభావం చూపుతున్నాయి. వాటిని అధిగమించేందుకు అవసరమైన సహాయం అందిస్తున్నాం. రైతుల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం రూబోసిస్ ఫైర్లింగ్ వైట్ ఫ్లై కారణంగా నష్టం జరుగుతోంది. దానికి కూడా పరిష్కారం రైతులకు తెలియజేశాం. దిగుబడులు తగ్గకుండా జాగ్రత్తలు సూచిస్తున్నాం’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
కార్మికులకు భరోసా లేదు
కోనసీమలో కొబ్బరి రైతులకు, వ్యాపారులకు తోడ్పడిన విధంగానే... కొబ్బరి దింపు, ఒలుపు వంటి పనుల వల్ల కార్మికులకు ఉపాధి కల్పించే మార్గంగా మారింది.
కోనసీమ వ్యాప్తంగా 9వేల మంది దింపు కార్మికులు, మరో 6వేల ఒలుపు కార్మికులున్నట్టు కార్మిక సంఘాలు చెబుతున్నాయి.
కొబ్బరి చెట్లు ఎక్కి కాయలు దించడానికి దింపు కార్మికులు నిత్యం శ్రమిస్తూ ఉంటారు. కాయలు దించే క్రమంలో కొందరు ప్రమాదాల బారిన పడిన ఘటనలూ ఉన్నాయి. ఇక దించిన కొబ్బరికాయల పై భాగాన్ని ఒలిచి, కొబ్బరిని సిద్ధం చేసే పని ఒలుపు కార్మికులది.
కోనసీమలో దింపు, ఒలుపు కార్మికులకు తగిన భద్రత లేదని , గుర్తింపు కార్డులు ఇచ్చినప్పటికీ ఉపయోగపడడం లేదని భీమరాజు అనే దింపు కార్మికుడు అన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన వారికి తగిన పరిహారం కూడా దక్కడం లేదని ఆయన బీబీసీతో చెప్పారు.
‘‘ప్రభుత్వం కొందరికి గుర్తింపు కార్డులు ఇచ్చింది. చాలా మందికి అవి దక్కలేదు. 15వేల మంది దింపు, ఒలుపు కార్మికులు ఉన్నాం. ప్రభుత్వం తగిన సహాయం అందించాలి. ప్రమాదాల నివారణకు అవసరమైన సహాయం చేయాలి. చెట్లు ఎక్కేందుకు తోడ్పడే సాధనాలు ఉచితంగా అందించాలి. ఒలుపు కార్మికులకు కూడా ఉపాధి భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నాం’’ అని భీమరాజు అన్నారు.
రైల్వే లైన్ ఉంటే..
కోనసీమకి రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా ఉన్న డిమాండ్ ఇప్పటికీ నెరవేరలేదు. అదే జరిగితే, కొబ్బరి ఎగుమతులను మెరుగ్గా రవాణా చేయొచ్చని, కేరళ తరహాలో కోనసీమలో కొబ్బరి వ్యాపారం విస్తరించే అవకాశం ఉంటుందని స్థానికులు అంటున్నారు.
కొబ్బరి నుంచి వచ్చే వివిధ ఉప ఉత్పత్తులకు తగిన పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయాలని కొబ్బరి రైతు సంఘం ప్రతినిధి అడ్డాల గోపాలకృష్ణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
‘‘కొబ్బరి ఆధారంగా ఇప్పటి వరకూ పీచు పరిశ్రమలు కొన్ని ఏర్పాటయ్యాయి. వాటికి మార్కెటింగ్ అవసరం ఉంది. ఇంకా అనేక ఉప ఉత్పత్తులకు అవకాశం ఉంది. సుదీర్ఘకాలంగా కోకోనట్ బోర్డ్ కూడా ఇదే చెబుతోంది. ఆయిల్ ఉత్పత్తుల వంటి కొన్ని యూనిట్లు ప్రారంభించారు. కొబ్బరి ఆధారంగా పారిశ్రామికాభివృద్ధికి ఉన్న మార్గాలను పూర్తిగా వినియోగించుకోవాలి’’ అని అన్నారు.
కోనసీమలో కొబ్బరి రైతులు ఇటీవల కాలంలో అంతర పంటలకు ప్రాధాన్యతనివ్వడం బాగా పెరిగింది. ఎక్కువగా కోకో, అరటి, పసుపు, అల్లం సహా వివిధ వాణిజ్య పంటలను సాగు చేస్తూ, ఆదాయం పెంచుకునే మార్గాలను వారు అన్వేషిస్తున్నారు.
ఎకరం కొబ్బరితోటపై రైతుకు ఏటా కనీసం రూ 60వేల వరకూ ఆదాయం వస్తుందని, అంతరపంటలతో అదనంగా మరో రూ.40 వేల వరకూ వస్తుందని తాటిపాకకు చెందిన బిక్కిన వీరేశ్ బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత్-చైనా సైనికుల తూర్పు లద్దాఖ్‌లో మళ్లీ ఘర్షణ
- ’టెస్ట్ చేయకుండానే కోవిడ్ వార్డులో పెట్టారు... మా అమ్మా, నాన్న మరణంపై విచారణ జరిపించాలి’
- ‘కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. బలవంతంగా గుండు గీయించారు’
- కృష్ణా జలాలు కడలి పాలు.. రాయలసీమలో కరవు కష్టాలు.. ఎందుకిలా? పరిష్కారం లేదా?
- మోదీ ‘మన్ కీ బాత్’కు యూట్యూబ్‌లో డిస్‌లైక్‌ల వెల్లువ
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
- చెస్ ఒలంపియాడ్: ఫైనల్ రౌండ్ ఆడుతుండగా ఇంటర్నెట్ సమస్య.. సంయుక్త చాంపియన్లుగా భారత్, రష్యా
- మహిళల భావప్రాప్తి కోసం ఫ్రాన్స్ రాకుమారి మేరీ బోనపార్టీ చేసిన ప్రయోగాలేంటి?
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- చైనాను ఎదుర్కోవడంలో భారత్ ముందున్న ‘సైనిక ప్రత్యామ్నాయాలు’ ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










